బ్రాండ్... ఏటికొప్పాక!
ఏటికొప్పాక బొమ్మ... కాలపరీక్షను తట్టుకుని నిలిచింది. సహజమైన రంగులతో, సరికొత్త డిజైన్లతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తూ... అంతర్జాతీయ బ్రాండ్‌గా అవతరిస్తోంది. మార్పును స్వాగతించే ఆత్మవిశ్వాసం ఉంటే...ఏ కళకైనా ఢోకాలేదనడానికి ఏటికొప్పాకే ఎదురులేని ఉదాహరణ.
ఆదరణ కరవైపోతోంది. అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. సంప్రదాయ కళలు కనుమరుగైపోతున్నాయి. కళనే నమ్ముకున్న జీవితాలు కళతప్పుతున్నాయి. కారణం ఎవరు? నిర్లిప్త ప్రభుత్వమా? సంప్రదాయ ఉత్పత్తుల్ని ప్రేమించలేని ప్రజలా? కొత్తకు జాతరచేసే కాలమా, బహుళజాతి సంస్థల గాలమా? ...అంతులేని అంతర్మథనం తర్వాత, లోతైన విశ్లేషణ తర్వాత ఏటికొప్పాక కళాకారుల ప్రశ్నకు కచ్చితమైన సమాధానం దొరికింది. 'కారణం మేమే...' అన్న నిర్ణయానికొచ్చారు. స్వీయలోపాల్ని తెలుసుకోవడమే తొలి విజయ సోపానం. వైఫల్యమే పునాదిగా, ఓ విజయగాథ ప్రారంభమైంది.* * *విశాఖజిల్లా ఎలమంచిలి మండలంలోని ఏటికొప్పాక జమీందారీ గ్రామం. చుట్టుపక్కల ఎక్కడ ఏ జాతర్లు జరిగినా...ఏటికొప్పాక జమీందార్ల బొమ్మల కొలువు ఉండాల్సిందే. వాటిని చూడ్డానికి జనం ఎగబడేవారు. జాతర్లోనే మరో జాతర! ఇక జమీందారీ కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్లు జరిగితే...చీరసారెలతో పాటు ఏటికొప్పాక ఆభరణాల పెట్టెలూ తప్పనిసరి. అత్తారింటికెళ్లే కొత్తపెళ్లికూతురు ఆ నగల్ని ఎంత భద్రంగా దాచుకునేదో, నగలపెట్టెనూ అంతే అపురూపంగా చూసుకునేది. ఏం అందం! ఏం చందం! ఎంత సొగసు! చెక్కతో అంతచక్కని కళాకృతులకు ప్రాణంపోయాలంటే ఎంతో సృజన ఉండాలి. ఎవరైనా, ఎంత కుబేరులైనా వాటిని దూరం నుంచే చూసి ఆనందించాలి. సొంతం చేసుకోవడం అసాధ్యం. ఎందుకంటే, ఆ కళ ప్రభువుల సొత్తు. ఆస్థాన నిపుణుల సృజనంతా...జమీందారుగారి కచేరీకో, దొరసాని మేడకో అంకితం. అలా...ఆ బొమ్మలు వందల సంవత్సరాలు దివాణాలకే పరిమితమయ్యాయి.స్వాతంత్య్రం వచ్చాక ప్రజలతో పాటు ఏటికొప్పాక బొమ్మలూ సంకెళ్లు తెంచుకున్నాయి. జమీన్లు రద్దయిపోయాయి. జమీందార్ల ప్రాభవం పలచబడిపోయింది. ప్రభువుల నీడలో బతికిన ఏటికొప్పాక కళాకారులు... కూటి కోసం, కూలి కోసం వీధుల్లోకి వచ్చారు. రాణీవాసాల్లో కొలువైన కళాఖండాలు సంతల్లో సరుకైపోయాయి. పల్లెపల్లెకూ తిరిగి అమ్ముకోవాల్సిన పరిస్థితి.
ఏటికొప్పాక బొమ్మను తయారు చేయడం అంటే, దాదాపుగా ఓ జీవికి ప్రాణం పోసినంత శ్రమ! అడవుల్లో దొరికే అంకుడుకర్రను తెచ్చుకోవాలి. ఆరునెలలపాటూ ఎండబెట్టాలి. అప్పుడే కర్రకు గట్టిదనం వస్తుంది. బొమ్మ కూడా మన్నికగా ఉంటుంది. అంకుడుకర్ర చాలా మెతక. ఎలా అయినా మలుచుకోవచ్చు. ఆ సహజసిద్ధమైన మెరుపు బొమ్మకు జీవకళ తెస్తుంది. ఏమాటకామాటే చెప్పుకోవాలి. జమీందార్లు గండపెండేరాలు తొడగకపోయినా, ఏటికొప్పాక కళాకారుల తిండికి మాత్రం ఎలాంటి లోటూ రానివ్వలేదు. అవసరమైన ముడిసరుకంతా ఇచ్చిపంపేవారు. కళాకారులు కూడా అదే ప్రపంచమన్నట్టు బొమ్మలు చేసుకునేవారు. ఇప్పుడలా కాదే? రోజు గడవాలి. బండి నడవాలి. కట్టె ఎండలేదంటే, కడుపు మండకుండా ఉంటుందా? సులభ మార్గాలు వెతుక్కున్నారు. కర్రల్ని ఎండబెట్టడం మానేసి, కాల్చడం మొదలుపెట్టారు. నాసిరకం రంగులు ప్రవేశించాయి. ఫలితం...నాలుగునాళ్లకే బొమ్మ పగిలిపోయింది, రంగు వెలిసిపోయింది. కొనుగోలుదారుడికి నమ్మకం తగ్గింది. కొనడం మానేశాడు. మెల్లమెల్లగా ఏటికొప్పాక బొమ్మకున్న గుర్తింపూ ప్రత్యేకతా మంటగలిసిపోయాయి. ఓ గొప్ప కళ దాదాపుగా అంతరించిపోయే పరిస్థితి వచ్చింది. ఆశ్చర్యకరంగా.. బూడిదలోంచి ప్రాణం పోసుకునే ఫీనిక్స్ పక్షిలా...ఆ పతనంలోంచే ఉత్థానం మొదలైంది.* * *ఇప్పుడు, ఏటికొప్పాక బొమ్మంటే ఓ బ్రాండ్. తిరుగులేని బ్రాండ్! ఆ బ్రాండింగ్ వెనకున్న బలమైన ఆలోచన...చింతలపాటి ప్రసాద్‌బాబు, ఏటికొప్పాక జమీందార్ల వారసుడు. ఆస్తిపాస్తులు చాలానే ఉన్నాయి. వాటిని వందరెట్లో వేయిరెట్లో పెంచుకోవాలన్న ఆలోచన ఏమాత్రం లేదు. ప్రసాద్‌బాబు లక్ష్యమల్లా ఒకటే...బక్కచిక్కిన ఏటికొప్పాక బొమ్మలకు పాతవైభవం తీసుకురావడం. అప్పటికే, చాలామంది కళాకారులు వూరొదిలివెళ్లారు. ఉన్నవాళ్లూ ఇంకేవో వృత్తుల్లో స్థిరపడ్డారు. ఆ యువకుడి ప్రథమ కర్తవ్యం... బొమ్మల్ని నమ్ముకుంటే లక్షణంగా బతకగలమన్న నమ్మకాన్ని కలిగించడం, బొమ్మల తయారీలో కళాకారులకు అండగా నిలబడటం. ఇక్కడ మరో సమస్యా ఉంది. సమకాలీనత లోపిస్తే, నవతరాన్ని ఆకట్టుకోకపోతే...ఎంతగొప్ప కళ అయినా మంచుబొమ్మలా కరిగిపోతుంది. అనేకానేక సంప్రదాయ వృత్తులు సంక్షోభంలో పడటానికీ ఇదే కారణం. ఏటికొప్పాక కళాకారుల సృజనకు తిరుగులేదు. ఎవరో వచ్చి పాఠాలు చెప్పాల్సిన అవసరమూ లేదు. వారికి తెలియజెప్పాల్సిందల్లా...జాతీయ అంతర్జాతీయ మార్కెట్ ధోరణుల గురించీ వినియోగదారుల అభిరుచుల గురించీ ఎగుమతుల విషయంలో పాటించాల్సిన ప్రమాణాల గురించీ. ఆ కార్యక్రమం చేపట్టడానికి ఓ వేదికంటూ ఉండాలి. అందుకే, 'పద్మావతీ అసోసియేట్స్' సంస్థను స్థాపించాడు ప్రసాద్‌బాబు. ఆ ఛత్రఛాయలకిందే...'బ్రాండ్ ఏటికొప్పాక' బృహత్ ప్రణాళిక అమలైంది. తాను చదివినవీ చూసినవీ అర్థంచేసుకున్నవీ...కళావ్యాపారానికి సంబంధించిన ప్రతి అంశాన్నీ వాళ్లకు బోధించాడు. తన ఇంటినే కార్యాలయంగా మార్చుకున్నాడు. అవసరాన్ని బట్టి అది శిక్షణాలయం అవుతుంది. ఎక్స్‌పోర్ట్ కన్సల్టెన్సీ అవుతుంది. ప్రయోగశాల అవుతుంది. స్ఫూర్తికేంద్రం అవుతుంది.తొలిదశలో అరవైమంది కళాకారులకు శిక్షణ ఇచ్చాడు. మలిదశలో మరో అరవై మెరికల్ని తయారుచేశాడు. శిక్షణ వల్ల కావచ్చు, అధ్యయనం వల్ల కావచ్చు, దిశానిర్దేశం వల్ల కావచ్చు...ఏటికొప్పాక కళాకారుల ఆలోచనలు విస్తరించాయి. మార్కెట్‌ను అర్థంచేసుకోగలిగారు. కొనుగోలుదారుల అభిరుచులు తెలుసుకోగలిగారు. మనకు వచ్చిన బొమ్మలు చేయడం కాదు, ప్రజలకు నచ్చిన బొమ్మలే చేయాలన్న వ్యాపార సూత్రాన్ని ఒంటబట్టించుకున్నారు. రిసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ లాంటి ప్రత్యేక విభాగమేదీ లేకపోయినా, అక్కడ చాలా పరిశోధనలే జరిగాయి. ఏ ఇద్దరు కలుసుకున్నా...ఆ చర్చే! కొత్త ఆలోచనలు, కొత్త ప్రయోగాలు, కొత్త పాఠాలు...మొత్తంగా కొత్తదనానికి కిరీటం తొడిగారు. ఫలితంగా...ప్రతిభ విస్తరించింది. ఏటికొప్పాక కళాకారులు ఫ్యాషన్స్ మీదా దృష్టి సారించారు. చెవి దుద్దులు, చేతి గాజులు, మణికట్టు వాచీలు...రకరకాల అలంకరణ వస్తువుల్ని సృష్టించారు. క్షణక్షణముల్ ఫ్యాషన్లు! ఆవెంటనే, ఏటికొప్పాక డిజైన్లూ మారిపోతాయి. గృహాలంకరణ వస్తువుల విషయంలో అయితే, సృజన పురులువిప్పింది. షార్క్ చేప నుంచి తిమింగలం వరకూ రకరకాల జలచరాల బొమ్మల్ని తయారు చేశారు. ఇక పండ్ల బొమ్మలైతే తినాలనిపించేలా ఉంటాయి. గుమ్మాలకు కట్టుకునే చిలకల దండలు, నట్టింటికి అందం తెచ్చే 'హ్యాంగింగ్స్', పడకగది దీపాలు, గోడ గడియారాలు...ఆ సృజనాత్మక వస్తువుల జాబితా చాలా పెద్దది. 'ఏటికొప్పాక థీమ్' తీసుకుని ఏ ఇంటినైనా అందంగా అలంకరించుకోడానికి సరిపడా...బొమ్మలున్నాయిప్పుడు. ఆ కళాకారులు 'కార్పొరేట్' అవసరాల్నీ అర్థంచేసుకున్నారు. బాల్‌పెన్, పెన్‌స్టాండ్, సెల్‌ఫోన్‌స్టాండ్ వంటి ఉత్పత్తులు అద్దాల క్యాబిన్లకు మరింత హుందాతనాన్ని తెస్తున్నాయి. ఏటికొప్పాక బొమ్మలు పవిత్ర పూజామందిరాల్లోకీ ప్రవేశించాయి. దేవతా మూర్తులు, అగరొత్తుల స్టాండ్లు, ప్రమిదలు...భగవంతునికీ భక్తులకూ అనుసంధానంగా నిలుస్తున్నాయి. వంటగదిని మాత్రం ఎందుకు ఒంటరిని చేయాలి? గరిటెలతో సహా సమస్తం సిద్ధం. ఇప్పుడు, చొక్కా గుండీల్నీ తయారు చేస్తున్నారు. అలా, ఏటికొప్పాక ప్రజల గుండెలకు మరింత చేరువ అవుతోంది.సంప్రదాయ పరిజ్ఞానాన్నే నమ్ముకున్న కళాకారులు..మూసలోంచి బయటికొచ్చి..నవతరం అభిరుచుల్ని అర్థంచేసుకుని...ఇన్నిన్ని డిజైన్లు సృష్టించడమంటే మాటలు కాదు. నిలవాలన్న తపన, గెలవాలన్న ఆరాటమే వాళ్లతో అద్భుతాలు చేయించింది. మనుగడ కోసం ఏటికొప్పాక ఎదురొడ్డి పోరాడింది. ముందుండి దిశానిర్దేశం చేయడానికి ప్రసాద్‌బాబు ఉండనే ఉన్నాడు.ఎగుమతి లక్ష్యం... ప్రాంతీయ, జాతీయ మార్కెట్ల మీద దృష్టిసారిస్తూనే... అంతర్జాతీయ విపణిని లక్ష్యంగా చేసుకున్నాడు ప్రసాద్‌బాబు. ఎగుమతులతో గిరాకీ పెరుగుతుంది. కళాకారుల ఆదాయమూ వృద్ధిచెందుతుంది. ఎగుమతే సర్వస్వంగా...ప్రసాద్‌బాబు నేతృత్వంలో యువకళాకారుల బృందం అహోరాత్రాలు శ్రమించింది. చూడచక్కని బొమ్మలు తయారు చేసింది. జాగ్రత్తగా మూటగట్టి విదేశాలకు పంపింది. వారం రోజుల్లోనే అవి తిరిగొచ్చేశాయి. వూహించని పరిణామం. ఏటికొప్పాకను నిరాశ కమ్మేసుకుంది. నాణ్యతకు తిరుగులేదు. పనితనానికి ఎదురులేదు. మరెందుకిలా జరిగింది? లోపం ఎక్కడుంది?...బొమ్మలకు పూసిన రంగుల్లో రసాయన అవశేషాలు అధికంగా ఉండటమే ప్రధాన కారణం. కర్రలో ఎంత మెరుపున్నా.. రసాయన రంగులు వేయకపోతే బొమ్మకు అందం రాదు. ఎగుమతి అవకాశాలు దాదాపుగా మూసుకుపోయినట్టే అని అంతా భావించారు. 'ఏం ఫర్వాలేదు...రసాయనాల్లేని రంగులు వాడితే సరి'... అంటూ కళాకారులకు ధైర్యం చెప్పాడు ప్రసాద్‌బాబు. ఉత్సాహం నింపడానికి అలా అన్నాడే కానీ, అసలు అలాంటి రంగులు ఉన్నట్టు కూడా ఆయనకు తెలియదు. పాండవుల కోసం రంగురంగుల లక్క ఇల్లు కట్టించారని మహాభారతంలో చదివినట్టు గుర్తు. అది సాధ్యమా, అసాధ్యమా...అన్న విషయంలో స్పష్టత లేదు. సలహా ఇచ్చి పుణ్యం కట్టుకునేవారూ దాదాపుగా లేరు. తనే అధ్యయనం ప్రారంభించాడు. భారత హస్తకళల సంస్థ, దస్తకార్ ఇండియాల సహకారం తీసుకున్నాడు. ప్రధానంగా ప్రకృతిలో నాలుగు రంగులే ఉంటాయి. వీటి సమ్మేళనం వల్లే మిగిలిన రంగులన్నీ ఏర్పడతాయి. బిక్షా గింజల నుంచి, తొగరు మొక్క బెరడు నుంచి, మంజిష్టా మొక్క వేళ్ల నుంచి ఎరుపురంగు తీయవచ్చు. పచ్చికొండ పసుపు దుంపల నుంచి పసుపురంగు తయారు చేసుకోవచ్చు. ఉసిరి నుంచి గోధుమరంగు, నీలిమందు మొక్కల నుంచి నీలంరంగు, కరక్కాయ నుంచి నలుపురంగు పిండుకోవచ్చు. రకరకాల మిశ్రమాలతో దాదాపు పాతిక రంగుల్ని తయారు చేయడంలో ఏటికొప్పాక కళాకారులు ప్రావీణ్యం సాధించారు. ఇస్తాంబుల్ యూనివర్సిటీ నుంచీ ఇంకొంత సమాచారం తెప్పించాడు ప్రసాద్‌బాబు. రంగుల్ని బాగా మరగబెట్టి, కనీసం ఆరునెలలు కుండల్లో నిల్వ ఉంచి...ఆతర్వాత అందులో వేడివేడి లక్కను కలపడంతో బొమ్మల తయారీకి అవసరమైన వర్ణాలు సిద్ధమైపోతాయి. నాణ్యత విషయంలో ఢోకాలేదు. వందేళ్లదాకా వెలిసిపోయే ప్రసక్తే లేదు. బొమ్మల తయారీని కుటుంబ వ్యాపారంగా మలచాలన్న ఉద్దేశంతో..రంగుల బాధ్యత మహిళలకే అప్పగించాడు ప్రసాద్‌బాబు. అవసరమైన శిక్షణ కూడా ఇచ్చాడు. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. గృహిణుల చేతుల్లోనూ నాలుగు డబ్బులు ఆడతాయి. 'సాధికారత'కు అదో మార్గం.
రసాయన రంగులు వాడుతున్న రోజుల్లో ఏటికొప్పాక వార్షిక టర్నోవరు పదిలక్షలకు మించేది కాదు. సహజమైన రంగులతో దశే మారిపోయింది. ఎగుమతి అవకాశాలు పెరిగాయి. ముఖ్యంగా ఆటబొమ్మల ఆర్డర్లు రెట్టింపు అయ్యాయి. ఎందుకంటే, కృత్రిమమైన రంగులేవీ వాడలేదు కాబట్టి, పసిపిల్లలు ఆ బొమ్మల్ని నోట్లోపెట్టుకున్నా ప్రమాదం ఉండదు. తొలిఏడాదే కోటి రూపాయల టర్నోవరు సాధించారు. ఎంతో చరిత్ర ఉన్న ఏటికొప్పాక బొమ్మలు 1992 వరకూ రాష్ట్ర సరిహద్దులు కూడా దాటలేదు. ఆ ఏడాది నుంచీ అమెరికా, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, హంగేరీ, పోలెండ్, జపాన్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.కళాత్మక ఆత్మవిశ్వాసం... బొమ్మ వెనకున్న శ్రమెంతో, సృజనెంతో దాని సృష్టికర్త అయిన కళాకారుడికే తెలుస్తుంది. వెలకట్టడానికి వ్యాపారులెవరు? ధర నిర్ణయించడానికి దళారీలెవరు? ఉన్న పదిమంది వ్యాపారులదీ ఒకేమాట. ఎవరి దగ్గరికి వెళ్లినా అంతంతమాత్రం ధరలే. చివరగా నష్టపోయేది కళాకారుడే. ప్రసాద్‌బాబు పాతపద్ధతికి మంగళం పాడాడు. కళాకారుడు తన సృష్టికి తానే ధర నిర్ణయించుకునే...అవకాశమిచ్చాడు. ముడిసరుకు, కూలీ తదితర ఖర్చులన్నీ లెక్కగట్టి ఏ ధరకైతే గిట్టుబాటు అవుతుందో కళాకారుడే చెప్పేస్తాడు. ఈ ప్రయోగం విజయవంతమైంది. చేతినిండా పనిలేక, వూరొదిలి వెళ్లినవారూ ధరల్లేక బొమ్మల తయారీని వదిలేసినవారూ...మళ్లీ వెనక్కి వచ్చేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) చేయూతనివ్వడంతో బొమ్మల తయారీ పరిశ్రమ మరింత వూపందుకుంది. దాదాపు రెండువందల యాభై కుటుంబాలు బొమ్మల్నే నమ్ముకుని బతుకుతున్నాయి. చుట్టుపక్కలున్న కైలాసపట్నం, మేడివాడ, తూర్పుగోదావరి జిల్లాలోని కొట్టాం గ్రామాలకూ బొమ్మల తయారీ విస్తరించింది.
జాతీయస్థాయిలో గుర్తింపు... అంతరించిపోతున్న కళను బతికించినందుకు, ఏటికొప్పాక బొమ్మలకు సహజమైన రంగులద్దినందుకు, కళాకారులకు గుర్తింపు తెచ్చినందుకు..చింతలపాటి ప్రసాద్‌బాబును నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ అవార్డు వరించింది. పద్మావతీ అసోసియేట్స్ సహకారంతో బొమ్మల తయారీలో మెలకువలు నేర్చుకున్న శ్రీశైలపు చిన్నయాచారికి జాతీయ అవార్డు లభించింది. గుడ్డు పరిమాణం ఉన్న బొమ్మలో 26 గుడ్లు పట్టేలా చెక్కబొమ్మ తయారు చేయడం చిన్నయాచారి ప్రతిభకు నిదర్శనం. ఆరు గుడ్లు పట్టేలా తయారు చేయడం ఎలాగో ప్రసాద్‌బాబు నేర్పించాడు. 12, 16, 24, 26 ... ప్రతి ప్రయత్నంలో గుడ్ల సంఖ్య పెంచగలిగాడు చిన్నయాచారి. ఏటికొప్పాక సాధించుకున్న గుర్తింపూ గౌరవం టాటా సంస్థ టైటాన్ ఇండస్ట్రీస్‌నూ ఆకర్షించింది. డిజైనర్ అభిజిత్ బన్సాద్ తాను రూపొందించాలనుకున్న గడియారానికి చుట్టూ చెక్కఫ్రేమ్ ఉంటే బావుంటుందని భావించాడు. దానిక్కూడా సహజమైన రంగులే వాడాలనుకున్నాడు. తన అంచనాలకు తగినట్టు...ఫ్రేమ్‌లు తయారు చేయగల కళాకారుల కోసం దేశమంతా వెదికాడు. ఎవరో సలహా ఇస్తే, గంపెడాశతో ఏటికొప్పాక వచ్చాడు. కళాకారుల పనితనం చూశాక ...'మీలాంటి వారి కోసమే ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్నా...' అంటూ తనకేం కావాలో చెప్పాడు. అచ్చుగుద్దినట్టు అలాంటి డిజైన్లనే అందించారు ఏటికొప్పాక కళాకారులు. తర్వాత కాలంలో, అభిజిత్ తన సొంత స్టూడియో ద్వారా.. ఇంటీరియర్ డిజైనింగ్‌లో రకరకాల ప్రయోగాలు చేశాడు. చాలావాటికి ఏటికొప్పాకే వేదికైంది. బౌద్ధులు సుగంధ ద్రవ్యాల ధూపం వేసే చెక్కపాత్రను కూడా ఇక్కడే డిజైన్ చేశాడాయన. బౌద్ధం విస్తరించిన ప్రతి దేశానికీ వాటిని ఎగుమతి చేస్తున్నాడు.
మునుముందుకు.. ఏటికొప్పాకలో...డాబా ఇళ్లు వెలుస్తున్నాయి. ముంగిట్లో బైకులు దర్శనమిస్తున్నాయి. కాన్వెంట్లకు వెళ్తున్న పిల్లల గుంపులు కనిపిస్తాయి. సాయంత్రాలు ఏ కూడలి దగ్గరో నిలబడి...బొమ్మల తయారీకి సంబంధించి ఆలోచనలు పంచుకునే యువతనూ చూడవచ్చు. తమ పిల్లల్ని ఈ వృత్తిలోకి తీసుకురావడానికి కన్నవారూ జంకడం లేదిప్పుడు. అంతమాత్రాన, ఏటికొప్పాక బొమ్మలకు సమస్యలే లేవని కాదు. అంకుడు కర్ర కొరతతో కళాకారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిపై అటవీశాఖ ఆంక్షలున్నాయి. పోలీసు కేసుల భయంతో దొడ్డిదారిలో కొనుగోలుచేయక తప్పడంలేదు. ఫలితంగా ధర చుక్కలనంటుతోంది. పొరుగు రాష్ట్రాల్లో దీన్ని వంట చెరుకుగా వాడుతున్నారు. అక్కడి నుంచి దిగుమతి చేసుకోడానికి కేంద్రం అనుమతి ఇస్తే ... ఏటికొప్పాక కళాకారుల కష్టం తీరిపోతుంది. పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది. అటవీశాఖ డిపోలు పెట్టి విక్రయించినా ఎంతోకొంత మంచే జరుగుతుంది. ఎన్ని విన్నపాలు చేసినా ప్రభుత్వం స్పందించడంలేదు. దీంతో, కేవలం అంకుడు కర్రల మీదే ఆధారపడకుండా పాత కర్రతో, సామిల్లులో దొరికే వృథా ముక్కలతో బొమ్మలు చేయడం నేర్పుతున్నాడు ప్రసాద్‌బాబు. విద్యుత్ కొరత కూడా తీవ్రంగా వేధిస్తోంది. తమ గ్రామాన్ని కోతల నుంచి మినహాయించాలని కళాకారులు ఎంతోకాలంగా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. ఇప్పటిదాకా జవాబు లేదు.అయితే, ఎన్ని సమస్యలొచ్చినా...ఆ కళాకారులు కుంగిపోవడం లేదు. ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు. 'బ్రాండ్ ఏటికొప్పాక' విజయ రహస్యం అదే!
బొమ్మలు మార్చిన జీవితాలు... అర్దాకలి లేదు. ఆత్మహత్య ఆలోచనల్లేవు. అప్పుల తిప్పల్లేవు. కార్మికుల వలసల్లేవు. సంప్రదాయ కళల్నే నమ్ముకున్న గ్రామాలు ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఏటికొప్పాకలో కనిపించదు. |
ఆర్థికంగా స్థిరపడ్డాంప్రకృతి సిద్ధమైన రంగుల వాడకం వల్ల బొమ్మలకు మంచి ధర వస్తోంది. శ్రమకు తగిన ప్రతిఫలమూ లభిస్తోంది. ఆర్థికంగా స్ధిరపడ్డాం. కుటుంబం మొత్తం ఇదే పని చేసుకుంటున్నాం. అప్పట్లో ఎంత కష్టపడినా రోజుకు వంద రూపాయలు రావడం కష్టంగా ఉండేది. ఇప్పుడు, నాలుగు వందలకుపైగా సంపాదిస్తున్నాం.
- పెదపాటి సత్యనారాయణ
| ఇంటి వద్దే ఉపాధిగతంలో బొమ్మల పని గిట్టుబాటు అయ్యేది కాదు. మరోదారి వెతుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితి లేదు. చేతినిండా పనుంది. పనితనాన్ని గుర్తించే సంస్థ ఉంది. దీనివల్ల మహిళలకూ మంచి జరుగుతోంది. ఇంటిపట్టునే ఉండి నాలుగురాళ్లు సంపాదించుకోవచ్చు. మేం సొంతంగా తయారుచేసుకునే బొమ్మల్ని కూడా విదేశాలకు ఎగుమతి చేయడానికి, ప్రభుత్వం ఓ సంస్థను స్థాపిస్తే బావుంటుంది.
- నక్కిన మహాలక్ష్మి
|
ఇదే ఆధారం...భర్త అనారోగ్యంతో చనిపోయాడు. బొమ్మలే నా జీవనాధారం. పిల్లల్ని చదివించుకుంటున్నాను. ఇందులోనే మరిన్ని మెలకువలు నేర్చుకుంటున్నాను. కొత్త కొత్త బొమ్మలు తయారు చేస్తున్నాను. స్వశక్తిపై బతకాలనుకునే వారికి ఇదో మంచి అవకాశం.
- తాలాబత్తుల కుమారి
| అవార్డుల పంటమాలో ఆశావాదం పెరిగింది. మాలాంటి యువకళాకారులంతా రోజూ కొంత సమయాన్ని ఆలోచించడానికే కేటాయిస్తున్నాం. ఇప్పటిదాకా ఎవరూ తయారుచేయని బొమ్మలు చేయాలన్నదే మా లక్ష్యం. నేను రూపొందించిన స్వామివారి రథానికి రాష్ట్రస్థాయి అవార్డు వచ్చింది. సహచరుడు శరత్ పల్లె జీవనాన్ని ప్రతిబింబించే చిహ్నం తయారుచేశాడు. ఏటికొప్పాక బొమ్మకు ప్రపంచపటంలో ప్రత్యేకమైన స్థానం ఉండాలి. అదే మా లక్ష్యం. - ఎస్.రమణ |
ఇంకా సాధించాలి...ఏటికొప్పాక విజయ యాత్రలో ఇదంతా ప్రారంభం మాత్రమే. సాధించాల్సింది చాలా ఉంది. మరింతమందిని కళాకారులుగా తీర్చిదిద్దాలి. మరిన్ని గ్రామాలకు విస్తరించాలి. మరిన్ని దేశాలకు ఎగుమతి చేయాలి. బాగా చదువుకున్న యువతను కూడా ఇందులో భాగస్వాముల్ని చేయాలి. సహజమైన రంగులకు సంబంధించి కూడా మరిన్ని ప్రయోగాలు చేస్తున్నాం.
- ప్రసాద్‌బాబు, హస్తకళానిలయం
|
- దాట్ల సుబ్బరాజు న్యూస్‌టుడే, ఎలమంచిలి
ఫొటోలు తోటపల్లి మోహన్ |
ఇటీవల భారత ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ సి.వి. రాజు గారు మరియు మీ వ్యాసం లో పేర్కొన్న ప్రసాద్ బాబు గారు వేరు వేరు వ్యక్తులా లేక ఒకరేనా?
రిప్లయితొలగించండి9052969293 నంబరుకు సందేశం పంపమని మనవి.