అమెరికాలో మనబడి!!! (Eenadu mag_02/09/12)


అమెరికాలోని తెలుగువారు తమ పిల్లలతో అక్షరాలు దిద్దిస్తున్నారు. గుణింతాలు వల్లెవేయిస్తున్నారు. చూచిరాత రాయిస్తున్నారు. శతకాలు నేర్పుతున్నారు. పద్దెనిమిది రాష్ట్రాల్లో... రెండువేలమంది బాలలతో 'మనబడి' కళకళలాడుతోంది.
క్షరమాల! అందాల అక్షరమాల... పట్టుచీరతో, పాపిటబిళ్లతో, పూలజడతో, పారాణిపాదాలతో - అచ్చతెలుగు అలంకారాలతో విమానాశ్రయానికి బయల్దేరింది.
ఆ నడకలో 'బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను..' అన్నంత వేగమూ వయ్యారమూ.
'శుభోదయం'... విమానాశ్రయ సిబ్బంది స్వాగతం పలికారు.
చేతులు జోడించి చిరునవ్వుతో బదులిచ్చింది, 'నమస్కారం' అంటూ.
ఎంత తీయని స్వరం... 'త్యాగయ్యగొంతులో తారాడునాదం!'
రెండు చేతుల్లోనూ బరువులూ బాధ్యతలూ... 'బంగారు పంటలూ మురిపాల ముత్యా'లేమో!
ఎవరో వయోధికురాలు భారంగా అడుగులేస్తోంది. చొరవగా సాయం అందించి, ఆమె వేలుపట్టుకుని నడిపించింది... 'కడుపులో బంగారు... కనుచూపులో కరుణ!'
విమానం ఆకాశవీధులకెక్కింది. నదులు దాటి, సముద్రాలు దాటి, ఖండాలు దాటి... అమెరికాకు చేరుకుంది.
ప్రవాసులంతా ఘనస్వాగతం పలికారు... 'మా తెలుగు తల్లికి మల్లెపూదండ... మా కన్నతల్లికి మంగళారతులు!'
మేళతాళాలతో ఛత్రచామరలతో 'మనబడి'కి తీసుకెళ్లారు.
జై తెలుగుతల్లి!
జైజై తెలుగుతల్లి!
* * *
కొన్ని అంతే! కోల్పోయిన తర్వాతే విలువ తెలుస్తుంది. దూరమయ్యాకే దగ్గరితనం అనుభవంలోకి వస్తుంది. నాల్రోజులు మాతృభాష వినబడకపోతే... ఐదోరోజు ఎక్కడో ఏమూల నుంచో వినిపించే తెలుగుమాట... అచ్చంగా అన్నమయ్య కీర్తనలా వీనులవిందు చేస్తుంది. వారంరోజుల పాటూ దుకాణాల మీదా బస్సుల మీదా పరాయి భాషేదో చూసీచూసీ విసిగిపోయినప్పుడు, 'ఇచ్చట పెరుగు అమ్మబడును' అన్న వంకరటింకర అక్షరాలు కూడా ముత్యాల్లా అనిపిస్తాయి. మాతృభాషకు దూరంకావడం అన్నది బాధ కలిగించే విషయమే. అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని ప్రవాస భారతీయులకు ఆ వెలితేమిటో తెలుసు. సంఘాల ద్వారా సత్సంగాల ద్వారా లోటును భర్తీచేసుకుంటున్నారు. బ్లాగు బాతాఖానీలూ ఆన్‌లైన్‌ పత్రికలూ ఎంతోకొంత ఉపశమనాన్ని ఇస్తున్నాయి. తమవరకూ పెద్దగా ఇబ్బందేం లేదు. బాధంతా... పిల్లల గురించే! బొత్తిగా భాషను మరచిపోతున్నారు. సెలవులకు భారతదేశానికి వచ్చినప్పుడు..నోరెత్తితే ఒట్టు! ఎదుటివారితో మాట్లాడలేరు. మాట్లాడింది అర్థంచేసుకోలేరు. తెలుగు పత్రిక చేతిలో పెడితే, బిక్కమొహం వేస్తారు. ఏ ఎంపీత్రీ ప్లేయర్‌తోనో కాలక్షేపం చేస్తారు, లేదంటే అంతర్జాలంలో తలదూర్చేస్తారు.
మనవళ్లకూ మనవరాళ్లకూ బోలెడన్ని కబుర్లు చెప్పాలని ఆశగా ఎదురుచూసే తాతయ్యలకూ నానమ్మలకూ ఎంత నిరాశ! వాళ్లకు మాత్రం పెద్దపెద్ద కోరికలేం ఉంటాయి? మనవడో మనవరాలో 'చేతవెన్నముద్ద...' చెబితే వినాలనుంటుంది. 'ముద్దుగారే యశోద...' పాడితే మురిసిపోవాలనుంటుంది! 'గౌరవనీయులైన తాతగారికి..' అని సంబోధిస్తూ ఉత్తరం రాస్తే, నలుగురికీ వినిపించాలనుంటుంది! పెద్దల దాకా ఎందుకు? తమ పిల్లలు కమ్మని తెలుగు మాట్లాడాలనీ గుండ్రని అక్షరాలు రాయాలనీ కన్నవారికి మాత్రం ఉండదేమిటి? ఆ లోటు తీర్చడానికే, 2007 ఫిబ్రవరి 21న... ప్రపంచ మాతృభాషా దినోత్సవం సందర్భంగా 'సిలికానాంధ్ర' నేతృత్వంలో 'మన బడి' ప్రారంభమైంది. సర్వజిత్‌ ఉగాది సుముహూర్తాన ఘనంగా అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. సంప్రదాయ బద్ధంగా అక్షరాలు దిద్దించాలంటే... పలకాబలపాలు కావాలి. అమెరికాలో దొరుకుతాయా? అన్న సందేహం. ప్రయత్నిస్తే దొరక్కపోతాయా అన్న ఆశావాదం. అంగడి అంగడి తిరిగారు. అంజనమేసి గాలించారు. అనుకున్నది సాధించారు. ముహూర్తం సమయానికంతా..పంచెకట్టులో నాన్నలొచ్చారు. పట్టుచీరలో అమ్మలొచ్చారు.
అ, ఆ, ఇ, ఈ...
కన్నవారు చేయిపట్టుకుని రాయిస్తుంటే... పసివాళ్లు బుద్ధిగా దిద్దుకున్నారు. వందమంది పిల్లలతో కాలిఫోర్నియాలో ప్రారంభమైన తెలుగుబడి పద్దెనిమిది రాష్ట్రాలకు విస్తరించడానికి ఎంతో సమయం పట్టలేదు.భాష... బాస!
'అసలే చదువుల ఒత్తిడి. దానికితోడు, వారాంతపు బడా? అయినా, అమెరికాలో ఉంటున్న పిల్లలకి తెలుగు అక్షరాలు అవసరమా?' అని వాదించినవారూ ఉన్నారు. 'మనబడి' వాళ్లందర్నీ ఒప్పించింది. మెప్పించింది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారి సంఖ్య పదహారు కోట్లని అనుకుందాం. అందులో సగానికి సగంమంది... రాష్ట్రం బయటో, దేశం బయటో ఉన్నారు. వాళ్లవరకూ తెలుగు అర్థంచేసుకోగలరు, మాట్లాడగలరు, రాయగలరు, చదవగలరు. సమస్యంతా రేపటితరానికే. ఓ పదేళ్ల తర్వాతో పదిహేనేళ్ల తర్వాతో ఆ పిల్లలు... తెలుగు అర్థంచేసుకోలేని, తెలుగు మాట్లాడలేని, తెలుగు రాయలేని, తెలుగు చదవలేని తెలుగువారిగా మిగిలిపోతారు. భాషనే మరచిపోయినప్పుడు మాతృదేశం, మాతృరాష్ట్రం మాత్రం ఏం గుర్తుంటాయి?
అలా ఓ లంకె తెగిపోతుంది.
మూలాలనేవి, సమూలంగా నాశనమైపోతాయి. అయినా... అక్షరమంటే అక్షరమొక్కటే కాదు. అంతర్లీనంగా అందులో చరిత్ర ఉంది, సంస్కృతీ సంప్రదాయాలున్నాయి. అక్షరాన్ని వదులుకుంటే అన్నీ వదులుకున్నట్టే. అందుకే అంత ఆందోళన. అమ్మ ఒళ్లోనో, అమ్మమ్మ పర్యవేక్షణలోనో ఉన్నంతకాలం పిల్లలు మాతృభాషే మాట్లాడతారు. బడికెళ్లడం మొదలుపెట్టాక, తల్లిభాష మెల్లమెల్లగా దూరమవుతుంది.
హైదరాబాద్‌లో సిద్దీ అనే తెగ ఉంది. వాళ్లంతా ఎప్పుడో నిజాం ప్రభువుల కాలంలో ఆఫ్రికా నుంచి వచ్చారు. క్రమక్రమంగా భాషను మరచిపోయారు. భాషతో పాటు సంస్కృతి పోయింది. సంస్కృతితో పాటు సంప్రదాయాలు పోయాయి. సంప్రదాయాలతో పాటు మూలాలు పోయాయి. పరిశోధకులు వచ్చి, జన్యునమూనాల్ని పరీక్షించి..మీరు ఫలానా ప్రాంతం నుంచి వచ్చారు. ఇదీ మీ జాతి, ఇదీ మీ భాష అని చెప్పేదాకా.. తామెవరో తెలియని పరిస్థితి! ఆ దుస్థితి ప్రవాసులకు మాత్రం రాదని భరోసా ఏమిటి? అలాంటి గండాల్ని గట్టెక్కడానికే... మనబడి.తెలుగు పాఠాలు...
అమెరికాలోని పద్దెనిమిది రాష్ట్రాల్లో 'మనబడి' తెలుగు పాఠాలు నేర్పుతోంది. రెండువేలకుపైగా విద్యార్థులున్నారు. రెండువందల యాభైమంది ఉపాధ్యాయులు అక్షరసేవలో నిమగ్నమయ్యారు. మన బడి అంటే, మన బడే! ప్రతి విద్యార్థీ విధిగా తెలుగులో మాట్లాడాలి. మాట్లాడే ప్రయత్నమైనా చేయాలి. ఆరేళ్లు నిండిన బాలబాలికలు పాఠశాలలో ప్రవేశానికి అర్హులు. అక్షరమాలతో చదువు ప్రారంభం అవుతుంది. శనివారం లేదా ఆదివారం... వారానికి ఒకరోజు బడి. అందరికీ అనువైన ప్రాంతంలో పాఠశాల నిర్వహించుకుంటారు. పాఠ్యపుస్తకాలూ నోటుపుస్తకాలూ సంచులూ టీషర్టులూ నిర్వాహకులే ఇస్తారు.
ప్రవేశం... ప్రసూనం... ప్రకాశం... ప్రమోదం... ప్రభాసం... మొత్తం ఐదు తరగతులు.
ఏడాదికో తరగతి. సెప్టెంబరు చివరినాటికి ప్రవేశ ప్రక్రియ పూర్తవుతుంది. ప్రతి ఒక్కరూ 'ప్రవేశం' నుంచే చదవాలని లేదు. ప్రాథమిక అవగాహన ఉన్నవారిని... నైపుణ్యాన్ని బట్టి ఏ 'ప్రసూనం'లోనో చేర్చుకునే అవకాశమూ ఉంది. క్రమశిక్షణ విషయంలో కచ్చితంగా ఉంటారు. 90శాతం హాజరు తప్పనిసరి. అంతకు తగ్గితే పరీక్షలకు అనుమతించరు. ఏటా స్నాతకోత్సవం ఘనంగా జరుగుతుంది. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ధ్రువపత్రాల్ని జారీ చేస్తుంది. బోధన ప్రణాళిక ఎంత పక్కాగా ఉంటుందంటే... బదిలీ మీదో పదోన్నతి మీదో అమెరికాలోని మరో నగరానికి వెళ్లినా... స్థానికంగా ఉన్న మనబడిలో చేరిపోవచ్చు. పాఠాలు కోల్పోయే ప్రసక్తే లేదు. వార్షిక రుసుము మూడువందల డాలర్లు. ఫీజుల్లో చాలావరకూ పాఠశాల భవనం అద్దెలకే వెళ్లిపోతుంది. అక్కడి చట్టాల ప్రకారం... పాఠశాల ఆవరణ బీమా తప్పనిసరి. అందుకూ కొంత చెల్లించాలి. భారత్‌లో పుస్తకాలు ముద్రించి, అమెరికాకు తరలించడం అంటే వ్యయప్రయాసలతో కూడిన విషయం. ఖర్చులతో పోలిస్తే ఆ మొత్తం నామమాత్రమే.
మాట్లాడటం...
అర్థంచేసుకోవడం...
రాయడం...
చదవడం...
'ప్రవేశం'లో అక్షరాలు దిద్దుకున్న విద్యార్థికి 'ప్రభాసం' పూర్తయ్యేసరికి... ఈ నాలుగు అంశాల్లో తిరుగు ఉండకూడదన్నది 'మనబడి' లక్ష్యం. ఆరేళ్లు నిండిన పిల్లలంతా ఉత్సాహంగా బడికి వస్తుంటే... చిట్టితమ్ముళ్లూ చిన్నారి చెల్లెళ్లూ వూరకుంటారా! 'మేమూ వస్తాం, తెలుగు నేర్చుకుంటాం..' అని ముద్దుముద్దుగా మారాంచేయరూ! వారికోసం 'బాలబడి'. తెలుగు అబ్బాయినో తెలుగు అమ్మాయినో పెళ్లిచేసుకున్న ఇతర ప్రాంతాల వ్యక్తులు కూడా జీవితభాగస్వామి మాతృభాషను నేర్చుకోడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాంటివారి కోసమే వయోజన విభాగం.ప్రత్యేక ప్రణాళిక...
ఆంధ్రప్రదేశ్‌లో పుట్టి, తెలుగు వాతావరణంలో పెరుగుతూ తెలుగు నేర్చుకోవడం వేరు. మనదికాని దేశంలో, మనదికాని మాధ్యమంలో చదువుకుంటూ, మనదికాని వాతావరణంలో జీవిస్తూ తెలుగు నేర్చుకోవడం వేరు. ప్రాంతాన్ని బట్టి పాఠ్యప్రణాళిక మారుతుంది. మారాలి కూడా. మనబడి ప్రణాళికా బృందం సభ్యులు తిరుమల పెద్దింటి శ్రీనివాస్‌, కూచిభొట్ల శాంతి, తూములూరు శంకర్‌, గుండుమళ్ళ మాణిక్యవల్లి, వసంత మంగళంపల్లి, ఓరుగంటి గోపాలకృష్ణ, రాయవరం భాస్కర్‌... అమెరికాలో ఉంటున్న తెలుగు పిల్లల్ని దృష్టిలో ఉంచుకునే పాఠాలు రాశారు. ఈ ప్రయత్నంలో తెలుగు విశ్వవిద్యాలయం, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ లాంగ్వేజెస్‌ సహకరిస్తున్నాయి.
'బుడిబుడి నడకల పిల్లలము పిల్లలము
వడివడి పరుగున వచ్చెదము వచ్చెదము
పాటలు మాటలు నేర్చెదము నేర్చెదము
గునగున బాలలు రారండీ రారండీ...'
అనే పల్లవితో బాలబడి గీతం మొదలవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు బోధన నిపుణులు ఏ ఉద్దేశంతోనో మరి, అక్షరమాలకు కోతలు వేశారు. కొన్ని అక్షరాల్ని మాయం చేశారు (అక్షరం అంటే..నాశనం లేనిదని అర్థం!). మనబడిలో మాత్రం కత్తిరింపులు లేకుండా నేర్పుతున్నారు. తరగతి పెరిగేకొద్దీ..భాషలోని ఒక్కో ఒడుపూ తెలిసిపోతుంది. తలకట్టుదీర్ఘాలు తలకెక్కుతాయి. వ్యాకరణం ఒంటబడుతుంది. శతక పద్యాలు నాలుక మీద నాట్యం చేస్తాయి. చూచిరాత చేతిరాతను మార్చేస్తుంది. భాష మీద పట్టు పెరుగుతుంది. నిన్నమొన్నటిదాకా... మాటల కోసం వెతుక్కున్న పిల్లలే - తడుముకోకుండా మాట్లాడేస్తారు. 'ఏదో ఒకరోజు మా విద్యార్థులు ఛందోబద్ధంగా కందాలు రాస్తారు' అంటారు కూచిభొట్ల ఆనంద్‌. ఆయన 'సిలికానాంధ్ర' వ్యవస్థాపక అధ్యక్షులు. 'తెలుగుబడి' ఆలోచన ఆయనదే. చమర్తి రాజు డీన్‌గా వ్యవహరిస్తున్నారు. వందలమంది స్వచ్ఛంద సేవకులు మాతృభాష సేవలో పాలుపంచుకుంటున్నారు. అందరూ ఉన్నతోద్యోగులే. తమదైన రంగంలో నిష్ణాతులే. క్షణం తీరికలేని జీవితాలే అయినా... వారానికి ఒకటిరెండు రోజుల్ని 'మనబడి'కి కేటాయిస్తున్నారు. వారాంతాల్లో తెలుగే సర్వస్వం. పాఠాలు చెప్పేవారు పాఠాలు చెబుతున్నారు. పాఠ్యప్రణాళిక బృంద సభ్యులు పాఠ్యపుస్తకాల తయారీలో నిమగ్నం అవుతున్నారు. పాలనా వ్యవహారాలు చూసేవారు ఆ బాధ్యతల్లో లీనమవుతున్నారు. 'అమెరికన్‌ విద్యాసంస్థల్లో ఇంగ్లిష్‌ ప్రథమ భాష. ద్వితీయ భాషగా ఏదైనా విదేశీ భాష నేర్చుకోవాల్సి ఉంటుంది. పిల్లలు ఏ జర్మనో జపనీసో చదువుకుంటారు. తెలుగును విదేశీభాషగా గుర్తించాలని మేం అమెరికన్‌ ప్రభుత్వాన్ని కోరాం' అని చెబుతారు చమర్తి. అదే సాధ్యమైతే.. తెలుగు అధికారిక పాఠ్యాంశం అవుతుంది.
తెలుగుదనమూ...
'తెలుగుబడి' ప్రధాన లక్ష్యం - చదువొక్కటే కాదు, సంస్కారమూ. తెలుగు సంస్కృతినీ సంప్రదాయాల్నీ పిల్లలకు పరిచయం చేయడం కూడా. ఆ రెండ్రోజులూ తెలుగుదనానికే అగ్రస్థానం. అత్తయ్య, మావయ్య- పలకరింపులైతే పన్నీటి చిలకరింపులే!విరామంలో తెలుగు ఆటలు - ఒప్పుల కుప్పా వయ్యారి భామా, చెమ్మ చెక్క చారడేసి మొగ్గ, వానావానా వల్లప్పా, కాళ్లాగజ్జె కంకాళమ్మా, వీరివీరి గుమ్మాడీ వీరిపేరేంటి? ఫలహారంలో తెలుగు రుచులు - అటుకులు, చెగోడీలు, అరిసెలు, పులిహోరా, చక్కెరపొంగలి.
చిరుతిళ్ల విషయంలో కన్నవారిదే చొరవ. ఏరోజు ఎవరేం తీసుకురావాలన్నది అంతా కలిసి నిర్ణయించుకుంటారు. పిల్లల కోసం ప్రత్యేకంగా గ్రంథాలయం ఉంది. ఇందులో దాదాపు నాలుగువేల పుస్తకాలు ఉన్నాయి. ఇంటికి తీసుకెళ్లి చదువుకోవచ్చు.
'మన బడికి వెళ్లాక తెలుగు భాష మీద ఆసక్తి పెరిగింది. ఇంకా ఇంకా నేర్చుకోవాలని ఉంది. సాంస్కృతిక కార్యక్రమాల్లో ధైర్యంగా పాల్గొంటున్నా' అంటాడు శ్రేయక్‌ దుగ్గిరాల. ఆ అబ్బాయి 'ప్రకాశం' పూర్తిచేసుకుని 'ప్రమోదం'లోకి వెళ్తున్నాడు. 'మేం కాలిఫోర్నియాలో ఉంటున్నాం. ఆరో తరగతి చదువుతున్నా. కూచిపూడి నృత్యం నేర్చుకున్నాను. వేణువు కూడా వాయించగలను. ఎన్ని నేర్చుకున్నా... తెలుగులో సరిగా మాట్లాడలేకపోతున్నానే అన్న బాధ ఉండేది. అందుకే మనబడిలో చేరాను' అంటుంది వేద్యస్ఫూర్తి. వేద్య సోదరి నవ్యమైత్రి అయితే, తెలుగులో చక్కగా పద్యాలు రాస్తోంది. 'ఈమధ్యే మేం భారత్‌ వెళ్లొచ్చాం. మా పిల్లలు మైథిలి, మానస్‌ బంధువులతో, వారి పిల్లలతో బాగా కలిసిపోయారు. గడగడా తెలుగు మాట్లాడారు. ఇదంతా చూసి... పెద్దవాళ్లు చాలా చాలా సంతోషించారు. ఇద్దరికీ తెలుగంటే చాలా ప్రేమ. ఆ వయసులో మాకున్న భాషాపరిజ్ఞానం కంటే, వాళ్లు ఎక్కువే నేర్చుకున్నారేమో అనిపిస్తుంది' అంటూ మనబడికి కృతజ్ఞతలు చెబుతారు ఉష, రావు దంపతులు.
తెలుగు అక్షరాలు రెండువేలమంది పిల్లలపై అక్షయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. వాళ్లంతా భారతదేశంలోని తాతయ్యలకూ నానమ్మలకూ అమ్మమ్మలకూ తరచూ ఉత్తరాలు రాస్తున్నారు. మునుపట్లా... ఫోన్లు వస్తే, పొడిపొడి మాటలతో సంభాషణ ముగించడం లేదు. బోలెడన్ని కబుర్లు చెబుతున్నారు. ఇంట్లో అమ్మానాన్నలు పొరపాటున ఇంగ్లిష్‌లో మాట్లాడబోతే 'యు ఆర్‌ సపోజ్డ్‌ టు స్పీక్‌ ఇన్‌ తెలుగు' అంటూ తుంచేస్తున్నారు. 'చెప్పండి నాన్నా...' అంటూ తెలుగులోకి లాగుతున్నారు. ప్రవాసుల రేడియోలో 'బాలానందం' కార్యక్రమాన్ని హుషారుగా నిర్వహిస్తున్నారు. 'సిలికానాంధ్ర' కార్యక్రమాల్లో బాల ప్రయోక్తలకు కొదవే లేదు. ఎవరికి వారు సభాసమ్రాట్టులే! తెలుగు భాష మీదా, సాహిత్యం మీదా అందరికీ మక్కువ ఎక్కువవుతోంది. ఒకరిద్దరు నిజంగానే, కందాలు కట్టేస్తున్నారు. సాంస్కృతికోత్సవాల్లో చక్కని నాటికలు ప్రదర్శిస్తున్నారు. ఆవేశంగా శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని వినిపిస్తున్నారు. హృద్యంగా కరుణశ్రీ పుష్పవిలాపాన్ని ఆలపిస్తున్నారు. ఓ కుర్రాడు 'భక్తప్రహ్లాద' నాటకంలో 'ఇందుగలడందు లేడని...' రాగయుక్తంగా పాడుతుంటే చప్పట్లే చప్పట్లు! ఒకటిరెండు తెలుగువారి ట్రేడ్‌మార్కు ఈలలూ!
పండగలకూ పబ్బాలకూ అమ్మాయిలు చక్కని పూలజడలు వేసుకుంటున్నారు. అబ్బాయిలు పంచెకట్టులో దర్శనమిస్తున్నారు. ఇంతకు ముందయితే, తమను చూసి అమెరికన్‌ మిత్రులు గేలిచేస్తారేమో అని బిడియపడేవారు. ఇప్పుడా జంకులేదు. 'ఎందుకు భయం? ఇది మన సంస్కృతి. మన సంప్రదాయం' అంటారా విద్యార్థులు.
భేష్‌...శభాష్‌!
ఆమాత్రం అభిమానం చాలు! ఏ దేశమేగినా, ఎందుకాలిడినా.. మేం తెలుగువాళ్లం, మాది తెలుగుజాతి, మా భాష తెలుగు... అన్న సంగతి గుర్తుంచుకుంటే చాలు! పరాయి ప్రభంజనాలు మనల్నేమీ చేయలేవు. పిజ్జా తింటున్నా..మన దిబ్బరొట్టే గుర్తుకొస్తుంది. కోక్‌ తాగుతున్నా రాములవారి కల్యాణానికి మనూళ్లో పంచే పానకాన్నే తలుచుకుంటాం. స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీలోనూ తెలుగుతల్లిని చూసుకోగలం. కీట్స్‌ కవిత్వం చదువుతూ కృష్ణశాస్త్రిని గుర్తుచేసుకోగలం!
దేశదేశాలలో...
ఓ పాతిక కుటుంబాలు ఉన్నా చాలు. తెలుగువారంతా ఒక్కటవుతున్నారు. సంఘాలు పెట్టుకుంటున్నారు. పండగలు జరుపుకుంటున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. తెలుగుబడులు నడుపుతున్నారు. పిల్లలకు చక్కని భాష నేర్పుతున్నారు. అమెరికాలో... హ్యూస్టన్‌ తెలుగు సాంస్కృతిక సమితి, వాషింగ్టన్‌ తెలుగు సమితి, ఇంటర్నేషనల్‌ తెలుగుబడి, తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ జాక్సన్‌విల్‌ ఏరియా, తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ గ్రీన్విల్‌, శాన్‌ ఆంటోనియో తెలుగు సంఘం, ఆరెంజ్‌కౌంటీ 'తెలుగుతోట'... తదితర సంస్థలు ఉత్సాహంగా తెలుగుబడులు నిర్వహిస్తున్నాయి. తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ లండన్‌, సింగపూర్‌ తెలుగు సమాజం, మలేసియా తెలుగు సంఘం, తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ సిడ్నీ (ఆస్ట్రేలియా), దుబాయ్‌ రసమయి... తమతమ దేశాల్లో ఓనమాలు దిద్దిస్తున్నాయి. పిల్లలకే పరిమితమైనవి కొన్ని, పెద్దలకూ నేర్పుతున్నవి కొన్ని. అక్షరాలతోపాటు..నాట్యం, సంగీతం తదితర కళలకు కాణాచిగా నిలుస్తున్నవి మరికొన్ని. పాఠ్యాంశాల రూపకల్పనలో, పరీక్షల నిర్వహణలో, పట్టాల ప్రదానంలో చక్కని ప్రమాణాలు నెలకొల్పే కృషి జరుగుతోంది. అక్షర సరస్వతి సేవలో పునీతులు అవుతున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు.
అక్షర సేవే లక్ష్యంగా...
- కూచిభొట్ల ఆనంద్‌
'సిలికానాంధ్ర' వ్యవస్థాపక అధ్యక్షులు
తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తిగా నిలిచే జగమంత తెలుగు కుటుంబం- సిలికానాంధ్ర. రేపటి తరానికి తెలుగు గొప్పదనాన్ని చెప్పాలి. తెలుగు సంస్కృతిని పరిచయం చేయాలి. తెలుగు సంప్రదాయాల్ని వారి జీవితంలో భాగం చేయాలి. అదీ కల్తీలేకుండా! మా కార్యక్రమాల్లో సినిమా పాటలకూ సినిమా నృత్యాలకూ చోటుండదు. అన్నమాచార్య సంకీర్తనోత్సవం, కూచిపూడి సమ్మేళనం, మంగళవాద్య కచేరీ... ఇలా తెలుగుదనాన్ని ప్రతిబింబించే కార్యక్రమాలెన్నో నిర్వహించాం. తెలుగును ప్రాచీన భాష నుంచి ప్రపంచ భాషగా తీసుకెళ్లాలన్నది మా లక్ష్యం. అందుకే, అంతర్జాలంలో తెలుగు వినియోగాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాం. తెలుగులో ఇప్పటికీ ఇ-బుక్స్‌ చాలా తక్కువ. యూనీకోడ్‌ ఫాంట్స్‌ ఏ కొన్నో ఉన్నాయి. కొత్తతరానికి తెలుగు భాషను దగ్గర చేయాలంటే... ఈ హంగులన్నీ అవసరమే. ఆ దిశగా మాకృషి కొనసాగుతోంది. 'మనబడి'ని అమెరికాతో పాటు, వివిధ దేశాలకూ విస్తరించే ప్రయత్నమూ జరుగుతోంది. ఆయాదేశాల నుంచి ఎంతోమంది భాషాభిమానులు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. ఇది శుభపరిణామం


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు