విద్యుత్‌ విహారం

విద్యుత్‌ విహారం
కాలుష్య రహితమే కాక, దేశానికి ఇంధన బిల్లు భారం  తగ్గించేందుకు విద్యుత్తు వాహనాల వినియోగం పెంచాలన్న ప్రభుత్వ యత్నాలకు, కార్పొరేట్‌ సంస్థలు అండగా  నిలుస్తున్నాయి. బ్యాటరీతో నడిచే వాహనాల తయారీలో దిగ్గజ సంస్థలైన మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌, మహీంద్రా, అశోకా లేలాండ్‌ ముందడుగు వేశాయి. వేగవంతమైన ఛార్జింగ్‌ వ్యవస్థను  ఏబీబీ పరిచయం చేసింది.
మహీంద్రా అండ్‌ మహీంద్రా ట్రెయో ఆటోలు
ఈనాడు, హైదరాబాద్‌: అగ్రగామి ఆటోమొబైల్‌ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా లిమిటెడ్‌, విద్యుత్తు ఆటోలు ప్రవేశపెట్టటానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే తుదిరూపం ఇచ్చిన ‘ట్రెయో’ శ్రేణి విద్యుత్తు ఆటోలను దిల్లీలో నీతిఆయోగ్‌ నిర్వహిస్తున్న ‘గ్లోబల్‌ మొబిలిటీ సమ్మిట్‌’ లో ప్రదర్శించింది. ట్రెయో, ట్రెయో యారి పేర్లతో త్వరలో మార్కెట్లోకి అందుబాటులోకి రానున్న ఈ ఎలక్ట్రిక్‌ ఆటోలు లీథియం ఐయాన్‌ బ్యాటరీతో నడుస్తాయి. తమ ఎలక్ట్రిక్‌ ఆటోలతో కాలుష్యమే ఉండదని, దీర్ఘకాలం మన్నికతో పాటు నిర్వహణ వ్యయాలు తక్కువని మహీంద్రా అండ్‌ మహీంద్రా వివరించింది. విద్యుత్తు వాహనాల వైపు మనదేశం శరవేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో, సౌకర్యవంతమైన పట్టణ ప్రయాణాలకు అనుగుణమైన రీతిలో బ్యాటరీతో  నడిచే ఆటోలను తీసుకువస్తున్నట్లు మహీంద్రా అండ్‌ మహీంద్రా ఎండీ పవన్‌ గోయంకా పేర్కొన్నారు. తాము ఎంతో ముందుగానే విద్యుత్తు వాహనాల తయారీలో అడుగుపెట్టినట్లు, ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇప్పుడు సామాన్య ప్రజల చెంతకు చేర్చబోతున్నామని తెలిపారు.

8 నిమిషాల్లోనే కారు ఛార్జింగ్‌
వేగవంతమైన వ్యవస్థ
ఆవిష్కరించిన ఏబీబీ
దిల్లీ: కారు బ్యాటరీలను కేవలం 8 నిమిషాల్లోనే ఛార్జింగ్‌ చేసి 200 కి.మీ. వరకు నడిపించగల వేగవంతమైన ఛార్జింగ్‌ వ్యవస్థను ఏబీబీ ఆవిష్కరించింది. భారత్‌లోనే తొలిసారిగా ‘టెర్రా హెచ్‌పీ’ వేగవంతమైన ఛార్జింగ్‌ వ్యవస్థను శుక్రవారమిక్కడ జరిగిన మూవ్‌ గ్లోబల్‌ మొబిలిటీ సమిట్‌లో ఏబీబీ ప్రదర్శించింది. ‘జాతీయ రహదారులపై ఉండే విశ్రాంతి కేంద్రాలు లేదా పెట్రోలు స్టేషన్ల వద్ద దీనిని ఏర్పాటు చేసుకోవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ ఛార్జింగ్‌ చేసుకోవచ్చ’ని ఏబీబీ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘రవాణా వ్యవస్థను ఇ-వాహనాల వైపు నడిపించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని మేం గౌరవిస్తున్నామ’ని ఏబీబీ సీఈఓ ఉల్రిస్‌ స్పైసోఫర్‌ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 68 దేశాల్లో 8,000 వేగవంత ఛార్జింగ్‌ కేంద్రాలను సంస్థ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. బస్సుల బ్యాటరీల ఛార్జింగ్‌కు టోసా వ్యవస్థలు విడుదల చేశామని తెలిపారు. కాలుష్య రహిత, సుస్థిర రవాణాకు మారాలన్న భారత్‌ యత్నాలకు ఏబీబీ సహకరిస్తుందని, భారత్‌లో తయారీకి ఊతం ఇస్తోందని వివరించారు.
అశోక్‌ లేలాండ్‌ ఇ-వాహనాల ప్లాంటు ప్రారంభం
చెన్నై: హిందుజా గ్రూప్‌ సంస్థ అశోక్‌ లేలాండ్‌ ఇక్కడి ఎన్నూర్‌ ప్లాంట్‌లో కొత్త విద్యుత్‌ వాహనాల సదుపాయాన్ని ప్రారంభించింది. కంపెనీ 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భవిష్యత్‌కు పునాది రాయి వేశామని సంస్థ ఎండీ వినోద్‌ కె దాసరి పేర్కొన్నారు. ‘ఇ మొబిలిటీ విప్లవంలో భాగమవడానికి ఈ విద్యుత్‌ వాహనాల కేంద్రం మాకు దన్నుగా నిలబడుతుంద’ని ఆయన అన్నారు. ‘విద్యుత్‌ వాహనాల్లో కొత్త ఉత్పత్తి ప్లాట్‌ఫామ్‌లైన ఇఎల్‌సీవీ(తేలిక పాటి వాణిజ్య వాహనం), ఫ్లోర్‌ ఎత్తు తక్కువగా ఉండే సిటీ బస్సులు, వివిధ విద్యుత్‌ వాహనాలతో ఉత్పత్తి మొదలుపెడతామ’ని వివరించారు. ఈ ప్లాంటులో మోటార్ల పరీక్ష, బ్యాటరీ మాడ్యూల్స్‌-ప్యాక్స్‌, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ లేబొరేటరీ తదితరాలు ఉంటాయి. తయారీ, క్షేత్ర స్థాయి ట్రాకింగ్‌కు డిజిటల్‌ టూల్స్‌ కూడా ఉన్నాయి. ఐఐటీ మద్రాస్‌ రీసెర్చ్‌ పార్క్‌లోని ఇమొబ్‌టెక్‌ కేంద్రంతో కలిసి కంపెనీకి కావలసిన అన్ని విద్యుత్‌ వాహనాల సేవలు, కాంట్రాక్టులను ఈ కేంద్రం నిర్వహిస్తుంది.
హ్యూందాయ్‌.. ఎస్‌యూవీ నెక్సో!
తమ తొలి విద్యుత్‌ స్పోర్ట్స్‌ వినియోగ వాహనం (ఎస్‌యూవీ) ‘నెక్సో’ను త్వరలో దేశీయ విపణికి విడుదల చేయనున్నట్లు హ్యుందాయ్‌ మోటార్‌ ప్రకటించింది. ఈ విషయాన్ని గ్లోబల్‌ మొబిలిటీ సదస్సులో కంపెనీ వైస్‌ ఛైర్మన్‌ ఛుంగ్‌ యూ సున్‌ వెల్లడించారు. అయితే వాహనం సాంకేతికత, సదుపాయాలు, ధర వంటి వివరాలను ఆయన వెల్లడించలేదు.   పర్యావరణ హిత వాహనాలపై హ్యుందాయ్‌ మోటార్‌ దృష్టి పెట్టిందని సున్‌ అన్నారు. దక్షిణ కొరియా కేంద్రంగా పనిచేస్తున్న హ్యుందాయ్‌ మోటార్స్‌.. భారత్‌లో అనుబంధ సంస్థ హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దేశంలో ప్రస్తుతం రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా ఉంది. ఇదే సమయంలో మరో విద్యుత్‌ కారు ‘కోనా’ను కంపెనీ ప్రదర్శించింది.
సుజుకీ వాహనాలకు రోడ్డు పరీక్షలు
జపాన్‌ వాహన దిగ్గజం సుజుకి మోటార్‌ కార్పొరేషన్‌, భారత్‌లో తన విద్యుత్‌ వాహనాల(ఈవీలు)కు రోడ్డు పరీక్షలు వచ్చే నెలలో ప్రారంభించనుంది. టయోటా మోటార్‌ కార్పొరేషన్‌తో కలిసి 2020 కల్లా ఈవీలను ఇక్కడ విడుదల చేయాలన్నది కంపెనీ లక్ష్యంగా ఉంది. అదే సమయంలో గుజరాత్‌ ప్లాంటులో ఈవీల కోసం లిథియం అయాన్‌ బ్యాటరీల ఉత్పత్తిని సైతం మొదలుపెట్టనుంది. ‘వచ్చే నెల 50 విద్యుత్‌ వాహనాల నమూనాలకు రోడ్డు పరీక్షలు మొదలుపెడుతున్నామ’ని సుజుకీ మోటార్‌ ఛైర్మన్‌ ఒసాము సుజుకీ శుక్రవారమిక్కడ జరిగిన ‘గ్లోబల్‌ మొబిలిటీ సమిట్‌ ‘మూవ్‌’’లో పేర్కొన్నారు. కాగా, ఈ మోడళ్లన్నీ సుజుకీ మోటార్‌ అభివృద్ధి చేయగా.. వాటిని మారుతీ సుజుకీకి చెందిన గురుగ్రామ్‌ ప్లాంటులో తయారు చేస్తారని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈఓ కెనిచి అయుకవ పేర్కొన్నారు.
ఎస్‌ఎంఎల్‌ ఇసుజు కొత్త ట్రక్కు
బెంగళూరు: వాహన సంస్థ ఎస్‌ఎంఎల్‌ ఇసుజు, గ్లోబల్‌ సిరీస్‌ ట్రక్కులను దక్షిణాది విపణిలోకి విడుదల చేసింది. భారత్‌లో తయారీ లక్ష్యానికి అనుగుణంగా వీటిని పూర్తిగా స్థానికంగానే తయారు చేస్తున్నట్లు ఇసుజు జనరల్‌ మేనేజర్‌ నవల్‌ కుమార్‌ శర్మ పేర్కొన్నారు. అధునాతన రోబోటిక్‌ టెక్నిక్‌లను వినియోగిస్తున్నామని, లారీ క్యాబిన్‌ రూపురేఖలు సైతం పూర్తిగా కొత్తవని వివరించారు. వీటితో పాటు అధునాతన టెలిమాటిక్స్‌ సొల్యూషన్లను ‘ఎస్‌ఎంఎల్‌ సారథి’ పేరుతో కంపెనీ విడుదల చేసింది. సామ్రాట్‌ హెచ్‌డీ 19, సర్టాజ్‌, సూపర్‌, టిప్పర్‌ సుప్రీమ్‌, ప్రెస్టీజ్‌, సర్టాజ్‌ హెచ్‌జీ71, సీఎన్‌జీ మోడళ్లలో కొత్త జీఎస్‌ సిరీస్‌ లభించనుంది. అత్యవసర సందర్భాల్లో వినియోగించుకునేందుకు ఎస్‌ఓఎస్‌ మీటతో పాటు, వాహనం ఎక్కడ ఉందీ తెలుసుకునే పర్యవేక్షణా (ట్రాకింగ్‌) వ్యవస్థను అమర్చినట్లు సంస్థ తెలిపింది. ఈ వాహనాలపై కంపెనీ మూడేళ్ల వారెంటీ అందిస్తోంది.
7249 ఫోర్డ్‌ ఎకోస్పోర్ట్‌లు వెనక్కి
దిల్లీ: దేశవ్యాప్తంగా 7,249 పెట్రోల్‌ ఎకోస్పోర్ట్‌ కార్లను వెనక్కి పిలిపించనున్నట్లు ఫోర్డ్‌ ఇండియా వెల్లడించింది. పవర్‌ట్రైన్‌ కంట్రోల్‌ మాడ్యుల్‌ (పీసీఎం) సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేయడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. 2017 నవంబరు నుంచి 2018 మార్చి మధ్యలో తయారైన ఎకోస్పోర్ట్‌ పెట్రోల్‌ వేరియంట్‌ కార్లను కంపెనీ స్వచ్ఛందంగా వెనక్కి పిలిపించనుంది. వాహనాల నాణ్యత కొనసాగించడానికి కట్టుబడి ఉన్నామని ఫోర్డ్‌ తెలిపింది. బ్యాటరీ డ్రైనేజ్‌ ఆకస్మాత్తుగా తగ్గే అవకాశం లేకుండా చూసేందుకే, వాహనాలను వెనక్కి రప్పిస్తున్నట్లు వివరించింది. లోపాలున్న ఫ్రంట్‌ లోయర్‌ కంట్రోల్‌ ఆర్మ్‌, సీట్‌ రీక్లైనర్‌ లాక్‌లను సరిచేయడానికి జులైలో ఫోర్డ్‌ 5,397 ఎకోస్పోర్ట్‌ కార్లను వెనక్కి పిలిపించిన విషయం తెలిసిందే.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)

వైవిధ్యమే జీవం! (Eenadu Sunday_30/09/12)