వ్యర్థాలే కాసులు కురిపిస్తున్నాయి!

వ్యర్థాలే కాసులు కురిపిస్తున్నాయి!
అది గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని నందిరాజుతోట. ఈ గ్రామంలో ఏ వీధి చూసినా పచ్చగా.. పరిశుభ్రంగా కనిపిస్తుంది. పూతోటలూ, నర్సరీలతో కళకళలాడుతుంది. నిత్యకళ్యాణం పచ్చతోరణంగా కనిపించే నందిరాజుతోట స్వచ్ఛతకు నిలువెత్తు నిదర్శనం. ఈ ప్రత్యేకతలతో ఆ ఊరు రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికి కారణం ఆ గ్రామ సర్పంచి వెంకటేశ్వరమ్మ, పంచాయతీ కార్యదర్శి మరియమ్మ. ఈ కృషి గురించి వారి మాటల్లోనే...
‘చెత్త నుంచి సంపద తయారీ’ అనే నినాదంతో అడుగులు వేయడమే కాదు.. దాన్ని నిజం చేసి చూపించారు వెంకటేశ్వరమ్మ, మరియమ్మ. వారికి ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే.. మూడేళ్ల క్రితం నందిరాజుతోటలో పంచాయతీరాజ్‌ అధికారులు వ్యర్థాల నుంచి సంపదను సృష్టించుకోవచ్చని శిక్షణ తరగతుల ద్వారా చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరైన వెంకటేశ్వరమ్మ, మరియమ్మ.. తమ గ్రామంలో ఆ ఆలోచనను ఆచరణలో పెట్టాలనుకున్నారు. గ్రామస్తులతో ఇదే విషయం చర్చించారు. అందరూ చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా.. డంపింగ్‌ యార్డుకు తరలించడానికి ఒప్పుకున్నారు.
వ్యర్థానికి అర్థం: అలా 2015లో గ్రామ సరిహద్దుల్లో లక్షా నలభై వేల రూపాయల వ్యయంతో డంపింగ్‌ యార్డును నిర్మించారు. దీనికయ్యే ఖర్చంతా వెంకటేశ్వరమ్మే స్వయంగా భరించింది. ఇదొక్కటే కాదు కంపోస్టు యూనిట్‌ తయారీని స్థాపించి దానికి ‘చెత్త నుంచి సంపద సృష్టి’ తయారీ కేంద్రం అని పేరు పెట్టారు. ఈ కేంద్రానికి డ్వామా నుంచి నిధులు అందాయి. ఆ తరువాత ప్రతి ఇంటికీ ప్లాస్టిక్‌ డబ్బాలను అందించి.. తడి, పొడి చెత్తలను వేరుచేయమని చెప్పారు. ఇందుకోసం ఉపాధి హామీ నిధులతో సిబ్బందిని నియమించారు. అలా వేరు చేసిన చెత్తను కంపోస్టు యూనిట్‌లో సేంద్రియ ఎరువు తయారు చేయడం మొదలుపెట్టారు. ఇలా చేయడం వల్ల వీధులూ శుభ్రంగా మారాయి. దోమల బెడదా, అనారోగ్యాల సమస్యలు తగ్గాయి. వ్యర్థాల నుంచి ఎరువులు వస్తున్నాయి. సిబ్బంది ద్వారా గ్రామంలో ప్రతి రోజూ 500 కిలోల వ్యర్థాలు సేకరిస్తున్నారు. నెలకు రెండున్నర టన్నుల వరకు కంపోస్టు ఎరువు తయారవుతోంది. కేజీ ఎరువును రూ.10 చొప్పున అమ్ముతున్నారు. అలా ఇప్పటి వరకు రూ.2 లక్షల పైన ఆదాయం సాధించారు. ఆ ఎరువుల్ని పొదుపు సంఘాల మహిళలకు అందిస్తున్నారు. దాంతో వారు పూల మొక్కల నర్సీలు ఏర్పాటు చేసి, ఉపాధి పొందుతున్నారు.
వందశాతం మరుగుదొడ్లు: గతంలో అక్కడ మహిళలు బహిర్భూమికి ఆరు బయటకు వెళ్లాల్సిందే! ఈ సమస్యను నివారించాలని మరుగుదొడ్లు లేని 486 ఇళ్లలో వాటిని ఏర్పాటు చేశారు. ఇళ్లు లేనివారికోసం సామూహికంగా కొన్ని మరుగుదొడ్లు నిర్మించారు. ఇవన్నీ ఒకెత్తయితే... నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రత్యేకంగా తొట్టెలు కట్టించి వాటిలో ఆకుకూరలు పెంచుతున్నారు. అలా వచ్చిన తాజా కూరల్ని గ్రామంలోని గర్భిణులకూ, బాలింతలకు ఉచితంగా అందేలా చూస్తున్నారు. మూడేళ్లుగా ఆ గ్రామాన్ని స్వచ్ఛత దిశగా నడిపిస్తున్నందుకు ప్రధాని నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు, పంచాయతీరాజ్‌ అధికారుల నుంచి సర్పంచి ప్రసంసలు అందుకుంది. రెండు సార్లు జాతీయ పురస్కారాలు, ఓ సారి రాష్ట్ర పురస్కారాన్ని సాధించిందీ ఊరు. ఇంటినుంచే తడి, పొడి వ్యర్థాలు వేర్వేరుగా సేకరించడం, వ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువు తయారీపై రాష్ట్రంలో 13 జిల్లాలకు చెందిన రెండు వేల మంది అధికారులు, ఎంపీపీలు, సర్పంచులు, ఉద్యోగులకు నందిరాజుతోటలో శిక్షణ ఇచ్చారు. ఇతర రాష్ట్రాల అధికారులూ వీరివద్ద శిక్షణ తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.
-జి. సురేష్‌కుమార్‌, న్యూస్‌టుడే బాపట్ల

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)