పోలింగ్‌బూత్‌కు బయల్దేరే ముందు రాముణ్ని తలుచుకుంటే, ఎలాంటి నాయకుడికి ఓటేయాలో స్పష్టమైపోతుంది. వృత్తి ఉద్యోగ ధర్మాల విషయంలో డోలాయమానంలో ఉన్నప్పుడు రామాయణాన్ని నెమరేసుకుంటే, చక్కని పరిష్కారం కళ్లముందు కనిపిస్తుంది. టీనేజీ కుర్రకారుకు రామకథ సీడీ బహుమతిగా ఇస్తే, పెద్దల్ని ఎందుకు గౌరవించాలో ధర్మాన్ని ఎలా ఆచరించాలో ఎవరోవచ్చి చెప్పాల్సిన అవసరమే ఉండదు. ఆలూమగల అనురాగానికి సంబంధించి రామాయణం ఓ దాంపత్యవాచకం! సమకాలీన సమాజం ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యలకూ సంక్షోభాలకూ రామకథలో పరిష్కారం ఉంది. రామమార్గంలో సమాధానం ఉంది.
సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణిస్తే అది ఉత్తరాయణమైంది. దక్షిణం వైపు ప్రయాణిస్తే అది దక్షిణాయనమైంది. అయోధ్యలో మొదలై, మళ్లీ అయోధ్యకు తిరిగొచ్చి జనరంజకంగా పాలించేదాకా... శ్రీరాముడు సాగించిన విలువలయాత్రే రామాయణమైంది. రామకథ వింటే మనసు ఉప్పొంగుతుంది. రాముడిని తలుచుకుంటే తనువు పులకిస్తుంది. ఉత్తరాలైనా రాతకోతలైనా 'శ్రీరామ' నామంతోనే. బిడ్డకు లాలపోస్తూ 'శ్రీరామరక్ష' అనుకుంటే, అమ్మకెంత నిశ్చింత! పల్లెపల్లెకో రామాలయం. ఇంటింటికో రామ్, రామారావు, రామిరెడ్డి, రామయ్య! తరాలనాటి పాలకుడిని ఇంకా గుర్తుంచుకున్నామంటే, గుండెల్లో గుడికట్టుకుని పూజిస్తున్నామంటే... అందుకు కారణం శ్రీరాముడి సుగుణాలే, వ్యక్తిత్వసంపదే.త్రేతాయుగం కావచ్చు, కలియుగం కావచ్చు. అయోధ్య కావచ్చు, ఆంధ్రదేశం కావచ్చు. ఏ యుగంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా ధర్మం ధర్మమే. ధర్మస్వరూపుడైన రాముడు రాముడే! నాయకుడంటే, దారిచూపేవాడు. రామ - ది లీడర్!
సుప్రజారాముడు...
దేశం ఎదుర్కొంటున్న అతితీవ్ర సమస్య... నిరుద్యోగమో, పేదరికమో కాదు-నాయకత్వ కొరత! మనకిప్పుడు రాముడిలాంటి నాయకుడు కావాలి. దశరథ మహారాజుకు పెద్దకొడుకుగా పుట్టడమే ఆయనకున్న ఏకైక అర్హత కాదు. ఆ ఒక్క కారణంతోనే సార్వభౌముడు కాలేదు. బాల్యం నుంచే సకలగుణాభిరాముడిగా పేరుతెచ్చుకున్నాడు. ప్రజల్ని ప్రేమించాడు. సేవకుల్ని ఆదరించాడు. శత్రువుల్ని తుదముట్టించాడు. గురువులంటే భక్తి. పెద్దలంటే గౌరవం. ఆ వినయాన్ని చూసి రుషులు సంతోషించారు. పౌరులు మెచ్చుకున్నారు. కాబట్టే, నిండుసభ ఏకగ్రీవంగా దశరథుడి ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. శ్రీరామ పట్టాభిషేకానికి మద్దతు పలికింది.
బలవాన్ (బలవంతుడు), ధృతిమాన్ (ధైర్యవంతుడు), స్త్థెర్యవాన్ (నిలకడ ఉన్నవాడు)... అంటూ రాముడి గుణగణాల్ని వర్ణిస్తాడు వాల్మీకి మహర్షి. నాలసః... సోమరితనం లేనివాడు, నిస్తంద్రీ... అలసట తెలియనివాడు, అప్రమత్తః... ఏమరుపాటు లేనివాడు, జితక్రోధః... క్రోధాన్ని జయించినవాడు అని మనసారా కీర్తిస్తాడు. ఇవన్నీ ప్రజానాయకుడికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలు. బలహీనుడు మంచి పాలకుడు కాలేడు. పిరికివాడు ఎంతగొప్ప మేధావి అయినా ఏం ప్రయోజనం? అపారమైన ధైర్యం ఉన్నా, అద్భుతమైన తెలివితేటలుఉన్నా... నిలకడలేని వ్యక్తి సరైన నిర్ణయాలు తీసుకోలేడు. అప్రమత్తత కరవైన నాయకుడు వైరిపక్షాల వలలో ఇట్టే చిక్కుకుపోతాడు. క్రోధాన్ని జయించలేనివాడు కొంపలు ముంచేయగలడు.
ఎక్కడున్నా, ఏం చేస్తున్నా రాముడి ఆలోచనలన్నీ ప్రజల చుట్టే - రామో రాజ్యముపాసిత్వా! ఆయన దృష్టిలో పాలన ఒక ఉపాసన. నేటి పాలకుల్లా సొంత వ్యాపారాల్లేవు. బినామీ వ్యవహారాల్లేవు. 'మహర్షి కల్పేన'...రుషులు తపస్సుచేసినంత ఏకాగ్రచిత్తంతో రాముడు పరిపాలన సాగించాడు. అంత నిస్వార్థంగా పాలించాడు కాబట్టే... రామరాజ్యంలో కరవుల్లేవు, కష్టాల్లేవు, శాంతిభద్రతల సమస్యల్లేవు. ప్రజలకు తమ నాయకుడంటే ఎంత గౌరవమంటే, ఒకరికొకరు అభివాదం చేసుకుంటున్నప్పుడు 'శ్రీరామ... శ్రీరామ' అనేవారట. రాముడు అడవులకెళ్తుంటే, అయోధ్య అయోధ్యంతా ఆయన వెనకాలే నడిచింది. రాముడే అడ్డు చెప్పకపోతే ఆ మహానగరం వల్లకాడైపోయేది. అదే జరిగితే, రామయ్య తట్టుకోగలడా? ఆ ప్రయత్నం మానుకోమని కోరాడు. వెనక్కి వెళ్లిపోయి పిల్లాపాపలతో సుఖంగా ఉండమన్నాడు. భరతుడికి సహకరించమని ఆదేశించాడు.మన నాయకులు... పదవిని సొంతం చేసుకోడానికి ఎన్ని తిప్పలుపడతారో, ఆ పదవిని కాపాడుకోడానికి అంతకంటే ఎక్కువ కష్టపడతారు. నానాగడ్డీ కరుస్తారు. నానాదార్లూ తొక్కుతారు. రాముడికెప్పుడూ పదవీ వ్యామోహం లేదు. తండ్రి అడవులకెళ్లమని ఆదేశించగానే... కారణమైనా అడక్కుండా బయల్దేరాడు. 'తల్లీ! పితృవాక్యం కంటే నాకు రాజ్యం ఎక్కువకాదు' అని కైకేయికి స్పష్టం చేశారు. రావణసంహారం తర్వాత అయోధ్యకు తిరిగి వస్తున్నప్పుడు కూడా తన దూత హనుమంతుడికి ఓ సూచన చేస్తాడు... 'మారుతీ! వెంటనే వెళ్లి, నేను రావణుడిని సంహరించిన విషయం భరతుడికి చెప్పు. సీతా సమేతంగా తిరిగొస్తున్న సంగతీ చెప్పు. నీ మాటలు వింటున్నప్పుడు భరతుడి ముఖకవళికల్లో వచ్చే మార్పును జాగ్రత్తగా గమనించు. కించిత్ బాధ కనిపించినా, నేను అయోధ్యకు వెళ్లను. ఏమో, తనకే ఈ రాజ్యం దక్కాలన్న కోరిక భరతుడికి ఉందేమో. తనని ఇబ్బందిపెట్టడం నాకిష్టంలేదు' అంటాడు.
రామో ద్విర్నాభిభాషతే... రాముడు ముందొకటీ వెనకొకటీ మాట్లాడడు. ఒకటి చెప్పి, మరొకటి చేయడు. అతనికి రెండు గొంతుకల్లేవు. ఒకే మాట. ఒకటే బాణం. శ్రీరాముడికి మాతృభూమి మీద అపారమైన ప్రేమ. అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు 'అయోధ్య నగరమా! సెలవు. వనవాసం తర్వాత మళ్లీ నీ దర్శనం చేసుకుంటాను' అని నమస్కరించి వెళ్లాడు. తిరిగివస్తున్నప్పుడు కూడా ఆ మట్టికి ప్రణామాలు చేశాకే... నగరంలో కాలుమోపాడు. సకల సౌభాగ్యాలతో తులతూగుతున్న లంకాపురిని పాలించే అవకాశం వచ్చినా 'జననీ జన్మభూమిశ్చ...' అంటూ సున్నితంగా తిరస్కరించాడు. నా అయోధ్యే నాకు గొప్పని చెప్పాడు. మన పాలకులూ ఉన్నారు... సంపాదన భారత్‌లో, ఆస్తులు దుబాయ్‌లో, పిల్లలు అమెరికాలో, బ్యాంకుఖాతాలు స్విట్జర్లాండ్‌లో!
ఎవరికి ఓటేయాలో, ఎవరికి ఓటేయకూడదో నిర్ణయించుకునే ముందు ఒక్కసారి రాముడిని తలుచుకుంటే చాలు... స్పష్టత వచ్చేస్తుంది. మనం నాయకులని భ్రమపడుతున్నవాళ్లు ఎంత మరుగుజ్జులో తేలిపోతుంది.
వికాస గురువు...
సీతను వెతుక్కుంటూ బయల్దేరినప్పుడు... రాముడు, వెనకాలే లక్ష్మణుడు. ఇద్దరంటే ఇద్దరే! లంకాపురిపై దండెత్తే సమయానికి... ఆ ఇద్దరికి తోడుగా విభీషణుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు, ఆంజనేయుడు మొదలైన యోధానుయోధులు. ఆ వెనకాలే వేలమంది వానరవీరులు. రాముడు ఎవర్నీ మాటలతో ప్రలోభపెట్టలేదు. గెలిపిస్తే, పదవులిస్తాననో అధికారం కట్టబెడతాననో వూరించలేదు. వ్యక్తిత్వ సంపదతో, ధర్మాచరణతో, ప్రేమగుణంతో అంతమందిని ఆకట్టుకున్నాడు.ఒక్కసారి రాముడిని చూసినవారు, ఒక్కసారి రాముడితో మాట్లాడినవారు... జీవితాంతం మరచిపోలేరు. ఆ దివ్యమోహన రూపం ఒక కారణం అయితే, ఆయన స్వభావం మరో కారణం. రాముడు స్మితపూర్వభాషి... ఏదైనా మాట్లాడటానికి ముందు చిరునవ్వు నవ్వేవాడట. పూర్వభాషి... తనే ముందుగా పలకరించేవాడట. మధురభాషి... చాలా మధురంగా మాట్లాడేవాడట! నిత్యం ప్రశాంతాత్మా... ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవాడట! న చానృతకథః... అబద్ధాలంటే తెలియనివాడు. నిభృతః... చాలా అణకువ కలవాడు. ఎదుటి వ్యక్తి అభిమానాన్ని పొందడానికి ఇంతకుమించిన అర్హతలేం ఉంటాయి? అందుకే, తొలి పరిచయంలోనే హనుమంతుడు వీరాభిమానిగా మారిపోయాడు. రావణుడి సోదరుడైన విభీషణుడు అన్ననూ ఆస్తులనూ వదులుకుని వచ్చి రాముడి పక్షాన నిలబడ్డాడు. సముద్ర ఇవ సింధుభిః..నదులన్నీ సముద్రంలో కలవాలని ఆశించినట్టే, సజ్జనులంతా శ్రీరామ సాంగత్యాన్ని కోరుకునేవారట. ఎంత మంచి పోలిక!
రాముడు సమదర్శి. విశ్వామిత్ర, వసిష్ఠాది రుషులతో ఎంత గౌరవంగా మాట్లాడాడో... గుహుడు, శబరి మొదలైన సామాన్యులతోనూ అంతే ప్రేమగా వ్యవహరించాడు. 'మమ్మల్ని కలుసుకోడానికి అంతదూరం నుంచి వచ్చావా మిత్రమా!' అంటూ గుహుడిని ఆలింగనం చేసుకున్నాడు. గిరిజన మహిళ శబరి మీదా అపారమైన ప్రేమ కురిపించాడు. 'ఆధ్యాత్మిక సాధన ఎలా సాగుతోందమ్మా' అని ప్రేమగా పలకరించాడు. భక్తితో ఆమె సమర్పించిన ఎంగిలి పళ్లను ఇష్టంగా తిన్నాడు.
అంతెందుకు, ఇప్పటిదాకా వేయికిపైగా రామాయణాలొచ్చాయి. ఆ మహాకావ్యాన్ని ఎన్నో భాషల్లోకి అనువదించారు. రామకథ అంటే కవులకు ఎందుకింత ప్రేమ... ముక్తికోసమో, భుక్తి కోసమో కాదు. నిజానికి రాముడెక్కడా తాను అవతార పురుషుడినని ప్రకటించుకోలేదు. 'దశరథ పుత్రుడిని... శ్రీరాముడిని' అని మాత్రమే చెప్పుకున్నాడు. కృష్ణుడిలా మహత్యాలు చూపలేదు. బుద్ధుడిలా సర్వస్వాన్నీ త్యజించలేదు. ప్రవక్తలా బోధనలు చేయలేదు. మనిషిగా బతికాడు. మనుషుల హృదయాల్లో దేవుడయ్యాడు! కంబోడియా, శ్రీలంక, చైనా, ఇండొనేసియా, థాయ్‌లాండ్, మలేసియా, నేపాల్... తదితర చాలా దేశాల్లో రామకథ ప్రచారంలో ఉంది. 'రాముడి వంటిగొప్ప కథానాయకుడు ఎక్కడ దొరుకుతాడు? ఇలాంటి వ్యక్తిత్వాల్ని చిత్రించినప్పుడే మాలాంటివారి జన్మ సార్థకం అవుతుంది' అంటారు 'అనర్ఘరాఘవ' కవి మురారి.
బంధాల రాముడు
కన్నవారిని పట్టించుకోని పిల్లలు.
భర్తను కడతేర్చిన భార్య.
భార్యను మోసం చేసిన భర్త.
అన్నను ముంచిన తమ్ముడు.
...దినపత్రికల శీర్షికలు చాలు, బంధాలెలా బీటలువారుతున్నాయో అర్థమైపోతుంది. వ్యవస్థకు కుటుంబం పునాది. కుటుంబానికి ప్రేమాభిమానాలు పునాది. ప్రస్తుత పరిస్థితుల్లో సీతాపతి మార్గమే... శ్రీరామరక్ష! తల్లి, తండ్రి, సోదరులు, జీవితభాగస్వామి, బంధువులు... ప్రతి బంధానికీ రాముడు చాలా ప్రాధాన్యం ఇచ్చాడు. మనసు తెలుసుకుని మసలుకున్నాడు. రాముడికి దశరథుడు అంటే అపారమైన గౌరవం. స్వయంవరంలో శివధనుస్సును ఎక్కుపెట్టిన తర్వాత కూడా, తండ్రి అనుమతి తీసుకున్నాకే సీతమెడలో వరమాల వేశాడు. అలా అని, సీతంటే ప్రేమ లేదని కాదు. ప్రాణేభ్యోపి గరీయసీ... 'నా ప్రాణంకన్నా ఎక్కువ' అని ప్రకటించాడు. తండ్రి అనుమతితో పెళ్లాడటం వల్ల ఆ ప్రేమ పదింతలు పెరిగిందని వాల్మీకి వ్యాఖ్యానిస్తాడు. తనకెన్ని పేర్లున్నా 'దాశరథీ...' అని పిలిస్తే రాముడికి మహదానందం. అమ్మ కౌసల్య అంటే అపారమైన అనురాగం. యాగసంరక్షణకు వెళ్లినప్పుడు, రాముణ్ని మేల్కొలపడానికి విశ్వామిత్రుడు ముందుగా తల్లిపేరే తలుస్తాడు 'కౌసల్యా సుప్రజారామా...'అంటూ! మిగిలిన ఇద్దరు అమ్మల్ని కూడా కన్నతల్లితో సమానంగా గౌరవించాడు. రాముడి వనవాసానికి కారణమైన కైకేయి మీద లక్ష్మణుడు పాములా బుసలుకొట్టాడు. భరతుడూ దుర్భాషలాడాడు. రాముడు మాత్రం పల్లెత్తు మాట కూడా అనలేదు. అరణ్యవాసం నుంచి తనను వెనక్కి తీసుకెళ్లాలని వచ్చిన భరతుడితో 'అమ్మ కైకేయిని జాగ్రత్తగా చూసుకో. తేడావస్తే... నా మీద ఒట్టే' అని గట్టిగా చెప్పాడు. సోదరుల విషయంలో 'తండ్రి తర్వాత తండ్రి'లా వ్యవహరించాడు. లక్ష్మణుడిని 'నువ్వు నా ఆత్మ' అని కొనియాడాడు. ఓ సందర్భంలో 'భరతశత్రుఘ్నులు నా ప్రాణంతో సమానం. వాళ్లను సోదరుల్లా, బిడ్డల్లా అభిమానించు' అని సీతకు చెప్పాడు. జీవితభాగస్వామి విషయంలో రాముడు చూపిన ప్రేమ, శ్రద్ధ... ఆలూమగల అనుబంధానికి నిర్వచనంలా నిలుస్తాయి. సీతంటే రాముడే, రాముడంటే సీతే!ధర్మమార్గం..
రామరావణులిద్దరూ విద్యావంతులే, బలవంతులే, అస్త్రశస్త్ర సంపన్నులే. రాముడివైపు విభీషణ హనుమంతాదులుంటే, రావణుడివైపు కుంభకర్ణుడూ ఇంద్రజిత్తూ తదితరులున్నారు.
రావణుడివైపు లేనిది...
రాముడివైపు ఉన్నది... ధర్మం!
'ధర్మం వెంబడే సంపద వస్తుంది. ధర్మం వెంబడే సుఖం వస్తుంది. ధర్మాన్ని ఆచరించేవాడు ప్రతీదీ పొందుతాడు. ప్రపంచానికి ధర్మమే పునాది' అంటాడు వాల్మీకి మహర్షి అరణ్యకాండలో. వృత్తివ్యాపార ఉద్యోగాలకూ ఈమాట వర్తిస్తుందనడానికి ఎన్నో ఉదాహరణలు. దొడ్డిదారి పెట్టుబడులే పునాదులుగా వెలిసిన వ్యాపార సంస్థల వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ధర్మాచరణకు దూరమైన ఉన్నతాధికారులూ నాయకులూ కటకటాల పాలు అవుతున్నారు.
...ఇది అధర్మమార్గం. రావణుడి దారి.
విలువల దారిలో, పారదర్శక విధానాలతో ఒక్కోమెట్టూ ఎక్కుతూ అంతర్జాతీయంగా విస్తరిస్తున్న సంస్థల్నీ చూస్తున్నాం. ఆ ఎదుగుదల సంస్థలకే పరిమితం కావడం లేదు. ఉద్యోగులకు మంచి జీతాలిస్తున్నాయి. వాటాదారులకు లాభాలు పంచుతున్నాయి. ఖాతాదారులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నాయి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో తాము సృష్టించిన సంపదను సమాజంతో పంచుకుంటున్నాయి.
...ఇది ధర్మమార్గం. రాముడిదారి.
ఎక్కడైనా సరే, అంతిమంగా గెలిచేది ధర్మమే.
అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు. లక్ష్యసాధనకు (రావణసంహారానికి) రాముడు అనుసరించిన ధర్మమార్గం ఆధునిక జీవితంలోనూ ఆచరణ సాధ్యమైందే. బృందాన్ని ఎంచుకోవడంలోనే శ్రీరామత్వం స్పష్టమైంది. హనుమంతుడు, సుగ్రీవుడు, విభీషణుడు, జాంబవంతుడు... అదో 'విలువల' టీమ్! ఆవైపున ఉన్నది... పరమ దుర్మార్గులు, ధర్మాధర్మ విచక్షణ తెలియని మూర్ఖులు, రాక్షసమాయలో ఆరితేరినవారు. అయినా సరే, రామబృందం ఎక్కడా నీతి తప్పలేదు. ధర్మాన్ని వదిలిపెట్టలేదు. సైనికశక్తిని అంచనా వేయడానికి మారువేషంలో వచ్చిన గూఢచారులను కూడా రాముడు సగౌరవంగా వెనక్కి పంపాడు. అంతిమ లక్ష్యాన్ని సాధించాక, లంకాధిపతిని సంహరించాక... ఇదంతా నా ఘనతే అని ఎక్కడా చెప్పుకోలేదు. 'సహచరుల సహకారంతో యుద్ధంలో గెలిచాను' అనే అన్నాడు. సర్వకాలసర్వావస్థల్లో వెన్నంటి నిలిచిన బృందాన్ని గౌరవించే పద్ధతి ఇదే.
రాముడి యుద్ధనీతి... వ్యాపార విషసంస్కృతులకు ఒక హెచ్చరిక. ఇంద్రజిత్తుతో పోరాడుతున్నప్పుడు లక్ష్మణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధపడతాడు. అదే జరిగితే అపార ప్రాణహాని తప్పదు. అందుకే శ్రీరాముడు 'ఒక వ్యక్తితో పోరాడటానికి... మిగిలినవారందర్నీ బలిచేయడం ధర్మం కాదు. పోరాడనివాణ్ని అసలు చంపకూడదు' అని వారిస్తాడు. ఒక కంపెనీ షేర్ విలువను కృతకంగా పెంచడానికో, మరో కంపెనీని పాతాళానికి లాగడానికో... అమాయకులైన మదుపర్ల పొట్టకొట్టే మార్కెట్ వ్యూహకర్తలకు ఇదో పాఠం.
'మీ విజయ రహస్యం ఏమిటి?' అనడిగారట విలేకరులు ఓ సంస్థ అధినేతను. 'పోటీ సంస్థలే. అవే లేకపోతే... నేనెంత వెనుకబడి ఉన్నానో తెలిసేది కాదుగా' అని చెప్పాడా వ్యాపారవేత్త. ఎంత గొప్పమాట! ఓ స్థాయికి చేరేసరికి చాలా సంస్థల్ని అహం కమ్మేస్తుంది. ఎదుటివారిలోని మంచినీ, పోటీ సంస్థ ఉత్పత్తిలోని నాణ్యతనూ గుర్తించడం మానేసి, రంధ్రాన్వేషణ ప్రారంభిస్తాయి. మంచి ఎక్కడున్నా ఏ కొంత ఉన్నా గుర్తించాలి, గౌరవించాలి. రాముడు ఎవర్నీ తూలనాడి ఎరుగడు. పరమశత్రువైన రావణుడి గురించి కూడా ఎప్పుడూ చెడు మాట్లాడలేదు. రావణాసురుడిని తొలిసారిగా చూసినప్పుడు 'అహో దీప్త మహాతేజా రావణో రాక్షసేశ్వరః' అంటూ అతని తేజస్సంపదను ప్రశంసించాడు. 'సీతాపహరణం చేయకపోయి ఉంటే, ఇతడు దేవలోకానికి కూడా రాజై ఉండేవాడు' అనుకున్నాడు. శత్రువును బేరీజు వేయడంలోనూ అంత నిజాయతీ!
రాముడు ధర్మాన్ని గెలిపించడానికి యుద్ధం చేశాడు, శత్రువును గెలవడానికి కాదు. లాభార్జనే వ్యాపార ప్రయోజనం. ఎవరూ కాదనలేరు. కానీ ఆ లాభం చెమటోడ్చి సంపాదించినదై ఉండాలి, జలగలా ఎవరి రక్తాన్నో పీల్చి కాదు. 'నేను తలుచుకుంటే ఈ భూమండలాన్ని మొత్తం జయించగలను. కానీ, అధర్మమార్గంలో దేవేంద్ర పదవి లభించినా కూడా స్వీకరించను. అలాంటి సామ్రాజ్యం విషం కలిపిన భోజనం లాంటిది' అని చెప్పాడు. ఈ మాట కార్పొరేట్ ప్రపంచానికీ వర్తిస్తుంది.ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ సదస్సులో మార్కెటింగ్‌గురు ఫిలిప్ కోట్లర్ ఆసక్తికరమైన వ్యాఖ్యానం చేశారు. 'అమెరికా వస్తువాదంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. చైనా వ్యాపారవాదంలో మునకలేస్తోంది. ఇక మిగిలింది భారతదేశం. ఆధ్యాత్మికతకూ వ్యాపారానికీ మధ్య సమతూకం పాటించే శక్తి భారత్‌కు ఉంది' అన్నారాయన. కోట్లర్ చెప్పిన ఆధ్యాత్మికతకు మూలం ధర్మం. ఆ ధర్మానికి ప్రతిరూపం శ్రీరాముడు.
రామో విగ్రహవాన్ ధర్మః |
సీతమ్మ మాయమ్మరాముడు ధర్మాన్ని గౌరవించాడు.
సీత రాముడిని గౌరవించింది.
అతను ధర్మమూర్తి. ఆమె ప్రేమమూర్తి.
వాల్మీకి మలిచిన సీతమ్మ... సద్గుణరాశి, ధైర్యవంతురాలు. ధర్మాధర్మాల గురించి రాముడితో చర్చించగలిగిందీ అంటే, వేదవేదాంగాల్ని చదువుకునే ఉంటుంది. కన్యాదానం చేస్తున్నప్పుడు జనకమహారాజు 'ఈమె సీత. నా కూతురు. ధర్మయాత్రలో... నీడలా నీ వెనకే నడుస్తుంది' అని రాముడితో చెబుతాడు. సీత చక్కని మాటకారి. 'మీదేశంలో పొలాన్ని దున్నితే ఆడపిల్లలు దొరుకుతారట!' అని కొంటెగా అడిగిన రామయ్యకు... 'మీ వూళ్లో పాయసం తింటే అబ్బాయిలు పుట్టేస్తారని విన్నానూ' అని గడుసుగా జవాబిచ్చింది. ఆ మృదుభాషిణి తప్పనిసరైనప్పుడు, కాస్త కటువుగానే మాట్లాడింది. శ్రీరాముడు తనను అడవులకు తీసుకెళ్లనని చెప్పినప్పుడు, 'నటుడు వేషానికి వెళ్తూ, తన భార్యని ఏ బంధువుల ఇళ్లలోనో దిగబెట్టి వెళ్లినట్టు... నన్నూ వదిలెళ్తారా?' అని ప్రశ్నించింది. అయినా రాముడు తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే, 'మీరు పురుషరూపంలో ఉన్న స్త్రీ అన్న సంగతి మా నాన్నగారికి తెలియదేమో?' అంటూ నిష్ఠూరాలాడింది. పెనిమిటి రాజ్యం పోయినందుకు బాధపడలేదు. రాణిగా అనుభవించాల్సిన భోగభాగ్యాలు దూరమైనందుకూ చింతించలేదు. అంత మాటలన్నది, ఎక్కడ రాముడు తనను వదిలి వెళ్తాడో అన్న భయంతోనే!అశోకవనంలో... రావణుడితో సంభాషించాల్సి వచ్చినప్పుడు... గడ్డిపోచను చూస్తూనే మాట్లాడేది. ఏం చెప్పినా, ఏం అడిగినా గడ్డిపోచతోనే. అంతర్లీనంగా 'నువ్వు గడ్డిపోచతో సమానం' అన్న తిరస్కారభావం. రావణ సంహారం తర్వాత, అగ్నిప్రవేశం చేయాలన్న నిర్ణయం కూడా తనే తీసుకుంది.అది కూడా రాముడికి మచ్చపడకూడదన్న ఆలోచనతోనే. పట్టాభిషేక సమయంలో... తన మెడలోని చూడామణి హారాన్ని తీసి, మారుతికి బహుమతిగా ఇచ్చింది. 'ఉన్నాడు లెస్స రాఘవుడు, రానున్నాడు, నిన్ను గొనిపోనున్నాడు నిజము నమ్ముముర్వీతనయా!' అని ధైర్యం చెప్పిన రామదూతకు కృతజ్ఞతాపూర్వక కానుక.
'ఉత్తర రామాయణం'లో... అడవులపాలైనప్పుడూ ఆమె స్త్థెర్యాన్ని కోల్పోలేదు. అందుకే, తాం క్షమా... మానవరూపం దాల్చిన భూదేవి, వసుధాయాః వసుధాం... భూదేవికే భూదేవి అని కీర్తించాడు వాల్మీకి. లవకుశులను పెంచి, ప్రయోజకుల్ని చేసిన తీరు... మాతృమూర్తిగా ఆమెకు పరిపూర్ణతను ప్రసాదించింది. రామాయణమంటే రామకథే కాదు. సీతకథ కూడా.
'సీతాయాశ్చరితమ్' ఆదికావ్యానికి మరో పేరు. |
రామవాక్కునాకు సంపద మీద ఆసక్తి లేదు. ఆశాలేదు. ధర్మాన్ని కాపాడటమే నా లక్ష్యం. ధర్మమార్గంలో నడవడంలో నేను రుషులతో సమానం
యజమాని తనకు అప్పగించిన పనిని, ఆశించినదాని కంటే అద్భుతంగా పూర్తిచేస్తే అతను ఉత్తమ ఉద్యోగి. అంతకంటే బాగా చేయగల సమర్థుడై ఉండి కూడా, ఆశించినమేరకు మాత్రమే చేసేవాడు మధ్యముడు. ఏమాత్రం నాణ్యత లేకుండా మొక్కుబడిగా చేసేవాడు అధముడు
సత్యానికీ ధర్మానికీ కట్టుబడి ఉన్నవారిని ప్రాణభయం వెంటాడదు
పామును చూసి ఎలా పక్కకెళ్లిపోతారో, అసత్యాత్ములను చూసి కూడా జనం అలానే భయపడతారు
భర్తకు భార్య విషయంలో జీవితకాల బాధ్యత ఉండాలి. భార్య కూడా జీవిత పర్యంతం తన భర్తను తప్ప మరెవరినీ అనుసరించకూడదు
ప్రతి మనిషికీ పితృభక్తి ఉండాలి. దేవతల కంటే తల్లిదండ్రులే ఎక్కువ. కన్నవారిని ప్రేమించలేని బిడ్డల పూజల్ని దేవుళ్లూ స్వీకరించరు |
- జనార్దన కరణం
బొమ్మలు: 'బాపు' సౌజన్యం
|
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి