Eenadu Eetaram (31/03/2012)
ఒకనాడు... అమ్మ చేసి ఇడ్లీలను వీధుల్లో అమ్మిన గతం! ఈనాడు... ప్రపంచ బ్యాంకు సదస్సులో ప్రసంగించిన వర్తమానం!! గతానికి, వర్తమానానికి మధ్య... అతడు ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం! లక్షల జీతాన్ని వదులుకున్నా... వెక్కిరింపులనే సోపానాలుగా మలుచుకున్నా... వందలాది మంది యువతకు వూతమిచ్చిన విజయం! సమాజహితమే థ్యేయంగా సాగుతున్న నేపథ్యం! న్యూయార్క్ సదస్సులో పాల్గొని తిరిగి వచ్చిన అతడితో మాట కలిపింది 'ఈతరం'...ప్రపంచ బ్యాంకు సదస్సు... మూడువందల మందికి పిలుపు. ముగ్గురికే మాట్లాడే ఆహ్వానం... ఈ అరుదైన అవకాశం చెన్నై యువకుడ్ని వరించింది... మురికివాడల్లోని యువత జీవితాల్లో... వెలుగుల దివ్వెలు పూయిస్తున్న కృషికి ఫలితమది! ఆ యువకుడేశరత్‌బాబు ఎలుములై. 'వ్యక్తిగా, పారిశ్రామికవేత్తగా సమాజంలో కొంచెం మార్పు తేవచ్చు. అదే రాజకీయాల్లో ఉంటే వాటిని మరింత వేగంగా పూర్తి చేయొచ్చు' ముప్ఫై ఒక్క సంవత్సరాల శరత్‌బాబు ఎలుములై అభిప్రాయమిది. రాజకీయాలంటే మురికి కూపంగా భావించే దేశంలో ఓ యువకుడు ఇలాంటి ఆలోచన కలిగి ఉండటం దమ్మున్న విషయమే. ఇదే అభిప్రాయం ప్రపంచ బ్యాంకు సమావేశంలో వ్యక్తం చేసినపుడు అభినందనలు వెల్లువెత్తాయి.గుడిసెలో ఉదయించిన భానుడు యువతకు స్ఫూర్తిగా నిలుస్తూ, ప్రపంచ బ్యాంకు దృష్టినాకర్షించిన శరత్‌బాబు ప్రస్థానం చెన్నైలోని ఓ మురికివాడలో మొదలైంది. శరత్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. ఐదుగురు పిల్లల కుటుంబాన్ని పోషించడానికి తల్లి రోజుకు మూడు ఉద్యోగాలు చేసేది. ఉదయం ఇడ్లీలు చేయడం, ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండడం, సాయంత్రం మరో పాఠశాలలో ఆయాగా పనిచేయడం. తల్లి చేసిన ఇడ్లీలను బజారుకెళ్లి అమ్మేవాడు శరత్. కష్టాల బాటలో సాగుతూనే చదువును ముందుకురికించాడు. ప్లస్‌టూ పూర్తయ్యాక బిట్స్ పిలానీలో సీటొచ్చింది. కెమికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసి మూడేళ్లు ఎమ్మెన్సీ కంపెనీలో ఉద్యోగం చేశాడు. ఆపై ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐఎం-అహ్మదాబాదులో ఎంబీఏ చదివాడు. లక్షల జీతమిస్తామంటూ కంపెనీలు రెడ్‌కార్పెట్ పరిచాయి. కానీ అతడు గతాన్ని మర్చిపోలేదు. తనలాంటి నిరుపేద యువకులకు ఊతంగా నిలవాలనుకున్నాడు. అందుకే ఆ అవకాశాల్ని తిరస్కరించి 2006లో కేవలం రెండువేల రూపాయల పెట్టుబడితో 'ఫుడ్‌కింగ్' పేరుతో క్యాటరింగ్ సర్వీస్ తెరిచాడు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి చేతులమీదుగా అది మొదలైంది. ఎగిసిన వ్యాపారం పెద్ద చదువులు చదివి, లక్షల జీతం వదులుకొని మురికివాడలో చిన్న హోటల్ పెడితే అంతా వింతగా చూశారు. శరత్ ఆ వెక్కిరింపుల్ని లెక్క చేయలేదు. మొదట్లో బ్యాంకులు, కార్పొరేట్ సంస్థలకు స్నాక్స్ సరఫరా చేసేవాడు. ఆ తర్వాత డోర్ డెలివరీ ఇచ్చే ప్రత్యేక హోటళ్లుగా మార్చాడు. అలా చెన్నైతో పాటు హైదరాబాదు, జైపూర్, అహ్మదాబాద్ నగరాలకూ విస్తరించాడు. ఐదేళ్లలో ఫుడ్‌కింగ్ టర్నోవర్ ఎనిమిది కోట్లకు చేరింది. 200 మందికి ఉపాధి కల్పిస్తోంది. వీళ్లంతా మురికివాడల్లోని కుర్రకారే. పదిలోపు విద్యార్హత ఉన్నవాళ్లే. వివిధ కారణాలతో బడి మానేసినవాళ్లు. భవిష్యత్తులో లక్షమందికి ఉపాధి కల్పించడం శరత్ లక్ష్యం. సేవ-రాజకీయం-అవార్డులు ఉపాధి కల్పించడంతోనే సరిపెట్టుకోలేదు శరత్. రెండేళ్ల కిందట 'హంగర్ ఫ్రీ ఇండియా' పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థ ప్రారంభించాడు. దీని తరపున మురికి వాడల్లోని పిల్లలు, యువతకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నాడు. రాజకీయాల్లోకీ అడుగుపెట్టాడు. 2009లో దక్షిణ చెన్నై లోక్‌సభ, 2011లో శాసనసభ, అదే ఏడాది చెన్నై మేయర్‌గా పోటీ చేశాడు. విజయం సాధించకపోయినా రాష్ట్రం దృష్టిని ఆకర్షించాడు. 2008లో 'ఎగ్జాంపుల్ టు యూత్', 'పెప్సి ఎంటీవీ యూత్ ఐకాన్' అవార్డులు, 2010లో 'రిట్జ్ చెన్నై యూత్ ఐకాన్', 2011లో 'సీఎన్‌ఎన్-ఐబీఎన్ యంగ్ ఇండియన్ లీడర్' అవార్డులు శరత్‌ని వరించాయి. శరత్ జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థల్లో విద్యార్థులనుద్దేశించి స్ఫూర్తిదాయక ఉపన్యాసాలు చేశాడు.
|
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి