చరణోపాసన మూడుముళ్ల బంధం (14/06/2012)


మనసులు మురిసిన వేళ...
మెరిసిన కల్యాణ హేల
చరణోపాసన ప్రేమబంధం... మూడుముళ్ల బంధంతో మురిసిపోయింది. తారల తళుకులే తలంబ్రాలయ్యాయి. ఆకాశమంత పందిళ్లు వేసి అలరించు మంటపాన అంగరంగ వైభవంగా సాగిందా కల్యాణం. అతిరథుల ఆశీర్వచనాలే వేదమంత్రాలయ్యాయి. బంధుమిత్రుల అభినందనలు మంగళ వాద్యాలయ్యాయి. కొణిదెల వారి పెళ్లి సందడి ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. హైదరాబాద్‌ శివార్లలోని మొయినాబాద్‌లో ఉన్న టెంపుల్‌ ట్రీ ఫామ్‌హౌస్‌ - రామ్‌చరణ్‌, ఉపాసనల వివాహానికి వేదికైంది. గురువారం ఉదయం ఈ వేడుక ఘనంగా జరిగింది. రాత్రి హైదరాబాద్‌లోని హైటెక్స్‌ ప్రాంగణంలో భారీ విందు కార్యక్రమం అట్టహాసంగా సాగింది. మెగా పెళ్లి ముచ్చట్లు ఇవీ...
టెంపుల్‌ ట్రీ ఫామ్‌హౌస్‌ సినీ, రాజకీయ ప్రముఖులతో కళకళలాడింది. ధగధగలాడే కల్యాణ మంటపానికి ముద్దుల కొడుకు రామ్‌చరణ్‌ని చిరంజీవి తోడ్కొని వచ్చారు. ముత్యాలు, మల్లెపూలు పొదిగి ప్రత్యేకంగా సిద్ధం చేసిన పందిరి నీడలో వరుడు కుటుంబం వేదిక దగ్గరకు వచ్చింది. చరణ్‌ నుదుట తల్లి సురేఖ స్వయంగా కల్యాణ తిలకం దిద్ది బాసికం కట్టారు. వేదపండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఉదయం 8 గంటల 29 నిమిషాలకు వధువు ఉపాసన శిరస్సున జీలకర్ర బెల్లం ఉంచారు చరణ్‌. వధువు తల్లిదం డ్రులు అనిల్‌ కామినేని, శోభనారెడ్డి వరుడు కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. చిరంజీవి, సురేఖ దంపతుల సమక్షంలో సరిగ్గా 9 గంటలకు మగధీరుడు ఉపాసన మెడలో మూడుముళ్లు వేశారు. పురోహితులు శాస్త్రోక్తంగా పూజాదికాలు నిర్వహించి సప్తపది, అరుంధతి నక్షత్ర దర్శనం, అప్పగింతలు వంటి కార్యక్రమాల్ని జరిపారు.ధగధగలు: వధూవరులు ధరించిన సంప్రదాయ దుస్తులు ధగధగ మెరిసిపోయాయి. మనీష్‌ మల్హోత్రా తీర్చిదిద్దిన గోధుమ వర్ణం కుర్తా, ధోతీని ధరించారు రామ్‌చరణ్‌. వధువు వస్త్రాల్ని తరుణ్‌ తహలియానీ డిజైన్‌ చేశారు. ఆమె బంగారు వర్ణపు చీర, మెరూన్‌ రెడ్‌ చున్నీతో మెరిసిపోయారు. ఉపాసన మెడలోని ముత్యాల హారం, నగలు, ముక్కుపుడక ఆకట్టుకొన్నాయి. కల్యాణం జరుగుతుండగా రామ్‌చరణ్‌ స్వయంగా ఉపాసన ముక్కు పుడకని సరిచేయడం ఆహుతుల్ని ఆకట్టుకొంది. చరణ్‌, ఉపాసన తరఫు బంధువులు, సన్నిహితులు సంప్రదాయబద్ధమైన వస్త్రధారణతో కనిపించారు. హీరోలు అల్లు అర్జున్‌, రానాలు తెలుగుదనం ఉట్టిపడే పంచెకట్టులో వచ్చారు. 
కల్యాణ మంటపాన్ని, ప్రాంగణాన్ని సుమారు నాలుగు నెలలపాటు శ్రమించి తీర్చిదిద్దారు. కళా దర్శకుడు ఆనంద్‌సాయి నేతృత్వంలో మన రాష్ట్రంతోపాటు పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్రల నుంచి తీసుకొచ్చిన కళాకారులు, కార్మికులు ఆ వేదికను తయారుచేశారు. లైటింగ్‌ కోసం ముంబైకి చెందినవాళ్లు ఏర్పాట్లు చేశారు. ఈ బృందాలే గురువారం రాత్రి రిసెప్షన్‌ ప్రాంగణాన్నీ తీర్చిదిద్దాయి. రిసెప్షన్‌ దగ్గరి వేదికను పూర్తిగా శ్వేత, నీలి వర్ణాలతో తీర్చిదిద్దారు. గాజు పలకలతోనూ, దీపగుచ్ఛాలతోనూ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ ప్రాంగణంలో సుమారు అయిదువేల విద్యుద్దీపాలను ఉపయోగించారు. 
ఘుమఘుమలు: విందులో ఏర్పాటు చేసిన వంటకాలు అతిథుల నోరూరించాయి. మొత్తం 150కిపైగా వంటకాలను సిద్ధం చేసి వడ్డించారు. దక్షిణాది, ఉత్తరాది రుచులతోపాటు విదేశీ వంటకాలు మెనూలో ఉన్నాయి. చెన్నై, కోల్‌కతా నగరాల నుంచి మూడు రోజుల క్రితం రెండు వందల మంది వంట మనుషుల్ని పిలిపించారు. వారితో ప్రత్యేకంగా పిండి వంటల్ని తయారు చేయించారు. కదలివచ్చిన అతిరథులు: సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై నవ దంపతుల్ని ఆశీర్వదించారు. చిరంజీవి, నాగబాబు, పవన్‌కల్యాణ్‌, అల్లు అరవింద్‌, ప్రతాప్‌ సి.రెడ్డి తదితరులు అతిథుల్ని సాదరంగా ఆహ్వానించి వేదిక దగ్గరకు తోడ్కొని వచ్చారు. రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ సతీసమేతంగా వచ్చి దంపతుల్ని ఆశీర్వదించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి, తమిళనాడు గవర్నర్‌ రోశయ్య, సుప్రీమ్‌కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చలమేశ్వర్‌, తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు, సినీ ప్రముఖులు అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌, మోహన్‌బాబు, శ్రీదేవి, బోనీకపూర్‌, పార్తీపన్‌, వెంకటేష్‌, ఎన్టీఆర్‌, అంబరీష్‌, సుమలత, సుహాసిని, శ్రియ, రామానాయుడు, రాఘవేంద్రరావు తదితర ప్రముఖులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. అప్పగింతల క్రతువు ముగిశాక వధూవరులతో కలిసి ఇరు కుటుంబాలవాళ్లు ప్రత్యేకంగా ఫొటోలు దిగారు. అనంతరం చిరంజీవి స్వయంగా కెమెరా చేతపట్టుకొని తన కొడుకు కోడలిని ఫొటోలు తీశారు. గురువారం రాత్రి నిర్వహించిన విందుకు పలువురు ప్రముఖలు హాజరయ్యారు. ఈ వేడుకులో పది వేలమంది పాల్గొన్నట్లు అంచనా. సినీ తారలు నాగార్జున, మహేష్‌బాబు, ప్రభాస్‌, శరత్‌కుమార్‌, సూర్య, టబు, కాజల్‌, తమన్నా, 'ఈనాడు' ఎమ్‌డీ సీహెచ్‌. కిరణ్‌, మార్గదర్శి ఎమ్‌డీ శైలజాకిరణ్‌, మాజీ క్రికెట్‌ కెప్టెన్‌ అజారుద్దీన్‌, శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌, హీరో బాలకృష్ణ సతీమణి వసుంధర తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)