సాంకేతిక సాయం...సమాజ సేవే ధ్యేయం! (Eetaram_15/09/12)
సాంకేతికత రెండువైపులా పదునున్న కత్తి...వాడకాన్ని బట్టే ఫలితం... సెల్‌ఫోన్ 'హాయ్'తో మొదలుపెట్టి కంప్యూటర్ 'సైన్ ఆఫ్'తో ముగించే యూత్ కొందరైతే... ఇదే టెక్నాలజీని సమస్యలపై పోరాటానికి... సామాజిక రుగ్మతను పారదోలడానికి వాడేవారు మరో రకం... ఢిల్లీలోని 'ఫ్యాట్' యువ తరంగాలు రెండో రకం. ఆ సేవల్ని భారత ప్రభుత్వమే గుర్తించింది! వ్యవస్థాపకురాలు గాయత్రి బురగొహెయిన్‌ని అంతర్జాతీయ అవార్డు వరించింది! ఆమెని 'ఈతరం' పలకరించింది.
మహిళల సమస్యలు, హక్కులపై పోరాడుతున్న సంస్థలు మనదేశంలో చాలా ఉన్నాయి. అందులోని ప్రతినిధులకు సామాజిక విషయాలపై మంచి అవగాహనే ఉంటుంది. కానీ సాంకేతికత విషయాలకొచ్చే సరికి వెనకబాటే. ఏడాదిన్నర ఓ సంస్థలో పనిచేసిన గాయత్రి ఈ విషయాన్ని స్వయంగా గమనించింది. అలాంటి వ్యవస్థలో తనూ ఓ భాగమవడం కన్నా ఆ అంతరాల్ని పూరించే చోదకంగా పని చేయాలనుకుంది. ఫలితమే జులై, 2008లో 'ఫ్యాట్' ఊపిరి పోసుకుంది.
పలు విధాల సాయం
ప్రతి స్వచ్ఛంద సంస్థకి సమాజ సేవతో పాటు మరిన్ని విధులుంటాయి. సంస్థ లెక్కల్ని ఎప్పటికప్పుడు కంప్యూటరీకరించాలి. ఎక్కువ శాఖలుంటే ఆన్‌లైన్‌లో అనుసంధానం చేయాలి. కొత్త సమాచారం కోసం అంతర్జాలాన్ని జల్లెడ పట్టాలి. ఇవన్నీ చేయాలంటే సాంకేతిక అంశాలపై పట్టుండాలి. వీటిలో శిక్షణ ఇస్తూనే ఫ్యాట్ సభ్యులు ప్రతివారం వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. సమాజంలోని ప్రధాన మహిళా సమస్యలు, వాటినెలా ఎదర్కోవాలో ఎన్జీవోలకు వివరిస్తున్నారు. మహిళా హక్కులు, చట్టపరంగా ఉన్న రక్షణలపై అవగాహన కల్పిస్తున్నారు. ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఈశాన్య రాష్ట్రాల్లో ఫ్యాట్ చురుగ్గా సేవలందిస్తోంది. ఇవి కాకుండా ప్రతి సంస్థకూ ఓ వెబ్‌సైట్ ఉండటం ఈరోజుల్లో అత్యవసరం. మంచి ఆశయంతో మొదలైనా సొంత వెబ్‌సైట్ కోసం సంస్థలు వేలు, లక్షలు వెచ్చించాల్సిందే. ఈ ఖర్చు తప్పించడానికి ఫ్యాట్ సభ్యులు ఇప్పటికే పదుల సంఖ్యలో ఎన్జీవోలకి ఉచితంగా వెబ్‌సైట్లు రూపొందించి ఇచ్చారు. కొన్ని సంస్థలకు నామమాత్రం ఫీజు వసూలు చేశారు. అదీ నిర్వహణ ఖర్చుల కోసమే. ఫ్యాట్ ఆఫ్రికాలోని సంస్థలకు సైతం వెబ్‌సైట్లు రూపొందించి ఇచ్చిన సందర్భాలున్నాయి.
సభ్యులదీ అదే నేపథ్యం!
ఫ్యాట్‌లో గాయత్రితో పాటు మరో నలుగురు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నలుగురూ ఉన్నత విద్యావంతులే, సమాజానికి సేవ చేయాలనే సంకల్పం ఉన్నవారే. క్షేత్రస్థాయి కార్యకర్తలుగా మురికివాడల యువతులు, బడి మధ్యలో మానేసిన వాళ్లనే ఎంపిక చేస్తారు. సెల్‌ఫోన్లు, సామాజిక అనుబంధాల వెబ్‌సైట్ల వాడకం, వెబ్‌సైట్ డిజైన్, నిర్వహణ అన్నింట్లో గాయత్రి వలంటీర్లకు శిక్షణనిస్తుంటుంది. సభ్యుల్లో కొందరు విదేశీయులు సైతం ఉండటం విశేషం.
మొదట్నుంచి మహిళల హక్కులు, సమస్యలపై పోరాడేదాన్ని. మహిళలు టెక్నాలజీ వాడకంలో వెనకపడటం గమనించా. ఆ ఖాళీ పూరించే ప్రయత్నమే ఫ్యాట్.* మీ నేపథ్యం, చదువు... ఈశాన్య రాష్ట్రంలోని పల్లెటూరిలో పుట్టి పెరిగాను. ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చదివాక వచ్చిన ఉద్యోగాన్ని సైతం వదులుకొని స్వచ్ఛంద సంస్థలో చేరాను. ఖాళీ సమయంలో వెబ్‌సైట్లు రూపొందించేదాన్ని. ఆ అనుభవమే ఫ్యాట్‌కు ఉపయోగపడింది. * ఫ్యాట్ సాయం మహిళా సంస్థలకేనా? చదువుకున్న ఇల్లాలితో కుటుంబం తద్వారా దేశమే బాగుపడుతుంది. సమాజసేవలో భాగమైన అతివకు సాంకేతిక విషయాలపై పట్టుంటే ఆ సేవలు మరింత విస్తృతమవుతాయి. అందుకే ప్రస్తుతానికి మహిళా సంస్థలకే మా తోడ్పాటు. * ఫ్యాట్ పుట్టుక, నిర్వహణలో ఇబ్బందులేమైనా? చాలానే ఎదుర్కొన్నాం. 'మేం మీకు అండగా నిలుస్తాం. ఉచితంగా సాయం అందిస్తాం' అంటే ముందు ఎవరూ నమ్మలేదు. కొందరైతే సమాజసేవకి టెక్నాలజీ అవసరమేంటని ప్రశ్నించారు. ఆర్థిక పరమైన ఇబ్బందులొచ్చాయి. ఇప్పుడా బాధల్లేవ్. 'ఓపెన్ మెడోస్', 'గ్లోబల్ ఫండ్ ఫర్ వుమెన్', 'మ మ క్యాష్' సంస్థల నుంచి నిధులందుతున్నాయి. * ఏపీతో మీ అనుబంధం? ప్రస్తుతానికి లేదు. భవిష్యత్తులో విస్తరించే యోచనలో ఉన్నాం. * మీ సేవకు గుర్తింపుగా... అమెరికా సంస్థ 'అనితా బోర్గ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వుమెన్ అండ్ టెక్నాలజీ' 2010 సంవత్సరానికి 'చేంజ్ ఏజెంట్'గా గుర్తించింది. టెక్నాలజీతో సమాజసేవ చేస్తున్న వ్యక్తులకు ఈ అవార్డునిస్తారు. అసోసియేషన్ ఫర్ కంప్యూటింగ్ మెషినరీ (ఎ.సి.ఎం.)కి భారతీయ బ్రాండ్ అంబాసిడర్‌గా మన ప్రభుత్వం నన్ను నియమించింది. |
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి