Eenadu Sunday (17-07-2011)

వైకుంఠపాళిలోనే కాదు...కార్పొరేట్‌ ఆఫీసుల్లోనూ పాములూ నిచ్చెనలూ ఉంటాయి. ఆ పాముల్ని ఎంత ఒడుపుగా తప్పించుకున్నామా, ఆ నిచ్చెనమెట్లు ఎంత వేగంగా ఎక్కగలిగామా అన్నదే కెరీర్‌గేమ్‌లో మన గెలుపోటముల్ని నిర్ణయిస్తుంది. అప్పుడే, క్యాంపస్‌ నుంచి బయటికొచ్చిన యువతీయువకులు...ఫస్ట్‌డే - ఫస్ట్‌షోకు వెళ్లినంత ఉత్సాహంగా ఆఫీసుకెళ్తారా! అంతా కొత్త. బాసు మనసు తెలియదు. సహోద్యోగుల స్వభావం తెలియదు. ఎవరితో మాట్లాడాలో తెలియదు. ఏం మాట్లాడాలో తెలియదు. ఎంత మాట్లాడాలో అంతకంటే తెలియదు. కాలేజీల్లో చెప్పరు. పుస్తకాల్లో రాయరు. సీనియర్లు నేర్పించరు. మరి, ఎవరొచ్చి బోధిస్తారీ కార్పొరేట్‌ భగవద్గీత? వివిధ రంగాల్లో నియామకాలు వూపందుకుంటున్న నేపథ్యంలో... 'ఎల్‌'బోర్డు ట్రైనీ కుర్రాళ్ల కోసం (బొత్తిగా 'ఆఫీస్‌ ఎటికెట్‌' తెలియని ముదుర్స్‌ కోసమూ) కొన్ని చిట్కాలు...
1 నిజావతార దర్శనం
కోరి వరించిన ఉద్యోగం. అడగ్గానే సెలవులిచ్చే బాసు. అడక్కపోయినా జీతాలు పెంచే కంపెనీ. అర్థంచేసుకునే సహోద్యోగులు. ఒకటేమిటి, సకల వైభోగాలూ ఉండవచ్చు. అయినా సరే, మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి... ఆ ఉద్యోగం ఇష్టంగానే చేస్తున్నారా? ఆ పనిని నిజంగానే ప్రేమిస్తున్నారా? అదే పని జీవితాంతం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారా? ఫర్వాలేదు, చల్తాహై...అంటూ డొంకతిరుగుడు మాటలొద్దు.
అవును/కాదు...అంతే!
సమాధానం 'కాదు' అయితే మాత్రం... మీ అభిరుచికి సరిపడే ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించండి. ఇక్కడ ఒకటే కొండగుర్తు. ఏ పని చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు మరచిపోతారో, ఏ పని చేస్తున్నప్పుడు అదసలు పనే అనిపించదో, ఏ పని గురించి మీరు పదేపదే ఆలోచిస్తుంటారో అదే...మీ పని. అదే మీ ఉద్యోగం. అదే మీ కెరీర్‌. అదే మీ జీవితం. తొలిదశలోనే మీ నిజావతారాన్ని గుర్తించండి. ఆలస్యమైతే...వృత్తిలోని అసంతృప్తి
పిిట్టకథ: ఒక ఆసుపత్రి. బయట పెద్ద బోర్డు. దాని మీద డాక్టరు పేరు. పక్కన పాతిక డిగ్రీలు. లోపల మాత్రం ఒక్క పేషెంటు కూడా కనిపించడు. ఆసుపత్రి గేటు పక్కనే ఓ చెప్పులుకుట్టే వ్యక్తి. ఎప్పుడూ కస్టమర్లే...అతనితో చెప్పులు రిపేరు చేయించుకోడానికి మండుటెండలో కూడా నిలబడతారు. కొంతకాలానికి ఆ డాక్టరు ఆసుపత్రిని మూసేస్తాడు. చెప్పులుకుట్టే వ్యక్తి అందులో షూ కంపెనీ ప్రారంభిస్తాడు. ఏం చేస్తున్నాం అన్నది కాదు. ఎంత నైపుణ్యంగా చేస్తున్నామన్నదే ప్రధానం.
2 మర్యాద రామన్న
కాలేజీ జీవితమే అంత! లెక్చరర్ల మీద జోకులేస్తాం. సహపాఠీల్ని ఏడిపిస్తాం. ఎదురుగాలేని మనుషుల గురించి ఏమేవో మాట్లాడుకుంటాం. అదో బాధ్యతలేని దశ. ఒక్కసారి కార్పొరేట్‌ ప్రపంచంలో కాలుపెట్టగానే, వాతావరణం గంభీరమైపోతుంది. అలా అని, వెుహం ముడుచుకుని కూర్చోవాల్సిన పన్లేదు. నవ్వినా నవ్వించినా...హుందాగానే ఉండాలి. హాస్యమే కాని, అపహాస్యం కూడదు. ఎదురుగాలేని వ్యక్తుల గురించి వ్యాఖ్యలొద్దు. విమర్శలొద్దు. చుట్టుపక్కల అతని సన్నిహితులెవరో ఉండే ఉంటారు. పనిచేసే చోట, కోరికోరి ఒక శత్రువును సృష్టించుకోవడం ఏమంత తెలివైన పనికాదు. అనుమతి లేకుండా ఎవరి క్యాబిన్‌లోకీ వెళ్లకండి. బాసేకానక్కర్లేదు, సహోద్యోగి అయినా సరే. థాంక్‌ యు, సారీ, ఎక్స్‌క్యూజ్‌మి!..వంటి మర్యాద మాటల్ని ధారాళంగా వాడండి, మీ సొమ్మేంపోదు. సెల్‌ఫోన్‌ సంభాషణలు ఎంత క్లుప్తంగా ఉంటే అంత మంచిది. ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు స్విచాఫ్‌ చేయడమే ఉత్తమం. రింగ్‌టోన్లు అసభ్యంగా లేకుండా జాగ్రత్తపడండి.కొలీగ్స్‌ దగ్గర చేబదుళ్లు తీసుకోవడం మంచి అలవాటు కాదు. తప్పనిసరై తీసుకున్నా, జీతంరాళ్లు చేతిలోపడగానే తీర్చేయండి. ఆఫీసు వేళల్లో చూయింగ్‌ గమ్‌, సిగరెట్‌, పాన్‌మసాలా...తదితర అలవాట్లను సాధ్యమైనంత దూరంగా ఉంచండి. పెద్దల మాట: అలవాట్లు ఆలోచనల్ని ప్రభావితం చేస్తాయి. ఆలోచనలు వ్యక్తిత్వానికి అద్దంపడతాయి. 'మీరు' అంటే...మీ అలవాట్లే.
3 బాసు దేవోభవ
'మేరే పాస్‌ క్వాలిఫికేషన్‌ హై.
మేరేపాస్‌ క్రియేటివిటీ హై.
మేరేపాస్‌ టాలెంట్‌ హై'...ఎన్ని మాటలైనా చెప్పండి.
'మేరేపాస్‌ మేనేజ్‌మెంట్‌ హై'...అన్న బాసు డైలాగుకే చప్పట్లు రాలతాయి.
బాస్‌ ఈజ్‌ ఆల్వేస్‌ పవర్‌ఫుల్‌! అతని వెుహం మీకు నచ్చకపోవచ్చు. అతని నైపుణ్యం మీద మీకు అనుమానం ఉండవచ్చు. ఎక్కడో జూలో ఉండాల్సిన అరుదైన జీవిని తీసుకొచ్చి, సూటూబూటూ వేసి క్యాబిన్‌లో కూర్చోబెట్టారేమిటా అని మీరు మనసులో తిట్టుకోవచ్చు. అయినా సరే, బాసు బాసే! అతనికి నచ్చేలా పనిచేయడం ఉద్యోగిగా మీ బాధ్యత. బాసు ఆదేశాల్ని శిరసావహించండి. అవసరమైతే, బాసు అజ్ఞానాన్ని భరించండి. అతని అసమర్థతను ఎత్తిచూపే విమర్శలొద్దు. బాసుతో వాదనలొద్దు. బాస్‌కు సదభిప్రాయంలేని వ్యక్తులతో రాసుకుపూసుకు తిరగకండి. మీరూ ఆ వ్యతిరేక వర్గంలో చేరిపోయారనుకునే ప్రమాదం ఉంది. చివర్లో ఒక్క మాట. 'పట్టమేలే రాజు అయితే...రాజునేలే దైవముండడొ' అన్నట్టు...బాసు ఉన్నతుడే. సర్వోన్నతుడు మాత్రం కాదు. బాసు బాసు దగ్గర కాస్త చనువు పెంచుకోండి. ముఖ్యమైన ఆలోచనల్ని పెద్ద బాసులకూ మెయిల్‌ చేయండి. లేదంటే, మీ బాసు ఆ ఘనతను సొంతంచేసుకునే ప్రమాదం ఉంది. బాస్‌ ఈజ్‌ ఆల్వేస్‌ డేంజరస్‌!
మహాలింగం: ఆడబాసు అయితే, పొగడ్తలతోనో పర్‌ఫ్యూమ్స్‌తోనో బుట్టలో వేసుకోవచ్చనీ, మగ బాసైతే పార్టీలిచ్చి మచ్చిక చేసుకోవచ్చనీ కలలు కనకండి. బాసుకు లింగభేదం లేదు... న్యూట్రల్‌ జండర్‌! ఆ సీట్లో ఎవరున్నా ఒకేలా ఆలోచిస్తారు.
4 ద్వైతసిద్ధాంతం!
'మీరు వేరు. మీ ఆఫీసు వేరు.
మీ ఇష్టాలు వేరు. మీ బాధ్యతలు వేరు.
వ్యక్తిగత పనులు వేరు. ఆఫీసు పనులు వేరు. రెంటినీ కలగాపులగం చేయకండి. ఒకదానితో ఒకటి ముడిపెట్టకండి. ఆఫీసు కంప్యూటర్‌ను ఆఫీసు అవసరాలకే వాడుకోండి. ఏ నీలి సినిమాలు డౌన్‌లోడ్‌ చేసుకోడానికో ఉపయోగించకండి. ఆఫీస్‌ ఈమెయిల్‌ అడ్రసుకు వ్యక్తిగత లేఖలొద్దు. ఆఫీసు ఫోను విషయంలోనూ ఆ తేడా పాటించండి. హెచ్‌ఆర్‌ విభాగం...మీ టెలిఫోన్‌ కాల్స్‌ జాబితా మీద కన్నేసి ఉంచే అవకాశమూ లేకపోలేదు. ఆఫీసు డెస్కు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. మీ కండోమ్‌ ప్యాకెట్లూ గాళ్‌ఫ్రెండ్‌ ఫొటోలూ ఇక్కడెందుకు? వ్యక్తిగా మీరు ఏ ప్రసాదో పరమేశ్వరో కావచ్చు. చిరుగుల జీన్సూ, రంగు వెలిసిన టీషర్టూ మీకు మహా ఇష్టం కావచ్చు. రబ్బరు చెప్పులతో తిరిగే అలవాటు ఉండవచ్చు. కానీ ఉద్యోగిగా మీరో కంపెనీకి బ్రాండ్‌ రాయబారి. అందుకు తగినట్టు వస్త్రధారణ ఉండాలి. మాటతీరులో, ప్రవర్తనలో ఆ హుందాతనం కనిపించాలి. గేటు దాటాక మాత్రం...మీరు మీరే!
తీరు-పనితీరు:
ఇఫ్‌ యు లుక్‌ గుడ్‌, యు ఫీల్‌ గుడ్‌.
ఇఫ్‌ యు ఫీల్‌ గుడ్‌, యు ప్లే గుడ్‌.
(అనువాదం అక్కర్లేదుగా!)
5 కరెంట్‌ 'ఎఫైర్స్‌'
గుడి, కాలేజీ, సినిమా థియేటర్‌, బస్టాపు, రెస్టారెంట్‌, బంధువుల పెళ్లి ...ఎక్కడైనా కావచ్చు.
సహపాఠీలు, సహప్రయాణికులు, పొరుగింటివారు, స్నేహితుల స్నేహితులు ...ఎవరి మీదైనా కావచ్చు.
హఠాత్తుగా ప్రేవో ఆకర్షణో పుట్టుకురావచ్చు. ప్రేమ, పెళ్లి కచ్చితంగా వ్యక్తిగత వ్యవహారాలే. నచ్చితే, ఎవర్నయినా ప్రేమించవచ్చు. అంతవరకూ తప్పేం లేదు. అది ఆఫీసు అయితే మాత్రం, ఆ వ్యక్తి సహోద్యోగి అయినప్పుడు మాత్రం...ఆ ప్రభావం కెరీర్‌ మీద పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ప్రేమను బహిరంగంగా ప్రదర్శించకండి (కనీసం ఆఫీసు గేటు దాటేదాకా). కబుర్లు చెప్పుకోడానికి, రొమాంటిక్‌ మెసేజీలు ఇచ్చుకోడానికి, ముద్దూముచ్చట్లు తీర్చుకోడానికి, ఆఫీసేం...పబ్లిక్‌ పార్కు కాదు. రెస్టారెంట్‌ అంతకన్నా కాదు. ఆ ఎనిమిది గంటలూ మీరు కేవలం సహోద్యోగులే. ఆఫీసులో మూలమూలకీ అమర్చిన రహస్య కెమెరాలు ప్రతిక్షణం మిమ్మల్ని గమనిస్తూ ఉంటాయి! దొరికిపోయారో, ఇరుక్కుపోతారు. ఆఫీసు సరసాల విషయంలో యాజమాన్యాలు చాలా కఠినంగా ఉంటాయి. వాటివల్ల పనివాతావరణం కలుషితం అవుతుందని భయపడతాయి. అది నిజం కూడా. వివాహేతర సంబంధాలను అంతకంటే తీవ్రంగా పరిగణిస్తారు. కొన్నిసార్లు ఆ ఆకర్షణ వికటించి...లైంగిక వేధింపులకు దారితీసే ప్రమాదమూ ఉంది. నైపుణ్యం, అనుభవం, విధేయత, నిజాయతీ... ఎంత ఘనమైన గతచరిత్ర ఉన్నా ఆ బలహీనత ముందు, బూడిదలో పోసిన పన్నీరే. ఆకర్షణల వలలోపడి కెరీర్‌ నాశనం చేసుకున్నవారి జాబితాలో మీ పేరు లేకుండా జాగ్రత్తపడండి.
'త్యాగ'రాజ కృతి: నిధి కావాలో, రాముడి సన్నిధి కావాలో త్యాగరాజుకు స్పష్టంగా తెలుసు. ఆ క్లారిటీ మీకుందా?
ఈ రెంటిలో ఏది ముఖ్యవో నిర్ణయించుకోండి...
ఎ. ఆఫీస్‌ రొమాన్స్‌
బి. ఉద్యోగం
ఏదో ఒకటి త్యాగం చేయక తప్పదు. రెండూ కావాలనుకుంటే, సంస్థ మిమ్మల్ని త్యాగం చేయాల్సి వస్తుంది.
6 మాట మీద నిలబడండి!
భార్యాభర్తల అనుబంధాలైనా, యజమాని-ఉద్యోగి సంబంధాలైనా నమ్మకమే పునాది! యాజమాన్యం మిమ్మల్ని నమ్మాలి. మీకు ఏదైనా బాధ్యత అప్పగిస్తే, నిశ్చింతగా ఉండొచ్చన్న భరోసా వారిలో కలిగించాలి. ప్రాజెక్టుల విషయంలో వాయిదాలొద్దు. సాకులొద్దు. అవసరమైతే వారాంతాలు పనిచేయండి. ఓ గంట ఎక్కువ ఉండి పూర్తిచేయండి. చెప్పిన సమయానికి చెప్పినట్టుగానే ఆ కాయితాల్ని తీసుకెళ్లి టేబిలు మీద పెట్టండి! ఆ నిమిషంలో బాసు కళ్లలో కనిపించే ఆనందం...అంకెలుగా మారి, మీ పేస్లిప్‌లో ఇంక్రిమెంటు రూపంలో ప్రత్యక్షమవుతుంది. అనివార్యకారణాల వల్ల సకాలంలో ప్రాజెక్టు పూర్తిచేయలేనప్పుడు... చందమామ కథలు చెప్పొద్దు. నిజాయతీగా తప్పు ఒప్పుకోండి. ఆ పొరపాటు మళ్లీ జరగకుండా జాగ్రత్తపడండి. సాధ్యమైనంత తొందర్లో పూర్తిచేసి ఇవ్వండి. ఏ విషయంలో అయినా 'అరె, మరచిపోయాను!' అన్నారంటే, మీరు 100 పర్సెంట్‌ ప్రొఫెషనల్‌ కాదని అర్థం. చేయాల్సిన పనులనూ వాటి ప్రాధాన్యతా క్రమాలనూ ఓ చోట రాసి ఉంచుకోవడం మంచి పద్ధతి. జైహనుమాన్‌: సీతను వెతకడానికి ఎంతమంది వీరాధివీరులు వెళ్తున్నా, హనుమంతుడి చేతికే ఉంగరాన్ని ఇచ్చాడు. సంజీవని పర్వతాన్ని వోసుకురాగల శక్తిమంతులు చాలామందే ఉన్నా, మళ్లీ హనుమంతుడికే ఆ బాధ్యత అప్పగించాడు. హనుమంతుడికి శక్తిసామర్ధ్యాలే కాదు, చిత్తశుద్ధి కూడా ఎక్కువని శ్రీరాముడికి తెలుసు. మీ బాసు శ్రీరామచంద్రుడు కావచ్చు, కాకపోవచ్చు. మీరు మాత్రం ఆంజనేయుడినే ఆదర్శంగా తీసుకోండి.
7 అతి సర్వత్ర వర్జయేత్‌!
ఎంత కలసి పనిచేస్తున్నా, ఎన్నేళ్ల పరిచయమైనా, ఎంత చనువు ఉన్నా...సహోద్యోగుల వ్యక్తిగత జీవితాల్లోకి జొరబడే హక్కు ఎవరికీ లేదు. ఇద్దరు వ్యక్తుల మధ్య కనిపించి కనిపించని సరిహద్దురేఖ ఉంటుంది. దాన్ని అతిక్రమించడం సంస్కారం అనిపించుకోదు. గుండె బరువు దించుకోడానికి ఎవరైనా కష్టాలు చెప్పుకున్నా, కన్నీళ్లు రాల్చుకున్నా...ఓ ఆత్మీయుడి పాత్రలో ఓదార్చడం వరకే మీ పని. కలసి భోంచేస్తున్నప్పుడు, కలసి క్యాంటీన్‌కు వెళ్లినప్పుడు కనీస మర్యాదలు మరచిపోకూడదు. సహోద్యోగుల టిఫిన్‌బాక్సు మీద దాడిచేయడం, అవతలి వ్యక్తి పళ్లెంలోని పదార్థాల్ని ఎంగిలి చేతులతో తీసేసుకోవడం, వ్యక్తిగత వాటర్‌బాటిళ్లను ఖాళీచేయడం...మంచి అలవాట్లు కావు. ఎలాంటి దురుద్దేశం లేకపోయినా ఇతరుల పర్సులూ బ్యాగులూ శోధించడమూ తప్పే. ఎంత ప్రేమ పొంగుకొస్తున్నా...ఒరేయ్‌, అంకుల్‌, ఆంటీ, బాబాయ్‌ వగైరా పిలుపులొద్దు. సర్‌ అనో, మేడమ్‌ అనో గౌరవంగా సంబోధించండి. మరొక్కమాట... వినయం మహాభూషణం. అతి వినయం మాత్రం ధూర్తలక్షణమే! తేడా: పొగడ్త అనేది చిటికెడు అత్తరు చిలకరించినట్టు ఉండాలి. అప్పుడే హాయిగా అనిపిస్తుంది. చెంబులకొద్దీ గొంతులో పోస్తున్నట్టు మాత్రం ఉండకూడదు. అదే జరిగితే డోకు వచ్చేస్తుంది.
8 ష్‌...పరమ రహస్యం!
ప్రతి సంస్థకూ కొన్ని రహస్యాలు ఉంటాయి. ఆ సీట్లో ఉన్నారు కాబట్టి, అందులో కొన్ని మీకూ తెలుస్తాయి. వాటిని బహిర్గతం చేయడం, వాటి గురించి బహిరంగంగా మాట్లాడటం (సన్నిహితులతో అయినా సరే..) తప్పు. దానివల్ల మీరు ఆ సంస్థతో కుదుర్చుకున్న ఉద్యోగ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టే. మీమీద క్రమశిక్షణ చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. చాలా సంస్థలు జీతభత్యాల విషయంలో గోప్యత పాటిస్తాయి. అయినా, మీ జీతం వివరాలేం కేంద్రప్రభుత్వ బడ్జెట్‌ గణాంకాలు కాదు... అందరితో పంచుకోడానికి. సాధ్యమైనంత రహస్యంగా ఉంచండి. సంస్థ ఉన్నతోద్యోగుల్లో మీ బంధువులూ పరిచయస్థులూ ఉండవచ్చు. వారి దగ్గర మీకున్న చనువును నలుగురి మధ్యా చాటుకోవాల్సిన అవసరం లేదు. దీనివల్ల మీ నైపుణ్యం, చొరవ, నాయకత్వ లక్షణాలు మరుగునపడిపోతాయి. ఫలానా వ్యక్తి అనుచరుడిగా ముద్రపడిపోతుంది. కష్టపడి ప్రవోషన్‌ తెచ్చుకున్నా... ఫలానా వ్యక్తి ఆశీస్సులవల్లే వచ్చినట్టు అంతా చెప్పుకుంటారు. మీ ఈమెయిల్‌ పాస్‌వర్డ్‌, సిస్టమ్‌ పాస్‌వర్డ్‌ ఎవరికీ చెప్పకండి. కీలకమైన డాక్యుమెంట్లు టైప్‌ చేస్తున్నప్పుడు...ఫాంట్‌ సైజు సాధ్యమైనంత తక్కువ ఉండేలా చూసుకోండి. ఇలాంటి జాగ్రత్తల వల్ల సంస్థలో మీ విశ్వసనీయత పెరుగుతుంది. 'మిస్టర్‌ డిపెండబుల్‌'గా పేరు తెచ్చుకుంటారు. జాగ్రత్త: మూడో మనిషికి తెలియని అతిముఖ్యమైన విషయం కావచ్చు. ప్రపంచానికంతా తెలిసిన నిత్యసత్యం కావచ్చు. ఏదైనా సరే, మీ సొరుగులోనో మీ కంప్యూటర్‌లోనో ఉన్నంతకాలం ఆ సమాచారం రహస్యమే. స్నేహితులతో, సహోద్యోగులతో పంచుకోడానికి ఆఫీసు రహస్యాలు... సినిమా గాసిప్స్‌ కాదు.
9 నేర్చుకుంటూ...
ద్యోగం అంటే చదువుల నుంచి విముక్తి కాదు. నేర్చుకోవాల్సిందంతా నేర్చుకున్నట్టూ కాదు. మన వృత్తికి, ఉద్యోగానికి సంబంధించి...కొత్తకొత్త మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. కొత్తకొత్త సాంకేతిక పరిజ్ఞానాలు అందుబాటులోకి వస్తుంటాయి. వాటన్నిటినీ గమనిస్తూ ఉండాలి. విశ్లేషించుకుంటూ పోవాలి. ఆ అంతర్మథనంలో మనం పనిచేస్తున్న సంస్థకు ఉపకరించే ఆలోచనలేమైనా వస్తే, సంబంధిత వ్యక్తులకు మెయిల్‌ చేయవచ్చు. కీలకమైన సమాచారం అయితే, నేరుగా కలుసుకుని వివరించవచ్చు. చాలా సందర్భాల్లో మన ఆలోచనలు అమలుకు నోచుకోకపోవచ్చు. కానీ, 'ఫలానా ఉద్యోగి సంస్థ అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నాడు' అన్న సంకేతాన్ని యాజమాన్యానికి పంపినవాళ్లం అవుతాం. మనదైన రంగానికి సంబంధించిన పుస్తకాలూ జర్నల్స్‌ చదువుతూ ఉండాలి. ప్రత్యేకమైన కోర్సులు ఉంటే, వెంటనే పూర్తిచేయాలి. ఈ జిజ్ఞాస ఆగనంత కాలం, మన ఎదుగుదలా ఆగదు. మెదడుకు మేత: నిత్యం ఏదో ఒక కొత్త విషయం తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువగా ఉన్నవారి మెదడు, మిగిలినవారితో పోలిస్తే ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
10 ఇష్టమైన వ్యాపకం
మీకంటూ ఆసక్తి ఉన్న కళలో నైపుణ్యాన్ని పెంపొందించుకోండి. సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, నటన, జ్యోతిషం, వాస్తు, ఇంద్రజాలం...ఏదైనా కావచ్చు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని నలుగురి ముందూ ప్రదర్శించడానికి సంకోచించవద్దు. ఆ హాబీ మీకో గుర్తింపును తెచ్చిపెడుతుంది. మీతో సరిసమానమైన విద్యార్హతలు ఉన్న వ్యక్తులు సంస్థలో చాలామంది ఉండవచ్చు. కళానైపుణ్యంలో మాత్రం...సాటీపోటీ ఉండదు. ఆ రంగానికి సంబంధించి ఆఫీసులో ఎవరికి ఏ సందేహం వచ్చినా మీరే గుర్తుకురావాలి. నిజానికి, హాబీ అనేది 'ప్రెషర్‌ వాల్వ్‌'లా పనిచేస్తుంది. ఆఫీసు ఒత్తిడిని తగ్గించుకోడానికి ఇదో మార్గం. అనుకోని పరిణామాల వల్ల మీరు పనిచేస్తున్న రంగం సంక్షోభంలో పడి ఉద్యోగం ఊడిపోతే...అప్పటికప్పుడు ఆదుకోడానికి ఓ కళ మీ చేతిలో ఉంటుంది. వృత్తి-ప్రవృత్తి: వృత్తి బతకడానికి సరిపడా సంపాదననిస్తుంది. ప్రవృత్తి జీవించడానికి సరిపడా అనుభూతుల్ని ప్రసాదిస్తుంది.
11 చిన్నచిన్న జాగ్రత్తలు!
కార్పొరేట్‌ బేరీజులో కొన్నిసార్లు అసమర్థులకే అందలాలు దక్కవచ్చు. కష్టపడనివాళ్లకే ప్రవోషన్లు రావచ్చు. ఆ మెరుపు తాత్కాలికమే. అంతిమ విజయం నైపుణ్యానిదే! * నిరాశపడకండి. బాసు కాదన్నంత మాత్రాన, ఐడియా వృథాగాపోదు. రీసైకిల్‌చేసి మళ్లీ వాడుకోవచ్చు.
* సంస్థలో మీకు కొన్ని సమాచార మార్గాలుంటాయి. వేగులుంటారు. ఆ రహస్యాలు ఎప్పుడూ వెల్లడి చేయకండి. శ్రేయోభిలాషుల్ని దూరం చేసుకోవడం తెలివైన నిర్ణయం కాదు.
* సంస్థ స్టేషనరీని వృథా చేయకండి. పనైపోగానే కంప్యూటర్‌ కట్టేయండి. ఉచితంగా వస్తుంది కదా అని, కప్పులకొద్దీ కాఫీ తాగేయకండి. మీకే కాదు, సంస్థకూ వేగులు ఉంటారు.
* తొందరగా వచ్చి, ఆలస్యంగా వెళ్తే ఎవరూ పట్టించుకోరు. ఆలస్యంగా వచ్చి తొందరగా వెళ్తే మాత్రం అంతా మీవైపే చూస్తారు.
* ఆఫీసుకు వస్తున్నప్పుడు శరీరాన్ని శుభ్రంచేసుకుని (వ్యక్తిగత పరిశుభ్రతతో) రావాలి. వెళ్తున్నప్పుడు, బుర్రను శుభ్రం చేసుకుని (ఆఫీసు ఒత్తిళ్లను అక్కడే వదిలేసి) ఇంటికి వెళ్లాలి.
* ఆఫీసు చిరునామాకు ఉద్యోగ ప్రయత్నాలు వద్దు. అలాగే, ఆఫీసులో పార్ట్‌టైమ్‌ వ్యాపారాలూ వద్దు.
అక్కడ కూడా: సాధారణంగా టాయిలెట్‌కు వెళ్తున్నప్పుడు బుర్రనిండా పనికి సంబంధించిన ఆలోచనలే ఉంటాయి. తలుపు మీద 'అతను', 'ఆమె' బొమ్మల్లో తేడాను గుర్తించలేకపోవడానికి
ఆ పరధ్యానమే కారణం. అప్రమత్తత అవసరం. అక్కడైతే మరీ అవసరం.
12 వీడుకోలు..
దుగుదలలో భాగంగానో, ఇంకేవో కారణాలతోనో సంస్థ నుంచి బయటికి వెళ్లిపోవడం తప్పేం కాదు. అలా అని, అంతకాలం నీడనిచ్చిన సంస్థను ఒక్కసారిగా శత్రువులా చూడటమూ సరికాదు. సహోద్యోగుల దగ్గర ప్రేమపూర్వకంగా వీడ్కోలు తీసుకోండి. ఎటూ బయటికి వెళ్తున్నాం కదా అని, కడుపులోని కోపమంతా వెళ్లగక్కకండి. విమర్శలూ శాపనార్థాలూ వద్దే వద్దు. బ్లాగులు, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో పాత సంస్థ మీద బురద చల్లకండి. మీ ఆన్‌లైన్‌ వ్యాఖ్యానాలు బహిరంగ ప్రకటనల్లాంటివే. నోటిదురుసు వ్యక్తుల్ని కార్పొరేట్‌ ప్రపంచం ఆమడ దూరంలో ఉంచుతుంది. జీవితమే ప్రయాణం:
ఓ సంస్థ నుంచి వీడ్కోలు అన్నది... ఆత్మీయుల కరచాలనాల మధ్య రైలెక్కినంత ప్రేమపూర్వకంగా ఉండాలి.
.
కొసమెరుపు
శిష్యుడు: బాసుకు నమస్కారాలు పెట్టాను. మేనేజ్‌మెంట్‌కు ఐడియాలు ఇచ్చాను. కొలీగ్స్‌కు పార్టీలు ఇచ్చాను. ఆఫీసు స్టేషనరీ పొదుపుగా వాడుకున్నాను. సకాలంలో ఆఫీసుకొచ్చాను. అవసరం అయితేనే సెలవులు పెట్టాను. అయినా నాకు ప్రవోషన్‌ రాలేదెందుకు? గురూజీ: అన్నీ చేశావు సరే. ఎప్పుడైనా పనిచేశావా? (ఏ సూత్రానికైనా కామన్‌సెన్స్‌ జోడించాలి. ఇది పదమూడో సూత్రం!)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)

వైవిధ్యమే జీవం! (Eenadu Sunday_30/09/12)