Eenadu Eetaram(29/09/12)
ఆశయం ఎగసి...ఆలోచన మెరిసి! లక్ష్యానికి ఆశయం తోడైతే సమాజానికి ఉపయోగపడే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మధ్యలో ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని అవకాశాలు ఆశ చూపినా ఆశయం తన లక్ష్యం మార్చుకోదు. దానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కడం పెద్ద కష్టమేం కాకపోవచ్చు. ఆలోచన చిన్నదే. కానీ వూహించని ఆవిష్కరణలకు కారణమవుతుంది. అది సాధ్యం కావాలంటే మాత్రం ఆచరణ పక్కాగా ఉండాలి. గమ్యం చేరే దారిలో అనుక్షణం తపించాలి. అప్పుడు అంతర్జాతీయ అవార్డులనూ ఎగరేసుకుపోవచ్చు.
నలుగురు యూత్ కలిస్తే ఫేస్‌బుక్ ముచ్చట్లు, ట్విట్టర్ ట్వీటుల చర్చలు నేటి ట్రెండ్. అదే మాధ్యమాన్ని సమాజ మార్పు వేదికగా, సమస్యల్ని పరిష్కరించే వెబ్‌సైట్‌గా రూపొందించారు హైదరాబాద్ అమ్మాయి పృకల్పా శంకర్, రాంచీ విద్యార్థి వరుణ్, జలందర్ కుర్రాడు హర్జోబెన్. ఆ వెబ్‌సైటే www.indiegogo.com/socialcops. దీనికోసం ప్రత్యేకంగా మొబైల్ అప్లికేషన్ రూపొందించడంతో ఇంటర్నెట్ లేకున్నా సెల్‌ఫోన్‌తో సైతం ఉపయోగించవచ్చు. పల్లె, పట్నం, నగరం.. ఏదైనా సామాన్య జనాలకు సవాళ్లు, సమస్యలు మామూలే. చెప్పులరిగేలా తిరిగినా పరిష్కారం కాని సమస్యలెన్నో. 'సోషల్ కాప్స్‌తో సమస్య ఇట్టే మాయం అవుతుంది' అంటున్నారు ఆ ముగ్గురు. సమస్య ఏదైనా సోషల్ కాప్స్ వెబ్‌సైట్ లేదా ఫేస్‌బుక్ పేజీ, ట్విట్టర్, మొబైల్ అప్లికేషన్ తెరిచి దాని తాలూకు ఫొటో, సమాచారాన్ని పోస్ట్ చేస్తే చాలు. వెంటనే ఆ వివరాలు సంబంధిత అధికారులకు చేరవేస్తారు. ఆ ప్రాంతంలోని స్వచ్ఛంద సంస్థలకూ సమాచారం అందుతుంది. విషయం ప్రపంచానికంతటికీ తెలియడంతో అధికారులు తాత్సారం చేయడానికి వీలుండదు. అప్పటికీ స్పందించకపోతే స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తాయి. అలా సోషల్ కాప్స్ ప్రజలు, సంస్థలు, అధికారుల మధ్య వారధిగా పనిచేస్తుంది. పృకల్ప, వరుణ్, హర్జోబెన్‌లు సింగపూర్ నన్యాంగ్ యూనివర్సిటీలో కలిసి చదివారు. అప్పుడు దేశంలో అవినీతి వ్యతిరేక ఉద్యమానికి లభించిన స్పందన చూసి ఆశ్చర్యపోయారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న విషయం వాళ్లకి అర్థమైంది. అదే స్ఫూర్తితో స్థానిక సమస్యలపై ప్రజలందర్నీ ఒకే ఆన్‌లైన్ వేదికపైకి తీసుకొస్తే పరిష్కారం దొరుకుతుందని ఆశించారు. ముందు వీధుల నుంచి పని మొదలు పెట్టాలనుకున్నారు. ఢిల్లీ లాంటి నగరపాలక సంస్థ ప్రజల సమస్యల్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయమంటోంది. ఇవన్నీ గమనించాక అన్ని సమస్యలకూ, అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి ఒక వేదిక ఉండాలని సోషల్ కాప్స్ ప్రారంభించారు మిత్రులు. ఈ ఆలోచన 2700 మందితో పోటీపడి మైక్రోసాఫ్ట్ అంతర్జాతీయ ఇమేజ్ పోటీలో రెండోస్థానం దక్కించుకుంది. సమస్య పరిష్కారం, శాశ్వత మార్పు అజెండాగా ముందుకెళ్తున్న సోషల్ కాప్స్ ప్రస్తుతం ప్రాంతాల వారీగా ఉత్సాహవంతుల్ని వలంటీర్లుగా ఎన్నుకుంటోంది. అన్నట్టు ఈ యువ సైన్యం తమ ఆశయం కోసం ఉద్యోగాలు సైతం వదులుకున్నారు. పృకల్పకి 'జాయ్ ఆఫ్ గివింగ్ వీక'్ వలంటీర్‌గా పని చేసేది. హర్జోబెన్ సింగ్ ఐబీఎం సంస్థలోనే ఉద్యోగం మానేస్తే, వరుణ్ బార్క్లేస్‌కి రాంరాం చెప్పాడు.
- శరత్‌కుమార్ బెహరా, హైదరాబాద్
|
ఏడేళ్ల కిందట అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్‌బుష్ ఇండియాలో పర్యటించాడు. భారత్, అమెరికాల మధ్య వ్యవసాయ రంగంలో పలు పరస్పర సహకార ఒప్పందాలు కుదిరాయి. దీనిలో భాగంగా యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా, గెయిన్స్‌విల్లీలో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ చేయడానికి నలుగురు యువ శాస్త్రవేత్తలకు అవకాశం కల్పించింది అమెరికా. దీనికి ఏపీ నుంచి దక్షిణామూర్తి ఒక్కడే ఎంపికయ్యాడు. ప్రవేశం పొందాక వరి పంటలో నీరు, నత్రజని వినియోగంపై సమగ్ర పరిశోధనలు చేశాడు. ఏరోబిక్ వరి విధానంలో మెరుగైన యాజమాన్య పద్ధతులు కనుగొన్నాడు. ఈ అత్యుత్తమ పరిశోధక ఫలితాలకు మెచ్చి అమెరికాలోని శాన్ ఆంటోనియాలోని 'సాయిల్‌సైన్స్ సొసైటీ ఆఫ్ అమెరికా' అత్యుత్తమ పరిశోధనగా మొదటి బహుమతి అందించింది. ఫ్లోరిడాలోని గామా సిగ్మా డెల్టా హానరరీ సొసైటీ గౌరవ సభ్యత్వం కల్పించింది. ఫలితంగా అక్కడి యూనివర్సిటీలు అత్యధిక వేతనంతో ఉద్యోగమిస్తామంటూ రెడ్ కార్పెట్ పరిచాయి. కానీ సొంత దేశం, సంస్థపై మమకారంతో అన్నీ వదులుకొని తిరిగొచ్చాడు దక్షిణామూర్తి. ప్రస్తుతం రాబోయే కాలంలో వాతావరణం మార్పులను సైతం తట్టుకొని ఎక్కువ ఉత్పత్తి సాధించే వరి, మొక్కజొన్న, పత్తి పంటలపై పరిశోధనలు చేస్తున్నాడు. దీనికి అమెరికా-బ్రిటన్ ప్రభుత్వాలు అగ్మిప్ ప్రాజెక్టు కింద రూ.1.10 కోట్లు అందిస్తున్నాయి. దక్షిణామూర్తి హైదరాబాద్‌లోని ఇక్రిశాట్, శ్రీలంకలోని యూనివర్సిటీ ఆఫ్ పెరడేనియాకి కన్సల్టెంట్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు.
సి.హెచ్.సూర్యప్రసాద్, కె.ఆదం, న్యూస్‌టుడే: యలమంచిలి, పెనుమంట్ర
|
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి