పాత బంగారులోకం (Eenadu Sunday Magazine 25/03/2012)
పాతకార్లూ పాతబైకులూ పాత ఎలక్ట్రానిక్ గృహోపకరణాలూ పాత సెల్‌ఫోన్లూ పాత లాప్‌టాప్‌లూ... ఒకరు వద్దనుకున్న వస్తువులను మరొకరు అపురూపంగా కళ్లకద్దుకుంటారు. ఇక్కడ పాత రోత కానేకాదు. వేలకోట్ల వ్యాపారం!మనసు కారుకొనమని వూరిస్తుంది. పరిస్థితి ఆటోలోనే వెళ్లమని ఆర్డరేస్తుంది. కోరిక ఐఫోన్ కావాలంటుంది. పర్సు అయ్యబాబోయ్ అని వాపోతుంది. శ్రీమతి సరికొత్త ఫ్రిజ్ మీద మనసు పారేసుకుంటుంది. నెలసరి వాయిదాలతో శ్రీవారి బుర్ర వేడెక్కిపోతుంది. అబ్బాయికి బైక్. అమ్మాయికి లాప్‌టాప్. కుటుంబానికంతా ఓ ఎల్‌సీడీ టీవీ. అర్జెంటుగా కావాలి. అవసరాలు అనంతాలు. కోరికలు అనంతానంతాలు. మధ్యమధ్యలో విలాసాల వూరింపులు. పాపం! మధ్యతరగతి మనిషి ఎలా నెగ్గుకొస్తాడో, ఎప్పుడు ఒడ్డున పడతాడో. ఇదీ నేపథ్యం. ఇప్పుడేం చేద్దాం! 'టు పర్చేజ్ ఆర్ నాట్ టు...' అని గిరీశంలా ఏకపాత్రాభినయం వేసుకోవాలా? 'ఏమీసేతురా లింగా...' అంటూ గోసాముల్లా తత్వం పాడుకోవాలా? పరిస్థితులతో రాజీపడాలా? కోరికలకు ఎగనామం పెట్టాలా? మధ్యేమార్గం... 'త్రిశంకు మార్కు' పరిష్కారం. సరికొత్త వస్తువును కొనలేనప్పుడు, కాస్త నాణ్యమైన పాత సరుకునే ఎంచుకోవచ్చుగా. రాజా లాంటి తాజా వెర్షన్ కుదరనప్పుడు... మాజీ తాజా మోడల్నే దర్జాగా వాడుకోవచ్చుగా! మనకు అవసరమైనది... మరొకరికి అనవసరమై ఉండవచ్చు. మనకు అనవసరమైనది... ఇంకొకరికి అవసరమై ఉండవచ్చు. ఈ చిన్నసూత్రం ఆధారంగా ఓ పెద్ద వ్యాపారమే పుట్టుకొచ్చింది. పాతవస్తువుల మార్కెట్ విలువ అక్షరాలా అరవైవేల కోట్ల రూపాయలని అంచనా! అదీ ఆటోమొబైల్ రంగాన్ని మినహాయించి! కార్ల నుంచి బైకుల దాకా, పుస్తకాల నుంచి ఫర్నిచర్ దాకా, లాప్‌టాప్‌ల నుంచి సెల్‌ఫోన్ల దాకా... దేశవ్యాప్తంగా పాతవస్తువుల అమ్మకాలు జోరందుకుంటున్నాయి. ఫుట్‌పాత్‌లనూ డబ్బాకొట్లనూ దాటేసుకుని... ఓ వ్యవస్థీకృత వ్యాపారమే ప్రాణంపోసుకుంది. పాతకు జాతరంటే ఇదే! ఒక్కసారి గతాన్ని వూహించుకోండి. కొనుగోలుదారుడి మనస్తత్వాన్ని గుర్తుచేసుకోండి. ఏ వస్తువు కొన్నా, మన్నిక కోరుకునేవాడు. 'లైఫ్‌లాంగ్ గ్యారెంటీ' ఆశించేవాడు. డొక్కుడొక్కుగా మారినా, తుక్కుతుక్కయిపోయినా వదిలిపెట్టేవాడు కాదు. భేతాళుడిని భుజానికేసుకుని బయల్దేరిన విక్రమార్కుడిలా... రిపేరు షాపుల చుట్టూ ప్రదక్షిణలు చేసేవాడు. అక్కడ కుదర్దంటే మరో దుకాణానికి. అక్కడా చేతులెత్తేస్తే... జాగ్రత్తగా అటకమీదికి. షోరూమ్‌లో తాజాతాజా సరుకు ప్రవేశించగానే..అప్పటిదాకా రాజ్యమేలిన మోడల్‌ను వదిలించుకునేవారు ఒకటోరకం. సంపన్న వర్గం, ఎగువ మధ్యతరగతి... ఈ జాబితాలోకి వస్తుంది. రానురానూ వీరి బలం పెరుగుతోంది. ఐటీ ఉద్యోగులూ సేవారంగ నిపుణులూ వ్యాపారవేత్తలూ వారి కుటుంబసభ్యులూ ఆ జాబితాలోకే వస్తారు. అలా అని, వీళ్ల ఖాతాల నిండా డబ్బేం మూలగడం లేదు. అప్పులిచ్చే బ్యాంకులూ వాయిదా పద్ధతిలో వసూలు చేసే రిటైల్ సంస్థలూ క్రెడిట్‌కార్డులూ ఎక్స్ఛేంజ్ ఆఫర్లూ... వస్తు వ్యామోహాన్ని రెచ్చగొడుతున్నాయి. 'సరికొత్త...' మోజు చాలానే ఉన్నా... ఆర్థిక పరిస్థితుల కారణంగా కాస్త రాజీపడిపోయి మాజీ తాజా ఉత్పత్తులతో సరిపుచ్చుకునేవారు రెండోరకం. సంపన్నుల్లా కనిపించాలనుకునే ఎగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతిలా ఫోజుకొట్టే మధ్యతరగతి, మధ్యతరగతిలా ఫీలైపోయే దిగువ మధ్యతరగతి... ఈ జాబితాలోకి వస్తాయి. కార్లూ బైకులూ అపార్ట్‌మెంట్ల విషయంలో ఈ రాజీ బాగా ఎక్కువ. రెండూ కాకుండా మరో వర్గమూ ఉంది. వీళ్లు పాతకొత్తలకు అతీతులు. పక్కా వాస్తవికవాదులు. అవసరం తీరిందా లేదా, మన్నిక ఉందా లేదా, ఎంతోకొంత తక్కువ ధరకు వస్తోందా లేదా?... అన్నదే ముఖ్యం. ఈ బృందంలో సంపన్నులు ఉన్నారు, సామాన్యులూ ఉన్నారు. మొత్తంగా మూడువర్గాలూ కలిసి పాత వస్తువుల మార్కెట్‌కు కొత్తకళ తీసుకొచ్చాయి. మనకు కనిపించని కోణమూ ఒకటుంది. అది నాణ్యత! గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు... దేన్ని తీసుకున్నా గతంతో పోలిస్తే, నాణ్యతలో గణనీయమైన తేడా కనిపిస్తోంది. ఉత్పత్తుల జీవన ప్రమాణం భారీగా పడిపోయింది. ఆ కారణంగా కూడా వినియోగదారుడు వీలైనంత తొందరగా వదిలించుకోడానికి ఇష్టపడుతున్నాడు. నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్త్లెడ్ ఎకనమిక్ రిసెర్చ్ కూడా ఈ విషయాన్ని నిర్ధరించింది. గతంలో మనిషికీ మనిషికీ మధ్యే కాదు, మనిషికీ-వస్తువుకూ మధ్య కూడా అనుబంధం ఉండేది. అచ్చొచ్చిన వాహనాన్నీ శుభాన్నిచ్చిన గృహాన్నీ అమ్ముకోకూడదన్న బలమైన నమ్మకం ఉండేది. ఇప్పుడలాంటి సెంటిమెంట్లు గాలికెగిరిపోతున్నాయి. బదిలీలూ వలసలూ అనివార్యమైన ప్రస్తుత పరిస్థితుల్లో (మరో నగరానికి కావచ్చు, మరో దేశానికీ కావచ్చు)... చాలా ముఖ్యమనిపించిన సామాన్లు మినహా ఫర్నిచర్ అంతా అమ్మేసుకుని విమానం ఎక్కేస్తున్నారు. అపార్ట్‌మెంట్ సంస్కృతి వచ్చాక... 'స్పేస్ మేనేజ్‌మెంట్' పెద్ద సమస్యగా మారిపోయింది. వాడకం తగ్గగానే ఏ వస్తువునైనా పక్కన పడేయాల్సిందే. తయారీ సంస్థలు కూడా... ఏటా తమ ఉత్పత్తులను నవీకరిస్తున్నాయి. మరింత సమర్ధంగా, మరింత వేగంగా పనిచేసే రకాలను రూపొందిస్తున్నాయి. 'స్లిమ్' మోడల్స్‌ను రంగంలోకి దించుతున్నాయి. 'ఎక్స్ఛేంజ్ ఆఫర్ల'తో మార్పిడిని ప్రోత్సహిస్తున్నాయి. ఆ సరుకంతా నేరుగా పాతవస్తువుల మార్కెట్‌కు చేరుతోంది. ఆ పాతబంగారులోకాన్ని ఓసారి సందర్శించి వద్దాం రండి.. పాతిల్లు బంగారంకానూ! ఏ దినపత్రిక క్లాసిఫైడ్ ప్రకటనలు చూసినా... కొత్తిళ్ల కళకళకంటే, పాతఫ్లాట్ల సందడే ఎక్కువ. సరికొత్త భవంతికున్న ఆకర్షణ లేకపోవచ్చు. ఆధునిక సౌకర్యాలు కాస్త తక్కువే కావచ్చు. ఫ్లోరింగ్ మెరుపు తగ్గిపోయి ఉండవచ్చు. గోడకేసిన రంగులు పాతబడి ఉండవచ్చు. కానీ పాతింటి ప్రత్యేకతలు పాతింటికున్నాయి. ఇన్నేళ్లుగా అక్కడో కుటుంబం ఉంటోందంటే, నివాసయోగ్యమైన ప్రాంతమని నిర్ధరణ అయినట్టే. నీటికొరత, పారిశ్రామిక కాలుష్యం, న్యాయపరమైన చికాకులు... ఉంటే గింటే, అప్పటికే బయటపడి ఉంటాయి. సరికొత్త ఫ్లాట్ కొనడమంటే, పునాదుల దశలో అడ్వాన్సు సమర్పించుకోవడమే! ప్లాను కాగితాల్ని చూసి రూపురేఖలు వూహించుకోవాలి. తాళాలు చేతికొచ్చేనాటికి అచ్చంగా అలానే ఉండవచ్చు, ఉండకపోనూవచ్చు. ఇక్కడలా కాదు, కళ్లముందు కనబడుతూ ఉంటుంది. వెంటనే గృహప్రవేశం చేసేయవచ్చు. బిల్డరు తాళాలు ఇచ్చేదాకా ఎదురుచూడాల్సిన అవసరంలేదు. ప్రీ-ఈఎమ్‌ఐలు చెల్లిస్తూ... జేబుకు చిల్లులు వేసుకోవాల్సిన పన్లేదు. మరీ అత్యాధునిక సౌకర్యాలు ఉండవు కాబట్టి, నెలవారీ మెయింటెనెన్స్ కూడా ఎక్కువేం ఉండదు. ధర విషయానికొస్తే... సరికొత్త ఫ్లాట్లతో పోలిస్తే... కనీసం ఇరవై నుంచి ఇరవై అయిదు శాతం తక్కువ! అమ్మేవారి అవసరాన్ని బట్టి గీచిగీచి బేరమాడుకోవచ్చు. ఎక్కడో వూరవతలికి వెళ్లి కొత్త ఫ్లాటు కొనేకంటే నిర్వహణ విషయంలో, నాణ్యత విషయంలో సంతృప్తికరంగా అనిపించిన పాత ఫ్లాటే ఉత్తమమని భావించేవారు చాలామందే ఉన్నారు. పాత భవనాలకు వీళ్లే మహరాజపోషకులు. పాత ఫ్లాట్ల సరఫరా పెరగడానికీ చాలా కారణాలు. వృత్తి ఉద్యోగాల తొలిదశలో చిన్న గూడుంటే చాలనుకునేవారు చాలామందే ఉంటారు. స్థోమత పెరిగేకొద్దీ, కుటుంబం పెద్దదయ్యేకొద్దీ ఇల్లు ఇరుకనిపిస్తుంది. దాన్ని అమ్మేసి, మరింత విశాలమైన ఆవరణలోకి వెళ్లాలనుకుంటారు. బ్యాంకులు ఇస్తున్నాయి కదా అని... స్థోమతకు మించి అప్పుచేసి, ఆతర్వాత వాయిదాలు చెల్లించలేక చేతులెత్తేసేవారూ లేకపోలేదు. ఆ ఆస్తులను బ్యాంకులు వేలం వేసుకుంటున్నాయి. అలాంటి ఫ్లాట్ల సంఖ్య తక్కువేంకాదు. అధిక వడ్డీరేట్ల కారణంగా... గతంలో పాతిక లక్షలు అప్పు ఇవ్వడానికి ముందుకొచ్చిన బ్యాంకులు ప్రస్తుత రేట్లలో ఏ ఇరవై మూడు లక్షల దగ్గరో ఆగిపోతున్నాయి. దీంతో కనాకష్టంగా కొత్తిల్లు కొనేవారు ఓ అడుగు వెనకేసి, ఉన్నంతలోనే కాస్త నాణ్యమైన పాతింటివైపు మొగ్గుచూపుతున్నారు. పాతబండి జోరు... కొత్తకార్ల మార్కెట్ విలువ: రూ.1,00,000 కోట్లు. పాతకార్ల మార్కెట్ విలువ: రూ.60,000 కోట్లు. ఎంత ఖరీదైన కారైనా, ఎంత కండిషన్‌లో ఉన్నా, ఎంత బాగా నచ్చినా... దాదాపు ఎనభైశాతం మంది యజమానులు మూడేళ్లకు మించి వాడాలనుకోవడం లేదు. ముప్ఫైవేల కిలోమీటర్లు దాటగానే... మరో ఆలోచన లేకుండా బండి మార్చేస్తున్నారు. ఈ ధోరణిని అర్థంచేసుకున్న తయారీ సంస్థలు సొంతంగా పాతకార్ల దుకాణాలు తెరుస్తున్నాయి. మారుతీ 'ట్రూ వాల్యూ', హ్యూందాయ్ 'అడ్వాంటేజ్', హోండా 'ఆటో టెర్రస్'... ఇందుకు ఉదాహరణ. బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్‌లాంటి మహాబ్రాండ్లు కూడా ఈ వ్యాపారంలోకి వచ్చేశాయి. ఇలాంటి చోట్ల కొనడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అప్పులివ్వడానికి బ్యాంకులూ ఫైనాన్స్ సంస్థలూ సిద్ధంగా ఉంటాయి. నాణ్యత విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. గ్యారెంటీ ఉంటుంది. ధరలు మాత్రం కాస్త ఎక్కువే. కాబట్టే, పాతకార్ల మార్కెట్‌లో వీటి వాటా పదిహేనుశాతానికి మించడం లేదు. కొత్త మోడల్.. 'ఇదిగో ఈ టీవీ మీఅమ్మ పుట్టింటివాళ్లు ఇచ్చింది', 'ఈ మిక్సీ నువ్వు పుట్టినప్పుడు కొన్నాం'... ...అని గొప్పగా చెప్పుకుని మురిసిపోయేవారూ బాగా తగ్గిపోతున్నారు. వినాల్సిన పిల్లలూ మొహం తిప్పుకుంటున్నారు. నాలుగైదేళ్లకు మించి ఎవరూ గృహోపకరణాల్ని వాడటం లేదు. నిజానికి, అంతకంటే చాలాముందే అవి పాతవస్తువుల మార్కెట్‌కు వెళ్లిపోతున్నాయి. గృహోపకరణాల మార్కెట్ విలువ నలభైవేల కోట్లనుకుంటే, వాడిన వస్తువుల మార్కెట్ 500 కోట్ల నుంచి 700 కోట్ల దాకా ఉంటుందని అంచనా. వీటికంటూ ఓ శాశ్వతమైన మార్కెట్ లేకపోవడంతో... ఓ మోస్తరు పట్టణాల్లో సంతలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. హైదరాబాద్‌లోని పాతబస్తీలో ప్రత్యేకమైన మార్కెట్ ఉంది. ఆన్‌లైన్ క్లాసిఫైడ్ సైట్లు కూడా క్రయవిక్రయాలకు వేదికలుగా నిలుస్తున్నాయి. బ్రాండెడ్ గృహోపకరణాల మార్కెట్‌లో 'ఎక్స్ఛేంజ్ ఆఫర్లు' హోరెత్తుతున్నాయి. మరింత పెద్ద టీవీ, మరిన్ని సేవలు అందించే వాషింగ్‌మెషీన్, మరింత నాణ్యమైన మిక్సీ, మరింత విశాలమైన రిఫ్రిజిరేటర్... ఎవర్ని మాత్రం వూరించకుండా ఉంటాయి? పాత సరుకు ఇచ్చుకో. కొత్త సరుకు పుచ్చుకో. మిగిలింది వాయిదాల్లో కట్టుకో. సున్నా శాతం వడ్డీ! నిక్షేపంగా పనిచేస్తున్న వస్తువుల్ని కూడా నామమాత్రపు ధరకు అమ్మేస్తున్నారు. ఆ సరుకంతా నేరుగా సెకెండ్‌హ్యాండ్ ఉత్పత్తుల డీలర్ల ద్వారా పాతసామాన్ల మార్కెట్‌కు తరలిపోతోంది. ఈ విభాగంలో రిఫ్రిజిరేటర్లకూ వాషింగ్‌మెషీన్లకూ మంచి గిరాకీ ఉంది. దిగువ మధ్యతరగతి ప్రజలు... వీటి కొనుగోలుదారులు. 'సెల్' మోహనరంగా! మొబైల్‌ఫోన్లకు సంబంధించి, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మార్కెట్ మనది. పాత ఫోన్ల విషయలోనూ అంతే ముందున్నాం. హైదరాబాద్‌లోని జగదీష్ మార్కెట్‌లాంటి చోట్ల... పాత సెల్‌ఫోన్లు విక్రయించే దుకాణాలు నిత్యం కస్టమర్లతో కళకళలాడుతూ ఉంటాయి. కొన్నయితే, అచ్చంగా కొత్తపీసులే! సరికొత్త మోడల్ రాగానే... మరో ఆలోచన లేకుండా సొంతం చేసుకునే వినియోగదారులకు కొదవే లేదు. యువతే కాదు, ఆ జాబితాలో అన్ని వర్గాలూ ఉన్నాయి. సెల్‌ఫోన్ విద్యార్థులకు ఫ్యాషన్ సింబల్ అయితే, వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి స్టేటస్ సింబల్! ఆ పరుగులో వెనకబడాలని ఎవరూ అనుకోవడం లేదు. మొత్తంగా సెల్‌ఫోన్ల మార్కెట్ విలువ 35 వేల కోట్లయితే, అందులో పాతసెల్‌ఫోన్ల మార్కెట్ 5 వేల కోట్లకుపైగా ఉంటుంది. ఆన్‌లైన్ క్లాసిఫైడ్ వెబ్‌సైట్లలో వచ్చే ప్రకటనల్లో 25 శాతం పాత సెల్‌ఫోన్లకు సంబంధించినవే. కంప్యూటర్లూ లాప్‌టాప్‌లూ కూడా బాగానే అమ్ముడుపోతున్నాయి. వీటి సెకెండ్-హ్యాండ్ విలువ రెండువందల కోట్లు ఉంటుందని అంచనా. పిల్లల కోసం కంప్యూటర్లూ లాప్‌టాప్‌లూ కొంటున్నవారిలో సగంమంది పాతవాటినే ఇష్టపడుతున్నారు. 'టెక్నాలజీ రోజురోజుకూ మారిపోతోంది. కొత్తకొత్త ఫీచర్స్ వచ్చిచేరుతున్నాయి. అలాంటప్పుడు అంత డబ్బు పోసి బ్రాండ్‌న్యూ కొనడంలో అర్థంలేదనిపిస్తోంది' అంటారు ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాజేంద్రప్రసాద్. పుస్తక బజార్... మంచి పుస్తకం బంగారం లాంటిది. పాతబడినా విలువ తగ్గదు. నలిగిపోయినకొద్దీ గిరాకీ ఎక్కువవుతుంది. దేశంలో పుస్తకాల మార్కెట్ విలువ ఐదువందల కోట్లని అంచనా. అందులో పది నుంచి పదిహేనుశాతం పుస్తకాలు నెల నుంచి ఏడాది కాలంలో పాత పుస్తకాల మార్కెట్‌కు వచ్చేస్తాయి. వాటి విలువ 50 నుంచి 70 కోట్ల దాకా ఉంటుంది. పాఠ్యపుస్తకాల మార్కెట్ కూడా పెద్దదే. ఢిల్లీలోని నయీసరక్, హైదరాబాద్‌లోని కోఠి ప్రాంతాలు పాత పుస్తకాల మార్కెట్‌కు ప్రధాన కేంద్రాలు. ఆదివారాలు ఫుట్‌పాత్‌ల మీద దర్శనమిచ్చే పుస్తకాల విలువా తక్కువేం కాదు. ఆన్‌లైన్‌లో secondhandbooksindia.comవంటి వెబ్‌సైట్లూ సేవలందిస్తున్నాయి. రెండువందల పుస్తకాలతో మొదలైన ఈ వెబ్‌సైట్‌లో ప్రస్తుతం ఆరువేలకుపైగా గ్రంథాలు అమ్మకానికున్నాయి. సాధారణ పుస్తకాల దుకాణంలో ఉన్నట్టే... పాత పుస్తకాల మార్కెట్‌లోనూ వ్యక్తిత్వ వికాస సాహిత్యానిదే హవా! ఎంత గిరాకీ ఉన్నా... పాత వస్తువుల మార్కెట్ మనదేశంలో అంతగా వ్యవస్థీకృతం కాలేదు. అక్కడక్కడా ప్రత్యేకమైన కూడళ్లు ఉన్నా... విశ్వసనీయత తక్కువ. ఈ పరిస్థితుల్లో క్లాసిఫైడ్ వెబ్‌సైట్లకు ప్రాధాన్యం పెరుగుతోంది. క్వికర్, ఓఎల్‌ఎక్స్, సులేఖ... వంటివి క్రయవిక్రయదారులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఇంటర్నెట్ వాడకం దారుల సంఖ్య గణనీయంగా పెరగడం, చెల్లింపు సౌలభ్యం, పారదర్శకమైన నిబంధనలు ఇందుకు కారణమంటున్నారు విశ్లేషకులు. కానీ మార్కెట్‌లో కొన్ని పాతవస్తువులకు సంబంధించి సరఫరా-గిరాకీ మధ్య చాలా తేడా ఉంటోంది. ముఖ్యంగా ఎల్‌సీడీ టీవీలూ, ఎంపీత్రీ ప్లేయర్లూ చాలా అరుదుగా అమ్మకానికొస్తున్నాయి. ఏసీలూ రిఫ్రిజిరేటర్ల సరఫరా కూడా తక్కువే. పాత కంప్యూటర్లయితే గుట్టలుగా పేరుకుపోతున్నాయి. చాలా కార్పొరేట్ కంపెనీలు టెక్నాలజీని 'అప్‌గ్రేడ్' చేసిన ప్రతిసారీ పాతసరుకును అమ్మేస్తున్నాయి. దీంతో సరఫరా పెరిగిపోతోంది. ఇక, పిల్లల ఆటవస్తువులూ మ్యూజిక్ సీడీలూ అరుదైన సేకరణలూ ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెడుతున్నవారు కూడా చాలామందే ఉన్నారు. ఈ-బే లిస్టింగ్స్‌లో వీటివాటా పాతిక శాతానికి పైమాటే. ఇలా పాతసరుకునంతా తీసుకొచ్చి మార్కెట్‌లో పోగేయడం వల్ల ఇ-కాలుష్యం ఎక్కువైపోతోందని పర్యావరణ ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, అనుమానించాల్సిందే. ధర చాలా తక్కువ? అయినా, అనుమానించాల్సిందే! 'నెగెటివ్ థింకింగ్' ఎక్కడా పనికిరాదు, ఒక్క 'సెకెండ్-హ్యాండ్' మార్కెట్‌లో తప్ప!
|
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి