మహా పయనం... సుదూరం!


మహా పయనం... సుదూరం!
కొన్ని లక్షల అడవిమృగాలు... ఆగకుండా పరుగులు తీస్తూనే ఉంటాయి... వేల కిలోమీటర్లు సుదూర తీరాలకు ప్రయాణిస్తాయి... ఏడాది మొత్తం అవలా గమనంలోనే ఉంటాయి... ఎందుకు..? ఏమిటి...? ఎక్కడ..?
నం ఒకటో రెండో అడవి జంతువులు కనిపిస్తేనే ఎంతో ఆసక్తిగా చూసేస్తాం. అదే కొన్ని లక్షల అడవి మృగాల్ని ఒక్కసారిగా చూస్తే? దబదబమని వాటి పరుగుల శబ్దం.... ఆ ఒత్తిడికి అంతెత్తున లెగుస్తున్న దుమ్ము... సూర్య కిరణాల వెలుగులో నల్లగా మెరిసిపోతున్న వాటి కొమ్ములు... అదంతా చూడటానికి ఎంతో చిత్రంగా అనిపించేయదూ! ఇవన్నీ ఏ సినిమా కబుర్లో అనుకుంటున్నారేమో? కానేకాదు. టాంజానియాకి వెళితే ఇవన్నీ కళ్లారా చూడొచ్చు. అదీ... ఏడాదంతా! ఎందుకంటే అన్ని రోజులూ వీటి ప్రయాణం ఇలాగే ఓ వృత్తంలా కొనసాగుతుంది. పక్షులు వలస వెళ్లి పిల్లలతో తిరిగి సొంత ప్రాంతాలకు వెళ్లిపోవడం మనం చూస్తుంటాం. అలాంటి వలసే ఇదీనూ. నేలమీద తిరిగే జీవుల వలసలో ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. దీన్నే ది గ్రేట్‌ వైల్డ్‌ బీస్ట్‌ మైగ్రేషన్‌, సెరంగటి వైల్డ్‌ బీస్ట్‌ మైగ్రేషన్‌ అంటూ పిలిచేస్తుంటారు.
ఏమా జంతువులు?
నీలి రంగు అడవి మృగాలు
నల్లని అడవి మృగాలు చారల గుర్రాలు
ఓ రకమైన జింకలు... ఇలాంటివే ఇంకొన్ని!
అన్నీ కలిపి దాదాపు 17 నుంచి 20లక్షల అడవి మృగాలుంటాయని అంచనా!
ఎందుకీ పయనం?
ఈ మృగాలు ప్రయాణం కొనసాగించడానికి కారణం ప్రధానంగా వాతావరణమే.
ఆహారం అన్వేషిస్తూ కొన్నాళ్లు, ఆడ మృగాల్ని ఆకర్షిస్తూ కొన్నాళ్లు, పిల్లల్ని కంటూ కొన్నాళ్లు, నీళ్లను వెతుక్కుంటూ కొన్నాళ్లు, శత్రువుల నుంచి తప్పించుకుంటూ కొన్నాళ్లు ఈ పయనాన్ని సాగిస్తాయి.
మార్చి నెల వచ్చేసరికి సెరంగటి దక్షిణ భాగంలో పచ్చికలు ఎండిపోతాయి. దీంతో వీటికి ఆహారం దొరకడం కష్టమైపోతుంది. ఇవి ఇక్కడి నుంచి ఆహారం కోసం పశ్చిమంవైపుగా ప్రయాణమవుతాయి.
అలా పశ్చిమంగా ఉన్న పచ్చికల్లోకి చేరి అక్కడ ఆహారాన్ని తింటాయి. పెద్ద సరస్సులు, పొడవాటి నదులు దాటుకుంటూ ముందుకు వెళతాయి.
మగవి వేటికవి సరిహద్దుల్ని ఏర్పరుచుకుని ఆడ మృగాల్ని ఆకర్షిస్తాయి. భలే గమ్మత్తయిన విషయం ఏమిటంటే వాటి జాగాలోకి మరో మగ మృగం వస్తే అసలు ఊరుకోవు. వాటితో తలపడి పెద్ద యుద్ధాలు చేసేస్తాయి.
తాగేందుకు నీటిని వెతుక్కుంటూ,   పచ్చికలు తింటూ కెన్యాలోని మాసాయ్‌మారా నేషనల్‌ రిజర్వ్‌ గుండా ప్రయాణిస్తాయి.
జనవరి, ఫిబ్రవరిల్లో వీటికి పిల్లలు పుట్టే కాలం. దాదాపు మూడు నుంచి నాలుగు వారాల వ్యవధిలోనే వీటికి మూడు నుంచి నాలుగు లక్షల పిల్లలు పుడతాయి. వీటిల్లో దాదాపు 50శాతం దూడలు శత్రువుల బారిన పడి కొన్ని రోజులకే
చనిపోతుంటాయి.
చిరుతలు, హైనాలు, సింహాలు భూమ్మీద వీటికి ప్రధాన శత్రువులు. నదులు సరస్సుల్లో అయితే మొసళ్లు వీటిని ఆహారంగా మార్చుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాయి. అలాగే వాటి బారి నుంచి తప్పించుకుని ముందుకు వెళ్లడానికి ఇవీ అంతే శ్రమిస్తాయి. ఈ క్రమంలో ఎక్కువగా శత్రువులకు ఆహారమైపోయేవి బుల్లి దూడలే.
అలా పిల్లల్ని తీసుకుని మళ్లీ మార్చి వచ్చేసరికి సెరంగటి దక్షిణ భాగానికి చేరుకుంటాయి. ఇక్కడి నుంచి మళ్లీ కొత్త ప్రయాణం మొదలవుతుంది. లేదు లేదు  కొనసాగుతూనే ఉంటుంది. మొత్తానికి భలే వలసే కదూ!
ఎక్కడి నుంచి ఎక్కడికి?
టాంజానియా, కెన్యాల మధ్యలో దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరం అడవి మృగాలు వృత్తాకారంలో
ప్రయాణిస్తాయి.
టాంజానియాలోని సెరంగటి నేషనల్‌ పార్క్‌ చుట్టూ ప్రయాణిస్తూ కెన్యాలో ఉన్న మాసాయ్‌మారా నేషనల్‌ రిజర్వ్‌ నుంచి మళ్లీ సెరంగటిలోకి వస్తాయి.
నెలకో ప్రాంతం చొప్పున ఈ అడవి మృగాలు వెళుతుంటాయి. అవి ఎప్పుడు ఎక్కడ సంచరిస్తాయో చెబుతూ మ్యాప్‌లూ ఉన్నాయి.
ఏడాదిలో పచ్చికబయళ్ల మీదుగా, గడ్డిమైదానాల మీదుగా, నదులను దాటుకుంటూ ముందుకుసాగుతూనే
ఉంటాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)

వైవిధ్యమే జీవం! (Eenadu Sunday_30/09/12)