ప్రకృతే కాన్వాసు...అదిరింది బాసూ! (Eetaram_08/09/2012)

ప్రకృతే కాన్వాసు...అదిరింది బాసూ!
వెనకబెంచీ విద్యార్థి.. పల్లెటూరి కుర్రాడు... ఒకప్పటి అతగాడి పరిచయ వాక్యాలు...రాష్ట్రం దాటి వెళ్లాడు... ఇప్పుడు దేశం మెచ్చిన కళాకారుడయ్యాడు... అతడి కళాకృతులు ప్రతిష్ఠాత్మక వేదికలపై కొలువు దీరాయి.. ఒక్కో కళాఖండం విలువ రూ.లక్షల్లోనే! వీటిని సృష్టించింది ప్రకాశం జిల్లా యువకుడు వేగూరి రవీంద్రబాబు. సొంతూరు వచ్చిన అతడ్ని పలకరించింది 'ఈతరం'.


ప్రకాశం జిల్లా మేదరమెట్ల. అచ్చమైన పల్లెటూరికి ఆనవాలు. పచ్చని పంట పొలాలు, కల్మషం లేని పల్లెమనుషులు, ఆహ్లాదకరమైన వాతావరణం. అక్కడే పుట్టిపెరిగాడు రవీంద్రబాబు. కొడుకు డాక్టరో, ఇంజినీరో కావాలని తల్లిదండ్రుల ఆశ. మనోడికి అంత సీన్‌ ఎక్కడిది? అత్తెసరు మార్కులతో నెట్టుకొచ్చేవాడు. ఎప్పుడూ ఏవో బొమ్మలు గీసేవాడు. వాటిని చూసి నవ్వేవాళ్లు కొందరైతే, 'నీలో ఓ మంచి కళ దాగుందిరా.. కీపిటప్‌' అనేవాళ్లు ఇంకొందరు. ఆ ప్రశంసలే అతడి కుంచెకు మరింత పదును పెట్టాయి. లెక్కలేనన్ని బహుమతులు తెచ్చిపెట్టాయి. ఆ ఊపుతో ఆంధ్రా యూనిర్సిటీలో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఫైనార్ట్స్‌ (బి.ఎఫ్‌.ఎ.), ఢిల్లీ జామియా మిలియా ఇస్లామియాలో ఎం.ఎఫ్‌.ఎ. పూర్తిచేశాడు. పీజీ పూర్తయ్యేసరికి తనెంచుకున్న కళలో లోతులు చూశాడు. ఆ సమయంలోనే కళాకారులకు అరుదుగా లభించే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ స్కాలర్‌షిప్‌కి ఎంపికయ్యాడు. సొంత చిత్రాలతో వ్యక్తిగత ప్రదర్శనలు చేయడం వైజాగ్‌లో ఉన్నప్పుడే మొదలైంది.
'వూరి'ంచిన వూహలు
ఎమ్‌.ఎఫ్‌.ఎ. పూర్తికాగానే ఆంధ్రా వదిలి బరోడా చేరాడు రవీంద్ర. ఆ నగరం కళలకు నిలయం. ఫైనార్ట్స్‌కు కేంద్రమైన మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం అక్కడే ఉంది. చిత్రకళ ప్రదర్శనలు, కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. 2009లో బరోడాలో సొంతంగా స్టూడియో ఏర్పాటు చేసుకున్నాడు రవీంద్ర. 'ఔరా ఆర్ట్‌ గ్యాలరీ' అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని పెయింటింగ్స్‌ వేసేవాడు. గ్రామీణ నేపథ్యంతో వేసే అతడి కళాకృతులు జనాల్ని బాగా ఆకట్టుకునేవి. ఆ ఉత్సాహంతో వరుస ప్రదర్శనలు ఏర్పాటు చేసేవాడు. సొంతంగా ఎగ్జిబిషన్లు పెట్టేవాడు. అయితే 'నేను ఏ బొమ్మ గీసినా నాకు స్ఫూర్తి నేను పుట్టిపెరిగిన మేదరమెట్ల గ్రామమే' అంటాడు రవీంద్ర. ఆ పరిసరాలు, మకిలి అంటని మనుషుల జ్ఞాపకాలనే ముడిసరుకుగా మార్చి 'చైల్డ్‌హుడ్‌ మెమొరీస్‌' పేరుతో కుంచె కదిలించాడు. మాయమవుతున్న పచ్చని పైర్లు, విచ్ఛిన్నమవుతున్న సంస్కృతి, పోటెత్తుతున్న కాలుష్యం.. వాటి తాలూకు బాధ అతడి ప్రతి చిత్రంలో కనిపిస్తుంటుంది. రాన్రాను ఈ భావాలనే నేల, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అనే పంచభూతాలకు అన్వయించి చిత్రాలుగా మలుస్తున్నాడు.
స్పృశించిన కొత్త కోణం
మదిలో మెదిలే ఆలోచనలు చిత్తరువులుగా మారితే పెయింటింగ్‌. ఇదో కళ. ఇలాంటివే మరో అరవైమూడు కళలు. కానీ రవీంద్ర ఉద్దేశంలో 'సమాజాన్ని ప్రభావితం చేయగలిగి, సమాజానికి ఉపయోగపడేదే నిజమైన కళ'. అనడమే కాదు ఆచరణలో పెడుతున్నాడు కూడా. దీన్ని ప్రత్యక్షంగా జనాలకు అర్థమయ్యేలా చెప్పడానికి అతడు 'ఇన్‌స్టలేషన్‌ వర్క్‌ ఆర్ట్‌' అనే కొత్త ప్రక్రియ ఎంచుకున్నాడు. దీన్నే 'వర్క్‌ ఆఫ్‌ ఆర్ట్‌' అని కూడా అంటారు. ఇదీ ఆలోచనల రూపమే. పెయింటింగ్స్‌లా చిత్ర రూపంలో కాకుండా వస్తు, మనిషి రూపంలో ఉంటుంది. బాధ, సంతోషం, దుఃఖం, ప్రతి భావం ప్రత్యక్షంగా చూపించొచ్చు. ఇలాంటి కళాకారులు ఇండియాలో కొద్దిమంది మాత్రమే ఉన్నారు. పెరిగిపోతున్న ధ్వని కాలుష్యం, వాటి దుష్ఫలితాలు వివరించేలా బాలుడు, మైకు సెట్లతో వినూత్నంగా ఇన్‌స్టలేషన్‌ వర్క్‌ చేశాడు రవీంద్ర. దీన్ని ముంబైలోని ప్రతిష్ఠాత్మక 'కాలా ఘోడా ఆర్ట్‌ ఫెస్టివల్‌'లో ప్రదర్శించారు. మాజీ క్రికెర్‌ కపిల్‌దేవ్‌ ఈ పనితనానికి ముచ్చటపడి దాని పక్కన నిల్చొని మరీ ఫొటోలు దిగాడు. అలాంటిదే రైతుకు అనుబంధంగా ఉండాల్సిన నేల రియల్‌ఎస్టేట్‌ కారణంగా అతడికి దూరమవుతోందనే కాన్సెప్ట్‌తో వేసిన ఇస్త్రీ పెట్టె ఇన్‌స్టలేషన్‌ వర్క్‌. దీన్ని బరోడాలోని కల్చరల్‌ పార్క్‌లో ప్రదర్శనకు ఉంచారు.
- యడ్లపాటి బసవసురేంద్ర, న్యూస్‌టుడే: మేదరమెట్ల
మేటి ప్రదర్శనలు
* 2008లో ముంబైలోని నెహ్రూ సెంటర్‌, రఘువంశీ మిల్స్‌, పీవీఆర్‌ ఫోనిక్స్‌, బాంబే ఎగ్జిబిషన్‌ సెంటర్లలో రవీంద్ర చిత్రాల ప్రదర్శన.* 2009 జులైలో ముంబై తాజ్‌మహల్‌ హోటల్‌లో వ్యక్తిగత ప్రదర్శన.యూరోపియన్‌ బిజినెస్‌ గ్రూప్‌ ఈ షో ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ ఆర్టిస్టుల ప్రశంసలందాయి.
* ధ్వని కాలుష్యంపై రూపొందించిన ఇన్‌స్టలేషన్‌ వర్క్‌ ఆర్ట్‌ ప్రతిష్ఠాత్మక 'కాలా ఘోడా' ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది.
* 'మోడ్రన్‌ అండ్‌ కాంటెంపరరీ ఇండియన్‌ ఆర్ట్‌' పేరుతో సూరత్‌, అహ్మదాబాద్‌లలో నిర్వహించిన ప్రదర్శనలో రవీంద్ర చిత్రాలు ప్రదర్శితమయ్యాయి. ఈ అవకాశం దేశంలోని టాప్‌ ఆర్టిస్టులకే దక్కింది.
* 2012లో జైపూర్‌లో జరిగిన 'ప్రవాసీ భారతీయ దివస్‌' వేడుకల్లో రవీంద్ర చిత్రాలు ప్రదర్శనకు ఉంచారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు