అమ్మాయిగా పుడితే... అక్కడే పుట్టాలి!

అమ్మాయిగా పుడితే... అక్కడే పుట్టాలి!
సమానత్వ సూచీలో తొమ్మిదేళ్లుగా తొలిస్థానంలో నిలుస్తున్న దేశం అది. అన్నిరంగాల్లో స్త్రీపురుష సమానత్వ సాధన దిశగా ఇప్పటికే 88శాతం ముందడుగు వేసిన ఈ దేశం మరో నాలుగేళ్లకల్లా ఆ కాస్త ఖాళీనీ భర్తీ చేసేస్తాం చూడమంటూ ప్రపంచ దేశాలకు సవాలు విసురుతోంది. విచిత్రమేమిటంటే ఆ సవాలును అందుకోవడానికి అగ్రరాజ్యాలేవీ దరిదాపుల్లో లేకపోవడం! అందుకే మరి, అమ్మాయిగా పుడితే ఐస్‌లాండ్‌లోనే పుట్టాలనేది!
మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం
మానత్వం పరిమళించే
ఆ సమ సమాజం...
మహిళలు కలలు కనే
ఆ అద్భుత ప్రపంచం...
ఎవరో ఇచ్చింది కాదు... మహిళలకోసం మహిళలే పోరాడి తెచ్చుకున్నది!
ఐస్‌లాండ్‌... ఐరోపాలోని ఓ చిన్న ద్వీపం. అందులో ఒకే ఒక్క పెద్ద నగరం రీక్‌జవెక్‌. ఆ నగరం నుంచి ఏ పక్కకి ఓ పావుగంట ప్రయాణించినా ఓ సరస్సో జలపాతమో వేడినీటి బుగ్గో కనిపించి కనువిందు చేస్తుంది. కానీ ఈ అందమైన ప్రాంతాల మధ్యే ఐస్‌లాండ్‌ వనితల పోరాట దీక్షకూ పట్టుదలకూ ప్రతీకల్లాంటి అగ్నిపర్వతాలూ ఉన్నాయి. కొన్ని చరిత్రకు సంకేతంగా- నిద్రాణంగా; మరి కొన్ని నేటి చైతన్యానికి ప్రతిబింబాలుగా - చురుగ్గా! ఈ ప్రకృతి రమణీయ ప్రాంతం పడతుల పాలిట స్వర్గం ఎలా అయిందో తెలియాలంటే.... ఓ నలభై ఏళ్లు వెనక్కెళ్లాలి.
1975ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించింది. మహిళల హక్కుల గురించి ప్రపంచం మాట్లాడుకోవడం మొదలుపెట్టింది అప్పుడే. కానీ ఐస్‌లాండ్‌ 150 ఏళ్ల క్రితమే ఆ విషయం మాట్లాడింది. 1850లోనే మహిళలకు పురుషులతో సమానంగా వారసత్వ హక్కు ఇచ్చింది.
అమెరికా కన్నా ఐదేళ్లముందే ఓటు హక్కు కల్పించింది. అయితే ఆ తర్వాత జరిగిన రాజకీయ, ఆర్థిక పరిణామాల వల్ల ఐస్‌లాండ్‌ సమాజమూ మారిపోయింది. సమానత్వ సాధనకు అడ్డంకులుగా ఉన్న సమస్యలన్నీ ఆ దేశంలోనూ వేళ్లూనాయి. మహిళలంటే చిన్నచూపూ, అధికారానికి వారిని దూరంగా ఉంచడమూ, పురుషుడికన్నా తక్కువ జీతం ఇవ్వడమూ, ఉద్యోగంతో పాటు ఇంటిపనుల బాధ్యతా, పనిచేసే చోట లైంగిక వేధింపులూ, ఇళ్లల్లో హింసా... అన్నీ అక్కడా చోటుచేసుకున్నాయి. మహిళను శక్తి స్వరూపిణిగా కీర్తించే పురాణాలూ స్త్రీలకు స్వేచ్ఛాస్వాతంత్య్రాలు అక్కర్లేదని చెప్పే స్మృతులూ వారికీ ఉన్నాయి. మరి తేడా ఏమిటీ అంటే- అక్కడి మహిళలు త్వరగా మేల్కొన్నారు. సమానత్వం తమ హక్కని గుర్తించారు... ప్రశ్నించారు...
పోరాడారు... అదే ఐస్‌లాండ్‌ ప్రత్యేకత. సమానత్వం దిశగా ఆ దేశం సాధించిన ప్రగతి గురించి తెలియాలంటే అభివృద్ధిపథంలో ఐస్‌లాండ్‌ వేసిన ఏడడుగుల గురించి ముందుగా తెలుసుకోవాలి.
తొలి అడుగు: లేచింది మహిళాలోకం
1975 అక్టోబరు 24. సమ్మె అంటే ఎలా ఉంటుందో ఆ దేశానికి తొలిసారి అనుభవంలోకి వచ్చింది. దుకాణాలూ, హోటళ్లూ; ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలూ; బడులూ, కాలేజీలూ; టెలిఫోన్‌ ఎక్చ్సేంజీ, రేడియో స్టేషన్లతో సహా అన్నీ దాదాపుగా మూతబడిన పరిస్థితి. ఆరోజంతా తినడానికి కూడా ఏమీ దొరకలేదు. ఎందుకంటే...దేశంలోని మహిళలంతా సమ్మెచేశారు. పొద్దున్నే నాలుగింటికే నిద్రలేచి వంటలు చేసి, భర్తకూ పిల్లలకూ టిఫిన్‌ క్యారేజీలు కట్టి, ఇల్లంతా శుభ్రంచేసి... అప్పుడు సమ్మెకెళితే ఏమిటి లాభం? తమ విలువ తెలియాలంటే అసలు ఏ పనీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. అది ఇంటిపనైనా, వృత్తి పనైనా, ఉద్యోగమైనా... సమ్మె అంటే సమ్మే. మంచాన ఉన్న అత్తగారికి గంటకోసారి మందులేయాలనీ, మూడేళ్ల చిన్నది తాను పెడితే తప్ప ఏమీ తినదనీ, బడినుంచి వచ్చే పిల్లవాడు తానులేకపోతే ఆగమైపోతాడనీ, సమయానికి డైనింగ్‌ టేబుల్‌ మీద అన్నీ అమర్చకపోతే భర్తకి కోపం వస్తుందనీ... ఎవరూ సాకులు చెప్పలేదు. అందరూ మాట మీద నిలబడ్డారు. తెల్లవారుతూనే లేచి ధర్నాచౌక్‌లకి వెళ్లిపోయారు. ‘సమాన గౌరవం, సమాన వేతనం’ తమ హక్కులని నినదిస్తూ రాత్రి దాకా అక్కడే ఉండిపోయారు. దేశంలో నూటికి 90 మంది మహిళలు సమ్మెచేయడం ప్రపంచ చరిత్రలో అదే ప్రథమం. సగం జనాభా సమ్మె చేస్తే ఏమవుతుందో ప్రపంచం చూసింది అప్పుడే. పిల్లల్నీ పెద్దల్నీ చూసుకునే ఇల్లాలు ఇంట్లో లేకపోవడంతో సగం మంది పురుషులూ ఉద్యోగాలకు వెళ్లలేకపోయారు. మరికొందరు బిస్కట్లూ, కథల పుస్తకాలూ బ్యాగుల్లో సర్దుకుని, పిల్లల్ని చంకనేసుకుని ఆఫీసుకెళ్లారు. ‘విమెన్స్‌ డే ఆఫ్‌’గా ఐస్‌లాండ్‌ చరిత్రలో నిలిచిపోయిన ఆ రోజు గురించి నేటి తరం ఎంతో ఆరాధనగా చెప్పుకుంటుంది. ఇక ఆ నాటి సమ్మె ప్రభావం దేశం మీద ఎలా పడిందంటే...
రెండో అడుగు: రాజకీయాధికారం
మిగతా దేశాల్లానే ఐస్‌లాండ్‌లోనూ చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం నామమాత్రంగానే ఉండేది. అలాంటిది సమ్మె తర్వాత పరిస్థితులు మారాయి. మహిళలు సంఘటితమై సమావేశాలూ చర్చలూ కొనసాగించారు. అన్ని సమావేశాల తీర్మానమూ ఒకటే... అదే రాజకీయాధికారం. రాజకీయాల్లో తమ భాగస్వామ్యం పెరిగితే కానీ స్త్రీలకు ఉపయోగకరమైన విధానాలు అందుబాటులోకి రావని భావించారు. పురుషులతో కలిసే ముందుకు సాగాలని నిర్ణయించి అన్ని పార్టీల్లోనూ తమ ఉనికిని చాటారు. దాంతో నెమ్మదిగా స్థానాలు పెరుగుతూ వచ్చాయి. సమ్మె తర్వాత ఐదేళ్లకు చట్టసభల్లో వారి శాతం ఐదుకి పెరిగింది. అయితే ఊహించనివిధంగా విగ్దిస్‌ ఫిన్‌బొగాడొట్టిర్‌ ఐస్‌లాండ్‌కి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన తొలి మహిళా అధ్యక్షురాలు అయ్యారు. నిజానికి గెలుస్తానని ఆమె అనుకోలేదట. అధ్యక్షస్థానానికీ పోటీపడగల సత్తా తమకుందని చెప్పడానికే పోటీచేశారట. ఆమె గెలుపు ఐరోపా ఖండంలోనే సంచలనమైంది. ఆ తర్వాత మూడేళ్లకు ‘మహిళల రాజకీయ పార్టీ’ ఏర్పడి మహిళాచైతన్యాన్ని మరింత ప్రభావితం చేసింది. పదహారేళ్ల పాటు ప్రజాదరణ పొందిన నాయకురాలిగా విగ్దిస్‌ కొనసాగడమూ మహిళల పార్టీ ఏర్పడడమూ రాజకీయాల్లో మహిళల ప్రవేశాన్ని వేగవంతం చేశాయి. చట్టసభల్లో వారి శాతం 5 నుంచి 15కీ క్రమంగా 50కీ పెరిగింది. 2016లో అయితే పార్లమెంటులో ఏకంగా 53 శాతం మహిళలే. 1975 నాటి సమ్మె జరగకపోతే తాను అధ్యక్షురాలినయ్యేదాన్ని కాదనీ, తమ దేశ మహిళల భవిష్యత్తును మార్చిన ఘటన అదేననీ విగ్దిస్‌ అంటారు. అలాగని ఆ సమ్మె తర్వాత ఒక్కసారిగా పురుషులంతా మంచివారైపోలేదు. దేశమంతా మారిపోనూలేదు. పురుష రాజకీయ నాయకులనుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటూనే తాము ముందుకు సాగినట్లు తొలి తరం మహిళా నేతలు తమ అనుభవాల్లో రాశారు.
మూడో అడుగు: కొత్త చట్టాలు
గత రెండు దశాబ్దాల్లో ఐస్‌లాండ్‌లో చాలా చట్టాలు చేశారు. వాటిని అక్కడివారు స్త్రీవాద చట్టాలంటారు. ఎందుకంటే మహిళలు చట్టసభలకు రాకముందు ఇవేవీ అక్కడ ముఖ్యమైన విషయాలు కాలేదు. మహిళల పార్టీ ప్రభావంతో గెలిచినవారు తెచ్చిన తొలి కీలక సంస్కరణ- రెండేళ్లు నిండిన పిల్లలకోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో డేకేర్‌ సెంటర్లను ఏర్పాటుచేయడం. ఇది మహిళలు వృత్తి ఉద్యోగాల్లో కొనసాగడానికి ఎంతగానో తోడ్పడింది. చట్టసభల్లో మహిళల సంఖ్య పెరగడం క్రమంగా పురుషుల దృక్పథంలోనూ మార్పునకు దారితీసింది. స్త్రీ పురుషులకు సమాన హోదా, సమాన హక్కులను కల్పిస్తూ 2000 సంవత్సరంలో మరో కీలక చట్టం చేశారు. సంపూర్ణ సమానత్వమే లక్ష్యంగా రూపొందిన ఈ చట్టం లింగవివక్ష సంఘటనలతో మొదలుపెట్టి భాషలో లైంగికతకు సంబంధించిన ఒక్కో పదం వాడుక వరకూ ఎన్నో అంశాలను చాలా నిశితంగా పరిశీలిస్తుంది. అక్కడ ఏ విషయంలోనూ స్త్రీ అనీ పురుషుడనీ విడదీసి చూడరు. మనిషిని మనిషిగా చూస్తారే తప్ప వారి లైంగికతకు ప్రాధాన్యం ఇవ్వరు. అందుకే స్వలింగ సంపర్కురాలు ప్రధాన మంత్రి అయిన తొలి దేశంగా ఐస్‌లాండ్‌ చరిత్ర సృష్టించింది. సమానత్వం సాధించాలంటే మొత్తంగా సమాజం దృక్పథంలో మార్పు రావాలి. ఆ దిశగానే పలు కొత్త చట్టాలను చేసింది ఐస్‌లాండ్‌. చట్టసభల్లో సగం మహిళలే ఉండడం వల్ల చట్టాలను ఆమోదింపజేసుకోవడమూ అమలు చేయడమూ సులువైంది.
నాలుగో అడుగు: ఆ సెలవు చెరిసగం
ప్రపంచమంతా మాతృత్వ, పితృత్వ సెలవు అంటుంటే ఐస్‌లాండ్‌ పేరెంటల్‌ (తల్లిదండ్రుల) సెలవు విధానాన్ని తెచ్చింది. అక్కడ తల్లితో సమానంగా తండ్రీ పిల్లల్ని చూసుకోవాలి. కాన్పు అయిన తొలి ఐదు నెలలూ తల్లీ ఆ తర్వాత ఐదు నెలలూ తండ్రీ తప్పనిసరిగా సెలవు పెట్టాలి. దాంతో ప్రతి తండ్రీ పిల్లలకు పాలు పట్టడం నుంచి న్యాపీలు మార్చడం వరకూ అన్ని పనులూ చేయాల్సిందే. ‘చేతకాదు, అలవాటు లేదు’ అని ఎవరైనా అంటే నేర్చుకోమంటారు తప్ప పోనీలే పాపమని వదిలేయరు. ఈ పదినెలలే కాక మరో రెండు నెలల సెలవును కూడా వెసులుబాటుని బట్టి తల్లిదండ్రులిద్దరిలో ఎవరో ఒకరు ఉపయోగించుకోవచ్చు. ఐస్‌లాండ్‌ 18 ఏళ్ల క్రితం చట్టం చేసినప్పుడు చెరి మూడు నెలల చొప్పున సెలవు ఆర్నెల్లే ఉండేది. ఆరేళ్ల తర్వాత ఆ సెలవును 9 నెలలకూ, మరో ఆరేళ్ల తర్వాత ఏడాదికీ పెంచింది. పురుషులు పిల్లల పెంపకంలో భాగం అవడం వల్ల తండ్రీబిడ్డల మధ్య అనుబంధం బలపడడంతో పాటు పనిచేసేచోట స్త్రీపురుషుల మధ్య సమానత్వమూ పెరుగుతోంది. తరచూ సెలవులు పెడుతుంటారని స్త్రీలను చిన్నచూపు చూడడం తగ్గింది. ఈ ప్రయోజనాలను గుర్తించడం వల్లనే సెలవును పెంచుతూ వచ్చింది అక్కడి ప్రభుత్వం.
ఐస్‌లాండ్‌ మహిళల్లో ఉన్నత విద్యావంతులు ఎక్కువ. వారి కెరీర్‌కి ఆటంకం కలగకుండా చూసుకోడానికి చట్టాలు ఎంతగానో తోడ్పడుతున్నాయి. పిల్లల పనులే కాదు, వంటా, ఇల్లు శుభ్రం చేయడమూ లాంటి పనులన్నీ పురుషులూ చేస్తారు. నిజానికి ఆ దేశంలో పెళ్లి కన్నా ప్రేమకీ, భార్యాభర్తలు అనిపించుకోవడంకన్నా పిల్లల పెంపకానికీ ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. 70శాతం తొలి సంతానం వివాహానికి ముందు పుట్టినవారే. అయినా తల్లిదండ్రులిద్దరూ బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు, పిల్లల్ని శ్రద్ధగా పెంచుతారు కాబట్టి సమాజమూ వారిని గౌరవిస్తుంది. ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత పెళ్లి చేసుకునేవారే ఎక్కువ. ఒకవేళ పిల్లలు పుట్టిన తర్వాత ఇద్దరికీ భేదాభిప్రాయాలు వచ్చి విడిపోయినా తల్లిదండ్రులుగా బాధ్యతను వదులుకోరు. స్వతంత్రంగా జీవించే ఒంటరి తల్లులకు సమాజమూ ప్రభుత్వమూ అండగా నిలుస్తాయి.
ఐదో అడుగు: బోర్డ్‌రూమ్‌లో
గత ఏడాది అక్టోబరు 24న చాలామంది మహిళలు మధ్యాహ్నం సరిగ్గా 2.38గంటలకు కార్యాలయాల్లో విధులు ఆపేసి బయటకు వెళ్లిపోయారు. తమకు ఇచ్చే వేతనానికి తాము పనిచేసిన గంటలు సరిపోతాయన్నది వారి వాదన. సమానత్వం దిశగా ఎన్ని చట్టాలు చేసి ఎన్ని కొత్త విధానాలు తెస్తున్నా ఇంకా కొన్ని చోట్ల వివక్ష ఉంది. స్త్రీలకు తక్కువ జీతం ఇస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తేవాలనే ఆరోజు వారంతా నిరసన ప్రదర్శన జరిపారు. దాంతో ప్రతి సంస్థా స్త్రీ పురుషులకు సమానవేతనం ఇస్తున్నట్లు నిరూపించుకోవాలని కొత్త ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. జనవరి ఒకటి నుంచీ అమల్లోకి వచ్చిన ఈ ఉత్తర్వు ప్రకారం- పాతిక మందికి మించి సిబ్బంది ఉన్న ఏ కార్యాలయమైనా సరే తమ వద్ద వేతనాల్లో వివక్ష లేదని ప్రభుత్వానికి హామీపత్రం ఇవ్వాలి. ఒకవేళ అలా ఇవ్వడంలో విఫలమైతే భారీ మొత్తంలో జరిమానా కట్టక తప్పదు. నిజానికి సమానవేతన చట్టం ఎప్పటినుంచో ఉంది. కానీ దాన్ని అందరూ అమలుచేయనందువల్లనే నూరు శాతం సమానత్వ సాధనకు కాస్త దూరంలో ఉండిపోయింది ఐస్‌లాండ్‌.
అవినీతిని తగ్గించాలన్నా, పాలనలో పారదర్శకత తేవాలన్నా నిర్ణయాత్మక పదవుల్లో మహిళల ఉనికి పెరగాలనీ, కంపెనీల బోర్డుల్లో మహిళల సంఖ్య పెంచడమే దానికి పరిష్కారమనీ ఐస్‌లాండ్‌ ప్రభుత్వం భావించింది. 50 మంది ఉద్యోగులున్న ప్రతి కంపెనీ బోర్డులోనూ తప్పనిసరిగా 40 శాతం మహిళలు ఉండాలంటూ చట్టం చేసింది. మహిళలను వెనక్కి నెడితే దేశ ఆర్థిక వ్యవస్థా వెనక్కే వెళ్తుందని గట్టిగా నమ్మే దేశం ఐస్‌లాండ్‌. లింగ వివక్షను తొలగిస్తే ఆర్థిక, వ్యాపార రంగాల్లోనే కాక మొత్తం సమాజానికే లబ్ధి చేకూరుతుందని సోదాహరణంగా నిరూపిస్తోంది.
ఆరో అడుగు... ఆ సంస్కృతికి వీడ్కోలు
రాజకీయాధికారంతోనో చట్టాలతోనో సమాజం పూర్తిగా మారిపోదు. కొన్ని అలవాట్లను బలవంతంగానైనా వదిలించాలి. కొత్త ఆలోచనాధోరణిని నేర్పించాలి. అందుకే సంస్కృతి మీదా దృష్టి పెట్టింది ఐస్‌లాండ్‌. పర్యటకం ప్రధాన ఆర్థిక వనరుగా ఉన్న దేశాల్లో సెక్స్‌ టూరిజం పెద్ద సమస్య. ఐస్‌లాండ్‌ ఆ సమస్యను అధిగమించింది. ఒళ్లమ్ముకోవడం అనేది అక్కడ చట్టరీత్యా శిక్షార్హమైన నేరం. పరిస్థితుల కారణంగా మహిళలు ఎవరైనా ఆ పని చేస్తే వారిని బాధితులుగానే పరిగణిస్తారు. డబ్బు చెల్లించి సెక్స్‌ పొందడం నేరం కాబట్టి ఆ పని చేసే పురుషులు నేరస్థులవుతారు. వారికే శిక్ష పడుతుంది. దాంతో సహజంగానే సమస్య పరిష్కారమైపోయింది. ఐస్‌లాండ్‌ చట్టాల ప్రకారం ఏ రకమైన వాణిజ్య ప్రకటనల్లోనూ ఏ లైంగికతనీ చిన్నచూపు చూడకూడదు, విమర్శించకూడదు. స్ట్రిప్‌ క్లబ్బుల్ని అక్కడ 2009లోనే నిషేధించారు. స్త్రీనా పురుషుడా అన్న తేడా లేదు, నగ్నత్వాన్ని వ్యాపారానికి వినియోగించుకోవడం నేరం. అది ఏ రూపంలోనైనా సరే.
పాతికేళ్ల క్రితం ఐస్‌లాండ్‌లో టీనేజ్‌ పిల్లల్లో సగానికి పైగా తాగి తందనాలాడుతుండేవారు. మాదకద్రవ్యాలు వాడేవారు. సాయంత్రమైతే కొన్ని వీధుల్లో తిరగడానికే భయపడేవారు ప్రజలు. అటువంటి పిల్లల్ని సరైన దారిలో పెట్టడానికి ప్రభుత్వం ఎంత పకడ్బందీ ప్రణాళికతో పనిచేసిందంటే... ముందుగా మనస్తత్వ నిపుణుల సలహాలు తీసుకుంది. అన్ని రకాల క్రీడా సౌకర్యాలతో ఇండోర్‌, ఔట్‌డోర్‌ స్టేడియాలను నిర్మించింది. స్కూళ్లలో రకరకాల కళల్లో శిక్షణ ఇప్పించడం మొదలెట్టింది. కుటుంబ విహారయాత్రలను ప్రోత్సహించింది. ఏదో ఒకదానికి అలవాటు పడే స్వభావం పిల్లల్లో సహజం. ఆ ఏదో ఒకటి మంచి అలవాటు అయ్యేలా చూసింది, పరిస్థితిని మార్చేసింది.
ఏడో అడుగు: సమానత్వం
ఐస్‌లాండ్‌లో సాంఘిక సంక్షేమ శాఖనే సమానత్వ శాఖ అంటారు. కాలానికీ, లక్ష్యానికీ తగినట్లుగా కొత్త కొత్త చట్టాలను చేయడానికీ; వాటి అమలునూ, సమాజంపై ప్రభావాన్నీ ఎప్పటికప్పుడు అంచనా వేసి తదనుగుణంగా సవరణలు చేయడానికీ ఈ శాఖను ఆరేళ్ల క్రితం ఏర్పాటుచేసింది ప్రభుత్వం. సంక్షేమ చట్టాలన్నీ సరిగ్గా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ఈ శాఖదే. లక్ష్యాలను సమీక్షించుకోవడం, తర్వాత ఏం చేయాలన్నది నిర్ణయించుకోవడం అక్కడ నిరంతరం జరుగుతుంటుంది. సమాన హక్కుల చట్టంలో మరో ముఖ్యమైన అంశం జెండర్‌ న్యూట్రాలిటీ. ఆటల్లో పాటల్లో చదువులో... ఎక్కడా స్త్రీలూ పురుషులూ అంటూ ఒక ప్రత్యేక జెండర్‌ని ప్రస్తావించరు. ఇది ఆడవాళ్ల పని, ఇది మగవారి పని అనే స్టీరియో టైప్‌ మాటలు పొరపాటున కూడా దొర్లకుండా చూసుకుంటారు. ప్రభుత్వ ఆదేశాలూ, పథకాల్లోనూ... వ్యక్తినీ, బాధ్యతనీ ప్రస్తావిస్తారే కానీ స్త్రీపురుషులన్న పదాలను ప్రస్తావించరు. అంత జాగ్రత్తగా అడుగడుగునా శ్రద్ధ చూపుతూ ముందుకు సాగుతున్నందువల్లనే మహిళల విజయం... అందరి విజయమని ఐస్‌లాండ్‌ ప్రపంచానికి చాటగలిగింది.
***
ఓ ఎనిమిదేళ్ల పాప తల్లిదండ్రులతో కలిసి షాపింగ్‌మాల్‌కి వెళ్లింది. ఎదురుగా అబ్బాయిల విభాగంలో నాసా స్పేస్‌ కాన్సెప్ట్‌ డిజైన్‌తో ప్రముఖ బ్రాండ్‌ టీషర్టులు కన్పించాయి. అలాంటివే అమ్మాయిలకూ ఉండే ఉంటాయని పరుగున లోపలికి వెళ్లింది. కానీ ఆ డిజైన్‌ కన్పించలేదు. షాపువాళ్లని అడిగితే అమ్మాయిలకు అలాంటివి లేవన్నారు. నిరాశగా ఇంటికొచ్చిన ఆ అమ్మాయి ఆరోజు రాత్రే కూర్చుని ఆ బ్రాండ్‌ యాజమాన్యానికి ఓ మెయిల్‌ పెట్టింది. అందులో- అమ్మాయిలకు ఖగోళశాస్త్రం పట్ల ఆసక్తి ఉండదని మీ ఉద్దేశమా... అని ప్రశ్నించింది. వలెంటినా తెరెష్కోవ, శాలీ రైడ్‌, సునీతా విలియమ్స్‌ తదితరులంతా మహిళలేనని గుర్తు చేసింది. తనకూ ఖగోళశాస్త్రమంటే ఇష్టమనీ ఆస్ట్రోనాట్‌ కావాలనుకుంటున్నాననీ రాసింది. అబ్బాయిలకు నాసా షర్టులూ, అమ్మాయిలకు పువ్వుల షర్టులూ అమ్మడం ద్వారా సమాజానికి మీరేం సందేశం ఇవ్వదలచుకున్నారని సూటిగా అడిగేసింది.
ఆ బ్రాండ్‌ హెచ్‌అండ్‌ఎమ్‌. అడిగింది ఐస్‌లాండ్‌ బాలిక. అదీ వారి చైతన్యం..!
ఆ ఒక్కటీ చాలు!
సమానత్వం ఒక్కటి సాధిస్తే చాలు, అదే అన్ని రంగాల్లోనూ ప్రగతికి బాటలు వేస్తుందనడానికి నిదర్శనం ఐస్‌లాండ్‌. ఒకప్పటి ఈ అతిపేద దేశం ఇప్పుడు ఐరోపాలోని సుసంపన్న దేశాల్లో ఒకటి. ఆర్థిక అసమానతలు చాలా తక్కువ. ప్రతి ముగ్గురిలో ఇద్దరికి కార్లున్నాయి. మానవాభివృద్ధి నివేదికలో ప్రపంచంలోనే తొమ్మిదో స్థానంలో నిలుస్తోంది. తీరప్రాంత గస్తీదళం తప్ప సైన్యం అనేది లేని ఈ దేశం గ్లోబల్‌ పీస్‌ ఇండెక్స్‌లో ప్రథమస్థానాన్ని ఆక్రమించింది. బహుళ రాజకీయ పార్టీల వ్యవస్థ వల్ల ఎప్పుడూ సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పడతాయి. అయినా ఒకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాక ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తాయి. ఐస్‌లాండ్‌ వాసులు కొత్తవారిని త్వరగా పలకరించరు. కాలక్షేపం కబుర్లు చెప్పరు. కానీ సంఘజీవనానికి ప్రాధాన్యమిస్తారు. కలిసికట్టుగా జీవిస్తారు. పుస్తకాలు విపరీతంగా చదువుతారు. దేశంలో నూటికి పదిమంది స్వయంగా ఓ పుస్తకం రాసినవారే కావడం విశేషం. సాహిత్యంలో నోబెల్‌ బహుమతి సైతం అందుకుందీ దేశం.
- పద్మశ్రీ యలమంచిలి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు