Stars words on Sachin's Century

సచిన్‌కి శతాభిషేకం
96.. 97.. 98.. 99... ఒక్కొక్క అంకె పెరుగుతోంటే, వందకు దూరం తరుగుతోంటే... అభిమానుల గుండె కొట్టుకొనే వేగం పెరిగింది. సచిన్‌కి సెంచరీ కొత్త కాదు. ఆ ఆట చూసి పరవశించిపోవడం మనకూ కొత్త కాదు. కానీ ఎప్పుడూ లేని ఉద్వేగం, ఉత్కంఠ ఈసారే కనిపించాయి. కారణం... ఈ వంద అతనికి వందోసారి. మనలాగే సినీ తారలు కూడా ఆసక్తిగా ఈ క్షణం కోసమే ఎదురుచూశారు. వందో పరుగు సచిన్‌ ఖాతాలో జమ కాగానే కోట్లమంది హృదయాల్లో కొండంత భారం దిగిపోయింది. హర్షాతిరేకాలు వెల్లివిరిశాయి. సచిన్‌ అంటే మన తారలకూ చాలా ఇష్టం. ఈ క్రికెట్‌ దిగ్గజంతో అంతో ఇంతో అనుబంధం కూడా ఉంది. అందుకే సచిన్‌ వందో వంద పూర్తవగానే కేరింతలు కొట్టారు. తమ అభిమానాన్ని మాటల్లో ఇలా బయటపెట్టారు.
భారతరత్నం... సచిన్‌: చిరంజీవి
''సచిన్‌తో నాకు వ్యక్తిగత పరిచయం ఉంది. 2004లో విశాఖపట్నంలో జరిగిన స్టార్‌ క్రికెట్‌ మ్యాచ్‌ల్లో ఆయన పాల్గొన్నారు. ఆ సందర్భంలోనే మా ఇంటికొచ్చారు. ఆతిథ్యం స్వీకరించి మాఇంట్లో కొన్ని గంటలు గడిపారు. ఓసారి 'మగధీర' పతాక సన్నివేశాల్ని ఆయనకు చూపించాను. చాలా సంతోషించారు. సచిన్‌ వంద సెంచరీల రికార్డును ఎప్పుడు సాధిస్తాడో అని నేనెంతో ఆసక్తిగా ఎదరుచూశాను. వంద పూర్తవగానే ఉద్వేగానికి లోనయ్యాను. చప్పట్లతో హాలంతా మార్మోగిపోయింది. ఇది నిజంగా పండుగలా ఉంది. సచిన్‌ నిగర్వి. ఎంత సాధించినా వినమ్రంగానే ఉంటాడు. అతని వ్యక్తిత్వానికి నేను దాసోహమయ్యా. సచిన్‌ ఆటని ఆస్వాదించని వారు ఎవరూ లేరేమో?! ఎన్ని విమర్శలు వచ్చినా తన బ్యాటుతోనే సమాధానం చెప్పాడు. ఇప్పటికైనా సచిన్‌కి భారతరత్న ప్రకటించాలి. అదే మనం ఆయనకు ఇవ్వగలిగే గౌరవం''.
కార్లో.. కామెంట్రీ వింటూ: వెంకటేష్‌
''చాలా రోజుల నుంచి ఈ క్షణం కోసమే క్రికెట్‌ ప్రపంచం ఎదురుచూసింది. కొంత కాలంగా ఎక్కడ చూసినా సచిన్‌ వందో సెంచరీ గురించే చర్చ. కొన్నిసార్లు తొంభైల్లోనే ఔటయ్యాడు. ఈసారి సచిన్‌ 90కి చేరుకోగానే... ఒత్తిడి తట్టుకోలేక మ్యాచ్‌ చూడడం మానేశాను. కార్లో వెళ్తూ క్రికెట్‌ కామెంట్రీ మాత్రం విన్నాను. 99 దగ్గరకు వచ్చేసరికి నేను కూడా కార్లోంచి బయటకి వచ్చి టీవీకి అతుక్కుపోయాను. వంద అనే అంకె చాలా గొప్పది. దాన్ని వందసార్లు అందుకోవడం సచిన్‌కే సాధ్యమైంది. ఆటగాడిగానే కాదు, వ్యక్తిగతంగా కూడా సచిన్‌ గొప్ప వ్యక్తి. సెంచరీ చేయకపోయినా జట్టును గెలిపించే చాలా అమూల్యమైన ఇన్నింగ్స్‌లను ఆడాడు. ప్రపంచం గర్వించే ఆటగాడితో కలిసి సమయం పంచుకొనే అవకాశం నాక్కూడా వచ్చినందుకు ఆనందంగా ఉంది''.
దమ్ము చూపించాడు: ఎన్టీఆర్‌
''చిన్నప్పటి నుంచీ సచిన్‌ ఆటంటే చాలా ఇష్టం. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నిబ్బరంగా ఆడతాడు. భారత క్రికెటర్ల దమ్ము చూపించడం సచిన్‌కే చెల్లు. రికార్డులు అతనికి కొత్తకాదు. అయితే వందో వంద మాత్రం ప్రత్యేకం. ఈ రికార్డు కోసం అందరిలానే నేను కూడా చాలాకాలంగా ఎదురుచూస్తున్నా. ఆస్ట్రేలియా పర్యటనలోనే ఈ ఈ మైలురాయి చేరుకొంటాడని భావించాను. ఆలస్యమైనా సాధించాడు. ఏదైనా సాధించాలి అనుకొనేవారికి సచిన్‌ ఆట ఓ స్ఫూర్తి. సచిన్‌ నుంచి మరిన్ని అమూల్యమైన ఇన్నింగ్స్‌లు రావాలి. మరిన్ని విజయాలను భారతమాతకు కానుకగా అందివ్వాలి''.
అనితర సాధ్యుడు: మోహన్‌బాబు
''ఇలాంటి అద్భుతాలను ఆవిష్కరించడం గొప్పవాళ్లకే సాధ్యం. దాని వెనుక ఎన్ని సంవత్సరాల తపన దాగి ఉందో..? ఈ ఘనత భవిష్యత్తులో మరెవరూ సాధించలేరు. సచిన్‌ని చూసి ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు. హ్యాట్సాఫ్‌ టు సచిన్‌..''
పరుగుల కోసమే పుట్టాడు: సురేష్‌బాబు
''పదహారేళ్ల వయసులో బ్యాటింగ్‌కి దిగినప్పుడు ఎంత చిత్తశుద్ధితో ఆడాడో... సచిన్‌ ఇప్పుడూ అలానే కనిపిస్తున్నాడు. వంద సెంచరీలు అనే ఘనత సాధించకపోయినా సచిన్‌ సచినే. అతను పరుగుల కోసమే పుట్టాడు. అతన్నుంచి ఈతరం నేర్చుకోవలసింది ఎంతో ఉంది. రిటైర్మెంట్‌ నిర్ణయం అతనికే వదిలిపెట్టాలి. ఓ సిరీస్‌లో విఫలమైన వెంటనే విమర్శించడం ఇప్పటికైనా మానుకోవాలి''.
షూటింగ్‌ వదిలేశా: బిపాసాబసు
''సచిన్‌ స్కోరు 90 అనగానే షూటింగ్‌ వదిలేసి టీవీ దగ్గరకు వచ్చేశా. సచిన్‌ ఆట ఎప్పటికీ ప్రత్యేకమే. వందకు చేరుకోగానే... అత్యుత్సాహం ప్రదర్శించలేదు. చాలా కూల్‌గా కనిపించాడు. అది అతనికే సాధ్యమైంది''.
ఆస్వాదించాలంతే: అమితాబ్‌బచ్చన్‌
''చరిత్రలో మరెవరికీ అందని ఘనత ఇది. ఈ రికార్డు వైపు చూడ్డానికి కూడా సాహసించలేరు. సచిన్‌ ప్రయాణం అందరికీ ఆదర్శం. అతని ఆట తీరు చూస్తూ ఆస్వాదించాలంతే. విమర్శకులకు సరైన సమయంలో సరైన ఆట తీరుతో సమాధానం చెప్పాడు''.
నిజమైన హీరో: షారుఖ్‌ఖాన్‌
''మేమంతా తెరపైనే హీరోయిజం చూపిస్తాం. సచిన్‌ నిజమైన హీరో. అంత నిబద్ధతగల ఆటగాడిని మరెక్కడా చూడలేం. క్రమశిక్షణ విషయంలో అతన్ని చూసి చాలా నేర్చుకోవాలి. వందో సెంచరీ చాలా ప్రత్యేకమైనది. సచిన్‌ని చూసి దేశం గర్విస్తోంది''.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు