ఆలోచన చెబితే... వ్యాపారం చేయిస్తాం!
ఆలోచన చెబితే...
వ్యాపారం చేయిస్తాం!
ఆ సంస్థ పేరు ఐబీహబ్స్. వ్యాపారం చేయాలనే ఆలోచనతో ఆ మెట్లు ఎక్కితే... చేయాలనుకున్న వ్యాపారంలో ఓనమాలు నేర్పించి... రుణాలు ఇప్పిస్తారు. అవసరం అయితే... మార్కెటింగ్ మెలకువలూ వివరిస్తారు. స్థలం మొదలు మెంటారింగ్ వరకూ ఎన్నో చేస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే... సర్వ సదుపాయాలన్నీ సమకూర్చి పూర్తిస్థాయిలో వ్యాపారవేత్తగా మారుస్తారు. ఆ వివరాలే చెబుతోంది సంస్థ సీఈఓ రాధా అలేఖ్య.
* నివేద ఇంజినీరింగ్ విద్యార్థినిగా ఉన్నప్పుడే వేస్ట్‌మేనేజ్‌మెంట్‌పై ఓ స్టార్టప్ ఆలోచన చేసింది. ఆమె ఆలోచన కొత్తదే కానీ.. పనిచేయడానికి ఓ బృందం, నెట్‌వర్క్ విస్తరణ.. ఇలాంటివన్నీ తెలుసుకునేందుకు మమ్మల్ని సంప్రదించింది. తాజాగా ఆమె వ్యాపార ఆలోచనకు కర్ణాటక ప్రభుత్వం నుంచి యాభై లక్షల సాయం అందుకుంది.
* పందొమ్మిదేళ్ల మేఘన కూడా అంతే. ఆమెకు సామాజిక సేవ చేయడం ఇష్టం. స్నేహితులతో కలిసి ఓ బృందంగా ఏర్పడింది. సేవనే ఓ స్టార్టప్‌గా మలచాలనుకుంది. కానీ దానికి నిధులు ఎలా సేకరించాలో, న్యాయపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియక మా దగ్గరకు వచ్చింది. ఎన్‌జీవోగా రిజిస్ట్రేషన్ చేయించాం. దానిద్వారా ఇప్పుడు యాభైమంది అనాథ చిన్నారులను దత్తత తీసుకుని పోషిస్తోంది.
వీళ్లిద్దరికే కాదు... చక్కటి ఆలోచనతో ముందుకొచ్చిన ఎవరికైనా సరే సాయం అందిస్తాం. అది నెట్‌వర్కింగ్ విషయంలో కావొచ్చు... సాంకేతిక సాయం, నిధుల సేకరణా, న్యాయసలహా, మార్కెటింగ్, పరిశోధనా, బ్రాండింగ్, మెంటారింగ్, వ్యాపారం చేసుకోవడానికి చోటు.. ఇలా అవసరాన్ని బట్టి సమస్తం సమకూరుస్తాం. ఒకప్పటితో పోలిస్తే... ఈతరం ఆలోచనలు మారాయి. తమ కాళ్లమీద తాము నిలదొక్కుకోవడమే కాదు...అనేక సమస్యలకీ పరిష్కారమూ చూపించాలనుకుంటున్నారు. కానీ మార్కెట్ పోటీ వల్ల ఆటుపోట్లను తట్టుకోలేరు. సరైన మార్గనిర్దేశనం లేకపోవడమూ మరో సమస్య. దాన్ని మేం గుర్తించి సరిదిద్దడానికి ప్రయత్నిస్తాం. ప్రతిదశలోని ఇబ్బందులు గుర్తించి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. అయితే మా దగ్గరికి వచ్చే ప్రతిదీ వ్యాపార ఆలోచనే కాకపోవచ్చు. ఆర్థిక లాభమే ఉండక్కర్లేదు. అది సామాజిక ప్రయోజనం కోసం చేసే పోరాటం కూడా కావొచ్చు. ఆ ఆలోచన ఏదైనా సరే బలంగా నమ్మి ముందడుగు వేస్తోన్నవారి వెన్నుతట్టడమే ఐబీహబ్స్ ఉద్దేశం.
మేమంతా ఎవరంటే...
ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎమ్ అన్నీ ప్రతిష్టాత్మ విద్యాసంస్థలే. ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులం అంతా కలిసి ఓ బృందంగా ఏర్పడ్డాం. అంతా వేర్వేరు ప్రాంతాలకు చెందినవాళ్లం. మాలో కొందరు డాక్టర్లూ, డిజైనర్లూ, ఇంజినీర్లు... ఇలా అన్నిరకాల వృత్తుల వారూ ఉన్నారు. మా అందరి లక్ష్యం దేశ ప్రగతికి మా వంతు సాయం అందించడమే. మా బృందంలో మొత్తం రెండు వందల మంది ఉన్నాం. మా అందరికీ కామన్‌గా విజయ్ అనే మెంటార్ ఉన్నారు. ఆయన సలహాతోనే మేం వేర్వేరు బృందాలుగా విడిపోయాం. మాలో కొందరు సైబర్ సెక్యూరిటీస్ కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు. మరికొందరు అడ్వాన్డ్స్ టెక్నాలజీ విషయంలో సాయపడుతున్నారు. మేం ఇరవై మంది కలిసి యువతను వ్యాపారవేత్తలుగా మార్చాలనే ఉద్దేశంతో ఈ ఐబీహబ్స్‌ని రెండేళ్లక్రితం ఏర్పాటు చేశాం. హైదరాబాద్‌తోపాటూ దిల్లీ, లఖనవూ, ముంబయి, బెంగళూరుల్లో నోడల్ ఏజెన్సీలు, మరో ముప్ఫై ప్రాంతాల్లో సెంటర్‌లనూ ఏర్పాటు చేశాం. గ్రామీణ యువతకూ చేరువ కావడమే మా లక్ష్యం.
|
స్టార్టప్‌లకు సాయం...
ఎవరైనా సరే! వ్యాపారవేత్తగా మారడం ఒక్కరోజులో జరిగిపోదు. ఒక్కో స్టార్టప్ వివిధ దశల్ని దాటుకుని ఎదగాలంటే ఐదు నుంచి ఏడేళ్ల సమయం పడుతుంది. మా దగ్గరకు వచ్చిన ఆలోచన ...ఏ దశలో ఉందో అంచనా వేసి దాని సామర్థ్యం మేరకు సాయం ఏమేరకు అవసరమో ఆలోచిస్తాం. అలా కొందరికి ఫండింగ్ కల్పిస్తే.. ఇంకొందరికి నెట్‌వర్క్ ఎలా విస్తరించుకోవాలో సూచిస్తాం. ఇంకొన్నింటికి ఎండ్ టు ఎండ్ పద్ధతిలో ఐడియా దశ నుంచి మార్కెట్ వరకూ అన్నింటా మేం సాయం అందిస్తాం. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా రెండువందల స్టార్టప్‌లకు సాయం అందిస్తే...ఒక్క హైదరాబాద్‌లోనే ముప్ఫై స్టార్టప్‌లకు సేవలు అందిస్తున్నాం. హైదరాబాద్ కేంద్రం నుంచి కీలక కార్యకలాపాలు సాగుతాయి. దాంతో ఇక్కడ సుమారు డెబ్భైమంది పని చేస్తున్నారు. మరి మీకేంటి ప్రయోజనం అంటారా? అది ఓ స్థాయికి చేరుకున్నాక మేం ఆ సంస్థల నుంచి ఈక్విటీల రూపంలో ఆదాయం అందుకుంటాం. అలా ఇప్పటివరకూ మా సాయం పొందిన స్టార్టప్‌లు చాలానే ఉన్నాయి. వాటిల్లో ఐబీ క్రికెట్, కోసిప్, సైబర్‌ఐ, మేక్ ది వరల్డ్ వండర్‌ఫుల్, ఇంగ్లిష్ ఇంజిన్, లాటీల్యాబ్స్... వంటివెన్నో.
|
ఎవరైనా సంప్రదించొచ్చు
చక్కటి ఆలోచనలు ఉన్నవారెవరైనా మమ్మల్ని సంప్రదించొచ్చు. అవసరం అనుకుంటే ఆలోచన ప్రాథమిక స్థాయిలో ఉన్నా మేం దానికో రూపం ఇస్తాం. మా వెబ్‌సైట్ www.ibhubs.co ద్వారా మా సాయం తీసుకోవచ్చు. దరఖాస్తు చేసుకుంటే మా బృందం వారితో మాట్లాడుతుంది. మాకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆలోచన బాగుంది... సాయం చేయొచ్చు అనుకున్నవాటికి ప్రాధాన్యం ఇస్తాం. మొదటి మూడు నెలలు ఉచితంగా సేవలు అందిస్తాం. ఆ తరువాత జరిగే చర్చలో దాని భవిష్యత్తు నిర్ణయిస్తాం. తరువాత పూర్తిస్థాయిలో సాయం చేస్తాం.
|
సాఫ్ట్‌వేర్ ఒకటే ఉద్యోగం కాదు...
నేను ఐఐటీ భువనేశ్వర్‌లో చదివా. మాది రాజమండ్రి. కొన్నాళ్లు చెన్నైలోని కాగ్నిజెంట్‌లో పనిచేశా. కానీ అది సంతృప్తినివ్వలేదు. సొంతంగా ఏదైనా చేయాలి... సామాజిక ప్రయోజనం ఉండాలి అనేది నా తపన. అప్పుడే నా ఆలోచనకు డాక్టర్ అశ్విని, కావ్య దొమ్మేటి...మరికొంతమంది తోడయ్యారు. నేను సీఈవోగా, వాళ్లిద్దరూ డైరక్టర్లుగా ఐబీహబ్స్‌ని ప్రారంభించాం. తలా కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాం. అమ్మానాన్నలకి నా లక్ష్యంతెలుసు కాబట్టి వాళ్లేమనలేదు. చాలామంది చదువులంటే ఐఐటీలూ, ఉద్యోగాలంటే సాఫ్ట్‌వేర్‌లే అనుకుంటారు. కానీ ఆలోచనలకు రెక్కలిస్తే...ఎన్నో అద్భుతాలు చేయొచ్చనేది మేం నిరూపించాలనుకున్నాం.
|
- స్వాతి కొరపాటి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి