Eenadu Eetaram (17/03/2012)




యువ లక్ష్యం... జన చైతన్యం!
దేశంలో అవినీతి అంతమైతే ఎంత బావుణ్ణు... అందరూ అనుకునేదే ఇది... ఆ యువకులు కూడా అలాగే అనుకున్నారు... అయితే అనుకుని ఊరుకోలేదు! నడుం బిగించి ముందుకురికారు... చదువుతూనే అవినీతిపై సమర శంఖం పూరించారు... వేల మందిని కదిలించారు... గుర్తుగా అవార్డులు, ఆహ్వానాలందాయి... వాళ్ల కార్యకలాపాలకు వేదికే 'వైబీఐ'! యూత్‌ ఫర్‌ బెటర్‌ ఇండియా. ఇంతకీ ఇదెలా పుట్టింది? ఎలా ఎదిగింది? ఆ యువ ప్రతినిధులను 'ఈతరం' పలకరించింది!


'చెడు రాజకీయానికి జవాబు మంచి రాజకీయమే!' అంటాడు మార్టిన్‌ లూథర్‌ కింగ్‌. రాజకీయాల్ని తిడుతూ కూర్చునే బదులు ఏదో ఒకటి చేసినపుడే ఫలితం. యూత్‌ ఫర్‌ బెటర్‌ ఇండియా అదే చేస్తోంది. ఓ కుర్రాడి మదిలో మెదిలిన ఆలోచన, ప్రణాళిక బద్ధమైన కృషిగా మారి అంతర్జాతీయ వేదికల వరకు నడిపించింది.ఎలా మొదలైంది?
దొంతినేని నరసింహారావు నల్గొండ జిల్లా కుర్రాడు. రాజకీయాలపై అవగాహన ఎక్కువ. అవినీతి, స్కాములు బయటపడినప్పుడల్లా బాధపడేవాడు. 'నేనేం చేయలేనా?' అని ఆలోచించేవాడు. దానికి జవాబే యూత్‌ ఫర్‌ బెటర్‌ ఇండియా. 2010 గాంధీ జయంతి రోజున కొందరు మిత్రులతో కలిసి చదువుతున్న కాలేజీలోనే ప్రారంభించాడు.
ఏమేం చేశారు?
అవినీతి, స్వార్థ రాజకీయాలపైనే వైబీఐ పోరాడాలనుకుంది. విద్యార్థుల్లో అవగాహన కల్పించడానికి కాలేజీలకు వెళ్లారు. బలమైన లోక్‌పాల్‌ ఆవశ్యకత వివరించారు. సమచారహక్కు చట్టాన్ని ఎలా ఉపయోగించుకోవాలో విశదీకరించారు. హైదరాబాద్‌తో మొదలైన వారి చైతన్య శంఖారావం కరీంనగర్‌, సిద్దిపేట్‌, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, అనంతపురం సహా 30 పట్టణాలలో మార్మోగింది. మొత్తం 250 మంది క్రియాశీలక సభ్యులయ్యారు. ఈ క్రమంలో చాలా కాలేజీల్లో నాయకత్వలేమి గుర్తించారు. అధిగమించడానికి 'లీడర్‌షిప్‌ ట్రెనింగ్‌ సెంటర్స్‌' తెరిచారు. కాలేజీలో చురుకైన విద్యార్థుల్ని, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నవారిని గుర్తించి శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. సమాచార హక్కు చట్టం ఎలా ఉపయోగించుకోవాలి? యువతను ఎలా కదిలించాలి? కార్యక్రమాల సమన్వయమెలా? మూడు రోజుల శిక్షణలో ఇవన్నీ నేర్పేవాళ్లు. శిక్షణకయ్యే ఖర్చుల్ని ఫౌండేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫార్మ్స్‌ (ఎఫ్‌.డి.ఆర్‌.) అనే స్వచ్ఛంద సంస్థ భరిస్తోంది.
ఇబ్బందులు దాటి!
మంచి ఆశయంతో మొదలైనా పురిటి కష్టాలు తప్పలేదు. మొదట్లో విద్యార్థుల్లో స్పందన అంతంతమాత్రం. 'ర్యాలీ చేద్దాం' రమ్మని బస్సులు పంపినా వచ్చేవాళ్లు కాదు. మరోవైపు సదస్సులకు కాలేజీ యాజమాన్యాలు అభ్యంతరాలు. ఒక దశలో విసుగుచెందినా, దేశం కోసం, జనచైతన్యం కోసం పట్టువదలరాదని కొత్త కార్యక్రమాలతో ముందుకెళ్లారు.


విజయాలు
వనపర్తి, జనగామ ప్రాంతాల్లోని కొన్ని కాలేజీలు రీఎయింబర్స్‌మెంట్‌ ఫీజుల కోసం విద్యార్థుల్ని సతాయించేవి. అధికారులేమో 'ఎప్పుడో మంజూరు చేశాం' అన్నారు. వై.బి.ఐ. సభ్యులు సమాచార హక్కు అస్త్రాన్ని ప్రయోగించేసరికి రూ.72 కోట్లు మంజూరు అయ్యాయి.
ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల కాలేజీల్లో చదివే వేలమంది విద్యార్థులు డొక్కు బస్సులతో సతమతమవుతుండడం గమనించి వైబీఐ 22 వేల మందితో సంతకాలు సేకరించి ప్రభుత్వానికి పంపింది. మెట్రో బస్సుల్లో ప్రయాణించేలా కాంబినేషన్‌ టికెట్‌కి అనుమతిచ్చింది ప్రభుత్వం.
అన్నా దీక్షకు ముందే బలమైన లోక్‌పాల్‌ బిల్లు కోరుతూ వైబీఐ 3500 మందితో హైదరాబాద్‌లో ర్యాలీ నిర్వహించింది.
అన్నా ఢిల్లీలో దీక్ష చేస్తున్నపుడు మద్దతుగా ఇందిరా పార్క్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. దీనికి ఐదు వేలమంది హాజరయ్యారు.
లోక్‌పాల్‌కు ఎన్నారైలు అమెరికాలో 'దండి మార్చ్‌-2' ప్రారంభిస్తే, మద్దతుగా వైబీఐ సభ్యులు ఇరవై పట్టణాల్లో ఏడువేలమందితో ర్యాలీలు చేశారు.
లోకాయుక్తని బలోపేతం చేయాలని 'క్విట్‌ కరప్షన్‌ మూవ్‌మెంట్‌' చేపట్టారు. దీనికి 35 పట్టణాల్లో 20 వేల మంది మద్దతు పలికారు. ఒకే అంశంపై ఇందరు విద్యార్థులు సమకూరడం రాష్ట్ర చరిత్రలోనే ప్రథమం.
'అడాప్ట్‌ ఎ ట్రీ' పేరుతో హైదరాబాద్‌లో వేల మొక్కలు నాటారు.



గుర్తింపు
వందేమాతరం యూత్‌ ఫ్రంట్‌ సంస్థ 'యంగ్‌ అఛీవర్‌ అవార్డు'.
అమెరికా ఎన్నారై సంస్థ 'కరప్షన్‌ ఫ్రీ ఏపీ' అవార్డు.
'యువజన సంఘాల్ని ఎలా బలోపేతం చేయాలి' అంశంపై జర్మనీలో ఈమధ్య జరిగిన సెమినార్‌కి ప్రపంచవ్యాప్తంగా 96 మంది, ఇండియా నుంచి నలుగురు ఎంపికైతే, అందులో ఇద్దరు వైబీఐ సభ్యులు.


కీలక సభ్యులు
దేవీప్రసాద్‌ రాజా షీలూరాజ్‌ *సూర్యనారాయణ మమత శ్రవణ్‌ కిషోర్‌ *రాఘవేందర్‌ రవి భాష్వంత్‌ మధు జయంతిసాధన మధుకర్‌ పుష్కరిణి బలరామ్‌ *సాయికృష్ణ


సంస్కరణలే లక్ష్యం
ఎంత ఇచ్చినా తీసుకోవడానికి ఈ సమాజం సిద్ధంగా ఉంటుంది. సమాజ హితం కోరేవాళ్లు జనాలకు ఇవ్వడం కాదు వాళ్లకో ఉత్ప్రేరకంగా పని చేయాలి. ప్రభుత్వంతో పని చేయించుకునేలా తయారు చేయాలి. కట్టిన పన్నులకు తగ్గట్టుగా పని చేయించుకోవాలి. ఈ పరిస్థితి రావాలంటే అవినీతి అంతమవ్వాలి. రాజకీయ సంస్కరణలు రావాలి. అవినీతి అంతానికి బలమైన లోక్‌పాల్‌, లోకాయుక్త. రాజకీయ సంస్కరణలకు దామాషా విధాన పద్ధతి. పార్టీలు ముందే అభ్యర్థుల్ని ప్రకటించాలి. జనం తమ ఓటుని వ్యక్తులకు కాకుండా పార్టీలకు వేయాలి. దీని వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీలు మంచి అభ్యర్థులనే ఎంచుకుంటాయి. పార్టీల్లోనూ అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలి. కార్యకర్తలే అభ్యర్థుల్ని ఎన్నుకోవాలి. ఈ సంస్కరణల కోసమే మా పోరాటం.
- నరసింహారావు, వ్యవస్థాపకుడు: యూత్‌ ఫర్‌ బెటర్‌ ఇండియా

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు