కుర్రకారోయ్..కనిపెట్టారోయ్!! (01/12/12)


క్యాంటీన్‌లో కబుర్లు... వెనక బెంచీ చాటింగ్‌లు... పుస్తకాలతో కుస్తీలు... అపోజిట్‌ సెక్స్‌ దోస్తీలు... అటుఇటుగా కాలేజీ కుర్రకారు తీరే ఇంత... కానీ సిసలైన విజేతలు కాస్త భిన్నం! సరదాలకు కామా పెట్టి లక్ష్యాలు చేపడతారు... కబుర్లకు బై చెప్పి కష్టపడి సాధిస్తారు... అందుకు ఈ ఆవిష్కరణలే సాక్ష్యం! వరించిన అవార్డులే ప్రమాణం! అలాంటి కొందరు యువ తరంగాల పరిచయం.

రైతు నేస్తం
పంట చేతికొచ్చే సమయానికే జంతువులు, పక్షులు దాడి చేస్తాయి. వాటిని తరమడం తలనొప్పి వ్యవహారమే. సౌర విద్యుత్తుతో ఈ సమస్యకు చెక్‌ పెడుతున్నారువిద్యార్థులు.
ఆవిష్కర్తలు: రాగిణిరెడ్డి, మాతృశ్రీ, పూర్ణచందర్‌, ప్రవీణ్‌, చైతన్యసాయి
పరిచయం: సిద్దిపేట పొన్నాల ఇందూరు ఇంజినీరింగ్‌ కాలేజీ ఈఈఈ మూడో సంవత్సరం విద్యార్థులు.
ఆలోచన: ఇంజినీరింగ్‌ ప్రాజెక్టులో భాగంగా.
ఆవిష్కరణ: సోలార్‌ హూటర్‌ సైరన్‌పనిచేసే విధానం: సౌరశక్తితో పనిచేస్తుంది. ఓ సౌర ఫలకానికి '555 టైమర్‌ బేస్డ్‌ అస్టేబుల్‌ సర్క్యూట్‌, హారన్‌ని అనుసంధానిస్తారు. సౌర ఫలకంపై సూర్యరశ్మి పడగానే సర్క్యూట్‌ పనిచేస్తుంది. అది విద్యుచ్ఛక్తిగా మారి హారన్‌ని మోగిస్తుంది. ఎంత సమయానికి ఒకసారి మోగాలో ముందే నిర్దేశిస్తారు. ధ్వని తీవ్రత పెరగాలనుకుంటే మరిన్ని సైరన్లు బిగించవచ్చు. ఈ పరికరం చుట్టూ ఫోకస్‌ ఎల్‌ఈడీ (లైట్‌ ఎంప్టింగ్‌ డయోడ్స్‌) అమర్చడంతో రాత్రివేళల్లో మెరుస్తాయి. అప్పుడు జంతువులు అటువైపు రావడానికి జంకుతాయి. ఒక్కో యూనిట్‌ తయారీకి రూ.2500 ఖర్చు అవుతుందంటున్నారు విద్యార్థులు.
ఏంటి లాభం: పొలాలకు రక్షణ. పదే పదే సైరన్‌ మోగడంతో అడవి పందులు, కోతులు, పక్షులు పొలాలపై దాడి చేయవు. విద్యుత్తు కంచెలతో జరిగే ప్రమాదాల నుంచి ఉపశమనం.
- చింతా నాగరాజు, సిద్దిపేట టౌన్‌
కరెంటు లేకున్నా ఛార్జింగ్‌
సెల్‌ఫోన్‌ లేని కుర్రకారు ఈరోజుల్లో అరుదే. మాటలు పోటెత్తాలంటే ఛార్జింగ్‌ ఉండాలి. మరి సమయానికి కరెంటు పోతే? పరిష్కారం చూపిస్తున్నారుఐదుగురు విద్యార్థులు.
ఆవిష్కర్తలు: శ్వేత, బబిత, అరుణ, సూర్యప్రకాశ్‌రెడ్డి, వేణు
పరిచయం: సిద్దిపేట పొన్నాల ఇందూరు ఇంజినీరింగ్‌ కళాశాల ఈఈఈ రెండో సంవత్సరం విద్యార్థులు.
ఆలోచన: కాలేజీ ప్రాజెక్టులో భాగంగా. సౌర విద్యుత్తు వాడకం పెంచాలనే ఉద్దేశం.
ఆవిష్కరణ: సౌర ఛార్జర్‌పనిచేసే విధానం: వాడిన పరికరాలు సౌరఫలకం, కంట్రోలింగ్‌ సర్య్కూట్‌. సౌరఫలకం సూర్యకాంతిని గ్రహించి కంట్రోలింగ్‌ సర్క్యూట్‌కి పంపిస్తుంది. సిలికాన్‌ మూలకాలతో తయారు చేసిన కాంతి విద్యుత్‌ చాలక ఘటం సూర్యరశ్మిని విద్యుత్తు శక్తిగా మార్చి విద్యుత్తును స్థిరీకరిస్తుంది. దానికి ప్రత్యేకంగా అమర్చిన ఛార్జర్‌తో సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ అవుతుంది. ఈ ఛార్జర్‌ తయారీకి రూ.500 చాలు.
ఏంటి లాభం?:సూర్యరశ్మి ఉంటే ఎక్కడైనా, ఎప్పుడైనా సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ చేయొచ్చు.
చూపునిచ్చే కారు
చూపు లేని వ్యక్తి కాలు బయట పెట్టాలంటేనే మరో వ్యక్తి సాయం కావాలి. మరి ఎవరి తోడూ లేకుండా కారు జామ్మంటూ దూసుకెళ్తే? ఈ నమూనా కారుని రూపొందించారు ఇంజినీరింగ్‌ కుర్రాళ్లు.
ఆవిష్కర్తలు: శ్రీకాంత్‌, సాయిరాం, త్రిలోక్‌, వంశీ
పరిచయం: నర్సాపూర్‌లోని బి.వి.ఆర్‌.ఐ.టి. ఇంజినీరింగ్‌ కళాశాల ఈఈఈ నాలుగో సంవత్సరం విద్యార్థులు.
ఆలోచన: ఇంజినీరింగ్‌ చదువు ప్రాజెక్టులో భాగంగా. కళాశాలలోని అసిస్టివ్‌ టెక్నాలజీ ల్యాబ్‌(ఎ.టి.ఎల్‌.)లో 45 రోజులు కష్టపడ్డారు.
ఆవిష్కరణ: అటానమస్‌ వెహికిల్‌ ఫర్‌ విజువల్లీ ఇన్‌ఫైడ్‌.పనిచేసే విధానం: కారుకి వెబ్‌కెమెరా, డీసీ మోటరు, బ్యాటరీ కంట్రోలర్‌, రిలేస్‌ అమర్చుతారు. వెబ్‌కెమెరా నుంచి వెలువడే సంకేతాల్ని దూరంగా ఉన్న కంప్యూటర్‌ గ్రహిస్తుంది. కారు ఎక్కడ ఉందో, ఏ దిశలో వెళ్తుందో తెరపై కనపడుతుంది. కంప్యూటర్‌ ముందు కూర్చున్న వ్యక్తి కారు ముందు కెళ్లడానికి అనుగుణంగా ఆదేశాలు జారీ చేస్తాడు. కారు లోపలి అంధుడి మాటలు సైతం కంప్యూటర్‌లో వినపడతాయి. ప్రస్తుతం దీన్ని కిలోమీటరు పరిధి నుంచి నియంత్రించవచ్చు.
గుర్తింపు: జూన్‌లో ఐఐటీ-ఖరగ్‌పూర్‌లో జరిగిన ఆప్టిమా జాతీయ సదస్సులో మూడో బహుమతి గెల్చుకుంది. గోవా క్వార్క్‌ జాతీయ సాంకేతిక పోటీల్లో రెండోస్థానంలో నిలిచింది.
- కణతాల భిక్షపతిచారి, నర్సాపూర్‌
సౌరశక్తి పట్టిస్తాడు
అవసరాలు పెరిగితే అగ్ర రాజ్యం అమెరికాకైనా విద్యుత్తు వెతలు తప్పవు. మరి ప్రత్యామ్నాయం ఏంటి? సంప్రదాయేతర విద్యుత్తు వాడకం.ఆ వనరుల్ని సమర్థంగా వాడుకునే సాఫ్ట్‌వేర్‌ రూపొందించాడు విజయవాడ యువకుడు.ఆవిష్కర్త: నాగభైరవ మిథున్‌మోహన్‌
పరిచయం: సొంతూరు కృష్ణా జిల్లా పెనమలూరు. అమెరికాలోని ఓహియో యూనివర్సిటీ ఆఫ్‌ డేటన్‌లో రెన్యువబుల్‌ అండ్‌ క్లీన్‌ ఎనర్జీ ఇంజినీరింగ్‌లో ఎం.ఎస్‌. చేస్తున్నాడు. అక్కడే పార్ట్‌టైం ఉద్యోగం.
ఆవిష్కరణ: సౌరశక్తిని సమర్థంగా వాడుకునే సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన
ఆలోచన: 2025 నాటికి సంప్రదాయేతర విద్యుత్తు వాడకం ఇరవై అయిదు శాతానికి పెంచాలని యూ.ఎస్‌. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎనర్జీ లక్ష్యం. ఈ దిశగా పరిశోధనల్ని ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగానే 'ఆప్స్‌ ఫర్‌ ఎనర్జీ కాంపిటీషన్‌' నిర్వహించారు. మిథున్‌ స్పందించాడు.
పనిచేసే విధానం: అమెరికా ప్రజలు తమ ఇళ్లపై సోలార్‌ ప్యానళ్లు అమర్చుకొని సౌర విద్యుత్తు ఉత్పత్తి చేస్తుంటారు. దాన్ని బ్యాటరీల్లో నిల్వ చేసి అవసరాలకు వాడుకొని మిగతాది విద్యుత్తు సంస్థలకు అమ్ముతుంటారు. అయితే ఉత్పత్తి చేసింది పొదుపుగా ఎలా వాడాలి? ఏ సమయంలో విక్రయించాలి? అవసరమైతే ఎలా కొనుగోలు చేయాలి? అనేది ఎంతకీ అంతుచిక్కదు. మిథున్‌ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగిస్తే చాలు. ఆ లెక్కలన్నీ కచ్చితంగా చెబుతుంది.
ఏంటి లాభం?: సౌర విద్యుత్తు వాడకంలో కచ్చితమైన వివరాలు తెలుస్తాయి. పొదుపు పాటించవచ్చు. ఎంత విద్యుత్తు వాడుకుంటున్నదీ, టారిఫ్‌ వివరాలు కళ్లముందే ఉంటాయి. ఆరోజు వాతావరణం, ఉష్ణోగ్రతల వివరాలు కూడా తెలుపుతుంది ఈ సాఫ్ట్‌వేర్‌.
గుర్తింపు: యూ.ఎస్‌. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎనర్జీ పాపులర్‌ ఛాయిస్‌ విభాగంలో రెండో బహుమతి. ఐదువేల అమెరికన్‌ డాలర్లు, ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. ఒహియో రాష్ట్ర శాసనసభ సైతం ఈ ఆప్‌ని ఉత్తమ ఆవిష్కరణగా గుర్తించింది. అమెరికా నోబెల్‌ బహుమతి గ్రహీత స్టీవెన్‌ చ్యూ మిథున్‌ని ప్రశంసించారు.
- యినకొల్లు సురేష్‌బాబు, విజయవాడ

http://www.facebook.com/pages/Electronic-Security-Systems-and-Solar-Products/245701395548462

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)