బొగ్గుల కుంపటి... మళ్లీ వచ్చింది !

బొగ్గుల కుంపటి... మళ్లీ వచ్చింది !

వంట చేసుకోవడానికి వెనకటి రోజుల్లో బొగ్గుల కుంపటినో లేదా కట్టెలపొయ్యినో వాడుకునేవారు. గ్యాస్‌ స్టవ్‌ రాకతో అవన్నీ క్రమంగా తెరమరుగైపోయాయి. అయితే ఆ బొగ్గులమీద కాచిన పాలమీగడ రుచీ, కట్టెలపొయ్యిమీద వండిన కోడికూర రుచీ గ్యాస్‌మీద వండిన వాటికి ఎలా వస్తుంది?



వంట చేసుకోవడానికి వెనకటి రోజుల్లో బొగ్గుల కుంపటినో లేదా కట్టెలపొయ్యినో వాడుకునేవారు. గ్యాస్‌ స్టవ్‌ రాకతో అవన్నీ క్రమంగా తెరమరుగైపోయాయి. అయితే ఆ బొగ్గులమీద కాచిన పాలమీగడ రుచీ, కట్టెలపొయ్యిమీద వండిన కోడికూర రుచీ గ్యాస్‌మీద వండిన వాటికి ఎలా వస్తుంది? అందుకే ఆనాటి పొయ్యిలు మళ్లీ కనిపిస్తున్నాయి.

వెనకటి రోజుల్లో పల్లెల్లో మొక్కజొన్న కంకులూ తేగలూ తినాలంటే కుంపట్లో కాసిని బొగ్గులు వేసి రాజుకున్నాక దానిమీద పెట్టుకుని కాల్చుకునేవారు. ఇక, గడ్డపెరుగుకోసం గిన్నెలో పాలుపోసి బొగ్గుల కుంపటిమీద పెట్టి, మీగడ కట్టాక వాటిని తోడుపెట్టేవారు. సన్నసెగమీద కాగిన ఆ పాలమీగడ రుచి గ్యాస్‌ స్టవ్‌మీద ఎన్ని గంటలు కాచినా రాదు. అలాగే పిండి వంటలూనూ. అంతేనా... బార్బెక్యూ కిచెన్‌లోనూ ఎలక్ట్రిక్‌, గ్యాస్‌ వాటికన్నా బొగ్గులూ లేదా కట్టెలతో మండించే పొయ్యిల్నే వాడుతుంటారు. ఎక్కువ సెగ వల్ల అవి మెత్తగా ఉడకడం, కాలడంతోపాటు ఆ పొగ వల్ల రుచీ బాగుంటుంది. కారణమేదయినా ఆనాటి కట్టెల పొయ్యిలూ కుంపట్లూ కొత్త రూపంలో మళ్లీ ఇళ్లలో కనిపిస్తున్నాయి. ఎన్విరోపిట్‌, ఫ్యాట్‌క్యాట్‌... వంటి కంపెనీలు బొగ్గు, కట్టెలతో పనిచేసే వుడ్‌, కోల్‌కుకింగ్‌ స్టవ్‌లను తయారుచేస్తున్నాయి. కట్టెల పొయ్యిల్లో వాటిని పెట్టేందుకు వీలుగా స్టాండులూ ఉంటున్నాయి. దాంతో వాటి నుంచి వచ్చే మసి లేదా బూడిద ఇల్లంతా ఎగరదు. అంతేకాదు, ఒకేసారి రెండు రకాల వంటకాలు వండేలా డబుల్‌ పాట్‌ అటాచ్‌మెంట్‌ కూడా ఇస్తున్నారు. వద్దనుకున్నప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఎంతో ప్రత్యేకంగా డిజైన్‌ చేయడం వల్ల సాధారణ కట్టెల పొయ్యిల నుంచి వచ్చే పొగతో పోలిస్తే వీటిల్లో 80 శాతం పొగ తగ్గుతుంది. అదే సమయంలో గ్యాస్‌ స్టవ్‌తో పోలిస్తే వేగంగానూ వంట పూర్తవుతుంది అంటున్నారు ఉత్పత్తిదారులు.



ఎలక్ట్రిక్‌ కుంపటి!

కట్టెలతో మండే పొయ్యిల్లో డిజైన్లలో తేడాలున్నా దాదాపుగా అన్నీ ఒకేలా ఉంటున్నాయి. కానీ బొగ్గుల కుంపట్లయితే రెండు రకాలుగా ఉంటున్నాయి. వీటిల్లో సాధారణ కుంపటిలో మాదిరిగానే బొగ్గులు రాజేసి మండించేవి ఒక రకమైతే, ఎలక్ట్రిక్‌ స్టవ్‌ మాదిరిగానే విద్యుచ్ఛక్తితో ఆన్‌ అయ్యేవి మరో రకం. రెండో రకంలో స్విచ్‌ ఆన్‌ చేయగానే అందులో వేసిన బొగ్గులన్నీ కాలి ఎర్రగా మారతాయి. ఇందులోని బర్నర్‌ను పెంచుకుంటూ తగ్గించుకుంటూ వాటిమీద మనకు కావాల్సినవి వండుకోవచ్చన్నమాట. కాబట్టి చేతికి ఏమాత్రం మసి అంటకుండానే కుంపట్లో వండుకోగలిగే అన్ని రకాల వంటలూ వండేసుకోవచ్చన్నమాట. వీబూస్ట్‌, వల్కనొ, కిటోసన్‌... వంటి కంపెనీలు తయారుచేస్తున్న ఈ రకం కోకోనట్‌ చార్కోల్‌ స్టార్టర్స్‌లో పొయ్యిని పట్టుకునేందుకూ హ్యాండిల్‌ ఉంటుంది. ఈ పొయ్యితోపాటు వాడుకునేందుకు వీలుగా కొబ్బరి పెంకులతో చేసిన బొగ్గుని కూడా విక్రయిస్తున్నారు. ఆన్‌ చేసిన మూడు నిమిషాలకే ఈ బొగ్గులు వేడెక్కుతాయి. ఈ కుంపటిని అవసరానికి అనుగుణంగా వేడిని పెంచుకుంటూ తగ్గించుకోవచ్చు. స్టెయిన్‌లెస్‌ స్టీలుతో తయారైన ఈ స్టవ్‌లకు ఎనామిల్‌ పెయింట్‌ కూడా వేయడంతో త్వరగా తుప్పు పట్టవనీ కనీసం ఐదేళ్లయినా చక్కగా పనిచేస్తాయనీ చెబుతున్నారు తయారీదారులు. గ్రిల్‌చేసుకునేందుకు అవసరమైన యాక్సెసరీల్నీ విక్రయిస్తున్నాయీ కంపెనీలు. అంతేకాదు, మామూలు బొగ్గులకుంపట్లలో వేసే బొగ్గుల్ని వెలిగించేందుకు ఎలక్ట్రిక్‌ చార్కోల్‌ స్టార్టర్లూ వస్తున్నాయి. మొత్తమ్మీద కట్టెలతోనూ బొగ్గులతోనూ పనిచేసే ఈ పొయ్యిలు, ఇంట్లో ఉన్నప్పుడే కాదు, ఏ పిక్నిక్‌కో వెళ్లినప్పుడు వెంట తీసుకెళ్లి వండుకునేందుకూ చలి కాచుకునేందుకూ కూడా సౌకర్యంగానే ఉంటాయి... ఏమంటారు?


Source : https://www.eenadu.net/telugu-article/sunday-magazine/coal-stove-for-cooking/27/322000907

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)