శ్రీరామ మార్గం (Eenadu Sunday Magazine 01/04/2012)
పోలింగ్‌బూత్‌కు బయల్దేరే ముందు రాముణ్ని తలుచుకుంటే, ఎలాంటి నాయకుడికి ఓటేయాలో స్పష్టమైపోతుంది. వృత్తి ఉద్యోగ ధర్మాల విషయంలో డోలాయమానంలో ఉన్నప్పుడు రామాయణాన్ని నెమరేసుకుంటే, చక్కని పరిష్కారం కళ్లముందు కనిపిస్తుంది. టీనేజీ కుర్రకారుకు రామకథ సీడీ బహుమతిగా ఇస్తే, పెద్దల్ని ఎందుకు గౌరవించాలో ధర్మాన్ని ఎలా ఆచరించాలో ఎవరోవచ్చి చెప్పాల్సిన అవసరమే ఉండదు. ఆలూమగల అనురాగానికి సంబంధించి రామాయణం ఓ దాంపత్యవాచకం! సమకాలీన సమాజం ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యలకూ సంక్షోభాలకూ రామకథలో పరిష్కారం ఉంది. రామమార్గంలో సమాధానం ఉంది. సూ ర్యుడు ఉత్తరం వైపు ప్రయాణిస్తే అది ఉత్తరాయణమైంది. దక్షిణం వైపు ప్రయాణిస్తే అది దక్షిణాయనమైంది. అయోధ్యలో మొదలై, మళ్లీ అయోధ్యకు తిరిగొచ్చి జనరంజకంగా పాలించేదాకా... శ్రీరాముడు సాగించిన విలువలయాత్రే రామాయణమైంది. రామకథ వింటే మనసు ఉప్పొంగుతుంది. రాముడిని తలుచుకుంటే తనువు పులకిస్తుంది. ఉత్తరాలైనా రాతకోతలైనా 'శ్రీరామ' నామంతోనే. బిడ్డకు లాలపోస్తూ 'శ్రీరామరక్ష' అనుకుంటే, అమ్మకెంత నిశ్చింత! పల్లెపల్లెకో రామాలయం. ఇంటింటికో రామ్, రామారావు, రామిరెడ్డి, రామయ్య! తరాలనా...