ఐడియా బ్యాంకు (Eenadu Sunday_23/09/12)

ఏదో చేయాలన్న తపన ఉన్నా ఏం చేయాలో తెలియక, ఏదో సాధించాలన్న కోరిక ఉన్నా ఎలా సాధించాలో అర్థంకాక...స్పష్టాస్పష్టమైన కలలతో, గజిబిజి మజిలీలతో కాలాన్ని వృథా చేసుకుంటున్న యువతకు ఈ ఐడియాలు స్ఫూర్తికేంద్రాలు. వీటిలో సంక్లిష్టత లేదు. కొరుకుడుపడని సాంకేతికత లేదు. కోట్ల పెట్టుబడుల ముచ్చటేలేదు. అన్నీ, ప్రజల అవసరాల్లోంచి పుట్టినవే. పుష్కలమైన మార్కెట్‌ అవకాశాలు ఉన్నవే. ఒకటిరెండు సందర్భాల్లో, తెలివిగా పాతచింతకాయకే ఐటీ తిరగమోత వేశారు. వాటిని యథాతథంగా కాపీకొట్టమనడం లేదు, అది అనైతికం కూడా (ఆపిల్‌-శాంసంగ్‌ గొడవ గుర్తుందిగా!).ఇమిటేషన్‌ ... చెత్తపని. ఇన్‌స్పిరేషన్‌ ... కొత్తగని.
మనసుంటే, ఆ ఆలోచనా విధానం నుంచి స్ఫూర్తిపొందాలి. దమ్ముంటే, మనకంటూ ఓ ఐడియాల అమ్ములపొది సిద్ధంచేసుకోవాలి. ఎవరికి తెలుసు, ఇంతకంటే గొప్ప ఆలోచనలు మన బుర్రలోంచి బుస్సున పొంగుకొస్తాయేమో!
నేడే ప్రారంభించండి...
ఐడియాబ్యాంకు ఖాతా!

పాతసామాన్లు దాస్తాం!
పాత ఆల్బమ్‌లు, పుస్తకాలు, ఇత్తడి సామాన్లు, మూలనపడ్డ పడక్కుర్చీ వగైరా వగైరా అటకంతా ఆక్రమించేస్తాయి. చూస్తూచూస్తూ తూకానికివ్వలేం. అలా అని, అట్టేపెట్టుకోలేం. వాటితో ఉన్న భావోద్వేగ సంబంధం అలాంటిది! పాత ఖాతాపుస్తకాలతో వ్యాపార సంస్థలకూ ఇలాంటి సమస్యే ఉంటుంది. నాల్రోజులు పట్టించుకోకపోతే, చెదపురుగులు తినేస్తాయి. 'వాటన్నిటినీ ఎవరైనా జాగ్రత్తగా దాచిపెట్టగలిగితే బావుండు?' అనిపిస్తుంది. 'త్రీబెడ్‌రూమ్‌ ఫ్లాట్‌లోకి మారాకో, లంకంత ఆఫీసు కట్టుకున్నాకో వెనక్కి తెచ్చుకోవచ్చు' అనుకుంటాం. 'స్టోర్‌మోర్‌' వ్యాపార లక్ష్యమూ అదే. మన సామాన్లన్నీ అట్టపెట్టెల్లో నింపి, భద్రంగా దాస్తారు. పురుగూపుట్రా రాకుండా చర్యలు తీసుకుంటారు. ఎన్ని డబ్బాలు నిండితే అంత అద్దె. నెలనెలా చెల్లించాలి. 'తరచూ బదిలీలపై వెళ్లేవారు కూడా మమ్మల్ని ఆశ్రయిస్తున్నారు' అంటారు స్టోర్‌మోర్‌ అధినేత విల్సన్‌. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ఇప్పుడిప్పుడే లాభాలబాట పడుతోంది.
భావోద్వేగాలు...ఐడియాకు
తిరుగులేని ముడిసరుకులు!
ఇంటికే సెలూన్‌
తీరిక ఉన్నప్పుడు ఓపిక ఉండదు. ఓపిక ఉన్నప్పుడు తీరిక ఉండదు. రెండూ ఉన్నప్పుడు...సెలూన్‌ ఖాళీగా ఉండదు. గంటలతరబడి వేచిచూడాలి. స్టార్‌ సెలూన్లకైతే అపాయింట్‌మెంట్‌ తప్పనిసరి. వీలునుబట్టి తేదీ సమయమూ కేటాయిస్తారు. చచ్చినట్టు వెళ్లాల్సిందే. 'వైఎల్‌జీ హోమ్‌ సెలూన్స్‌' వచ్చాక బెంగళూరు ప్రజలు వూపిరి పీల్చుకుంటున్నారు. ఓరోజు ముందు ఫోన్‌ చేస్తే చాలు, ఇంటికొచ్చి మరీ శుభ్రంగా క్షౌరం చేసి వెళ్తారు. కనీస ఫీజు... ఐదువందలు! మసాజ్‌, కలరింగ్‌ తదితర సేవలూ అందిస్తున్నారు. నిపుణులైన ఉద్యోగుల సాయంతో వ్యాపారాన్ని విజయవంతంగా నడుపుతున్నారు బాలచంద్ర. ఈ ఆలోచనకు గ్రామీణ జీవితమే స్ఫూర్తి కావచ్చు.
ఐడియాకు సంబంధించినంత
వరకూ...పాత రోత కానేకాదు.
శునకాల సేవలో...
చాలామందికి పెంపుడు జంతువులంటే ప్రేమ. బొచ్చుకుక్కలంటే మరీ ఇష్టం. ముద్దు చేస్తున్నంతసేపూ బాగానే ఉంటుంది. వాటి బాగోగులు చూడాలంటే మాత్రం, తలప్రాణం తోకకొస్తుంది. తిండి పెట్టాలి. స్నానం చేయించాలి. షికారుకు తీసుకెళ్లాలి. టీకాలు వేయించాలి. ఒంట్లో నలతగా ఉంటే వైద్యం చేయించాలి. వీటికితోడు క్షౌరాలూ మసాజ్‌లూ. అంత తీరిక ఎవరికుంది, ఎక్కడుంది? 'స్కూపీ స్క్రబ్స్‌' ఆ బాధ్యతలన్నీ సంతోషంగా స్వీకరిస్తుంది. ఇంటికొచ్చి మరీ సేవలందిస్తుంది. మనం సరేనంటే ఆ సంస్థ ప్రతినిధులు రోజూ కుక్కల్ని షికారుకు కూడా తీసుకెళ్తారు. శునకాహార తయారీలో ఉన్న సంజీవ్‌కుమార్‌ ఈ సరికొత్త ఆలోచనకు ప్రాణంపోశారు. ఢిల్లీ కేంద్రంగా ప్రారంభించినా ఇతర నగరాలకూ విస్తరించారు.
మార్పును పసిగట్టేవారినే,
ఐడియాలు వరిస్తాయి.
ఆన్‌లైన్‌లో ఆటో!
అర్జెంటుగా ఆసుపత్రికి వెళ్లాలి. సమయానికి ఒక్క ఆటో కూడా కనిపించదు. ఉన్నా, మనం వెళ్లాల్సిన చోటికి రాకపోవచ్చు. వచ్చినా మీటరు మీద రెట్టింపు అడగొచ్చు. ఇలాంటి చికాకులేవీ లేని ఆటోసేవలను అందించాలన్నది పుణెకు చెందిన autowale.inలక్ష్యం. సంస్థ వెబ్‌సైట్‌లోకి వెళ్లి వివరాలు నమోదు చేసుకుంటే చాలు. చెప్పిన సమయానికి, మనింటిముందు ఆటో హారను వినిపిస్తుంది. కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేసినా స్పందిస్తారు. 'రేడియో టాక్సీ' పద్ధతిలో ఈ వ్యవస్థంతా నడుస్తుంది. ఒకటిరెండేళ్లలో ఆటోవాలా.ఇన్‌ పాతిక నుంచి నూటయాభై ఆటోలకు పెరిగింది. నెలనెలా కచ్చితమైన సంపాదన దొరుకుతుంది కాబట్టి, ఆటో డ్రైవర్లు కూడా సంతోషంగా ఉన్నారు. ఐడియా వీరులు ముకేష్‌ఝా, జనార్దన్‌ ప్రసాద్‌ తమ వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నంలో ఉన్నారు.
గొప్ప ఐడియా గాంధీలాంటిది.
సాదాసీదాగా ఉంటుంది.
కాసుల ట్యూబు!
చేతిలో వీడియో, బుర్రలో ఆలోచనలు...ఇదే హితేంద్ర ప్రధాన పెట్టుబడి. యోగా, డాన్స్‌, వంటలు, కుట్లు, అల్లికలు, ఆరోగ్య సూత్రాలు, వంటింటి చిట్కాలు, నర్సరీ రైమ్స్‌..ఒకటేమిటి నిత్యజీవితంలో ఎంతోకొంత ఉపయోగం ఉన్న ప్రతి అంశానికి సంబంధించీ వీడియోల్ని తీయడం లేదా తీయించడం, వాటికి మెరుగులుదిద్ది యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయడం - ఇవీ అతని రోజువారీ పనులు. యూట్యూబ్‌ పార్ట్‌నర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ పుణ్యమాని...క్లిక్కులు పెరిగేకొద్దీ, హితేంద్ర ఆదాయం పెరుగుతుంది. ప్రస్తుతం ఆయన సంపాదన నెలకు పాతిక లక్షల పైమాటే. ఇదేమంత సులభమైన పని కాదు. ప్రజలకు నచ్చే వీడియోలే పెట్టాలి. క్లిక్కులు పెరిగితేనే డబ్బు. కాపీ సరుకును యూట్యూబు అంగీకరించదు. ఓరకంగా ఏరోజుకారోజు పరీక్షే. ప్రతి పరీక్షలోనూ ఫస్టు మార్కులు తెచ్చుకుంటున్నాడీ యువకుడు.
సమకాలీనత తోడైతే...సాధారణమైన ఐడియా
కూడా, అద్భుతమైన ఐడియాగా మారిపోతుంది.
పురుషులకు మాత్రమే
మగాళ్లకు ఓ టేస్టూపాడూ ఉండదు, షాపింగ్‌ అంటే గిట్టదు. తప్పనిసరిగా వెళ్లాల్సివచ్చినా పర్సుతీస్తే ఒట్టే...అన్నది మార్కెట్‌ పండితుల నిశ్చితాభిప్రాయం. అందులో కొంత నిజమూ ఉంది. కాస్తంత శ్రద్ధపెడితే, మాటలతో రెచ్చగొడితే, గ్లామర్‌ మంత్రం జపిస్తే...పురుషులతో 'ఆన్‌లైన్‌' షాపింగ్‌ చేయించవచ్చని నిరూపించారు అభిషేక్‌ షా, చేతన్‌ బఫ్నా, సోమ్యాతంబీ, సుబీర్‌ఘోష్‌. ఈ నలుగురూ గుర్‌గావ్‌లోని ఓ మేనేజ్‌మెంట్‌ కాలేజీలో సహపాఠీలు. ఆతర్వాత వ్యాపార భాగస్వాములయ్యారు. ఓ వెబ్‌సైట్‌ రూపొందించుకుని, పురుషుల దుస్తులను అమ్మకానికి పెట్టారు.fetise.comలో నాలుగు వందల నుంచి నలభైవేల దాకా... వివిధ శ్రేణులలో బ్రాండెడ్‌ దుస్తులు ఉంటాయి. ఆకర్షణీయమైన డిస్కౌంట్లు కూడా ఇస్తారు.
మూసలోంచి బయటపడినవారినే...
ఐడియా దేవత అనుగ్రహిస్తుంది.
100 శాతం సేంద్రియం!
రసాయనాల జాడేలేని, క్రిమిసంహారకాల వూసేలేని, కృత్రిమతకు తావేలేని జీవితం గడపాలని ఎవరికి మాత్రం ఉండదు? అందుకు ఉపయోగపడే ఉత్పత్తులు మార్కెట్‌లో దొరికితే, ఓ పదిరూపాయలు ఎక్కువ పెట్టడానికైనా చాలామంది సిద్ధంగా ఉంటారు. మార్కెట్‌ సర్వే కూడా ఆమాటే చెప్పడంతో... కరణ్‌, యోగితా మెహ్రా దంపతులు... లక్షణమైన ఉద్యోగాల్ని వదులుకుని 'గ్రీన్‌ ఎసెన్షియల్స్‌' పేరుతో గోవాలో దుకాణాన్ని ప్రారంభించారు. సేంద్రియ సబ్బులు, షాంపూలు, డిటర్జెంట్లు...ఒకటేమిటి, సహజసిద్ధమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన వస్తువులన్నీ అక్కడ దొరుకుతాయి. 'వ్యాపారం బావుంది. కస్టమర్లకు మా ఉత్పత్తులు తెగనచ్చాయి' అంటారు యోగిత. కృత్రిమ రంగుల దుష్ఫ్రభావాన్ని తీవ్రంగా నిరసించే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అపూర్వ కొఠారి కూడా సేంద్రియ మంత్రాన్నే జపిస్తున్నాడు. అమెరికా నుంచి వెనక్కి వచ్చేసి సేంద్రియ పత్తితో టీషర్టులు తయారుచేస్తున్నాడు. nonasties.in ద్వారా విక్రయాలు జరుపుతున్నాడు. సంతోషించాల్సిన విషయం ఏమిటంటే, పత్తిరైతుల్నీ ఇందులో భాగస్వాములను చేస్తున్నాడు. 'సేంద్రియం' అంటే ఆరోగ్యం. ఆరోగ్యం అంటే ఆనందం.
ఆనందమే బిజినెస్‌ ఐడియా అయినప్పుడు, తిరుగేముంది!
ఇ-కూరగాయల బండి
భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్థులే అయినప్పుడు...ఇంటి పనులకు తీరికే ఉండదు. అతికష్టమ్మీద నెలకోసారి పచారీ సామాన్లు తెచ్చిపడేస్తారు. కరెంటు బిల్లులూ నల్లా బిల్లులూ ఆన్‌లైన్‌లోనే కట్టేసుకుంటారు. మరి, కూరగాయల సంగతేమిటి? పండ్ల సంగతేమిటి? ఎక్కువరోజులు నిల్వ ఉంచితే, ఫ్రిజ్‌లో అయినా కుళ్లిపోతాయి. అందులోనూ కరెంటు కోతల కాలం! హైదరాబాద్‌కు చెందిన ఫార్మర్‌2హోమ్‌.కామ్‌ ఆ సమస్యకో చక్కని పరిష్కారాన్ని చూపుతోంది. సంస్థ వెబ్‌సైట్‌లోకి వెళ్లి... అవసరమైన కూరగాయల్నీ పండ్లనూ ఎంచుకుని, ఎన్ని కిలోలు కావాలో...ఏ చిరునామాకు పంపాలో నమోదు చేస్తే చాలు. ఇంటికే తెచ్చిస్తారు. ఫోన్‌లోనూ ఆర్డరు ఇవ్వవచ్చు. అయితే ఒక నిబంధన. కనీసం నూట ఎనభైరూపాయల విలువైన సరుకులు కొనాలి. ప్రస్తుతానికి హైదరాబాద్‌లోని కొద్ది ప్రాంతాలకే ఈ సేవలు పరిమితం. భవిష్యత్‌లో విస్తరించే అవకాశం ఉందంటారు ఫార్మర్‌2హోమ్‌.కామ్‌ వ్యవస్థాపకుడు రమణకుమార్‌.
ఒకరి సమస్య...
మరొకరికి బిజినెస్‌ ఐడియా!
పనిమనుషుల కంపెనీ
అంట్లు తోమాలి. బట్టలు ఉతకాలి. ఇల్లు తుడవాలి. ఏన్ని పనులు? ఒక్కపూట పనిమనిషి రాకపోయినా నరకమే! నెలకు లక్షరూపాయలు సంపాదించే సాఫ్ట్‌వేర్‌ గృహిణి అయినా...చచ్చినట్టు సెలవు పెట్టుకోవాల్సిందే. ఇంటిపనులన్నీ చేసుకోవాల్సిందే. ఎంత సమయం వృథా, ఎంత నైపుణ్యం వృథా, ఎంత సంపాదన వృథా. ఇది ఒక కోణం. మరో కోణంలో చూస్తే...పనిమనుషులూ మనలాంటి మనుషులే. వారికీ అవసరాలుంటాయి. అనారోగ్యాలుంటాయి. పనిమనుషుల సేవల్ని వ్యవస్థీకృతం చేయడం ద్వారా ఇద్దరి సమస్యలూ పరిష్కరించవచ్చని భావించారు లూథియానాకు చెందిన గౌరీసింగ్‌. సేవలు మెరుగుపడితే యజమానులు సంతృప్తి చెందుతారు. జీవనప్రమాణాలు మెరుగుపడితే పనిమనుషులు సంతోషంగా ఉంటారు. 'ద మెయిడ్స్‌ కంపెనీ' స్థాపించడం వెనకున్న ఉద్దేశమూ అదే. నెలనెలా పనిమనుషుల బ్యాంకు ఖాతాల్లో పారితోషికాలు జమైపోతాయి. మెయిడ్స్‌ కంపెనీలోని వారంతా సుశిక్షితులే. గౌరీసింగ్‌ పనిమనుషులకూ వ్యాపారంలో వాటా ఇచ్చారు.
కొన్ని ఐడియాలు చంకలో పిల్లలాంటివి. పట్టించుకోకుండా, ఎక్కడెక్కడో వెతుకుతాం.
ఆత్మశాంతి కోసం..
భారతీయులకు సంబంధించినంత వరకూ చావు కూడా పెళ్లిలాంటిదే! శాస్త్రోక్తంగా చేయాలనుకుంటారు, సాధ్యమైనంత ఘనంగా నిర్వహించాలనుకుంటారు. అందులోనూ కాశీలో శ్రాద్ధకర్మలు జరిపితే..పునర్జన్మలు ఉండవన్నది బలమైన నమ్మకం. ఆ విశ్వాసాన్నే వ్యాపార అవకాశంగా మలుచుకున్నాడు జటాశంకర్‌ ద్వివేది. ఆయన సంస్థ www.kashimoksha.com కాశీలో పితృకర్మలు నిర్వహించాలనుకునే వారికి అన్ని సేవలూ అందిస్తుంది. దహన సంస్కారాలు మొదలుకొని దశదినకర్మల దాకా...సకల కార్యక్రమాలూ చేయించి పెడుతుంది. రవాణా, వసతి, భోజనం తదితర సౌకర్యాలు కల్పిస్తుంది. కొరియర్‌లో అస్థికలు పంపినా చాలు. సెల్‌ఫోన్‌ ద్వారానే సంకల్పం చెప్పించి కార్యాన్ని పూర్తిచేస్తారు. ఎంతమందికి సంతర్పణ జరపాలన్నది చెబితే...అంతమందికీ కడుపునిండా వడ్డిస్తారు. కస్టమర్లు కోరితే మొత్తం కార్యక్రమాన్ని వీడియో తీసి పంపుతామని చెబుతున్నారు ద్వివేది.
ఐడియాకు సెంటిమెంటు తోడైతే...అదరహో!
మహిళా క్యాబ్‌ సర్వీస్‌
ఐటీ రంగంలో ఉద్యోగాలంటే..రాత్రీపగలూ తేడా ఉండదు. అర్ధరాత్రో అపరాత్రో డ్యూటీ పూర్తవుతుంది. క్యాబ్‌లో ఇంటికెళ్లాలి. పాపం! బిక్కుబిక్కుమంటూ బండెక్కుతారు మహిళలు. 'కాల్‌సెంటర్‌ ఉద్యోగినిపై క్యాబ్‌డ్రైవరు అత్యాచారం' తరహా వార్తలు బుర్రలో తిరుగుతూనే ఉంటాయి. ఇకనుంచి ముంబయి ఉద్యోగినులకు అలాంటి భయాలేం అక్కర్లేదు. ఎందుకంటే, సుసేబెన్‌ షా 'ప్రియదర్శిని క్యాబ్‌'లో డ్రైవర్లంతా మహిళలే. దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినవారే. షా డ్రైవింగ్‌ పాఠాలు నేర్పించారు. ఆత్మరక్షణ సూత్రాలు బోధించారు. స్పోకెన్‌ ఇంగ్లిష్‌లో శిక్షణ ఇప్పించారు. వీటన్నిటివల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ప్రస్తుతం పాతిక 'ప్రియదర్శిని' వాహనాలు ముంబయి రోడ్ల మీద పరుగులు తీస్తున్నాయి.
కాస్త సేవ, కాస్త వ్యాపారం...
సామాజిక ఐడియా!
బహుమతుల బజార్‌
బహుమతులనేవి 'ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం..' అన్నంత మొక్కుబడిగా ఎందుకుండాలి? వైవిధ్యమైన కానుకలు ఇవ్వొచ్చుగా. నిజానికి, బహుమతి ఎంపిక కూడా ఓ కళే. నేహా అరోరా లాంటి ఏ కొద్దిమందో చేయగలరా పని! అందుకే ఆ యువతి...'దఎల్లోసైకిల్‌.కామ్‌' పేరుతో బహుమతుల వ్యాపారంలోకి ప్రవేశించారు. సంస్థ వెబ్‌సైట్‌లోకి వెళ్తే రకరకాల ఐడియాలు కనిపిస్తాయి. అన్నీ చూస్తుంటే, ఇంత వైవిధ్యంగా కూడా బహుమతులు ఇవ్వొచ్చా అనిపిస్తుంది. ఆ ఆలోచనకు ఓ రూపం ఇవ్వడానికి ఎంత ఖర్చు అవుతుందో కూడా రాసుంటుంది. ప్రపంచంలో ఏమూలన ఉన్నవారైనా బహుమతులు పంపుకోవచ్చు. స్వీకరించేవారు మాత్రం బెంగళూరులోనే ఉండాలి. 'బహుమతి అంటేనే అనుభూతి. మేం దాన్ని రెట్టింపుచేస్తాం' అంటారు నేహా.
కొత్త ఐడియాలు రావాలంటే ఒకటే దారి
...కొత్తగా ఆలోచించాలి.
ఆన్‌లైన్‌లో అద్దెపుస్తకాలు
ఎవరన్నారు, పుస్తకాలకు కాలం చెల్లిందని? గ్రంథాలయాలు మూలనపడుతున్నాయని?...ఇప్పటికీ పుస్తకాలు చదివేవారు ఉన్నారు. అద్దె పుస్తకాల కోసం ఆవురావురుమంటూ ఎదురుచూసేవారూ ఉన్నారు. అలాంటివారి కోసమే నివేదితావర్మ 'బుక్‌ మి ఎ బుక్‌' ప్రారంభించారు. సాహిత్యం, సైకాలజీ, సినిమా, క్రీడలు.. తదితర అంశాలకు సంబంధించి నివేదిత లైబ్రరీలో ఇరవైవేల పుస్తకాలు ఉన్నాయి. అందులోంచి మనకు నచ్చినవాటిని ఎంచుకోవచ్చు. భద్రంగా ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. వారం రోజుల తర్వాతో పదిహేను రోజుల తర్వాతో తామే వచ్చి తీసుకెళ్తారు. నెలకు ఎన్ని పుస్తకాలు తీసుకోవచ్చు అన్నది...సభ్యత్వ స్వభావాన్ని బట్టి ఉంటుంది. ఆ మొత్తం మూడు వందల నుంచి ఐదువందల దాకా ఉంటుంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నా...ఢిల్లీ, గుర్‌గావ్‌, నొయిడా వాసులకూ ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. పదిమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. నివేదిత ఓ కాలేజీలో లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తూనే.. లైబ్రరీ ద్వారా నెలనెలా పాతికవేల దాకా సంపాదించుకుంటున్నారు. పుస్తకం పాతదే, ఆన్‌లైన్‌ సేవలే కొత్త.
కొన్ని ఐడియాలకు కాలదోషం ఉండదు.
టెక్నాలజీ తిరగమోత పడాలంతే!
అద్దెకు...అదిరే డ్రస్సులు!
శ్రావణం వస్తే పెళ్లిళ్ల సందడి. సీజన్‌ ముగిసేలోపు ఓ పాతిక పెళ్లిళ్లకైనా వెళ్లాల్సి ఉంటుంది. ఏడాది పొడుగునా..పుట్టినరోజు వేడుకలూ నిశ్చితార్థాలూ గృహప్రవేశాలూ ఉండనే ఉంటాయి. ప్రతి శుభకార్యానికీ ఓ కొత్తచీర కట్టుకోవాలని ఏ మహిళకు మాత్రం ఉండదు? ఇక టీనేజీ అమ్మాయిలైతే, ప్రతి వీకెండ్‌ పార్టీలోనూ డిజైనర్‌ డ్రస్సులో మెరిసిపోవాలని కలలుకంటారు. అన్ని బట్టలు కొనడం దాదాపుగా అసాధ్యం. అదే, అద్దెకు దొరికితే? ఎగిరి గంతేస్తారు. ముంబయి ఫ్యాషన్‌ వ్యాపారవేత్త జెస్సికా 'సీక్రెట్‌ వార్డ్‌రోబ్‌' అలాంటి వారికో వరం. వెబ్‌సైట్‌ ద్వారా నచ్చిన చీరలూ డ్రస్సులూ ఎంచుకోవచ్చు. నేరుగా ఇంటికే పంపుతారు. ఒకసారి ధరించి చూసిన తర్వాతే అద్దెకు తీసుకోవచ్చని అనుకుంటే, ఆ సౌకర్యమూ ఉంది. అన్నీ డిజైనర్‌ వస్త్రాలే. ధరలు పాతిక వేల నుంచి యాభైవేల దాకా ఉంటాయి. ధరను బట్టి అద్దె ఉంటుంది. డిపాజిట్‌గా కొంత మొత్తం చెల్లించాలి. భద్రంగా తిరిగిచ్చాక వాపసు చేస్తారు. 'బట్టల కొత్తదనం పాడవకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఏకాస్త అనుమానం వచ్చినా... వార్డ్‌రోబ్‌లోంచి తీసేస్తాం' అంటారు జస్సికా. ప్రస్తుతానికి 'డెయిల్‌ యువర్‌ డ్రస్‌' సేవలు ముంబయికే పరిమితం.
ఫ్యాషన్‌ ఐడియాను నమ్మినవారు ఎన్నటికీ చెడిపోరు.
కార్లు కడగబడును
కారు కడుక్కోవడం కంటే, కొనుక్కోవడమే సులభం. ఇరుకిరుకు అపార్టుమెంట్లలో అయితే..మరీ సమస్య. ధైర్యంచేసి బకెట్టూ తుండుగుడ్డా పట్టుకుని రంగంలో దూకితే...వారానికొక్కసారి వచ్చే ఆదివారం సగానికిసగం ఖర్చయిపోతుంది. సర్వీస్‌ సెంటర్‌లో అప్పగించాలంటే మరో సమస్య. ఇచ్చిరావాలి. వెళ్లి తెచ్చుకోవాలి. విడిభాగాలు మారిపోతాయేమో అన్న భయమూ ఉంటుంది. మన సమయమూ శ్రమా వృథా కాకుండా ఓ మార్గం ఉంది... 'జెర్సీస్‌ కార్‌కేర్‌' లాంటి సంస్థకు ఆ బాధ్యత అవుట్‌సోర్స్‌ చేసేయడమే. ఇంటికొచ్చి మరీ, అత్యాధునిక ఉపకరణాలతో శుభ్రంగా కడిగి వెళ్లిపోతారు. సంస్థ కార్యాలయం చెన్నైలోని అడయార్‌ ప్రాంతంలో ఉంది. 'మా చేయిపడితే...ఏ కారైనా ఇప్పుడే షోరూమ్‌ నుంచి తీసుకొచ్చినంత కొత్తగా మారిపోతుంది' అంటారు జెర్సీస్‌ ప్రతినిధి రాజేష్‌.
ఐడియాలు రెండురకాలు...
సుఖపెట్టేవి, కష్టాన్ని తప్పించేవి.
మొదటి రకానివి - యాభైరోజుల సినిమాలు.
రెండో రకానివి - వందరోజుల బొమ్మలు.
మాయా సెక్రటరీ
ఎనిమిదింటికి నోట్స్‌ తీసుకోవాలి. పదింటికంతా... కొత్త వెంచర్స్‌కు సంబంధించి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ సిద్ధం చేయాలి. రెండింటికి అతిథులకు తాజ్‌లో డిన్నర్‌ ఏర్పాట్లు. సాయంత్రం క్రాస్‌వర్డ్‌కు వెళ్లి చేతన్‌భగత్‌ కొత్తపుస్తకం గిఫ్ట్‌ప్యాక్‌ చేయించి తీసుకురావాలి. నెలకో పాతికవేలు జీతమిచ్చి నియమించుకున్న సెక్రటరీ తప్ప ఇన్నిపనులు ఎవరు చేయగలరు? ఆ అవకాశం, అవసరం ఏ కొద్దిమందికో ఉంటుంది. మిగిలినవారికి సూక్ష్మంలో మోక్షంలాంటి ఉపాయం ఒకటుంది. 'ఎట్‌ యువర్‌ సర్వీస్‌ ముంబయ్‌' వర్చువల్‌ సెక్రటరీలా వ్యవహరిస్తుంది. ఆ సంస్థ ప్రతినిధులకు ఫోన్‌లోనో, మెయిల్‌ ద్వారానో ఆరోజు కార్యక్రమాలన్నీ చెప్పేస్తే చాలు. చకచకా పనులు జరిగిపోతాయి. 'సెక్రటరీని నియమించుకుంటే పనున్నా లేకపోయినా జీతం ఇవ్వాలి. మేం అలాకాదు. పనిని బట్టే పారితోషికం' అంటారు సంస్థ వ్యవస్థాపకుడు భరత్‌ అహివర్‌. ప్రస్తుతం ఇ-సెక్రటరీల సేవల్ని పాతికమంది దాకా వినియోగించుకుంటున్నారు.

కొన్ని ఐడియాలు వైన్‌ లాంటివి. వర్తమానంతో పోలిస్తే, భవిష్యత్‌లో మరింత బావుంటాయి.
పచ్చదనం అండ్‌ కో
ఇంట్లో పచ్చని ఇండోర్‌ ప్లాంట్స్‌ ఉండాలనో బాల్కనీలో ఒకటిరెండు పూలమొక్కలైనా కనిపిస్తుండాలనో ఎవరికి మాత్రం ఉండదు. సమస్యంతా వాటి నిర్వహణతోనే. కళ్లముందు మొక్కలు ఎండిపోతూ ఉంటే మనసు గిజగిజలాడుతుంది. 'ఆ బాధంతా మీకెందుకు సార్‌, నేనున్నాగా..' అంటున్నాడు ఢిల్లీకి చెందిన దేవ్‌ గుజ్రాల్‌. ఇల్లు, ఆఫీసు, హోటలు... ఎక్కడైనా సరే కుండీల్లో మొక్కలు తీసుకొచ్చి పెట్టడం, నీళ్లూగట్రాపోయడం, ఓ నాల్రోజుల తర్వాత వాటి స్థానంలో మరో మొక్క పెట్టడం...ఒకటేమిటి పచ్చదనానికి సంబంధించిన పనులన్నీ ప్రొఫెషనల్‌గా చేసుకుపోతాడు గుజ్రాల్‌. ఇంట్లో ఖాళీ జాగా ఉంటే.. పూర్తిస్థాయి పూలతోట ఏర్పాటుచేయగలడు. ఆ యువకుడి 'అద్దె మొక్కల' వ్యాపారం బ్రహ్మాండంగా నడుస్తోంది. 'త్వరలోనే గుర్‌గావ్‌లోనూ ఆఫీసు పెడుతున్నా' అంటాడు గుజ్రాల్‌.
పచ్చని ఐడియాతో...
బోలెడంత పచ్చ'ధనం'!
నా ఐడియా బ్యాంకు పొంగిపొర్లుతోంది. అన్నీ గొప్పగానే అనిపిస్తున్నాయి. ఏ ఐడియాకు ముందుగా ప్రాణంపోయాలి? ఏ ఐడియా ఎంత అద్భుతమైందో ఎలా గుర్తించాలి? బేరీజు వేసుకోడానికి 'ఐడియా మీటర్‌' లాంటిది ఏదైనా ఉందా?...రేపటి హీరోల బుర్రల్లో బోలెడన్ని సందేహాలు.ఒకటే సమాధానం..
'ఏ ఐడియాను తలుచుకుంటే ఒంట్లో వేయి ఓల్టుల శక్తి ప్రవహిస్తుందో, ఏ ఐడియా గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఆకలేయదో నిద్రపట్టదో, ఏ ఐడియాతో అయితే పీకలోతు ప్రేమలో పడతారో, ఏ ఐడియా కోసమైతే సర్వస్వాన్నీ వదులుకోడానికైనా సిద్ధపడతారో...ఆ ఐడియాకు ముందుగా ప్రాణం పోయండి!'
విజయోస్తు. దిగ్విజయోస్తు








కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు