ఏమి సేతురా రామ!

ఏమి సేతురా రామ!
సముద్రగర్భ అద్భుతానికి శాశ్వత భద్రత
ధునిక భారత చరిత్రలో అత్యంత వివాదాస్పద అంశాల్లో సేతు సముద్రం ప్రాజెక్టు ఒకటి. దీనికి సంబంధించి కేంద్రప్రభుత్వం ఇటీవల సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించిన ప్రమాణపత్రంలో రామసేతును తాకబోమంటూ స్పష్టీకరించింది. తాజా పరిమాణంతో సేతు సముద్రం పథకం ప్రస్తుతానికి వెనక్కు వెళ్లిందనే భావించాలి. రామసేతు మానవ నిర్మితమేనని సశాస్త్రీయ అధ్యయనం ద్వారా అమెరికాలోని మూడు విశ్వవిద్యాలయాలకు చెందిన భూగర్భ శాస్త్ర నిపుణులు, శాస్త్రవేత్తల అధ్యయనాల సారాంశాన్ని ‘డిస్కవరీ’కి చెందిన సైన్స్‌ టీవీ ఛానెల్‌ ప్రసారం చేసింది. ఈ రెండు కీలక పరిణామాల నేపథ్యంలో సమీప భవిష్యత్తులో ఏ ప్రభుత్వమూ రామసేతును కదిలించే సాహసం చేయకపోవచ్చు. పేరుకు మూడు దిక్కులా సముద్రమున్నా తూర్పు, పశ్చిమ తీరాలకు ఒక వైపు నుంచి రెండో వైపు సముద్రయానం చేయాలన్నా, సముద్రం ద్వారా సరకు రవాణా చేయాలన్నా తీరం చుట్టూ నౌకలు వెళ్ళలేవు. శ్రీలంక చుట్టిరావాల్సిందే. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది మన్నార్‌ అఖాతం, సేతు, పాక్‌ జలసంధుల్లో సముద్రం లోతు చాలాతక్కువగా ఉండటం. దీనివల్ల ఓడలు సహజంగా ప్రయాణం చేయడానికి వీలుపడదు. దీనికి ప్రత్యామ్నాయంగా తవ్వకాలు జరిపి కృత్రిమంగా అక్కడ లోతు పెంచాలి. రెండో కారణం ఛానల్‌ తవ్వాలంటే అడ్డుగాఉన్న రామసేతును కూల్చడం. ఇది నూరు కోట్ల ప్రజల మనోభావాల్ని గాయపరచడం అవుతుంది. అందువల్లే దాదాపు 200 ఏళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు!
లాభరహితం
ఇటీవల డిస్కవరీకి చెందిన సైన్సు టీవీ ఛానల్‌, ఈ రహదారిపై సంచలనాత్మక  నివేదిక ఇచ్చింది. ఈ సేతు సహజంగా ఏర్పడింది కాదని మానవ నిర్మితమని అమెరికాలోని మూడు విశ్వవిద్యాలయాల జియాలజిస్టులు, శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అందులోని రాళ్ళు ఏడు వేల సంవత్సరాల నాటివని, ఇసుక మేటలు నాలుగు వేల ఏళ్ల నాటివని నిర్ధారించారు. దీనిపై చరిత్రకారులు తమ వాదనలకు బలం చేకూరిందని వాదిస్తున్నారు. వాల్మీకి రామాయణం యుద్ధకాండ అధ్యాయం 22లో ఈ సేతు నిర్మాణంపై వివరణ ఉంది. నరికిన చెట్లు, పేర్చిన రాళ్ల గురించి ప్రస్తావన ఉంది. కాల, నక్షత్ర గమనాల ప్రకారం, అందుబాటులో ఉన్న (ఇప్పటికీ పాటిస్తున్న) శాస్త్రం ఆధారంగా క్రీ.పూ.5114లో రాముడు జన్మించినట్లుగా విశ్వసిస్తున్నారు. ఈ ఏడు వేల సంవత్సరాల్లో సముద్రమట్టం మార్పులకు గురైంది. అందువల్లే రామసేతు సముద్రం లోతట్టుకు చేరుకుందన్నది చరిత్రకారుల వాదన. 1480నాటి భీకర తుపాను తరవాత తీర ప్రాంతంలో మార్పులు వచ్చాయనీ చెబుతున్నారు. ప్రాచీన తమిళ సాహిత్యంలో సేతు, రాముడి ప్రస్తావన ఉంది. జాఫ్నాలోనూ దొరికిన రాగి, బంగారం, వెండి నాణెలపై సేతు గురించి రాసిఉంది. కృష్ణదేవరాయ శాసనాల్లో తన సామ్రాజ్యం సేతు నుంచి విజయనగరం వరకు విస్తరించినట్లుంది. ఆ సేతు హిమాచలం అనీ భారతీయులు రివాజుగా అంటూ ఉంటారు. ముస్లిములూ దీన్ని దాటి ఆదాం కొండకు వెళ్లినట్లు భావిస్తున్నారు. శ్రీలంకలోని 7,360 అడుగుల ఎత్తుగల కొండపై పెద్ద పాదముద్రను, ముస్లిములు ఆదామ్‌దిగా, హిందువులు శివుడిదిగా, బౌద్ధులు శ్రీపాదంగా విశ్వసిస్తున్నారు. సైన్సు ఛానల్‌ ప్రసారం ప్రకారం ఇది మానవ నిర్మితమైతే రామాయణానికి సంబంధించి ఇదే మొట్టమొదటి చారిత్రక ఆధారమవుతుంది!
శ్రీలంక చుట్టూ తిరిగి రాకుండా తీరసముద్రాన్ని కొంతమేర లోతుగా తవ్వి నౌకాయానానికి అనువుగా లోతైన ఛానల్‌ని ఏర్పాటు చేసుకుంటే, కన్యాకుమారి నుంచి చెన్నై ప్రయాణ దూరం 755 నుంచి 402 నాటికల్‌ మైళ్లకు తగ్గుతుంది. దాదాపు 36 గంటల సమయం కలిసొస్తుంది. ప్రస్తుతం ఆసియా దేశాలు అరేబియా సముద్రం నుంచి శ్రీలంక మీదుగా మలైకా జలసంధి ద్వారా నౌకారవాణా చేస్తున్నాయి. జపాన్‌ తన చమురు దిగుమతుల్ని 80 శాతం ఈ మార్గం ద్వారానే తరలిస్తుస్తోంది. చైనా సైతం దాదాపు 60 శాతం చమురు దిగుమతుల్ని ఈ మార్గం ద్వారానే తీసుకువెళ్తోంది. ఒకవేళ సేతు సముద్రం ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రపంచ రవాణాలో కొంతభాగం మనతీరం ద్వారా జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇదంత సులభం కాదు. లోతులేని సముద్రతీరం, సముద్రపు గాలులు, పర్యావరణ, ఆర్థికపరంగా లాభదాయక కోణాలు మనకు అననుకూల పరిణామాలు. సేతుసముద్రం ఛానల్‌లో భారీనౌకలు, ట్యాంకర్లు వెళ్లలేవని నిపుణుల నివేదికలు స్పష్టీకరిస్తున్నాయి. అవి రెండు మూడు గంటల్లోనే శ్రీలంకను వేగంగా చుట్టి వచ్చేస్తున్నాయి. పోటీ విపణి వ్యవస్థలో అధిక రాబడికి అవకాశం లేకపోవడంతో ప్రాజెక్టువల్ల లాభదాయకతా ఉండదన్నది నిపుణుల అభిప్రాయం. రామసేతు ప్రాంతం అనేక సముద్ర జీవరాశులకు అది ఆలవాలం. రామసేతును  కూలిస్తే సునామీ ప్రమాదం పెరుగుతుందని నిపుణులూ హెచ్చరిస్తున్నారు. అణు ఇంధనం థోరియం నిల్వలకూ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ట్యుటికోరిన్‌ పోర్టు, అక్కడి థర్మల్‌ ప్రాజెక్టు వల్ల ఇప్పటికే అక్కడి సముద్రతీరం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. దాదాపు 140 తీర గ్రామాల మత్స్యకారుల ఉపాధి మార్గాలూ ప్రభావితమవుతాయి. శ్రీలంక ప్రభుత్వమూ ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. స్వాతంత్య్రానికి ముందు తొమ్మిది కమిటీలు, తరవాత అయిదు కమిటీలు రామసేతు ప్రాజెక్టుపై నివేదికలు ఇచ్చాయి. ఛానల్‌ ఎక్కడ తవ్వాలనే దానిపై వారు తమ దృష్టి కేంద్రీకరించారు. ఏ కమిటీకూడా రామసేతును విడగొట్టి సముద్రం మధ్యలో ఛానల్‌ తవ్వమని సిఫార్సు చేయలేదు. పంబన్‌ (రామేశ్వరం) ద్వీపభూభాగం మీదుగా ఛానల్‌ తవ్వాలని ఎక్కువ కమిటీలు సిఫార్సు చేశాయి. కొన్ని ప్రస్తుతం ఉన్న పంబన్‌ ఛానల్‌ (ప్రధాన భూభాగానికి పంబన్‌ ద్వీపానికి మధ్య సముద్రం) నుంచి తవ్వమని చెప్పాయి. 1955లో రామస్వామి మొదలియార్‌ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ అసలు మండపం దగ్గర ప్రధాన భూభాగాన్ని తొలిచి తవ్వమని సిఫార్సు చేసింది. 2004లో పర్యావరణ ప్రభావంపై అధ్యయనం చేసిన నాగపూర్‌ సంస్థ (నీరీ) ఈ ప్రాజెక్టు పర్యావరణానికి తీవ్ర హానికరమని నివేదించింది. అయినా ప్రభుత్వం ఆ నివేదికను పరిగణనలోకి తీసుకోలేదు. దేశంలో ఉన్న అప్పటి సంకీర్ణ రాజకీయాలే అందుకు కారణం.
చారిత్రక  ప్రాశస్త్యం
రామసేతు- దక్షిణ తమిళనాడు తీరాన సముద్రంలోకి చొచ్చుకుని శ్రీలంకకు అతిసమీపాన ఉన్న ప్రాంతం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామేశ్వరం ఈ పంబన్‌ ద్వీపంపైనే ఉంది. రాముడు స్థాపించిన ఆలయంగా దీన్ని భావిస్తారు. మండపం దగ్గరున్న ప్రధాన భూభాగం పంబన్‌ ద్వీపం ఒకనాడు కలిసే ఉండేది. 1480నాటి  భయంకర తుపానుతో మధ్యభూభాగం తెగిపోయిందని అంటారు. బ్రిటిష్‌ హయాములో రామేశ్వరం దాటి భూభాగం చివరికొస ధనుష్కోడి వరకు రైలుమార్గం ఉండేది. 1964 తుపాను ధాటికి మార్గం శిథిలం కావడంతో ప్రస్తుతం రామేశ్వరం వరకే రైలు మార్గం పరిమితమైంది. మన చివరి భూభాగం ధనుష్కోడి నుంచి శ్రీలంకలోని మన్నారు ద్వీపంలోని తలై వరకు గల 50 కి.మీ. సముద్ర ప్రాంతం రామసేతుగా ప్రసిద్ధి చెందింది. దీన్నే బ్రిటిష్‌వారు ఆడం బ్రిడ్జిగా పిలిచారు. ఈ ప్రదేశంలో సముద్రం లోతు మూడు నుంచి 30 అడుగుల మధ్య మాత్రమే ఉంటుంది. ఈ దారిలో దాదాపు 103 ఇసుక, పగడాల దిబ్బలున్నాయి. వీటిపై ఇప్పటికీ రాళ్ళున్నాయి. అవి ఉపగ్రహ సాయంతో తీసిన ఛాయాచిత్రాలు, వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2002 నాసా ఉపగ్రహ చిత్రాలు ఈ మార్గాన్ని ధ్రువీకరించాయి. వాస్తవానికి 15వ శతాబ్దం చివరివరకు ఈ మార్గం ద్వారా మనుషుల రాకపోకలు ఉండేవని చెబుతారు. తంజావూరులోని సరస్వతి మహల్‌ లైబ్రరీలో దీనికి సంబంధించిన ఆధారాలున్నాయి. ఈ దారిపై కొందరు ముస్లిములు శ్రీలంకలోని ‘ఆదాం’ కొండకు చేరుకున్నట్లుగా ఉంది. తరవాత సర్వేలో బ్రిటిషువారు ఈ దారిని ఆడం బ్రిడ్జిగా పిలిచారు. బ్రిటిష్‌ పాలనలో భారత-శ్రీలంకల మధ్య రైలు నడిచేది. దీనిలో భాగంగా ధనుష్కోడి నుంచి తలైమన్నార్‌ వరకు పడవలు నడిపేవారు. అక్కడి నుంచి కొలంబో వరకు రైలులో వెళ్ళేవారు. స్వాతంత్య్రం తరవాత రైలు ఆగిపోయినా 1982 వరకు పడవలు నడిచేవి. తమిళ టైగర్ల వివాదాల వల్ల వాటి రాకపోకలూ నిలిచిపోయాయి.
కేంద్రం అభయం
మత విశ్వాసాలను పరిగణనలోకి తీసుకుని పనిచేయరాదని వాదించే డీఎమ్‌కే 2004నాటి కేంద్రప్రభుత్వంలో భాగస్వామి. పైగా నౌకాయాన మంత్రిత్వశాఖ ఆ పార్టీ మంత్రి ఆధీనంలోనే ఉంది. పార్టీ అధినేత కరుణానిధి సైతం ప్రాజెక్టు నిర్మాణంపై గట్టి పట్టుదలతో ఉండేవారు. దీనివల్ల ఏ కమిటీ సిఫార్సు చేయకపోయినా సముద్రం మధ్యలో రామసేతును పగులగొట్టి ఛానల్‌ తవ్వాలని  యూపీఏ ప్రభుత్వం నిర్ణయించింది. అప్పట్లో దేశ ప్రజలను దిగ్భ్రమకు గురిచేసిన పరిణామమిది! కాంగ్రెస్‌, వామపక్షాలు ఈ నిర్ణయాన్ని సమర్థించాయి. లాలు ప్రసాద్‌, దేవెగౌడ వ్యతిరేకించారు. భాజపా తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. చివరకు 2005 జులై రెండున అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కేంద్రమంత్రి టీఆర్‌ బాలు, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీలు రామసేతును కూలుస్తూ నిర్మించే సముద్ర ప్రాజెక్టును ప్రారంభించారు. మూడు నుంచి అయిదేళ్లలోపు దీన్ని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పెద్దగా వివాదంలేని పాక్‌ జలసంధి వద్ద తొలుత తవ్వకాలు చేపట్టారు. మూడింట ఒక వంతుపైగా పని రెండేళ్లలో పూర్తి చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. 2007లో జయలలిత సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రామసేతును జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలని కోరారు. దీనిపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ సుబ్రమణ్యస్వామి పిటిషన్‌ దాఖలు చేశారు. అన్నింటినీ స్వీకరించిన సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యేవరకు తవ్వకాలు ఆపమని ఆదేశించింది. రామసేతుకు భంగం కలగకుండా ప్రత్యామ్నాయాల అన్వేషణకు ఆర్‌కే పచౌరి నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. రామసేతును రాముడు లేదా మానవ నిర్మితమనేదానికి చారిత్రక ఆధారాలు లేవంటూ 2007లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రమాణపత్రంలో పేర్కొంది. ప్రజలనుంచి తీవ్ర నిరసనలు పెల్లుబకడంతో తరవాత దాన్ని వెనక్కుతీసుకుంది. 2008లో పచౌరీ కమిటీ ప్రత్యామ్నాయ మార్గం లాభదాయకం కాదని, పర్యావరణానికి ప్రాజెక్టు ప్రమాదకరమని స్పష్టీకరించింది. ప్రభుత్వం ఆ నివేదికను తిరస్కరించింది. 2014లో అధికారంలోకి వచ్చిన ఎన్‌డీయే ప్రభుత్వం రామసేతుకు భంగం కలగకుండా ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తామని చెప్పింది. అధ్యయనం చేపట్టిన ‘రైట్స్‌’ సంస్థ పంబన్‌ ఛానల్‌ ద్వారా ప్రత్యామ్నాయ మార్గాన్ని నిర్మించాలని చెప్పింది. తన వైఖరిని చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో మార్చి 16న ప్రభుత్వం అఫిడవిట్‌ సమర్పించింది. రామసేతును తాకబోమని ప్రభుత్వం స్పష్టీకరించడంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన తగ్గుముఖం పట్టింది. ప్రత్యామ్నాయ మార్గాల్లో నిర్మించినా ఒనగూడే ప్రయోజనం పరిమితమేనన్న నిపుణుల మాటలవల్ల రామసేతు పథకానికి శాశ్వతంగా తెరపడినట్లేనని భావించాలి!
- కె.రామకోటేశ్వరరావు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)

వైవిధ్యమే జీవం! (Eenadu Sunday_30/09/12)