పళ్లు తోమండి... శుభ్రంగా..! (07/02/2016)

 
పళ్లు తోమండి... శుభ్రంగా..! 
దీర్ఘకాలిక చిగుళ్ల వ్యాధుల్ని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరిస్తున్నారు భారతీయ వైద్యులు. చిగుళ్లు వాయడం, తరచూ బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లకు గురవడం జరుగుతుంటే హృద్రోగ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్టు అనుమానించాలని అంటున్నారు. దంత సంరక్షణవల్ల దంతాలు ఆరోగ్యంగానూ చూడచక్కగానూ కనిపించడమే కాదు, గుండె కూడా పదిలమే. ఎందుకంటే చిగుళ్లలోని బ్యాక్టీరియా రక్తం ద్వారా రక్తనాళాలకు చేరి అక్కడ అతుక్కుని, గడ్డలు ఏర్పడ్డానికి కారణమవుతుంది. ఫలితంగా ఇవి రక్తప్రవాహాన్ని అడ్డుకుంటాయి. దాంతో బీపీ పెరిగి హృద్రోగ ప్రమాదం అధికం అవుతుంది. ఇటీవలే ఎండోకార్డైటిస్‌(గుండె కవాటం నుంచి రక్తం కారడం) వ్యాధికి గురయిన వాళ్లని పరిశీలించినప్పుడు- దానికి కారణం నోటిలోని బ్యాక్టీరియా అని తేలిందట. అదెలా అంటే నోటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడంవల్ల నోట్లోని బ్యాక్టీరియా రక్తం ద్వారా గుండెకు చేరి అక్కడి కవాటాల్ని దెబ్బతీస్తుంది. అంతేకాదు, జీర్ణక్రియ సరిగ్గా ఉండకపోవడం, చక్కెరవ్యాధి, శ్వాసకోశ సమస్యలు, ఆస్టియోపోరోసిస్‌, పొట్ట క్యాన్సర్‌... ఇలా రకరకాల వ్యాధులు వచ్చే ఆస్కారం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి దంతసిరి ఆరోగ్యానికీ సంకేతమే. 

ప్లాస్టిక్‌ వాడకంతో వూబకాయం! 
ప్లాస్టిక్‌ వాడకం మంచిది కాదని తెలిసినా యథేచ్ఛగా దాన్ని వాడేస్తున్నాం. సంచులూ, సీసాలూ, పాత్రలూ... ఇలా ఒకటేమిటి, అంతా ప్లాస్టిక్‌మయమే. కానీ అందులోని హానికరమైన థాలేట్లు చర్మం ద్వారాగానీ ఆహారం ద్వారా గానీ శరీరంలోకి చొచ్చుకుపోతున్నాయి అంటున్నారు జర్మనీలోని లెప్‌జిగ్‌ యూనివర్సిటీ నిపుణులు. ఏదో ఒక రూపంలో శరీరంలో చేరుతున్న ఈ థాలేట్లు, హార్మోన్లమీదా బరువు మీదా తీవ్ర ప్రభావాన్ని కనబరుస్తున్నాయట. ఫలితంగా జీవక్రియ దెబ్బతింటుంది. ఉదాహరణకు జర్మనీలో ప్రతి ఇద్దరిలో ఒకరు వూబకాయులుగా ఉన్నారు. వాళ్ల ఆహారపుటలవాట్లూ, వ్యాయామం లేకపోవడం, జన్యువులూ ఇందుకు ఒక కారణమైతే, వాతావరణ కలుషితాలైన థాలేట్లు మరో ప్రధాన కారణమని సంబంధిత నిపుణులు పేర్కొంటున్నారు. శరీరంలో అధికం అవుతున్న థాలేట్ల కారణంగా బరువు పెరుగుతున్నట్లు ఇప్పటికే వేర్వేరు పరిశోధనల్లో తేలింది. ఫుడ్‌ ప్యాకేజింగ్‌లో వాడే ప్లాస్టిక్‌ వల్లే ఇవి ఎక్కువగా శరీరంలో చేరుతున్నాయని వాళ్లు హెచ్చరిస్తున్నారు. 

పీచు పదార్థం... శ్వాసామృతం! 
ఆహారంలో భాగంగా పీచుపదార్థాలను ఎక్కువగా తీసుకుంటే మంచిదన్నది తెలిసిందే. అవి మధుమేహం, హృద్రోగాల వంటి సమస్యలు రాకుండా చూడటమే కాదు, వూపిరితిత్తుల వ్యాధుల్నీ నిరోధిస్తాయని అమెరికన్‌ థొరాసిక్‌ సొసైటీ పేర్కొంటోంది. వూపిరితిత్తుల పనితీరుకీ పీచుకీ ఉన్న సంబంధాన్ని తెలుసుకునేందుకు నిపుణులు రోజువారీ ఆహారంలో పీచు పదార్థాలు 17.5 గ్రాములకన్నా ఎక్కువగా తీసుకునేవాళ్లనీ; 10.75 గ్రా. కన్నా తక్కువగా తీసుకునేవాళ్లనీ ఎంపికచేసి పరిశీలించారు. పీచు ఆహారం ఎక్కువగా తినేవాళ్లలో, తీసుకోనివాళ్లతో పోలిస్తే వూపిరితిత్తుల సామర్థ్యం బాగున్నట్లు తేలిందట. ముఖ్యంగా పీచుపదార్థం పొట్టలోని బ్యాక్టీరియా పనితీరుమీద ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా ఎలాంటి ఇన్ఫెక్షన్లూ రాకుండా ఉంటాయి. అదే సమయంలో వూపిరితిత్తుల్ని రక్షించే సహజ రసాయనాలూ విడుదలయ్యేలా చూస్తుంది. అందుకే పీచు పదార్థం బాగా తినేవాళ్లలో శ్వాసకోశవ్యాధులు తక్కువన్నది ఈ పరిశోధన సారాంశం. 

తినే సమయమూ ముఖ్యమే! 
చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు తిండి పెట్టేస్తుంటారు. కానీ అది మంచిది కాదనీ, ఆ ప్రభావం కేవలం శారీరక రుగ్మతల్నే కాదు, మానసిక సమస్యల్నీ తెచ్చిపెడుతుందనీ అంటున్నారు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు. సమయం చూసుకోకుండా తినడంవల్ల జీవక్రియ దెబ్బతినడమే కాదు, అధ్యయనశక్తీ, తెలివితేటలు కూడా తగ్గుతాయి అని విశ్లేషిస్తున్నారు. ఇందుకోసం వీళ్లు ఎలుకల మీద పరిశోధనలు చేయగా ఈ విషయం తేలిందట. నిద్రపోయేవేళల్లో అంటే అర్ధరాత్రి సమయంలో తినడంవల్ల వాటిల్లో జ్ఞాపకశక్తితోపాటు వస్తువుల్ని గుర్తుపట్టే శక్తి కూడా బాగా తగ్గిందట. దాంతో ఈ విషయమై మరింత లోతుగా పరిశీలించగా- జీవగడియారానికి కారణమైన సీఆర్‌యీబీ అనే ప్రొటీన్‌ శాతం బాగా తగ్గినట్లు గుర్తించారు. అంతేకాదు, ఈ ప్రొటీన్‌ శాతం తక్కువగా ఉండటంవల్లే అల్జీమర్స్‌ వస్తుందనీ తేలింది. అంటే జీవగడియారాన్ని పట్టించుకోకుండా తినడంవల్ల ఆ ప్రభావం ఈ ప్రొటీన్‌మీద ఉంటుంది. ఫలితంగా అధ్యయనశక్తి, జ్ఞాపకశక్తి రెండూ క్షీణిస్తాయని నిపుణులు భావిస్తున్నారు. 

టూకీగా...
హిస్టరెక్టమీ తరవాత రక్తస్రావం కనిపిస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. ఎందుకంటే అది ఇన్ఫెక్షన్‌కీ క్యాన్సర్‌కీ దారితీయవచ్చు అని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
తరచూ డిప్రెషన్‌తో బాధపడేవాళ్లలో మధుమేహవ్యాధి వచ్చే అవకాశం ఎక్కువనీ; అలాగే మధుమేహుల్లో డిప్రెషన్‌కు గురవడమూ ఎక్కువనీ అమెరికన్‌ నిపుణుల సరికొత్త అధ్యయనంలో తేలింది. మొత్తంగా చూస్తే వ్యాయామం లేకపోవడం, అధిక బరువే ఈ రెండు రకాల వ్యాధులకీ ప్రధాన కారణం.
టీవీ, ఇంటర్‌నెట్లలో ఆరోగ్యానికి హానికరమైన ఆహారపదార్థాలకు చెందిన ప్రకటనలు పదే పదే చూపించడంవల్లే పిల్లలు వాటిని ఎక్కువగా తింటున్నారని లివర్‌పూల్‌ యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొంటున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)

వైవిధ్యమే జీవం! (Eenadu Sunday_30/09/12)