Vande Masteram (Sachin's 100's)


వందే మాస్టరం
'శతకం' అలక వీడింది. తనెంతో ఇష్టపడే సచిన్‌ చెంతకు మళ్లీ చేరింది! 12 నెలల నిరీక్షణకు తెరదించుతూ.. 33 ఇన్నింగ్స్‌ల విరామానికి ముగింపు పలుకుతూ.. మళ్లీ మాస్టర్‌ బ్యాట్‌కు సలాం చేసింది. ఏడాది క్రితం వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై చేసిన 111 పరుగుల ఇన్నింగ్స్‌తో ఆఖరు. కొన్నాళ్లకే ప్రపంచకప్‌ ముగిసింది.. చాన్నాళ్ల తర్వాత ఇంగ్లాండ్‌ పర్యటన ఆరంభమైంది.. పూర్తయింది. సొంతగడ్డపై వెస్టిండీస్‌తో సిరీస్‌ సాగిపోయింది. ఆస్ట్రేలియా పర్యటనా అయిపోయింది. పదకొండు టెస్టులు.. పదమూడు వన్డేలు.. అభిమానుల ఆశ నెరవేరలేదు.. ఏడాదిపాటు వూరించి వూరించి ఉస్సూరుమనిపించిన వందో వంద ఎట్టకేలకు సచిన్‌ బ్యాటు నుంచి జాలువారింది. అందుకే ఇప్పుడు క్రికెట్‌ భారతమంతా 'వందేమాస్టర'మంటోంది. క్రికెట్‌ ఎవరెస్టుకు సలాం చేస్తోంది!
ఒకటికి రెండు.. సిక్స్‌కు పదిస్తే..!
ఈనాడు క్రీడావిభాగం
రికార్డులంటేనే బద్దలయ్యేవి. బద్దలయ్యేందుకే రికార్డులున్నవి. జిమ్‌ లేకర్‌ పదికి పది నుంచి.. సన్నీ అత్యధిక శతకాల రికార్డు వరకు చరిత్రలో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి.. మళ్లీ మళ్లీ! ఇంకా అవుతాయి కూడా. ఏ ఘనతా శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు... ఎవరో ఒకరు.. బద్దలు కొడతారు! కానీ.. సచిన్‌ 'సెంచరీ' విషయంలో ఈ లెక్కలు మారక తప్పదేమో! అవును.. మాస్టర్‌ బ్లాస్టర్‌ రికార్డు చెదిరిపోవడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది! ఎందుకంటే..: ప్రస్తుతం క్రికెట్‌ ఆడుతున్న వారిలో ఎవరూ సెంచరీల్లో సచిన్‌ను అధిగమించే అవకాశం లేదు. సమీప ప్రత్యర్థి రికీ పాంటింగ్‌ (71) వయసు 37. ఇప్పటికే వన్డే కెరీర్‌కు తెరపడింది! ఎంతో కాలం టెస్టు క్రికెట్టూ ఆడే అవకాశం లేదు. కాబట్టి అతడు సచిన్‌ శతక రికార్డును అందుకునే అవకాశమే లేదు. కొత్తగా ఓ అద్భుతమైన బ్యాట్స్‌మన్‌ వస్తాడనుకుందాం! మధ్యలో ఏ కొన్నాళ్లో తప్ప, కెరీర్‌ ఆరంభం నుంచి ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా ఉంటూ, అత్యుత్తమ ఫామ్‌ను కొనసాగించిన సచిన్‌కు 'సెంచరీ' కొట్టడానికి 23 ఏళ్లు పట్టింది. కానీ ఆ కొత్త బ్యాట్స్‌మన్‌ అన్నేళ్లు ఆడగలడా? టీ20 హవా నేపథ్యంలో అన్ని సెంచరీలు కొట్టడానికి అవసరమైన టెస్టులు, వన్డేలు ముందు ముందు జరగడం అనుమానమే! ఇప్పటికే టెస్టుల సంఖ్య బాగా తగ్గిపోయింది!
ఛాన్స్‌ ఉంది..: సచినుడి రికార్డు ఇక ఎప్పటికీ బద్దలు కాదా అని కాసింత ఈర్ష్యపడే విదేశీయులకు వూహల్లోనైనా కాస్త వూరటనిచ్చే ప్రయత్నం చేద్దాం! సచిన్‌ 'సెంచరీ' కూడా బద్దలయ్యే మార్గం ఒకటుంది. ఇప్పుడున్న మైదానం కొలతలను సగానికి సగం తగ్గిస్తే.. బ్యాట్‌తో టచ్‌ చేస్తే సింగిల్‌, సింగిల్‌కు రెండు, రెండుకు మూడు, నాలుగుకు ఎనిమిది, సిక్స్‌కు పదో పదిహేనో ఇస్తే అప్పుడు సచిన్‌ రికార్డును బద్దలు కొట్టొచ్చు! కావాలంటే డబుల్‌ సెంచరీ కూడా కొట్టొచ్చు!
''చాలా క్లిష్ట దశను (వందో సెంచరీ సాధించే క్రమంలో) అనుభవించా. ఎన్ని సెంచరీలు చేశామన్నది ముఖ్యం కాదు. జట్టు తరఫున బాగా ఆడడం ప్రధానం. నేను మైలురాయి గురించి ఆలోచించలేదు. ఇదంతా మీడియానే మొదలుపెట్టింది. నేనెక్కడికెళ్లినా వందో సెంచరీ గురించే చర్చలు. ఎవరూ కూడా నా 99 సెంచరీల గురించి మాట్లాడలేదు. ఇదంతా నాకు చాలా కష్టమనిపించింది. కుర్రాళ్లూ.. ఆటను ఆస్వాదించండి. కలలు తప్పక నిజమవుతాయి. ప్రపంచ కప్‌ కోసం నేను 22ఏళ్లు నిరీక్షించా''
-సచిన్‌

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు