ఒంట్లో గడియారం

ఒంట్లో గడియారం 
గతి తప్పితే ప్రమాదం!
జీవితమే ఒక లయ!
ప్రతీ దశా క్రమబద్ధమే!!
నవ మాసాలు నిండగానే తల్లి కడుపులోంచి బయటపడతాం. మూణ్నెల్లు రాగానే బోర్లా పడతాం, ఏడాది వచ్చేసరికి నిలబడతాం. బాల్యం దాటుతూనే పలకరించే నవ యవ్వనం.. దాంతో పాటు మారిపోయే శరీరం.. అన్నీ లయాత్మకమే. అంతెందుకు? రాత్రవుతూనే నిద్ర ముంచుకొస్తుంది. పొద్దు పొడవగానే మెలకువ వచ్చేస్తుంది. భోజనం వేళకు కడుపులో ఆకలి మంట రగులుతుంది. ఇవన్నీ ఠంచనుగా.. ఏదో గంట కొట్టినట్టుగా.. సమయం ప్రకారం ఎలా జరుగుతున్నాయి? వీటన్నింటినీ వెనక నుంచి నడిపిస్తున్న అదృశ్యశక్తేంటి? అదే మన జీవగడియారం! సర్కాడియన్‌ రిథమ్‌! చీకటి, వెలుతురు.. రాత్రి, పగలుకు అనుగుణంగా సాగే 24 గంటల చక్రభ్రమణం. మన నిద్ర తీరుతెన్నులు, ఆహార అలవాట్లు, హార్మోన్ల ఉత్పత్తి, రక్తపోటు, శరీర ఉష్ణోగ్రత.. ఇలా అన్నింటినీ నియంత్రించే అద్భుత జీవలయ. ఇది సజావుగా పనిచేసినంతవరకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మొరాయిస్తే- నిద్రలేమి, వూబకాయం, అధిక రక్తపోటు, క్యాన్సర్‌ వంటి సమస్యలెన్నో బయలుదేరతాయి. నిజానికి ఈ జీవగడియారం ఉనికి మనకు చాలాకాలం క్రితమే తెలుసు. కానీ ఇదెలా పనిచేస్తుందన్నది మాత్రం తెలియదు. దీని రహస్యాన్ని ఇటీవలే ముగ్గురు పరిశోధకులు- జెఫ్రీ సి.హాల్‌, మైఖేల్‌ రాస్‌బాష్‌, మైఖేల్‌ డబ్ల్యూ.యంగ్‌ ఛేదించారు. వైద్యరంగంలో ఇదో విప్లవాత్మకమైన ఆవిష్కరణనీ.. ఆధునిక జీవనశైలి మోసుకొస్తున్న ఎన్నో జబ్బులకు పరిష్కారం చూపే మార్గమనీ కొనియాడిన నోబెల్‌ కమిటీ వీరికి ఈ సంవత్సరం వైద్యంలో నోబెల్‌ బహుమతినీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో జీవగడియారం ప్రాధాన్యత, దాని గుట్టుమట్లపై సమగ్ర కథనం మీకోసం.
గలూ రాత్రీ.. వెలుగూ చీకటీ. ఒక్క కాల గణనకే కాదు. భూమ్మీద ప్రతి ప్రాణి శరీర కాలక్రమానికీ ఇవే మూలాధారాలు. అనాదిగా మన నిద్ర, ఆహార అలవాట్లు, నడవడి, విహారాల వంటివన్నీ వీటితో ముడిపడుతూ రూపుదిద్దుకున్నవే. ఇరవై నాలుగు గంటల చక్రభ్రమణంలో వచ్చీ పోయే వెలుగు-చీకట్లకు అనుగుణంగా శరీర వ్యవస్థలు ఒక క్రమపద్ధతిలో నడవటం వెనక ఏదో శక్తి ఉందని పరిశోధకులు చాలాకాలం కిత్రమే వూహించారు. ఎన్నెన్నో పరిశోధనలు చేశారు. చివరికి దీని ఉనికి నిజమేనని, ఇదే జీవగడియారం (సర్కాడియన్‌ రిథమ్‌) అని స్పష్టమైన నిర్ధరణకూ వచ్చారు. అయితే ఈ గడియారం ఎలా పనిచేస్తోంది? దీన్ని నడిపించేందేటన్న రహస్యం మాత్రం చాలాకాలంగా అలాగే ఉండిపోయింది. సీమోర్‌ బెంజర్‌, రోనాల్డ్‌ కోనోప్కా అనే పరిశోధకులు 70ల్లో ఈగలపై పరిశోధించి జీవగడియారాన్ని నడిపిస్తున్న జన్యువును గుర్తించారు. దీనికి ‘పీరియడ్‌’ అనీ పేరు పెట్టారు. ఇందులో తలెత్తే మార్పుల మూలంగానే జీవగడియారం అస్తవ్యస్తమవుతున్నట్టూ తేల్చారు. అయితే జన్యువులు జీవగడియారాన్ని ఎలా పనిచేయిస్తున్నాయి? అనేది తెలుసుకోవటంపై అప్పట్లో ఎలాంటి పురోగతి కనబడలేదు. దీన్ని ఛేదించటంలోనే తాజా నోబెల్‌ విజేతలు- జేఫ్రీ హాల్‌, మైఖేల్‌ రాస్‌బాష్‌, మైఖేల్‌ యంగ్‌ విజయం సాధించారు. వీళ్లు పీరియడ్‌ జన్యువును వేరు చేయటమే కాదు. ఈ జన్యువు విడుదల చేస్తున్న ‘పీఈఆర్‌’ ప్రోటీన్‌ అనేదే గడియారాన్ని నడిపిస్తోందని, ఇది ఈగల కణాల కేంద్రకంలోకి రాత్రిపూట చేరుకొని, పగటిపూట కరిగిపోతున్నట్టు స్పష్టంగా గుర్తించారు. మరి ఈ ప్రోటీన్‌ కణ కేంద్రకంలోకి ఎలా చేరుకుంటోంది? ఇక్కడే మైఖేల్‌ యంగ్‌ కనుగొన్న ‘టైమ్‌లెస్‌’ జన్యువు దారి చూపించింది. ఇది విడుదల చేసే టిమ్‌ ప్రోటీన్‌ జతకలవటం వల్లనే పీఈఆర్‌ ప్రోటీన్‌ కణ కేంద్రకంలోకి చేరుకుంటున్నట్టు తేలింది. అంతేకాదు.. ‘డబుల్‌ టైమ్‌’ అనే మరో జన్యువు ఉత్పత్తి చేసే డీబీటీ అనే ప్రోటీన్‌ ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారా పీఈఆర్‌ ప్రోటీన్‌ కణ కేంద్రకంలోకి చేరుకోవటాన్ని ఆలస్యం చేస్తోందని, దీని వల్లనే 24 గంటల వ్యవధికి అనుగుణంగా పీఈఆర్‌ ప్రోటీన్‌ హెచ్చుతగ్గులు సాధ్యమవుతున్నట్టూ బయటపడింది. ఇలా చివరికి చాలాకాలంగా వైద్య పరిశోధనా రంగానికి అంతుపట్టని కీలక రహస్యం గుట్టు రట్టయ్యింది. మొత్తమ్మీద మూడు రకాల జన్యువులు, అవి విడుదల చేసే ప్రోటీన్లు జీవగడియారం పనిచేయటంలో పాలు పంచుకుంటున్నాయన్నమాట.
ఇంతకీ జీవగడియారం ఎక్కడుంటుంది?
రాత్రి-పగలు, కాంతి, ఉష్ణోగ్రత వంటి వాటి ఆధారంగా శరీర వ్యవస్థలను నియంత్రించే ప్రధాన జీవగడియారం మన మెదడులో ఉంటుంది. మెదడు మధ్యలోని హైపోథలమస్‌ గ్రంథిలో చాలా చిన్న పరిమాణంలో సుమారు 10వేల నాడీకణాలతో కూడిన రెండు సమూహాలుంటాయి. వీటినే సుప్రాఖియాస్మాటిక్‌ న్యూక్లియస్‌ (ఎస్‌సీఎన్‌) అంటారు. మన ఒంట్లో ప్రధాన గడియారంలా పనిచేసేది ఇదే. రోజంతా ఆయా సమయాలకు అనుగుణంగా ఇది వివిధ జీవక్రియలు జరిగేందుకు అవసరమైన సంకేతాలను పంపిస్తుంటుంది. అయితే ఒక్క మెదడులోనే కాదు.. మన శరీరంలోని ప్రతి అవయంలోనూ, ప్రతి కణజాలంలోనూ, ప్రతి కణంలోనూ చిన్న చిన్న జన్యు గడియారాలు ఉంటాయి. ఇవన్నీ ఆయా సమయాల్లో, ఆయా అవసరాలకు అనుగుణంగా స్పందించి పనిచేస్తాయి. ఉదాహరణకు- మనం ఆహారం తీసుకున్నప్పుడు పాంక్రియాస్‌ కణాల్లోని గడియారం ఉత్తేజితమై ఆహార పరిణామానికి అనుగుణంగా ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయమని చెబుతాయి. కాలేయ కణాల్లోని గడియారం గ్లైకోజెన్‌ ప్రక్రియను ఎప్పుడు ఆపాలి? కొవ్వు జీవక్రియలను ఎప్పుడు ఆరంభించాలి? అనేది సూచిస్తుంటాయి. ఈ చిన్న చిన్న జీవగడియారాలన్నీ ప్రధాన జీవగడియారానికి అనుగుణంగానే పనిచేస్తుంటాయి గానీ ప్రధాన జీవగడియారం వీటిని మరీ బలంగా ప్రభావితం చెయ్యలేదు. అందుకే టైమ్‌ జోన్స్‌ మారినప్పుడు, షిఫ్టు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ప్రధాన గడియారం వెంటనే గాడిలో పడినా ఇవి అంత తేలికగా సర్దుకోవు. దేని పని దానిదే అన్నట్టుగా వ్యవహరిస్తుంటాయి. ఇదే ఇప్పుడు రకరకాల సమస్యలకు దోహదం చేస్తోంది.
అస్తవ్యస్తమైతే ఇబ్బందులే
జీవగడియారంపై మన జీవనశైలి ప్రభావం చాలా ఎక్కువ. రాత్రీ పగలు మాత్రమే కాదు.. మనం తినే తిండి, చేసే వ్యాయామం, సామాజిక సంబంధాల వంటివీ దీనిపై ప్రభావం చూపుతాయి. తెలిసో తెలియకో చాలావరకు మనం జీవగడియారానికి విరుద్ధంగానే ప్రవర్తిస్తున్నాం. ఇష్టం వచ్చినపుడు తినటం, పడుకోవటం, లేవటం.. ముఖ్యంగా తరచుగా పనివేళలు మారిపోయే షిఫ్టు ఉద్యోగాలు జీవగడియారానికి పెద్ద ముప్పుగా పరిణమిస్తున్నాయి. దీంతో రకరకాల సమస్యల ముప్పూ పెరుగుతోంది.
నిద్ర సమస్యలు: చీకటి పడుతున్నప్పుడు మన కంట్లోని రెటీనా పొర- మెదడులోని ప్రధాన జీవగడియారానికి సంకేతాలు పంపిస్తుంది. ఇది వెంటనే పీనైల్‌ గ్రంథిని ప్రేరేపించి క్రమంగా మెలటోనిన్‌ హార్మోన్‌ ఉత్పత్తయ్యేలా చేస్తుంది. దీంతో మన శరీరంలో వరుసగా కొన్ని జీవక్రియలు జరిగి మనకు నిద్ర ముంచుకొస్తుంది. అయితే కొన్నాళ్లు బాగా పొద్దుపోయాక పడుకోవటం.. మరికొన్నాళ్లు మధ్యాహ్నమే నిద్రకు ఉపక్రమించటం.. మిరుమిట్లు గొలిపే కాంతి.. ఇలాంటివన్నీ జీవగడియారాన్ని అస్తవ్యస్తం చేస్తాయి. దీంతో పడుకున్నా వెంటనే నిద్ర పట్టదు, ఒకవేళ పట్టినా మధ్యలోనే మెలకువ వస్తుంటుంది. ఇది ఇతరత్రా సమస్యలకూ దారితీస్తుంది.
కుంగుబాటు, ఒత్తిడి: ఒత్తిడి హార్మోన్‌ అయిన కార్టిజోల్‌ స్థాయులు పగటి పూట ఎక్కువగా, రాత్రిపూట తక్కువగా ఉంటాయి. జీవగడియారం దెబ్బతింటే కార్టిజోల్‌ స్థాయులూ అస్తవ్యస్తమవుతాయి. దీంతో కుంగుబాటు, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలూ బయలుదేరతాయి. నిద్రలేమితో సతమతమయ్యే 70% మందిలో కుంగుబాటు, ఆందోళన వంటి సమస్యలూ కనబడుతుండటమే దీనికి నిదర్శనం. కొద్దిరోజులు బాగా హుషారుగా, కొద్దిరోజులు చాలా నిరాశగా ఉండే బైపోలార్‌ డిజార్డర్‌ బాధితుల్లో మూడింట రెండొంతుల మంది నిద్రలేమితో సతమతమవుతున్నవారే.
రోగనిరోధకశక్తి తగ్గుముఖం: రోగనిరోధక వ్యవస్థలో పాలు పంచుకునే రసాయనాల స్థాయులు రోజంతా ఒకేలా ఉండవు. గుండెజబ్బుల దగ్గర్నుంచి చాలా వ్యాధులకు మూలమైన వాపు ప్రక్రియ ప్రతిస్పందనను ప్రేరేపించే రసాయనాల మోతాదులు రాత్రిపూట ఎక్కువగా ఉంటాయి. అలాగే వాపు ప్రక్రియ ప్రతిస్పందనను అడ్డుకునే రసాయనాలు పగటిపూట ఎక్కువగా ఉంటాయి. అందుకే విశ్రాంతి తీసుకునే సమయంలో ఇన్‌ఫెక్షన్లతో శరీరం బాగా పోరాడుతుంది. జీవగడియారం, నిద్ర తీరుతెన్నులు అస్తవ్యస్తమైతే రోగనిరోధకశక్తి కూడా తగ్గుతుంది.
వూబకాయం పెద్దముప్పు
జీవ గడియారం గతి తప్పితే జీవక్రియలూ మందగిస్తాయి. ఇది సమస్త సమస్యలకు మూలమైన వూబకాయానికీ దారితీయొచ్చు. ఉదాహరణకు- బాగా పొద్దుపోయాక లేదా అర్ధరాత్రి పూట భోజనం చేస్తున్నామనుకోండి. వెంటనే మెదడులోని గడియారం ‘వద్దు, తినొద్దు. ఇది విశ్రాంతి తీసుకునే సమయం’ అని చెబుతుంటుంది. కానీ క్లోమగ్రంథిలోని గడియారం మాత్రం ఆహార పరిమాణానికి అనుగుణంగా ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయాలని ఆదేశిస్తుంది. ఏదో ఒకసారి ఇలా జరిగితే ఇబ్బందేమీ ఉండదు. కానీ అదేపనిగా తినే అలవాట్లు మారిపోతుంటే క్లోమగ్రంథిలోని గడియారం వేళలూ మారిపోతాయి. ప్రధాన గడియారానికీ దీనికీ పొంతన కుదరక జీవక్రియలు మందగిస్తాయి. దీంతో శరీరం గ్లూకోజును సరిగా వినియోగించుకోలేదు (ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌). ఇది క్రమంగా మధుమేహానికి దారితీయొచ్చు. శరీరం వినియోగించుకోని గ్లూకోజు కొవ్వుగా మారి వూబకాయమూ ముంచుకొస్తుంది. ఈ కొవ్వు కాలేయంలోకీ చేరుకోవచ్చు. ఇది వాపు ప్రక్రియను ప్రేరేపించి క్యాన్సర్లకూ దారితీయొచ్చు. అలాగే కొవ్వు రక్తనాళాల గోడలకు అంటుకొని పేరుకుపోతే గుండెజబ్బులూ తలెత్తొచ్చు. అంటే వూబకాయంతో పాటు సకల జబ్బులు ముంచుకొస్తాయన్నమాట.
విప్లవాత్మక ఆవిష్కరణ 
నకు రోజూ ఏదో ఒక నిర్దిష్టమైన సమయానికి నిద్ర, ఆకలి, ఉత్తేజం, అలసట వంటి భావనలు కలగటానికి జీవగడియారమే కారణం. గుండె వేగం, రక్తపోటులో మార్పులు, హార్మోన్ల ఉత్పత్తి, కణాల విభజన, వృద్ధి, ఎముకల పెరుగుదల వంటివన్నీ దీని ఆధారంగానే సాగుతుంటాయి. అందువల్ల జీవగడియారం పనితీరును, దీనికి దోహదం చేస్తున్న యంత్రాంగాలను గుర్తించటమనేది సామాన్య విషయం కాదు. ఇదో విప్లవాత్మకమైన ఆవిష్కరణని నోబెల్‌ కమిటీ కొనియాడటమే దీనికి నిదర్శనం. మన జీవ గడియారం (సర్కాడియన్‌ రిథమ్‌) పగలు-రాత్రి, ఉష్ణోగ్రత వంటి బాహ్య వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పనిచేస్తుంది. ఈ బయటి వాతావరణ పరిస్థితులు మారితే లోపలి గడియారం పనితీరూ మారొచ్చు. ఉదాహరణకు పగలూ రాత్రీ సమయాలు వేర్వేరుగా ఉండే ప్రాంతాలకు ప్రయాణించినపుడు జీవగడియారం అస్తవ్యస్తమై.. తాత్కాలికంగా నిద్ర పట్టకపోవటం, అలసట, తికమక పడటం వంటివి తలెత్తుతాయి. దీన్నే ‘జెట్‌ లాగ్‌’ అంటారు. కొత్త ప్రాంతంలో పగలు, రాత్రి సమయాలకు మన శరీరం సర్దుకున్నాక ఇవీ తగ్గిపోతాయి. అయితే దీర్ఘకాలంగా జీవగడియారం అస్తవ్యస్తమైతే మాత్రం నిద్ర సమస్యలతో పాటు కుంగుబాటు, విషయ గ్రహణ సామర్థ్యం తగ్గటం, మతిమరుపు, కొద్దిరోజులు అతి హుషారు కొద్దిరోజులు నిరాశ (బైపోలార్‌) వంటి సమస్యలెన్నో ముంచుకొస్తాయి. అంతేకాదు.. వూబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం.. ముఖ్యంగా క్యాన్సర్‌ వంటి తీవ్ర సమస్యల ముప్పూ పెరుగుతుంది. కాబట్టి దెబ్బతిన్న జీవగడియారాన్ని సరిదిద్దే మార్గాలను గుర్తిస్తే ఇలాంటి జబ్బుల బారినపడకుండా చేసుకోవచ్చు. తాజా నోబెల్‌ గ్రహీతల అధ్యయనం ఇందుకు ఎంతగానో తోడ్పడగలదని, మానవాళి ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపగలదని నిపుణులు ఆశిస్తున్నారు.
గడియారం గతి తప్పకుండా..
  గడియారం చెడిపోతే పక్కన పడేస్తామా? బాగు చేయించి తిరిగి గోడకు తగిలిస్తాం. జీవ గడియారమూ అంతే. ఏమాత్రం అస్తవ్యస్తమైనట్టు అనుమానం వచ్చినా జాగ్రత్త పడటం మంచిది. మన జీవనశైలిని, ఆహారం తీరుతెన్నులను సరిచేసుకోవటం ద్వారా జీవగడియారాన్నీ కొంతవరకు సరిదిద్దుకోవచ్చు. పూర్తిగా చెడిపోకుండా కాపాడుకోవచ్చు. ముందునుంచే తగు జాగ్రత్తలు పాటిస్తే అసలు గడియారం అస్తవ్యస్తం కాకుండానూ చూసుకోవచ్చు.
వేళకు భోజనం: రోజూ ఒకే సమయానికి భోజనం చేయటం మంచిది. దీంతో జీవగడియారం గతి తప్పకుండా సరిగా పనిచేస్తుంది. రక్తంలో గ్లూకోజు స్థాయులను నియంత్రించే ఇన్సులిన్‌ స్థాయులు ఉదయం పూట ఎక్కువగా ఉంటాయి. అనంతరం క్రమంగా తగ్గుతూ వస్తాయి. అందువల్ల ఉదయం అల్పాహారం కాస్త ఎక్కువగా తీసుకున్నా ఇబ్బందేమీ ఉండదు. అయితే రాత్రిపూట మాత్రం కడుపు కాస్త ఖాళీగా ఉండేలా చూసుకోవాలి.
తగినంత నిద్ర: రాత్రి వేళ సుమారు 8 లేదా 9 గంటల సమయంలో మన శరీర ఉష్ణోగ్రత తగ్గటం మొదలవుతుంది. ఈ సమయంలో పడుకుంటే నిద్ర బాగా పడుతుంది. కాబట్టి వీలైనంతవరకు పెందలాడే నిద్రకు ఉపక్రమించాలి. రోజూ రాత్రిపూట కనీసం 6 నుంచి 8 గంటల సేపు నిద్రపోవటం ఉత్తమం. దీంతో జీవగడియారమూ సజావుగా పనిచేస్తుంది.
నీలి కాంతికి దూరం: టీవీ, కంప్యూటర్‌, స్మార్ట్‌ఫోన్‌, ట్యాబ్‌ల వంటివి మెదడుపై విపరీత ప్రభావం చూపుతాయి. వీటి నుంచి వెలువడే నీలి కాంతిని (బ్లూలైట్‌) జీవగడియారం పగటి వెలుగనే అనుకుంటుంది. కాబట్టి రాత్రిపూట.. ముఖ్యంగా పడుకునే ముందు వీటికి దూరంగా ఉండటం మేలు. అలాగే పడుకోవటానికి ముందుగానే ఇంట్లో వెలిగే లైట్ల కాంతి తగ్గించుకునే ఏర్పాటు చేసుకోవాలి.
రోజూ వ్యాయామం: రోజుకు కనీసం అరగంట సేపు వ్యాయామం చేయటం అన్ని విధాలా మంచిది. ఉదయం పూట వ్యాయామం చేయటం ఇంకా మంచిది. ఎందుకంటే ఉదయం పూట ఆరు బయటకు వెళ్తే ఒంటికి ఎండ కూడా తగులుతుంది. కంటికి సూర్యుడు, సహజ వెలుతురు కనబడతాయి. జీవగడియారం అస్తవ్యస్తమైనా దీంతో తిరిగి గాడినపడుతుంది. ఉదయం పూట కుదరకపోతే సాయంత్రమైనా వ్యాయామం చేయొచ్చు. అయితే పడుకోవటానికి ముందు వ్యాయామాల జోలికి వెళ్లకపోవటమే మేలు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)

Ratan Tata special article on Eenadu