Sunday Eenadu Magazine (04/03/2012)



ప్రశ్న
సామాన్యుడి ఆయుధం
ఫైలు కదిలించడానికి లంచమడుగుతారు. అకారణంగా లాకప్పులో తోసేస్తారు. హఠాత్తుగా బ్యాంకుఖాతాలోని డబ్బు మాయమైపోతుంది. బీమా ఏజెంటు మాటలు అబద్ధాలని తేలిపోతుంది. ఎన్నో సమస్యలు, ఒకటే పరిష్కారం.
...ప్రశ్న!ప్రశ్నిస్తేనే జవాబు. నిలదీస్తేనే న్యాయం.
వరు?
ఒక ప్రశ్న తత్వశాస్త్రానికి మూలమైంది.
ఎందుకు?
ఒక ప్రశ్న ఆవిష్కరణలకు బీజమైంది.
ఎలా?
ఒక ప్రశ్న సముద్రయాత్రలకూ అంతరిక్ష అన్వేషణలకూ కారణమైంది.
ఏమిటి?
ఒక ప్రశ్న విప్లవాలకు వూతమిచ్చింది. ప్రశ్నే లేకపోతే మానవజాతి మనుగడే లేదు. న్యూటన్‌ ప్రశ్నించకపోతే, ఎడిసన్‌ ప్రశ్నించకపోతే, మహాత్ముడు ప్రశ్నించకపోతే, చేగువేరా ప్రశ్నించకపోతే...ప్రపంచ చరిత్ర మరోలా ఉండేది. ఇంకోలా చదువుకునేవాళ్లం.
ప్రశ్నకు దూరంగా ఉన్నవారు అజ్ఞానంలోనే మిగిలిపోతారు. ప్రశ్నించే ధైర్యం ఉన్నవారికే, ప్రశ్నించాలన్న వివేకం ఉన్నవారికే, ప్రశ్నను సృష్టించగల సత్యాన్వేషికే ఎప్పటికైనా జవాబు దొరుకుతుంది.
ప్రశ్నించడం గొప్ప కళ. అజ్ఞానులు ప్రశ్నించలేరు. మొహానికి మేధావి మార్కు మాస్కేసుకున్నా...ప్రశ్న అడుగుతున్నప్పుడే అయ్యగారి డొల్లతనం బయటపడిపోతుంది.
ప్రశ్న పదునుగా ఉండాలి. అప్పుడే, గురితప్పకుండా లక్ష్యాన్ని చేరుతుంది. రాల్చాల్సినవి రాల్చేస్తుంది. కూల్చాల్సినవి కూల్చేస్తుంది. బిక్కుబిక్కుమంటూ గజగజావణికిపోతూ అర్థమైకానట్టు గొణిగితే...అది ప్రశ్నించడం కానేకాదు, ప్రాధేయపడటం.
ప్రశ్నలో గందరగోళం ఉండకూడదు. అస్పష్టత తొంగిచూడకూడదు. సూటిగా సుత్తిలేకుండా ఉండాలి.
ఇవన్నీ ప్రశ్న ప్రాథమిక లక్షణాలు. వ్యక్తినైనా, వ్యవస్థనైనా నిలదీస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు.
ప్రశ్న గొప్పదనం మన పెద్దలకు బాగా తెలుసు. అందుకే, ఆధ్యాత్మిక సాహిత్య రచనకు ప్రశ్నోత్తర ప్రక్రియనే ఎంచుకున్నారు. 'భగవద్గీత' మొత్తం కృష్ణార్జునుల సంవాదమే. అర్జునుడు ప్రశ్నిస్తాడు. కృష్ణుడు జవాబిస్తాడు. ఉపనిషత్తుల్లో ప్రత్యేకంగా ప్రశ్నోపనిషత్తే ఉంది. రమణమహర్షి బోధనలన్నీ ప్రశ్న-జవాబుల రూపంలోనే ఉంటాయి. 'క్వశ్చన్‌ ఈజ్‌ గాడ్‌' అంటారు జిడ్డు కృష్ణమూర్తి.
అంత విలువైన ప్రశ్న, అంత పదునైన ప్రశ్న - చిలుముపట్టిపోయింది, మొత్తంగా మొద్దుబారిపోయింది. అరవై అయిదేళ్ల క్రితం తెల్లవారిని ప్రశ్నించడం అయిపోయాక, ఆ ప్రశ్నలన్నింటినీ కట్టకట్టి అటకెక్కించేశాం. అందుకే ఈ దుస్థితి.
బర్త్‌ సర్టిఫికెట్‌ కావాలంటే లంచం ఇవ్వాలి. డెత్‌ సర్టిఫికెట్‌ కావాలన్నా లంచం ఇవ్వాలి. ఎందుకివ్వాలని ప్రశ్నించం.
వేసిన రోడ్లే వేస్తారు. పూడ్చిన గోతులే పూడుస్తారు. అధికారులూ గుత్తేదార్లూ కుమ్మక్కై ఖజానా మొత్తం తవ్వేసుకుంటారు. 'ఏమిటీ దోపిడి' అని ప్రశ్నించం.
మీడియా టైగర్లు మైకు కనిపించగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ప్రజల్లో విద్వేషాలు రేపుతారు. అగ్నిగుండాలంటారు, దమనకాండలంటారు. ఇదేం భాషని ప్రశ్నించం.
చట్టసభల్లో బూతులు దొర్లుతాయి. పిడిగుద్దులు పేలతాయి. ఇదేం పద్ధతని ప్రశ్నించం.
ఫలానా బ్యాంకువాళ్లు వడ్డీల మీద వడ్డీలు వేస్తారు, అర్థంలేని జరిమానాలతో జేబులకు చిల్లులేస్తారు. అయినా, నోరు మెదపం.
ఆవేశం కట్టలు తెంచుకుంటున్నా, ఆక్రోశం ఉప్పొంగుతున్నా...గొంతు పెగలదు. ప్రశ్న బయటికి రాదు. ఏ అజ్ఞాతశక్తో నోటికి తాళం వేసినట్టు, ఏ కిరాతకుడో గొంతు మీద కత్తిపెట్టినట్టు.. నోరుమూసుకు కూర్చుంటాం. ఎవరేం చేస్తారో అన్న భయం. ఫిర్యాదులు చేసీచేసీ విసిగిపోయామన్న నైరాశ్యం. ఆ ధోరణికి సగం కారణం నాయకులే! పాలకుల దృష్టిలో ప్రశ్నంటే ధిక్కారం. 'మా భూముల్ని లాక్కోవడం ఏం న్యాయం?' అని ప్రశ్నిస్తే, ఖాకీల్ని ఉసిగొల్పుతారు. 'మా ఉపాధిని మింగేయడం ధర్మమేనా' అని నిలదీస్తే, తుపాకుల్ని గురిపెడతారు. అవున్లే, చట్టసభల్లో ప్రశ్నలడగడానిక్కూడా ఓరేటు పెట్టి 'క్వశ్చన్‌ అవర్‌'ను టోకుగా అమ్మేసుకునే వారికి...ప్రశ్నంటే మాత్రం ఏం గౌరవం ఉంటుంది? సంక్షుభిత సమాజంలో, విలువలు చచ్చిన వ్యవస్థలో...తక్షణావసరం ప్రశ్న. తక్షణ పరిష్కారమూ ప్రశ్నే. దేశానికిప్పుడు కావలసింది మౌనయోగులు కాదు. ప్రశ్నించే యోధులు.
భారత రాజ్యాంగం, సర్వోన్నత న్యాయ స్థానం, చట్టాలు...పౌరులకు తిరుగులేని ప్రశ్నాయుధాల్ని ప్రసాదించాయి. నోటి తాళాల్ని బద్దలుకొట్టుకుని, భయాల ముసుగులు చించేసుకుని...నిలదీద్దాం రండి! ప్రశ్నిద్దాం పదండి!
'ప్రజా ప్రయోజన' ప్రశ్న
సమస్యలో తీవ్రత ఉండాలి. అది ప్రజాబాహుళ్యానికి సంబంధించినదై ఉండాలి. ఫిర్యాదుదారు స్వరంలో నిజాయతీ ఉండాలి. చాలు, ఈ మాత్రం అర్హత చాలు... న్యాయమూర్తులు స్పందించడానికి, పాలన వ్యవస్థ మీద కళ్లెర్రజేయడానికి. కార్డుముక్క అయినా కళ్లకద్దుకుంటారు. చిత్తుకాయితమైనా అపురూపంగా స్వీకరిస్తారు. 'ప్రజా ప్రయోజన వ్యాజ్యం'...న్యాయవ్యవస్థ సామాన్యుడి కోసం ప్రత్యేకించిన మహాస్త్రం! ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల నిర్లిప్తత...తదితర సమస్యల విషయంలో హైకోర్టూ సుప్రీం కోర్టూ చాలా సత్వరంగా, అంతే తీవ్రంగా స్పందించిన సందర్భాలు కోకొల్లలు.
ఆన్‌లైన్‌ లాటరీలను ప్రభుత్వం ఎందుకు అనుమతిస్తోంది? దుష్ఫరిణామాలున్న మందుల తయారీకి సర్కారు ఎలా లైసెన్సులు ఇచ్చింది?
నిమజ్జనాల వల్ల జలకాలుష్యం పెరుగుతోందని తెలిసీ, ప్రోత్సహిస్తున్నారెందుకు?
...సామాన్యుడి మదిలో మెదిలిన ఎన్నో ప్రశ్నలకు ప్రజా ప్రయోజన వ్యాజ్యాల ద్వారానే జవాబు దొరికింది. పరిష్కారమూ లభించింది. న్యాయవ్యవస్థ ప్రజాహిత వ్యాజ్యాలను అనుమతించడం ద్వారా.. కార్యనిర్వాహక వ్యవస్థ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని సుప్రీంకోర్టు గట్టిగా సమర్థించుకుంది. 'ప్రభుత్వం సరిగా పనిచేయకపోతే ఇక సామాన్యుడి ప్రయోజనాలను కాపాడేదెవరు?'
...ఇదీ 'సుప్రీం' ప్రశ్న!
'సమాచార' ప్రశ్న
మనం రోజూ ప్రయాణించే రోడ్డు కంకరతేలిపోతుంది. 'ఆ కాంట్రాక్టరు అంతు చూడాలి?' అనుకుంటాం. మనం రోజూ చూసే ఛానల్‌లో ఓ రాజకీయ నాయకుడు ప్రభుత్వ పథకాల గురించి వూదరగొడుతుంటాడు. 'ఆ కథ వెనుక కథల్ని బయటపెట్టాల'ని మనసులోనే నిర్ణయించుకుంటాం.
చౌకధరల దుకాణం డీలరు ఎప్పుడూ సరుకు రాలేదనే బుకాయిస్తాడు. 'ఆ బండారం తవ్వితీయాలి' అని పళ్లునూరతాం.
స్టేషన్‌ ఆఫీసరును ఎప్పుడు కదిలించినా 'మీ నగల చోరీ కేసే కదా! పరిశోధనలో ఉంది' అంటూ తలతిప్పుకుంటాడు.
'పోలీస్‌ వ్యవస్థ ఏం చేస్తోంది?' బల్లగుద్ది దబాయించాలనిపిస్తుంది. ఆగ్రహం, ఆవేశం... ఆ కాసేపే. వెంటనే, చల్లబడిపోతాం. మన ప్రపంచం మనది. మన పరుగు మనది. కాస్త తీరిక చేసుకుంటే ఓపిక తెచ్చుకుంటే ఆ బాగోతాలన్నీ బయటికి లాగొచ్చు. చీకటి వ్యవహారాల్ని వెలుగులోకి తీసుకురావచ్చు - 'సమాచార హక్కు చట్టం' సాయంతో. పంచాయతీ ఆఫీసు నుంచి రాష్ట్రపతి భవన్‌ దాకా...ఏ కార్యాలయం నుంచి అయినా సమాచారం పొందవచ్చు. తెల్లకాగితం మీద రాసిచ్చినా చాలు. నిర్ణీత వ్యవధిలోపు సమాచారం ఇవ్వాలి. లేదంటే, సంబంధిత అధికారి జరిమానా కట్టాల్సి ఉంటుంది. తోకజాడిస్తే...సమాచార కమిషన్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు. 'హమారా పైసా...హమారా హిసాబ్‌' ...డబ్బు మనది అయినప్పుడు, ఆ లెక్కలు కూడా మనవే, మనకు తెలియాల్సిందే.
మరిన్ని వివరాలకు...
రాష్ట్ర సమాచార కమిషన్‌,
గ్రౌండ్‌ ఫ్లోర్‌, హాకా భవన్‌,
పబ్లిక్‌ గార్డెన్స్‌ ఎదురుగా,
నాంపల్లి, హైదరాబాద్‌. ఫోన్‌: 040 - 23230245,
www.apic.gov.in
'మానవ హక్కుల' ప్రశ్న...
ఈ భూమి పాలకుల అబ్బసొత్తా, పొక్లెయినర్లతో దున్నించడానికి? ఖాకీ డ్రస్సు వేసుకుంటే నియంతలైపోతారా, ఎవర్నయినా లాఠీలతో కుళ్లబొడిచేయడానికి? ...చాలాసార్లు కడుపు రగిలిపోతూ ఉంటుంది. ఎవర్ని ప్రశ్నించాలో తెలియదు. ఎలా నిలదీయాలో తెలియదు.
భయం వద్దు. బాధ వద్దు. భారత రాజ్యాంగం మన చేతిలో పెద్ద అమ్ములపొదే పెట్టింది. ప్రతిపౌరుడికీ కొన్ని ప్రాథమిక హక్కులున్నాయి. వాటి విషయంలో ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా... న్యాయస్థానాలు, మానవ హక్కుల కమిషన్‌ వంటి వివిధ వేదికల ద్వారా ప్రశ్నించవచ్చు. స్వేచ్ఛగా, నిర్భయంగా, హుందాగా బతికే హక్కు ప్రతి మనిషికీ ఉంది. ఆ హక్కుకు భంగం కలిగితే, అది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది. ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు, తోటిపౌరులు - బాధ్యులు ఎవరైనా కావచ్చు. ఆ వివక్షను ప్రశ్నించడానికి సామాన్యులకు కూడా అందుబాటులో ఉన్న ఓ శక్తిమంతమైన వేదిక మానవ హక్కుల కమిషన్‌. మన విషయంలోనే కాదు, ఎదుటి మనిషి హక్కులకు భంగం కలుగుతున్నట్టు అనిపించినా...కమిషన్‌ను ఆశ్రయించవచ్చు. హైదరాబాద్‌లో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ కార్యాలయం ఉంది. ఢిల్లీ కేంద్రంగా జాతీయ కమిషన్‌ పనిచేస్తుంది. కలం, కాగితం చాలు...కేసు వేయడానికి. గుండెధైర్యం చాలు...నిగ్గదీసి ప్రశ్నించడానికి.
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ కార్యాలయం,
గృహకల్ప కాంప్లెక్స్‌,
నాంపల్లి, హైదరాబాద్‌. ఫ్యాక్స్‌: 040-24601573
aphumanrights@ap.nic.in
'అవినీతి'పై ప్రశ్న...
బిల్లు రావాలి. లంచం ఇవ్వాలి.
ఫైలు కదలాలి. లంచం ఇవ్వాలి.
సంతకం చేయాలి. లంచం ఇవ్వాలి.
ఆర్డరు కాపీ రావాలి. మళ్లీ లంచం ఇవ్వాలి.
లంచంలేని ఫైళ్లు పక్షవాత రోగుల్లా మూలనపడుంటాయి. మార్చురీ శవాల్లా కుళ్లిపోతూ కనిపిస్తాయి. ఆ రోగకారక క్రిముల్నీ ఆ చావు వెనకున్న హంతకుల్నీ నిలబెట్టి నిలదీయడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థే...అవినీతి నిరోధకశాఖ. ఈ విభాగం రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో జరిగే చీకటి లావాదేవీలపై విచారణ జరుపుతుంది. లంచాల అధికారులను వలపన్ని పట్టుకుంటుంది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లోని అవినీతిపై సీబీఐ ఓ కన్నేసి ఉంచుతుంది. అవినీతి నిరోధకశాఖకు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను కార్యాలయాలున్నాయి. ఆరోపణ రుజువైతే... నేర తీవ్రతను బట్టి ఆ అవినీతిపరుడి ఉద్యోగం వూడుతుంది, ఇంక్రిమెంటుకు కోతపడుతుంది, ప్రాధాన్యం లేని సీటుకు బదిలీ జరుగుతుంది. డీజీపీ లేదా ఏడీజీపీ స్థాయి అధికారి ఈ విభాగానికి నేతృత్వం వహిస్తారు. రాష్ట్రప్రభుత్వ శాఖల్లో అవినీతి, నిర్లక్ష్యం, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలుంటే లోకాయుక్తకూ ఫిర్యాదు చేయవచ్చు. కర్ణాటక లాంటి చోట్ల ఇప్పటికే ఆ వ్యవస్థ విశ్వరూపం చూపింది.
డైరెక్టర్‌ జనరల్‌ కార్యాలయం,
అవినీతి నిరోధకశాఖ, హైదరాబాద్‌.
ఫోన్‌: 040- 24740196, 24740197
ఈమెయిల్‌ ఫిర్యాదులకు: dg_acb@ap.gov.in
రిజిస్ట్రార్‌, లోకాయుక్త కార్యాలయం,
5-9-49, బషీర్‌బాగ్‌ హైదరాబాద్‌.
ఫోన్‌: 040 - 2323 2877, 2324 1614
ఈమెయిల్‌ : ap.lokayukta.gmail.com
వెబ్‌సైట్‌:lokayukta.ap.nic.in
'వినియోగ' ప్రశ్న
వినోదాలు వద్దనుకుని, విలాసాలు త్యాగం చేసుకుని, అవసరాలు తగ్గించుకుని, పైసాపైసా కూడబెట్టుకుని...ఏ రిఫ్రిజిరేటరో కొంటాం. వారం రోజుల్లో మూలనపడిపోతుంది. మన సొమ్మును భద్రంగా కాపాడాల్సిన బ్యాంకులే చిన్నగా కన్నాలేయడం మొదలుపెడతాయి. ధీమా ఇవ్వాల్సిన బీమా కంపెనీలు ఎగనామం పెట్టేస్తాయి. గాలిమేడలు చూపించిన బిల్డరు మొండి గోడల దశలోనే మాయమైపోతాడు.
ఇలాంటప్పుడు ఎలా స్పందించాలి? ఎవర్ని నిలదీయాలి?
సాధారణంగా మనల్ని మనం తిట్టుకుంటాం. 'అంతా మన ఖర్మ' అన్న కర్మసిద్ధాంతమొకటి! ఎంతకాలమీ మౌనం. ప్రశ్నించాల్సిన సమయం రానేవచ్చింది.
పుచ్చిపోయిన సరుకు ఎందుకు అంటగట్టారు? నాసిరకం సేవలు ఎందుకందించారు?
హామీ నిలబెట్టుకోవడం చేతకాదా? మానసిక క్షోభకు గురిచేయడం మీకు న్యాయమా?
...మొహమాటం వద్దు. నిర్లిప్తత వద్దు. ఆదమరుపు వద్దు. ధైర్యంగా ప్రశ్నించండి.
మనం కొన్న ఉత్పత్తుల్లో ఏవైనా సమస్యలుంటే, సేవల విషయంలో అసంతృప్తి ఉంటే, అన్నిటికంటే ముందు చేయాల్సిన పని... చెల్లింపు రసీదు, వారంటీ కార్డూ వెతికిపెట్టుకోవడం. ఆతర్వాత, ఆయా సంస్థల 'కస్టమర్‌ కేర్‌' హెల్ప్‌లైన్‌ ద్వారా ప్రశ్నించవచ్చు. పెద్దపెద్ద బ్రాండ్‌లన్నీ ఇరవైనాలుగు గంటలూ అందుబాటులో ఉండే నంబర్లను ఏర్పాటు చేస్తున్నాయి. అవే ప్రశ్నలతో ఖాతాదారుల సేవా విభాగం ఇ-మెయిల్‌ చిరునామాకు ఉత్తరం రాయవచ్చు. మన ప్రశ్న నిఖార్సయిన ప్రశ్నలాగానే ఉండాలి. విమర్శలొద్దు దూషణలొద్దు. ఆ ఉత్తర ప్రత్యుత్తరాల్ని జాగ్రత్తగా దాచుకోవాలి. భవిష్యత్తులో సాక్ష్యాలుగా వాడుకోవచ్చు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా...సరైన స్పందన లేకపోతే వినియోగదారుల న్యాయస్థానాన్ని ఆశ్రయించడమే ఉత్తమం. జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఇవి పనిచేస్తున్నాయి. వినియోగదారుల పరిరక్షణ చట్టం ప్రకారం...'వినియోగదారుడంటే కొంత మొత్తాన్ని చెల్లించి లేదా చెల్లిస్తానని హామీ ఇచ్చి సరుకులు కొన్నవాడు'. రైల్వేశాఖ, విద్యుత్‌ సరఫరా సంస్థ, జలమండలి, తపాలాశాఖ తదితర సంస్థలన్నీ ఈ పరిధిలోకే వస్తాయి. సురక్షితంగా గమ్యానికి చేర్చని ఆర్టీసీని ప్రశ్నించవచ్చు. దారిదోపిడీల నుంచి కాపాడలేని రైల్వేశాఖను ప్రశ్నించవచ్చు. నల్లాల్లో మురికినీటిని సరఫరా చేసే స్థానిక సంస్థల్ని ప్రశ్నించవచ్చు. ఉత్తరాల్ని చెత్తబుట్టపాలు చేసే తపాలాశాఖ నిర్వాకాన్ని ప్రశ్నించవచ్చు. జిల్లా కేంద్రాల్లో వినియోగదారుల వివాద పరిష్కార కేంద్రాలు ఉన్నాయి. వివరాలకు: www.scdrc.ap.nic.in
పింఛన్లు, ప్రావిడెంట్‌ఫండ్‌, ప్రభుత్వరంగ బ్యాంకులూ బీమా సంస్థలు, ఈఎస్‌ఐ, తపాలా, రైల్వే తదితర ...కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో సేవల లోపాల్ని ఈమెయిల్‌ ద్వారా ప్రశ్నించే అవకాశం ఉంది. కేంద్ర పాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల శాఖ ఇందుకు ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను ఏర్పాటు చేసింది.
వివరాలకు:pgportal.gov.in
ఖాతాలోని డబ్బు మాయం అవుతోందనో, ఏ చిన్నసాకు దొరికినా వేలకువేలు జరిమానాలు విధిస్తున్నారనో, సేవల్లో అసాధారణమైన జాప్యం ఉంటోందనో ..ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులపైనా ఎన్నో ఫిర్యాదులు. ఇలాంటి చేదు అనుభవాలేమైనా ఉంటే ఆయా బ్యాంకుల్ని ప్రశ్నించడానికి ఓ రాజమార్గం ఉంది.
బ్యాంకింగ్‌ అంబుడ్స్‌మన్‌ కార్యాలయం,
భారతీయ రిజర్వు బ్యాంకు ఆవరణ,
సైఫాబాద్‌, హైదరాబాద్‌.
ఫోన్‌ : 040-23210013, 23243970.
ఈమెయిల్‌: bohyd@rbi.org.in
'స్టాక్‌' ప్రశ్న...
సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్చ్సేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) మార్గదర్శకాలతో స్టాక్‌మార్కెట్‌ వ్యవహారాల్లో పారదర్శకత పెరిగింది. ఆన్‌లైన్‌ సేవల కారణంగా వేగమూ పెరిగింది. జారీ పూర్తయిన పన్నెండు పనిరోజుల్లోపు ఈక్విటీ వాటాలను కేటాయించాల్సిందే. ముప్పై రోజుల్లోపు డివిడెండ్‌ మొత్తం వాటాదారుడికి అందాల్సిందే. ఆలస్యమైతే పద్దెనిమిదిశాతం వడ్డీతో సహా వడ్డించాలి (మ్యూచువల్‌ఫండ్‌ డివిడెండ్లు అయితే, పదిహేనుశాతం). ఎక్కడ ఏ తేడా వచ్చినా, సంబంధిత సంస్థల్ని ప్రశ్నించవచ్చు. సెబీ ద్వారా నిలదీయవచ్చు.
ఇన్వెస్టర్ల ఫిర్యాదుల్ని పరిష్కరించడానికి సెబీ ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. వెబ్‌సైట్‌: www.scores.gov.in
'బీమా' ప్రశ్న...
ఆరు నెలలు ప్రీమియం చెల్లిస్తే చాలంటారు, పదేళ్ల తర్వాత కోట్లే నంటారు. వద్దనుకుంటే డబ్బు తీసేసుకోవచ్చంటారు... కొందరు బీమా ఏజెంట్లు అమాయకులకు రంగుల చుక్కలు చూపించేస్తారు. వాస్తవాలు మాత్రం మరోలా ఉంటాయి. ఇక అర్థంలేని కారణాలతో క్లెయిమ్‌లను తిరస్కరించడం, సకాలంలో డాక్యుమెంట్లు అందించకపోవడం, పాలసీ మొత్తం చెల్లించినా, చెల్లించలేదని బుకాయించడం... చికాకు పెట్టే చేష్టలెన్నో! తొలిదశలో పాలసీదారుల సేవా విభాగాన్ని సంప్రదించడం ఉత్తమం. మలిదశలో ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. 
కనీసం 30 రోజుల్లో ఎలాంటి సమాధానం రాకపోతే బీమా అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు. చివరి అస్త్రం...బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏ). క్లెయిమ్‌ తిరస్కరించినా, పాక్షికంగా ఆమోదించినా, ప్రీమియం అసాధారణ మొత్తంలో పెంచినా... కారణం ఏదైనా మన హక్కులకు భంగం కలిగితే, నిగ్గదీసి అడగొచ్చు. ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయవచ్చు.
ఐఆర్‌డీఏ వెబ్‌సైట్‌: www.igms.irda.gov.in
బీమా అంబుడ్స్‌మన్‌: insombudhyd@gmail.com
'రియల్‌' ప్రశ్న...
సూపర్‌ డీలక్స్‌ ఫ్లాటన్నారు? అద్దాల్లా మెరిసే రోడ్లన్నారు? స్విమ్మింగ్‌పూల్‌ కడతామన్నారు? జిమ్ము పెడతామన్నారు? ...బిల్డరు వాగ్దానాలకూ బిక్కుబిక్కుమనే వాస్తవాలకూ మధ్య తేడాలే 'రియల్‌' మోసాలు! రిజిస్ట్రేషన్‌ పూర్తయిన మరునిమిషమే బిల్డరు గాయబ్‌! ఆఫీసుకెళ్తే కనబడడు. ఫోను చేస్తే లిఫ్టు చేయడు. దురదృష్టం ఏమిటంటే, వేయి రూపాయల పాలసీకైనా బీమా నియంత్రణ సంస్థ భరోసా దొరుకుతుంది. ఐదువందల రూపాయల షేరుకైనా సెబీ అజమాయిషీ ఉంటుంది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో మాత్రం అలాంటి అత్యున్నత సంస్థ ఏదీ లేదు. మహా అయితే క్రెడాయ్‌, నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ రియల్‌టర్స్‌ లాంటి సంఘాల్ని సంప్రదించాలి. అక్కడా న్యాయం జరక్కపోతే సివిల్‌కోర్టులూ వినియోగదారుల ఫోరాలూ ఉన్నాయి. 'రియల్‌' మోసాల్ని ప్రశ్నించడానికి... సంఘటిత స్వరమే ఆయుధం! వందమంది కొనుగోలుదారులు ఒక్కటై వెళ్తే...ఏ బిల్డరు అయినా దిగొస్తాడు. అసలు, ఇల్లు కొంటున్నప్పుడే... ఆస్తి తాలూకు పత్రాలూ కార్పొరేషన్‌ లేదా మున్సిపాలిటీ అనుమతులూ క్షుణ్నంగా పరిశీలిస్తే చాలా సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ధర, నాణ్యత ఒక్కటే కాదు... చట్టబద్ధతా ముఖ్యమే. మనం ఎదుటి మనిషిని ప్రశ్నించే స్థాయిలో ఉండాలంటే, మనల్ని ఎవరూ ప్రశ్నించలేనంత స్వచ్ఛంగా ఉండాలి.
నిరంతర 'ప్రశ్న'...
ప్రతిరోజూ ప్రతి చోటా... ప్రభుత్వ వైఫల్యమో, సిబ్బంది నిర్లక్ష్యమో కనిపిస్తూనే ఉంటుంది. చెత్తడబ్బా నిండిపోయి దుర్వాసన గుప్పుమంటూ ఉంటే, స్థానిక సంస్థ హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేయండి. ట్రాఫిక్‌జామ్‌ ఉంటే, ట్రాఫిక్‌ హెల్ప్‌లైన్‌కు కాల్‌చేయండి. ప్రజాస్వామ్య వ్యవస్థకు సిగ్గుచేటనిపించే ఏ దృశ్యం కనబడినా, సెల్‌ఫోన్‌ కెమెరాలో బంధించండి ... సోషల్‌ మీడియా ద్వారా ఘనతవహించిన పాలన వ్యవస్థను ప్రశ్నించండి. హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ వంటి ప్రభుత్వ విభాగాలు కూడా ఇప్పుడు ట్విటర్‌లో ఖాతాలు తెరుస్తున్నాయి. నిరభ్యంతరంగా ప్రశ్నాస్త్రాలు సంధించుకోవచ్చు. ఫిర్యాదులో అంతర్లీనంగా ప్రశ్న ఉంది. 'మీ బాధ్యత మీరు నిర్వర్తించడం లేదు, ఖబర్దార్‌!' అన్న హెచ్చరిక ఉంది. స్పందించని ప్రభుత్వాధికారులకు ప్రశ్న ఒక మొట్టికాయ, జవాబుదారీతనం కరవైన పాలకులకు ప్రశ్న ఒక తొడపాశం. మొదటి ప్రశ్నకు స్పందించకపోవచ్చు. వంద ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి చేసినప్పుడు, చచ్చినట్టు దిగొస్తారు.
ఉద్యమం అంటే మరేమిటో కాదు...
వేయి గొంతుకల ప్రశ్న!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు