ధరించే దమ్ముందా? (Eenadu_02/02/13)


నెల రోజుల కిందట యావద్దేశం వూగిపోయింది... ఉరితీయాలంది... కానీ.. ఆ వూపిప్పుడు చల్లారింది... మళ్లీ ఘటనలు షరామామూలే! మరి కింకర్తవ్యం? అంతా చల్లబడిన చోటు నుంచే వేడి రగిలిస్తున్నారు యువ దర్శకుడు శేఖర్‌ కమ్ముల. ధర్నాలు, ఆందోళనలు కాదు.. మారాల్సింది మన మనసులంటూ సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారాయన. అమ్మాయిల్ని ఆదరించే మనసుందా మీకు? వారిపై అకృత్యాలను ఎదిరించే ధైర్యముందా మీకు? ఈ బిళ్ల(బ్యాడ్జ్‌) ధరించే దమ్ముందా? అంటూ నిలదీస్తున్నారు. 'ఐ కేర్‌.. ఐ రియాక్ట్‌' అనే నినాదంతో రాష్ట్రమంతా తిరుగుతూ కళాశాలలు, క్యాంపస్‌లు, ఐటీ సంస్థల్లో యువతను తట్టిలేపుతున్న శేఖర్‌తో 'ఈనాడు' ముఖాముఖి.
* ఈనాడు: నిర్భయ ఉదంతం.. తదనంతర స్పందనల తర్వాత.. ఇంత ఆలస్యంగా ఉద్యమిస్తున్నారెందుకు?
శేఖర్‌ కమ్ముల: ఆలస్యం కాదు. ఇదే సరైన సమయం. నిజానికి ఢిల్లీ సంఘటన తర్వాత అమ్మాయిల్లో భయం పెరిగింది. ఇటీవల కళాశాలలు, ఐటీ సంస్థల్లో వారితో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం స్పష్టమైంది. ఇంకా ఇలాంటివి నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ధర్నాలు, ఆందోళనల వల్ల కాదు.. మార్పు మనలోనే రావాలన్న లక్ష్యంతో దీనికి శ్రీకారం చుట్టాను.*ఈనాడు: అంటే ధర్నాలు, ఆందోళనలతో మార్పు రాదంటారా? ఢిల్లీ స్పందన స్వల్ప భావోద్వేగమేనా?
శేఖర్‌: ఇది అనూహ్య భావోద్వేగమే! కుల, మత, వర్గ, ప్రాంతంతో సంబంధం లేకుండా ఓ సామాజిక అంశంపై స్పందించడం గొప్ప విషయమే. అంతరాంతరాల్లో నివురు గప్పిన నిప్పులా ఎప్పటి నుంచో లోలోన రగులుతూ వచ్చిన ఉద్వేగమది. అందుకే యువత అంత తీవ్రంగా స్పందించింది. అయితే అది అక్కడితో ఆగిపోకూడదు. కఠినంగా శిక్షించాలనో, ఉరితీయాలనో కేవలం ఒక్కరోజు ఆవేశపడడం వల్ల సమస్య పరిష్కారం కాదు. ప్రతిరోజూ ఇలాంటివి అనేక చోట్ల ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఎవరికి వారు తమ సమస్యల చట్రంలో పడిపోయి, మా గొడవ కాదులే అని వదిలేస్తున్నారు. పాలకులు కూడా కుల, మత, ప్రాంతీయ ఉద్యమాలపై స్పందిస్తారు.. ఎందుకంటే అవి ఓట్లతో ముడిపడినవి. అదే స్త్రీ సమస్యలకూ, ఓటు బ్యాంకుకూ సంబంధం లేదు కాబట్టి మాట్లాడరు. కానీ మా సమస్యలపై స్పందిస్తేనే ఓట్లేస్తామని మహిళలు నిలదీసే రోజు వస్తే.. తప్పకుండా స్పందిస్తారు.
ఈనాడు: ఇప్పుడు మీరెంచుకున్న మార్గమేంటి?
శేఖర్‌: 'నేను అమ్మాయిలను గౌరవిస్తా.. అత్యాచారాల పట్ల స్పందిస్తా' (ఆంగ్లంలో ఐ కేర్‌.. ఐ రియాక్ట్‌).. ఈ నినాదాన్ని సాధ్యమైనంత ఎక్కువమందిలోకి తీసుకెళ్లే ప్రయత్నమిది. మన ఆలోచనల్లో, చూసే దృక్పథంలో, మనసుల్లో మార్పు తీసుకురావాలన్న లక్ష్యంతో కళాశాలలు, సాఫ్ట్‌వేర్‌ సంస్థలకు వెళుతున్నా. ''మీకు ఈ అన్యాయాల పట్ల నిరసన చెప్పాలనుందా? మీకివి నచ్చట్లేదా? కోపం, ఆవేశం వస్తుందా? అయితే ఈ నినాదమున్న బిళ్లను పెట్టుకోండ'ని యువతకు చెబుతున్నా. దీని గురించి అడిగినవాళ్లకి లక్ష్యమేంటో చెప్పి.. వారినీ ఇందులో భాగస్వాములను చేయాలి. ఇలా సాధ్యమైనంత ఎక్కువమందికి ఇది చేరువవ్వాలి. ఇప్పటి వరకైతే 50వేల బిళ్లలను కళాశాలలు, సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో యువతకు అందజేశా.
ఈనాడు: ఈ బిళ్ల పెట్టుకున్నంత మాత్రాన మారుతారా?
శేఖర్‌: వెంటనే మార్పు కనిపించకపోవచ్చు. కానీ ఈ బిళ్ల ధరిస్తే.. 'నేను అమ్మాయిలను గౌరవిస్తాన'నే సందేశం వెళ్తుంది. మన దృక్పథాన్ని ప్రతిబింబజేస్తుంది. అనుక్షణం గుర్తుచేస్తుంది. ముందుగా మనలో మనకే 'నేను మంచోడిన'నే భావన ఏర్పడుతుంది. సున్నితత్వం పెరుగుతుంది. వ్యక్తిత్వంలో మార్పునకు నాంది పడుతుంది. అమ్మాయిలను గౌరవించడం కూడా ఓ సామాజిక బాధ్యతగా భావించాలనే ప్రేరణ కలుగుతుంది. భావోద్వేగాలను పంచుకోవచ్చు. ఒక తరగతిలో గదిలో ఉపాధ్యాయుడు ధరించాడనుకోండి.. ఇది ఏంటని విద్యార్థులడుగుతారు. అలాగే ఇంట్లో అమ్మానాన్నలు పెట్టుకుంటే పిల్లలకు తెలుస్తుంది.. దీని విలువేంటో? మన మనసులో మంచి భావం ఏర్పడడమే కాకుండా.. మన ద్వారా మరికొందరు కూడా దీన్నించి స్ఫూర్తి పొందే అవకాశం ఉంటుంది. మనం ఎన్ని చట్టాలు తెచ్చినా.. ఎంత కఠిన శిక్షలు వేసినా.. అన్నింటి కంటే రావల్సింది మనలో మానసిక పరివర్తనే. ఆ మనసులో మార్పు అనేది దీనివల్ల సాధ్యమవుతుందని నమ్ముతున్నా. ఒక్కరిలో మార్పు వచ్చినా అది కచ్చితంగా శక్తిమంతమైనదే! అయితే ఈ బిళ్లను నిరంతరంగా పెట్టుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. అందుకే అబ్బాయిలను అడుగుతున్నా.. ''ఆ దమ్ముందా?'' అని. నిజానికి ఇదీ గాంధేయ పద్ధతే!ఈనాడు: ఎన్ని తరాలు మారినా మహిళను చూసే దృష్టి కోణం మారడం లేదు? కారణమేంటంటారు?
శేఖర్‌: కారణాలన్నీ మనకు తెలుసు. వాటిపై చర్చలు జరుగుతుంటాయి. కానీ ఎప్పటికి కొలిక్కి వస్తాయో తెలియదు. కాబట్టి కాసేపు కారణాలను పక్కనబెడదాం. ఎవర్నో నిందించడాని కంటే ముందు.. మనల్ని మనం మార్చుకునే ప్రయత్నం చేద్దాం. మనం బయటకు చెప్పేదానికి, చేసేదానికి ఎక్కడా పొంతన ఉండడం లేదు. ఉదాహరణకు ఇప్పుడు అబ్బాయిలనే చూడండి.. అమ్మాయిలపై వ్యాసం రాయమంటే బంగారు పతకం వచ్చేంత అద్భుతంగా రాస్తారు. కానీ బయటికొచ్చి ఏం చేస్తున్నారు? మళ్లీ అమ్మాయిలను ఏడ్పిస్తుంటారు. వ్యక్తిత్వంలో అంత తేడా ఉంది. ఎందుకలా అంటే.. ఆయా వ్యక్తులు పెరిగిన వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. కుటుంబ విలువలు, కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు.. ఇవి కూడా వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతాయి.
ఈనాడు: సినిమాలు కూడా ఒక కారణమనే విమర్శ ఉంది..?
శేఖర్‌: నేను కాదనను. సినిమాల ప్రభావం యువతపై ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో మనకు దార్శనికులంటూ ఎవరూ లేరు. సినిమా హీరోలనే అనుసరించే పరిస్థితి. స్త్రీని చులకన చేసేలా సన్నివేశాలు, సంభాషణలు చిత్రీకరిస్తున్న సినిమాలు వస్తున్నాయి. చూస్తున్నారు. తీస్తున్నారు. దీనిపై చర్చకు అంతం లేదు. అయితే నా వరకు నేను మంచి చిత్రాలే తీయగలనని హామీ ఇవ్వగలను. అందరి తరుఫున హామీ ఇవ్వగలవా? అంటే.. అది నా శక్తికి మించినది. అయితే నేనొక్కటి చెప్పగలను.. ఇప్పుడు కుల, మత, ప్రాంతాలకు వ్యతిరేకంగా సినిమాలు తీస్తే అడ్డుకుని, ఎలా అయితే నిరసన వ్యక్తపరుస్తున్నారో.. అలాగే అమ్మాయిలను కించపరిచే అసభ్యకర సన్నివేశాలు, అభ్యంతరకర భాష ఉపయోగించినా నిలదీయాలి. అలాంటి సినిమాలు చూడొద్దు.
ఈనాడు: అమ్మాయిలు వేసుకునే దుస్తులు కూడా ఈ అఘాయిత్యాలు జరగడానికి ప్రేరేపిస్తున్నాయనే వాదన కొందరు వినిపిస్తున్నారు..?
శేఖర్‌: అలా ఏం కాదు. ఏడేళ్ల పాప ఏం రెచ్చగొట్టే డ్రెస్‌ వేసుకుందని అత్యాచారం చేశాడు? అది స్వభావ లోపం. అంతేగానీ దుస్తులు ధరించడానికీ.. అత్యాచారాలు జరగడానికి సంబంధం లేదు. అయినా రెచ్చగొట్టేలా దుస్తులు వేసుకుందని చెప్పి.. అత్యాచారం చేస్తారా? మనమేమీ జంతువులం కాదు కదా.. ఏది మంచో ఏది చెడో తెలుసుకునే విచక్షణ మనకు ఉంటుంది కదా.. మరి మన బుద్ధి ఏం చేస్తున్నట్లు? ఇవన్నీ సాకులు. సంప్రదాయాలనేవి మనం ఏర్పాటుచేసుకున్నవి. వాటిని అబ్బాయిలు అతిక్రమించినప్పుడు.. అమ్మాయిలెందుకు చేయకూడదు? మీకో విషయం చెబుతా.. ఈ మధ్య ఓ ప్రిన్సిపల్‌ అన్న మాటలివి.. 'అసలు సమస్యంతా అబ్బాయిలతో కదా.. అబ్బాయిలను ఆరింటిలోపు ఇంటికి రమ్మని చెప్పండి. వాళ్లను ఇంటి పట్టునే ఉంచితే సరిపోతుంది కదా.. ఎందుకు అమ్మాయిలను నియంత్రించడం?' అని. ఆయన ఇది ఆచరిస్తున్నారు కూడా. 'నిజానికి అత్యాచారమన్నది తృప్తి కోసం కాదు.. కేవలం తన బలాన్ని ప్రదర్శించడం కోసం చేస్తార'ని ఎక్కడో చదివాను. జంతువులు చేసే పని అది. మనం అలవాటు చేసుకున్నాం. అదొక మానసిక దౌర్భల్యం.
ఈనాడు: చట్టాలు కఠినంగా మారితే పరిస్థితుల్లో మార్పు రావొచ్చా?
శేఖర్‌: మారాల్సింది చట్టాలు కాదు.. మన ఆలోచనా విధానం. పోలీసులు, న్యాయవ్యవస్థ.. అన్నీ మారాలని చెప్పుకుంటే వినడానికి బాగుంటుంది. కానీ అది ఎప్పటికవుతుందో తెలియదు. అందుకే మనలోనే మార్పు రావాలి. మన ఇంటి నుంచే మొదలవ్వాలి. అమ్మాయిలంటే గౌరవం కలిగేలా, వివక్ష లేకుండా పెంపకం ఉండాలి. విద్యార్థి దశ నుంచే అమ్మాయిలను ఏడిపించడం తప్పూ.. తప్పూ.. అని పాఠశాల, కళాశాలల్లో పదేపదే బోధించాలి. ఎంతగా చెప్పాలంటే.. ఇప్పుడు ఏబీసీడీలు, గణితం, సైన్స్‌.. ఎలా అయితే ఓ పాఠ్యాంశంగా చెబుతున్నారో.. ఇదీ ఓ సబ్జెక్ట్‌గా చెప్పాలి.
ఈనాడు: అబ్బాయిలకేం చెబుతారు?
శేఖర్‌: ప్రేమించడం తప్పు కాదు. ఆ ప్రేమను అమ్మాయికి చెప్పడమూ తప్పు కాదు. కానీ అమ్మాయిలు నో చెబితే.. నో అని వదిలేయండి.. నువ్వు తక్కువ. ఆమె ఎక్కువని కాదు.. మనకు ఇష్టమైతే స్నేహం చేస్తాం. లేదంటే చేయం. అమ్మాయిల విషయంలో కూడా అలాగే చేయండి. 'అవునంటే కాదనిలే.. కాదంటే అవుననిలే..' ఇలాంటివి సినిమాలకే పరిమితం. పదిసార్లు అడిగి వెంటపడితే పదకొండోసారి సరే అంటుందనుకోవడం సరైంది కాదు. అమ్మాయిలను సరదాగా ఆటపట్టిస్తున్నాం.. అదేం తప్పు కాదని అనుకోవద్దు. అది ఆటపట్టించడం కాదు.. బాధపెట్టడమే! ఇక్కడ్నించే పైశాచికత్వం మొదలవుతోంది. అమ్మాయిలు వద్దన్నా వెంటపడి ఏడిపించేవాడు 'హీరో' కాదు.. నో అంటే నో అని అర్థం చేసుకున్నవాడే 'హీరో' అని అర్థం చేసుకోండి.
అయితరాజు రంగారావు, ఈనాడు ప్రత్యేక విభాగం
భయం నీడలో... భరోసా జాడ!
ఢిల్లీ ఘటనతో దేశం నివ్వెర పోయింది... మానం కోసం ప్రాణాలొదిలిన నిర్భయ ధీరత్వాన్ని వేనోళ్ల పొగిడింది... కామాంధుల దుశ్చర్యను దునుమాడుతూ ఒక్కటై కదిలింది... ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపింది యువతే. వారి పోరాట ఫలితమే... ముష్కరుల్ని ఉరికంబం ఎక్కించాలనే గళాలు ఒక్కటయ్యాయ్‌... బూజు పట్టిన చట్టం కోరల్ని పదునెక్కించాలన్న డిమాండ్లు వూపందుకున్నాయ్‌... ఇంత జరిగాక... అకృత్యాలు ఆగుతాయన్న నమ్మకం జనాల్లో కలిగిందా? యువత వైఖరిలో గణనీయమైన మార్పొచ్చిందా? అమ్మాయిల తల్లిదండ్రులు గుండెపై చేతులేసుకొని నిబ్బరంగా నిద్రపోతున్నారా? వీటన్నింటిపై 'ఈతరం' రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. వాళ్ల అభిప్రాయాలు మీకందిస్తూనే... మానసిక నిపుణుల సూచనలూ జోడిస్తున్నాం.
చినుకు చిన్నగానే మొదలవుతుంది. అదే వర్షపు హోరుగా, భారీ ఉప్పెనగా ఉరకలెత్తుతుంది. మార్పు సైతం అలాంటిదే. ఢిల్లీ సంఘటన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోలేదు గానీ యువతలో చిన్న కదలిక మొదలైందంటారు సామాజిక విశ్లేషకులు. అత్యాచారాలు వెంటనే ఆగిపోలేదు కానీ అమ్మాయిల తీరులో మార్పు కనిపిస్తుందంటారు. ఆ సంఘటన ప్రభావం వల్ల ఎవరికి వారు అప్రమత్తంగా ఉండడం మొదలైందని చెప్పవచ్చు. సర్వేలో పాల్గొన్న యువత ఇదే విషయం ధృవీకరిస్తున్నారు. 'గతంలో వారాంతాల్లో మా క్లాసు అమ్మాయిలతో కలిసి సరదాగా సినిమాలు, ఔటింగ్‌కు వెళ్లేవాళ్లం. ఇప్పుడు ఏవో కారణాలు చెప్పి అంతా డుమ్మా కొడుతున్నార'ంటాడు ఇంజినీరింగ్‌ విద్యార్థి ప్రదీప్‌. అబ్బాయిల్లోనూ ఇదే తీరు. మా అక్కాచెల్లెళ్ల విషయంలో గతంలో కంటే ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలనుకుంటున్నాం అన్నారు సర్వేలో పాల్గొన్న చాలామంది కుర్రాళ్లు. అయితే కొన్నాళ్లకి పరిస్థితి మొదటికొస్తుందేమోనని అనుమాన పడ్డవాళ్లూ ఎక్కువే.తల్లిదండ్రుల భయం
ఈ సంఘటనతో అమ్మాయిల కంటే తల్లిదండ్రులే ఎక్కువ బాధ పడుతున్నారనే విషయం సర్వేలో స్పష్టమైంది. హైదరాబాద్‌ అమ్మాయి శుభాంగిణి చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ఢిల్లీ ఘటన తర్వాత ఆమె తల్లిదండ్రులు ఉన్నపళంగా ఉద్యోగం మానేసి ఇంటికి వచ్చేయమంటున్నారు. బెంగళూరులో చదివే వైజాగ్‌ అమ్మాయి హారిక యోగక్షేమాల గురించి తల్లిదండ్రులు రోజూ వాకబు చేస్తూనే ఉన్నారు. కొత్తగా పెళ్త్లె ఢిల్లీలో ఉంటున్న శ్రీలత భర్తతో కలిసి సరదాగా బయటికెళ్దామన్నా తల్లిదండ్రులు ఒప్పుకోని పరిస్థితి. హైదరాబాద్‌ వాసి సతీష్‌ (పేరు మార్చాం)కైతే హాస్టల్‌లో ఉంటూ చదివే ఒక్కగానొక్క కూతురుపైనే బెంగ. దీన్ని 'కెటాస్ట్రోఫిక్‌ మిస్‌ఇంటర్‌ప్రిటేషన్‌' అంటారు సైకాలజిస్ట్‌ డాక్టర్‌ విశ్వనాథ్‌. పదేపదే ఇలాంటి సంఘటనల గురించి ప్రచారం జరగడం, మాకూ ఆ దుస్థితి వస్తుందని బాధ పడటమే ఈ పరిస్థితికి కారణమంటారాయన. అయితే 'మహిళలపై ఈ అఘాయిత్యాలు, దారుణాల్ని నిశితంగా గమనించేవాళ్లు సమాజంలో తమకు భద్రత లేదన్న భావనలో పడిపోతారు. రాన్రాను ఇదో ఫోబియాలా మారుతుంది. ఈ పరిస్థితుల్లో వాళ్లు కచ్చితంగా మానసిక నిపుణులను సంప్రదించాల్సిందే' అంటారు క్లినికల్‌ సైకాలజిస్టు డాక్టర్‌ నిరంజన్‌రెడ్డి. 'ఇప్పుడు రాత్రివేళలో మగ సహోద్యోగులతో ఆఫీసుకెళ్లాలంటే భయమేస్తోంది. ఏళ్లకొద్దీ పరిచయమున్నా ఎవర్నీ నమ్మకలేకపోతున్నా' అన్న కాల్‌సెంటర్‌ ఉద్యోగి పద్మ మాటలే అందుకు నిదర్శనం
ఏం చేయాలి?
 దుస్సంఘటనలు జరగకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? మానసిక నిపుణులు చేస్తున్న సూచనలు.
* అమ్మాయిలు, ఉద్యోగినులు ఇలాంటి దుస్థితి నాకూ ఎదురైతే ఏం చేయాలనే వాస్తవ అంచనాకి ముందే రావాలి. అప్పుడు ఒంటరిగా కాకుండా జట్లుగా వెళ్లడం, కాలేజీలు, ఆఫీసుల నుంచి త్వరగా ఇంటికి వచ్చే ఏర్పాట్లు చేసుకోవడం సాధ్యమవుతాయి.* తల్లిదండ్రులూ తమ పిల్లలకి తరచూ ధైర్యం చెప్పాలి. సూచనలు, సలహాలివ్వాలి. అనుకోని పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొనేలా శిక్షణనిప్పించాలి.
* ఇంటికి దూరంగా ఉండే అమ్మాయిలు 'నేను ఫలానా జాగ్రత్తలు తీసుకుంటున్నా' అని తల్లిదండ్రులకు భరోసా ఇవ్వగలగాలి.
* విద్యార్థినుల కాలేజీ ప్రాంగణాల్లో, ప్రయాణ సమయంలో యాజమాన్యాలు భద్రతా చర్యలు తీసుకునేలా తల్లిదండ్రులు ఒత్తిడి తేవాలి.
* పోలీసులు, సామాజిక సంస్థలు, కళాశాలల యాజమాన్యాలు, సంస్థలు... ఉద్యోగులు, విద్యార్థినులతో తరచూ సమావేశాలు ఏర్పాటు చేస్తూ వాళ్లలో ఆత్మస్త్థెర్యం నింపాలి.
* తమకెదురయ్యే ప్రతి సమస్య, వ్యక్తిగత విషయాలు తమతో చర్చించే స్వేచ్ఛను తల్లిదండ్రులు పిల్లలకివ్వాలి.
* రాత్రివేళ విధులు నిర్వహించే ఉద్యోగినులను ఆఫీసు, గమ్యస్థానాలకు చేర్చే క్యాబుల్లో కెమెరాలు ఏర్పాటు చేయాలి.
- తమ్మిశెట్టి రఘుబాబు, ఈనాడు ప్రత్యేక విభాగం
యువ అంతరంగం
నిర్భయ ఉదంతం అనంతరం యువత మనస్పందనలపై హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, వరంగల్‌ నగరాలు, జిల్లాల్లో చేసిన సర్వే. వాళ్లు వెల్లడించిన వివరాలు.


Eenadu link: http://eenadu.net/Specialpages/etharam/etharaminner.aspx?qry=sp-etaram1


Advertisement 





కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)