చార్‌ధామ్‌ యాత్రపై భయాందోళనలు

 చార్‌ధామ్‌ యాత్రపై భయాందోళనలు

‘దేవభూమి’(ఉత్తరాఖండ్‌)లో అసలేమి జరుగుతోంది? ఆదిశంకరాచార్యులు నెలకొల్పిన మఠాల్లో ఒకదానికి నెలవైన జోషీమఠ్‌లో ఇటీవల నేల కుంగిపోయింది. వందల సంఖ్యలో భవనాలకు నెర్రెలిచ్చాయి. అక్కడ భూకంపం సంభవించవచ్చునన్న శాస్త్రవేత్తల హెచ్చరికలు ఇప్పటికే గగ్గోలు పుట్టిస్తున్నాయి.


Published : 22 Feb 2023 00:30 IST

‘దేవభూమి’(ఉత్తరాఖండ్‌)లో అసలేమి జరుగుతోంది? ఆదిశంకరాచార్యులు నెలకొల్పిన మఠాల్లో ఒకదానికి నెలవైన జోషీమఠ్‌లో ఇటీవల నేల కుంగిపోయింది. వందల సంఖ్యలో భవనాలకు నెర్రెలిచ్చాయి. అక్కడ భూకంపం సంభవించవచ్చునన్న శాస్త్రవేత్తల హెచ్చరికలు ఇప్పటికే గగ్గోలు పుట్టిస్తున్నాయి. జోషీమఠ్‌కు 82 కిలోమీటర్ల దూరంలోని కర్ణప్రయాగ్‌లోనూ తాజాగా భూమి కుంగి భవనాలు బీటలు వారాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బద్రీనాథ్‌కు వెళ్ళే రహదారి కొన్నిచోట్ల పగుళ్లు తేలితే- అధికార యంత్రాంగం కొద్దిరోజుల క్రితం వట్టిగా సిమెంట్‌తో వాటిని పూడ్చేసింది. అవి తిరిగి నోళ్లు తెరుస్తుండటమే కాదు- అదే దోవలో జోషీమఠ్‌ నుంచి మార్‌వాడీల మధ్య కొత్తగా కనీసం పది చోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. అందుకు కారణాలేమిటో, వాటి పర్యవసనాలు ఎలా ఉండబోతున్నాయో ఎవరికీ అంతుచిక్కడం లేదు. అయినప్పటికీ, ఆందోళన పడాల్సిందేమీ లేదంటూ ఏప్రిల్‌ నెల నుంచి ‘చార్‌ధామ్‌’ (గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌) యాత్ర నిర్వహణకు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం సంసిద్ధమవుతోంది. శాస్త్రవేత్తలను ఇప్పుడదే తీవ్రంగా విస్మయపరుస్తోంది. బద్రీనాథ్‌ మార్గంలో నిరుడు పదహారు లక్షల మంది ప్రయాణించారు. భక్తులూ పర్యాటకుల తాకిడి ఈసారి అంతకు మూడు రెట్లు అధికంగా ఉండవచ్చునని అంటున్నారు. రాకపోకలు పెద్దగా లేని రోజుల్లోనే పగుళ్లు తేలిన రహదారి- ‘చార్‌ధామ్‌’ యాత్ర ఊపందుకొని వేల సంఖ్యలో వాహనాలు పరుగులు తీసే సమయంలో పెనుఒత్తిడిని తట్టుకోగలదా అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ‘స్థానికంగా నేల కుంగుబాటుపై సమగ్ర అధ్యయనం నిర్వహించాల్సి ఉంది... అప్పటివరకు ప్రమాదకరమైన ఈ ప్రాంతంలోకి లక్షల సంఖ్యలో ప్రజలను అనుమతించడం నిప్పుతో చెలగాటమాడటమే’నని సీనియర్‌ భూగర్భ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నాలుగు పుణ్యధామాల సందర్శనకు తరలిరాబోతున్న ఆసేతుహిమాచల అశేష భక్తజనాన్ని ఆ మేరకు ఉత్తరాఖండ్‌ సర్కారు పూర్తిస్థాయిలో అప్రమత్తం చేయాలి!


ఉత్తరాఖండ్‌లో కొన్నేళ్లుగా జోరుగా అభివృద్ధి పనులు, విచ్చలవిడిగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వాటికి తోడు వాతావరణ మార్పులతో హిమాలయాల్లో సున్నిత సమతౌల్యం దెబ్బతిని ఆ రాష్ట్రంపై ప్రకృతి విపత్తులెన్నో దండెత్తుతున్నాయి. ‘నేడో రేపో ఉత్తరాఖండ్‌ భారీ భూకంపం బారినపడవచ్చు... ప్రభుత్వం ఇప్పటికైనా ముందుజాగ్రత్తలు తీసుకోకపోతే ఊహకందని ఆస్తి, ప్రాణనష్టాలను చవిచూడాల్సి వస్తుంది’ అని పర్యావరణవేత్త, ‘పద్మభూషణ్‌’ పురస్కార గ్రహీత డాక్టర్‌ అనిల్‌.పి.జోషీ హెచ్చరిస్తున్నారు. భారతీయ వైజ్ఞానిక విద్యా పరిశోధన సంస్థ(కోల్‌కతా), నెవడా విశ్వవిద్యాలయ(అమెరికా) పరిశోధకుల అధ్యయనం ప్రకారం- హిమాలయ పర్వతశ్రేణులను వరస భూకంపాలు పట్టి కుదిపేయనున్నాయి. ఆ వరసలో అతిభారీ భూప్రళయమొకటి సమీప భవిష్యత్తులోనే విరుచుకుపడవచ్చునన్న అంచనాలు స్థానికుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలోనూ ఈ నెల మొదట్లో భూమి కుంగిపోయి ఇళ్ల గోడలు బీటలువారాయి. పొంచిఉన్న పెనుప్రమాదాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు సరైన వ్యవస్థలను కొలువుతీర్చడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తుర్కియే, సిరియాలను అతలాకుతలం చేసిన ఇటీవలి భూకంపం- గడచిన వందేళ్లలో ఎన్నడూ కనివినీ ఎరగని ఘోరకలి! తుర్కియే వాణిజ్య సంస్థల సమాఖ్య అంచనాల మేరకు అది డెబ్భై వేలకు పైగా ప్రాణాలను కబళించింది. ఇంకెందరినో క్షతగాత్రులుగా, అనాథలుగా, నిర్వాసితులుగా మార్చేసింది. భూకంపాల ముప్పు అధికంగా ఉన్న తుర్కియేలో నిర్మాణాల నియంత్రణలో నిపుణుల సూచనలను పాలకులు ఆలకించలేదు. తత్ఫలితంగానే విషాద తీవ్రత నిశ్చేష్టపరిచింది. తుర్కియే అనుభవాలే గుణపాఠాలుగా హిమాలయ సానువుల్లో పర్యావరణ పరిరక్షణ, నష్టనివారణ చర్యలకు ప్రభుత్వాలు సత్వరం ఉపక్రమించాలి. ముఖ్యంగా భూకంప పెనుముప్పు ముంగిట్లో ఉన్న ఉత్తరాఖండ్‌కు అది ప్రాణావసరం. తద్భిన్నంగా అంతా బాగుందని సర్కారే సెలవిస్తూ పొద్దుపుచ్చితే- కట్టలు తెంచుకోబోయే కన్నీటి గంగకు అదే బాధ్యత వహించాల్సి వస్తుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)