ట్రెక్కింగ్‌.. కిక్కే వేరు..!

ట్రెక్కింగ్‌.. కిక్కే వేరు..!
నగర వాసుల్లో పెరిగిన ఆసక్తి
అడవులు, కొండకోనలు, జలపాతాల్లో విహారం
రెండేళ్లలో వందల ట్రెక్‌లు.. వేల మంది హాజరు
ప్రభుత్వ యంత్రాంగమూ సై అంటోంది
ఫోన్‌ కాల్స్‌.. వాట్సాప్‌.. ట్విట్టర్‌.. ఫేస్‌బుక్‌.. ఇన్‌స్టాగ్రామ్‌... ఇంటర్‌నెట్‌.. ఎప్పుడూ ఈ గోలేనా. వీటన్నింటికీ దూరంగా అసలు ఫోన్‌ సిగ్నలే లేని ప్రాంతాలకు వెళ్లిపోతే బాగుంటుందని.. అనుకునే వాళ్ల సంఖ్య.. రాజధాని నగరాలలో క్రమంగా పెరుగుతోంది. అందుకే.. ఎవరైనా ట్రెక్కింగ్‌కు అడవుల్లోకి వెళుతున్నామనగానే.. పెద్దసంఖ్యలో తరలి వస్తున్నారు. కొండలపై నడక అంటే చాలు తెల్లవారుజామున 5 గంటలకే సిద్ధమై పోయి వెళ్లిపోతున్నారు. ప్రకృతిపై విపరీతమైన ప్రేమ, ఆసక్తి నగర వాసుల్లో పెరిగాయనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. దీంతో ప్రభుత్వం కూడా ఇప్పుడు జనానికి అత్యంత ప్రీతిపాత్రంగా మారిన ట్రెక్కింగ్‌పై ప్రత్యేక దృష్టిసారించింది. కృష్ణా జిల్లా యంత్రాంగం ట్రెక్కింగ్‌ను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. కృష్ణా అడ్వంచర్‌ క్లబ్‌ పేరుతో మొదటి ట్రెక్కింగ్‌ను మూలపాడు అటవీ ప్రాంతంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మూలపాడులోని అడవి మధ్యలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయం వద్ద బేస్‌ క్యాంప్‌ను ఏర్పాటు చేసి అక్కడ ఓ అవగాహన కార్యక్రమాన్ని సైతం నిర్వహించనున్నారు. ట్రెక్కింగ్‌ను నగరవాసులందరికీ అందుబాటులోనికి తేవాలనేది ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
గత రెండేళ్లలో విజయవాడ, గుంటూరు నగరాల్లో మారిన జీవనశైలి, కొత్తగా వచ్చే వారితో ఇక్కడి వాతావరణం పూర్తిగా మారిపోయింది. రెండేళ్ల కిందటి వరకూ ట్రెక్కింగ్‌ అంటే.. నలుగురో అయిదుగురో వెళ్తూ ఉండేవారు. కానీ.. ఇప్పుడలా కాదు. ఉద్యోగులు, వ్యాపారులు, యువత, విద్యార్థులు.. అన్ని వర్గాలు ఒక్క చోటకి చేరి.. నగరాలకు దూరంగా అడవులు, కొండ కోనల్లో విహరించి వస్తున్నారు. వారికున్న సమయాన్ని బట్టి నిత్యం ఉదయాన్నే ఓ రెండు గంటలు, ఆదివారం, సెలవు దినాల్లో రోజంతా నగర వాతావరణానికి దూరంగా వెళ్లి పోయే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇరు నగరాల్లోనూ ఉన్న ఓ రెండు మూడు ప్రైవేటు యువ అడ్వంచర్‌ సంస్థలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ ఆరోగ్య, ఆహ్లాద భరిత కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఈ సంస్థల నినాదం సైతం చాలా కొత్తగా ఉంటోంది. మల్టీప్లెక్స్‌లో ఓ వ్యక్తి సినిమాకు వెళ్తే.. కనీసం రూ.200 అవుతుంది. అదే డబ్బులను మీకు అవసరమైన ఆహారం, నీటికి వెచ్చిస్తే చాలు. జీవితంలో మీరు ఎప్పుడూ ఊహించనంత ఆనందం సొంతమవుతుందంటూ పిలుపునిస్తున్నారు. ప్రస్తుతం ఈ పిలుపును అందుకుని వెళ్లేవారిలో అన్ని వర్గాలు, అన్ని వయసుల వాళ్లూ ఉంటున్నారు. దీంతో ఈ సంస్థలు నిర్వహించే ట్రెక్కింగ్‌, హైకింగ్‌, రాక్‌క్లైంబింగ్‌, రాఫ్లింగ్‌ యాక్టివిటీ చాపకింద నీరులా.. ఇరు నగరాల్లోనూ వ్యాపించింది.
ఈ సంస్థల కృషి మరువలేనిది..
బెజవాడ కేంద్రంగా పనిచేసే విజయవాడ అడ్వంచర్‌ క్లబ్‌(వీఏసీ), యూత్‌ హాస్టల్స్‌, ఆవారా సంస్థలు ట్రెక్కింగ్‌, వాకింగ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గత కొన్నేళ్లుగా కృషి చేస్తున్నాయి. ఈ మూడు సంస్థలూ తమ కార్యకలాపాలను విస్తృతంగా చేపడుతున్నాయి. రోజూ ఏదో ఒకటి నిర్వహిస్తున్నాయి. రెండు నగరాలకు చెందిన యువత, పెద్ద చిన్నా అందరినీ నిత్యం దగ్గరలో ఉండే అటవీ ప్రాంతాలు, కొండకోనలు, నదీ తీరాల వెంట తెల్లవారకముందే తీసుకెళ్లి.. మళ్లీ ఉషోదయ కిరణాలు నేలను తాకే సమయానికి తిరిగి వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతో కళాశాలల విద్యార్థులు, యువత, కుటుంబాలు, ఉద్యోగ సంఘాలు, మహిళలు, పిల్లలు.. అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ ట్రెక్కింగ్‌లో పాల్గొంటున్నారు. వీరి వల్లే గత కొంతకాలంగా ఈ ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలపై జనంలో విపరీతమైన అవగాహన పెరిగింది. ఈ సంస్థల కీలక సభ్యులు ముందుగా వెళ్లి.. అటవీ ప్రాంతాల్లో దారులు చేయడం, రెక్కీ నిర్వహించడం చేసి సురక్షితమని భావించిన తర్వాతే మిగతా వారిని తీసుకెళ్తారు. మూలపాడు నుంచి పరిటాల, దొనకొండ వరకూ అడవిలో నడుచుకుంటూ ముందుకెళ్లి ట్రెక్కింగ్‌ కోసం దారిని ఏర్పాటు చేశారు. ఇలాంటి దారులను ముందుగా వెళ్లి ఏర్పాటు చేస్తుంటారు. గుంటూరు కేంద్రంగా పనిచేసే జిప్సీ క్లబ్‌, ఎంబీబీఎస్‌ విద్యార్థులు నిర్వహించే గుంటూరు బైకర్స్‌ అండ్‌ ట్రెక్కర్స్‌ అసోసియేషన్‌ సంస్థలు సైతం తరచూ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. వీళ్లు అందరినీ కలుపుకుని వెళ్లడం కాకుండా.. క్లబ్‌లో సభ్యులుగా ఉండే వారితో నెలకు ఒకసారి సుదూర ప్రాంతాలకు వెళ్లి ప్రకృతిలో విహరించి వస్తున్నారు.
ఆహ్లాదకర ప్రదేశాలెన్నో..
ఉండవల్లి, ఎర్రబాలెం కొండలు..ఉండవల్లి కొండలపైకి ఎక్కి నడుచుకుంటూ ఎర్రబాలెం వరకూ హిల్‌వాక్‌తో వెళతారు. మరికొందరు ఎర్రబాలెంలో కొండ ఎక్కి ఉండవల్లి వరకూ వస్తారు. రోజూ ఉదయాన్నే ఈ కొండపై ట్రెక్కింగ్‌ నిర్వహించేందుకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.
మూలపాడు అటవీ ప్రాంతం..ఇబ్రహీంపట్నం నుంచి ఆరు కిలోమీటర్ల దూరం జాతీయ రహదారిపై వెళ్లాక.. మూలపాడు వద్ద కుడి వైపునకు తిరిగి 13 కిలోమీటర్లు అడవి మార్గంలో వెళితే ఆంజనేయస్వామి ఆలయం వరకూ వెళ్తారు. అక్కడ విశాలమైన ఖాళీ స్థలం ఉంటుంది. చుట్టూ చెట్లు, మధ్యలో ఖాళీ ప్రదేశం, పక్కనే ఆంజనేయస్వామి గుడితో ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడి నుంచి నాలుగైదు దారుల్లో అడవిలోకి ట్రెక్కింగ్‌కు వెళ్లొచ్చు. ప్రస్తుతం ఇక్కడే ప్రభుత్వం అధికారికంగా ట్రెక్కింగ్‌ను నిర్వహిస్తోంది.
గుత్తికొండ బిలం.. గుంటూరు జిల్లాలో నర్సారావుపేట - మాచర్ల మార్గంలో 20 కిలోమీటర్లు వెళితే గుత్తికొండ వస్తుంది. మరో పది కిలోమీటర్లు వెళితే గుత్తికొండ బిలం వస్తుంది. ఇది కంటికి ఎదుటి వాళ్లు కనిపించనంత చిమ్మ చీకటిగా ఉంటుంది. దీనిలో ఒక్క మనిషి మాత్రమే దూరి వెళ్లేంత ఖాళీ ఉంటుంది. దానిలో నుంచి పాక్కుంటూ వెళ్లాలి. లోపలికి వెళ్లాక విశాలమైన సొరంగ మార్గం కనిపిస్తుంది. అక్కడి నుంచి మరికొన్ని సొరంగ మార్గాలు కనిపిస్తాయి. వాటి లోపలి నుంచి వెళితే కృష్ణ బిలం వద్దకు చేరుకుంటారు. మరికొంత దూరం వెళ్లాక.. అక్కడ విశాలమైన గుహ కనిపిస్తుంది. అక్కడే ఎప్పుడూ నడుం లోతు నీళ్లతో ఉండే నది ప్రవహిస్తూ కనిపిస్తుంది. ట్రెక్కింగ్‌ చేసే వారికి ఇదో గొప్ప అనుభూతి ఇస్తుంది.
కొండవీడు ఫారెస్ట్‌.. గుంటూరులో ఉండే కొండవీడు కోట, అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్‌ చేయడం కూడా ఓ గొప్ప అనుభూతిని ఇస్తుంది. చాలా సుదూరమైన ట్రెక్కింగ్‌ ప్రాంతమిది. ఫిరంగిపురం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో కొండవీడు ఉంటుంది. రెడ్డిరాజుల కాలంనాటి ఏకశిల ధ్వజస్తంభం, కత్తుల బావి ఉంటాయి. మరో మూడు కిలోమీటర్లు వెళితే కింద నుంచి కొండవీడు కోట వద్దకు చేరుకునేందుకు నడక మార్గం ఉంటుంది. సరిగ్గా గంట పడుతుంది.
కొండపల్లి, కేతనకొండ, పరిటాల..కొండపల్లి కోట వద్ద నుంచి నడుస్తూ ముందుకు వెళ్లి పైకి చేరుకుంటారు. ఇది కూడా తరచూ నగరవాసులు వెళ్లే అతి ప్రధానమైన ట్రెక్కింగ్‌ ప్రదేశమే. కేతనకొండ, పరిటాల సైతం ట్రెక్కింగ్‌కు అనుకూలమైన ప్రదేశాలే. ఇవి కాకుండా మాదులమ్మ జలపాతాలు, మూలపాడు అటవీ ప్రాంతంలోని జలపాతాల్లో విహారానికి అధిక సంఖ్యలో ఆసక్తి చూపిస్తుంటారు.
ట్రెక్కింగ్‌, హైకింగ్‌, రాక్‌క్లైంబింగ్‌, రాప్లింగ్‌..
ఈ ఆరోగ్య, ఆహ్లాదభరిత కార్యక్రమంలో భాగంగా ప్రధానంగా ఈ నాలుగు రకాల సాహస క్రీడలను చేస్తుంటారు. అడవులు, కొండల పైనుంచి దారిని ఏర్పాటు చేసుకుంటూ స్వచ్ఛమైన ప్రకృతి వాతావరణం మధ్య నుంచి ముందుకు వెళ్లడాన్ని ట్రెక్కింగ్‌ అంటారు. అడవులు, కొండల పైకి దారి ఉండి.. నేరుగా దానిమీదుగా వెళ్లిపోతే హైకింగ్‌ అంటారు. అదే కొండలపైకి రాళ్ల మీదుగా తాడు సహాయంతో ఎక్కే దానిని రాక్‌     క్లైంబింగ్‌ అంటారు. అదే.. కొండల పైనుంచి తాళ్లను కట్టి.. కిందకు దిగడాన్ని రాప్లింగ్‌ అంటారు. వీటిలో ఎవరికి ఆసక్తి ఉన్నవి వాళ్లు ప్రస్తుతం చేస్తున్నారు. వీటిలో శిక్షణ ఇచ్చేందుకు ఏడాదికోసారి ఈ సంస్థలే ఐదు రోజుల కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.
సౌకర్యాలు కల్పిస్తే..
కొండల పైకి ఎక్కి కింద ఉండే ప్రదేశాలను తిలకించడం, జలపాతాల్లో జలకాలాడడం, అడవుల్లో విహరించడం.. ఈ మూడింటిపై జనం విపరీతంగా ఆసక్తి చూపిస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం పెద్దగా ఏర్పాట్లు చేయాల్సిన వసరమూ లేదు. ఈ అటవీ ప్రాంతాల్లోకి వెళ్లేందుకు అనుకూలమైన ప్రాంతాలను గుర్తించి, అక్కడ బేస్‌ క్యాంప్‌లను ఏర్పాటు చేస్తే సరిపోతుంది. ఈ బేస్‌ క్యాంపుల్లో ట్రెక్కింగ్‌ చేసేవారికి అల్ఫాహారం, నీరు, ఔషధాలను అందుబాటులో ఉంచితే చాలు. పైసా ఖర్చు లేకుండా.. ప్రకృతిలోని ఆహ్లాదాన్ని సొంతం చేసుకోవచ్చు. విదేశాలలో మాదిరిగా.. అటవీ ప్రాంతాల్లోకి సైక్లింగ్‌తో వెళ్లేలా చేస్తే పర్యాటకంగానూ ఎంతో ప్రాధాన్యం పెరుగుతుంది.
నగర వాసులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు...
- ఉనాది రఘునాథ్‌రెడ్డి, ప్రముఖ పర్వతారోహకులు, ట్రెక్కింగ్‌ నిపుణులు
అడవుల్లోకి వెళ్లడం ఓ గొప్ప అనుభూతిని ఇస్తుండడంతో దీనిపైనే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. గత రెండేళ్లలో నగరంలో కొన్ని వందల సంఖ్యలో ట్రెక్కింగ్‌, హైకింగ్‌ కార్యక్రమాలను నిర్వహించాం. అందుకే.. ప్రభుత్వం సైతం ముందుకొచ్చి ట్రెక్కింగ్‌పై జనానికి మరింత అవగాహన పెంచేందుకు కార్యక్రమాలను చేపడుతోంది. కృష్ణా జిల్లా కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం చొరవతో మూలపాడులో ట్రెక్కింగ్‌ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.  బేస్‌ క్యాంప్‌ను మూలపాడులో ఏర్పాటు చేస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)

Ratan Tata special article on Eenadu