సాగంతా సౌరవిద్యుత్తుతోనే!

గ్రామాల్లో మైక్రోగ్రిడ్లకు అనుసంధానం
 ఇసా-అమరావతి ఆధ్వర్యంలో ఏటా ప్రపంచ ఉత్తమ సౌర నగరం అవార్డు
 విద్యుత్తు ఆవిష్కరణల వేదిక సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు
 రూ.13,200 కోట్లతో సౌరపలకలు, బ్యాటరీతయారీపై సాఫ్ట్‌బ్యాంక్‌తో ఒప్పందం
ఈనాడు, అమరావతి: ‘రాష్ట్రంలో వ్యవసాయానికి వినియోగించే 17లక్షల విద్యుత్తు  కనెక్షన్లకు సౌరపలకలు అమర్చి గ్రిడ్‌కు అనుసంధానిస్తాం. రైతులు వాడుకోగా మిగిలిన విద్యుత్తును యూనిట్‌కు రూ.1.50 వంతున చెల్లిస్తాం. అన్నదాతలకు నెలకు రూ.15వేల నుంచి రూ.18వేల వరకు ఆదాయం లభించేలా చేస్తాం. ఇపుడున్న వాటి స్థానంలో ఇంధన పొదుపు పంపుసెట్లు అమరుస్తాం’  అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. గ్రామాల వారీగా మైక్రోగిడ్లు ఏర్పాటుచేసి రైతులు ఉత్పత్తి చేసే విద్యుత్తును అక్కడి ప్రజలే వినియోగించుకునే విధానం తెస్తామన్నారు. విజయవాడలో జరుగుతున్న ‘విద్యుత్తు ఆవిష్కరణల వేదిక 2019’ ముగింపు కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. ప్రభుత్వానికి ఖర్చు లేకుండా రాష్ట్రమంతా ఎల్‌ఈడీ వీధిదీపాలు అమర్చినట్లే ఈ బృహత్తర ప్రాజెక్టునూ అమలుచేయబోతున్నట్లు సీఎం వెల్లడించారు. సౌర విద్యుత్తుకు ప్రోత్సాహం, ఇపుడున్న ప్రభుత్వ వాహనాల స్థానంలో మూడు నాలుగేళ్లలో అన్నీ విద్యుత్తు వాహనాలే తేవడం తమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో 150 మెగావాట్ల సామర్థ్యంతో సౌర, వాయు ఆధారిత విద్యుదుత్పత్తి నిల్వ వ్యవస్థను అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు. కుటుంబానికో స్మార్ట్‌ఫోన్‌ అందించి సేవలన్నీ ఆన్‌లైన్‌ ద్వారా అందించేలా చర్యలు చేపడుతున్నామన్నారు.
ఇసా-అమరావతి పేరుతో ఏటా అవార్డు
వచ్చే ఏడాది నుంచి ప్రపంచ ఉత్తమ సౌర నగరాన్ని ఎంపిక చేసి ఇసా-అమరావతి పేరుతో ఏటా అవార్డు బహూకరిస్తామని చంద్రబాబు ప్రకటించారు. సదస్సుకు హాజరైన ఇసా(ఇంటర్నేషనల్‌ సోలార్‌ అలయన్స్‌) డైరెక్టర్‌ జనరల్‌ ఉపేంద్ర తిపాఠి చేసిన ప్రతిపాదనకు సీఎం ఆమోదం తెలిపారు. రూ.10కోట్లు మంజూరుచేయాలని ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌కు సూచించారు.
ఆవిష్కరణలకు ప్రోత్సాహం
సదస్సులో నిర్వహించిన పోటీలో ఉత్తమ ఆవిష్కరణలుగా నిలిచిన వారికి చంద్రబాబు నగదు బహుమతులు అందించారు. తక్కువ వ్యయంతో సౌర విద్యుత్తు ఆవిష్కరణ చేసిన 1366 టెక్నాలజీస్‌ ప్రతినిధులను ఆయన అభినందించారు. రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటుచేసి 9 నెలల్లో ఉత్పత్తి ప్రారంభించాలని సూచించారు. కాలుష్య రహిత జనరేటర్ల తయారీపై చక్ర్‌ ఇన్నోవేషన్స్‌, సౌర  విద్యుత్తు ప్యానెళ్లను శుభ్రం చేసే వ్యవస్థపై స్కైలాన్సర్‌, ఇళ్ల పైకప్పుపై విద్యుదుత్పత్తి చేసే బేసిక్‌ ఎనర్జిటిక్స్‌ సంస్థలకు బహుమతులు అందించారు.

ఎస్‌బీ ఎనర్జీతో రూ.13,200 కోట్ల ఒప్పందం
సాఫ్ట్‌బ్యాంక్‌ ఎనర్జీ(ఎస్‌బీ) ప్రాజెక్ట్‌ సంస్థ రాష్ట్రంలో రూ.13,200 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత తెలిపిందని ఏపీఈడీబీ సీఈవో జాస్తి కృష్ణకిషోర్‌ తెలిపారు. సౌరపలకలు, బ్యాటరీల ఉత్పత్తి పరిశ్రమను ఈ సంస్థ ఏర్పాటు చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను సౌరహబ్‌గా రూపుదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌, ఎస్‌బీ ఎనర్జీ కార్యనిర్వాహక ఛైర్మన్‌ మనోజ్‌ కోహ్లి సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు. సౌర విద్యుత్తు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రూ.5లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)