వచ్చేస్తోంది... అంతం-6

వచ్చేస్తోంది... అంతం-6
మనిషి సంఘజీవే కాదు. పర్యావరణ జీవి కూడా! మట్టిలో మట్టిలా.. గాలిలో గాలిలా.. మనిషి కూడా సమస్త జీవజాతుల్లో ఒక జీవే. కాకపోతే మేధోశక్తి పుణ్యమాని తనకు హాని తలపెట్టే ముప్పులను, ఉపద్రవాలను తప్పించుకుంటూ ఒకింత ఆధిపత్యం చెలాయించటం నేర్చుకున్నాడు. ఎక్కడికక్కడ ఆవాసాలను ఏర్పరచుకుంటూ.. అవసరార్థం వస్తు సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడదే ఇతర జీవజాతులకు శాపమవుతోంది. ఆరో భారీ అంతర్థాన ముప్పునకు శరవేగంగా దారితీస్తోంది. దీని మూలంగా 21వ శతాబ్దం మధ్యలోనే ప్రపంచంలోని 75% జీవజాతులు అంతర్థాన ముప్పును ఎదుర్కోవచ్చని.. ఇందుకు మానవ తప్పిదాలే బీజం వేస్తున్నాయని తాజా నివేదిక ఒకటి గట్టిగా హెచ్చరిస్తోంది! 
కొత్త నీరు రావటం, పాత నీరు పోవటం సహజమే. కొత్త జీవుల రాకతో పాత జీవులు కనుమరుగు కావటమూ మామూలే. ఇది మన భూమ్మీద అనాదిగా జరుగుతున్న సృష్టి కార్యమే! అయితే దీనికీ ఒక లయ ఉంది. ఒక వేగముంది. ఏటా 1-5 జీవజాతులు అంతరించిపోతుంటాయి కూడా. కానీ ఇప్పుడు దీని వేగం గణనీయంగా పుంజుకుంది. చెట్లు, మొక్కలు, జంతువుల వంటివన్నీ 100 నుంచి 1000 రెట్ల వేగంతో అంతరించిపోవటం ఆరంభించాయి. మన వస్తు వినియోగంతో రోజురోజుకీ పెరిగిపోతున్న వ్యర్థాలు, కాలుష్యం, వాతావరణ మార్పు, జీవజాతులను వేటాడి పొట్టనపెట్టుకోవటం, వాటి ఆవాసాలను కబలిస్తుండటం వంటివన్నీ ఇందుకు దోహదం చేస్తున్నాయి. అందుకే స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ, యూనివర్సిడాడ్‌ నేషనల్‌ ఆటోనోమా డి మెక్సికో పరిశోధకులు దీన్ని ‘జీవ నిర్మూలన’గానూ వర్ణిస్తున్నారు. ఇది నిజంగా మానవత్వాన్ని పణంగా పెట్టటమేనని ఆందోళన వెలిబుచ్చుతున్నారు. వీళ్లంతా 1900 నుంచి 2015 వరకు 177 క్షీరదాలను.. 27,600 సకశేరుకాల తీరుతెన్నులను  క్షుణ్ణంగా పరిశీలించారు. సుమారు 32 శాతం.. అంటే 8,851 సకశేరుక జాతుల సంఖ్య, వాటి విస్తరణ చాలా వేగంగా తగ్గిపోతుండగా.. 40 శాతానికి పైగా క్షీరదాల జనాభా గణనీయంగా పడిపోతోంది. దీన్ని బట్టి త్వరలోనే జీవజాతులు భారీ ఎత్తున అంతర్థాన ముప్పునకు చేరువతున్నాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
కొత్త కాకపోవచ్చు గానీ..
దాదాపు 450 కోట్ల మన ‘భూ చరిత్ర’లో జీవజాతులు భారీ స్థాయిలో అంతరించిపోవటం కొత్తేమీ కాదు. ఇలా ఇప్పటికి ఐదుసార్లు జరిగింది. వీటి మూలంగా భూమ్మీద నివసించిన వాటిల్లో కనీసం 75% వృక్ష, జీవజాతులు కనుమరుగయ్యాయి. వీటిన్నింటికీ పర్యావరణ ప్రభావాలు, వృక్షాలు, గ్రహశకలాలు, తోకచుక్కలు కారణమైతే రాబోయే ఆరో అంతర్థానానికి మనిషే కారణమవుతున్నాడు! ఇదింకా ఆరంభం కాలేదుగా అని మనం సర్దిచెప్పుకోవచ్చేమో గానీ దీని అంచుననే నిలబడి ఉన్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిజానికి జీవుల అంతర్థాన ప్రక్రియ, వాటికి పట్టే సమయంతో పోలిస్తే మన జీవనకాలం చాలా చిన్నది. అందువల్ల దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఊహించటం కష్టం. కానీ పర్యావరణ వ్యవస్థలన్నింటి మీదా ఇది పెద్ద ప్రభావాన్నే చూపిస్తుందనేది మాత్రం నిజం. దీనికి గత అంతర్థాన యుగాలే నిదర్శనం. ప్రాణి తనను తాను రూపొందించు కోవటం దగ్గర్నుంచి.. ప్రాణులు, చెట్లు, మనుషుల అవసరాల వరకూ సమస్త జీవజాతులన్నింటికీ భూ వనరులే ఆధారమన్న విషయాన్ని విస్మరించలేం. గ్రహశకలాలు, తోకచుక్కల వంటి ముప్పుల విషయంలో మనమేమీ చేయలేకపోవచ్చు గానీ మనమే ఉత్పాతాలుగా మారకుండా చూసుకోవటం మన చేతుల్లోనే ఉంది. కాబట్టి భవిష్యత్‌ తరాల కోసమైనా జీవజాతులను రక్షించుకోవటం, కాపాడుకోవటం మన కర్తవ్యం. జీవో రక్షతి రక్షితః!
ఆ ఐదు అంతర్థానాలు
తొలి మహా అంతర్థానం: ఇది 44.4 కోట్ల సంవత్సరాల క్రితం జరిగింది. దాదాపు 86% సముద్ర జీవజాతులు అంతరించిపోయాయి. సిలికేట్‌ రాళ్లు వాతావరణంలోని కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చుకోవటం.. ఫలితంగా తీవ్రమైన చలితో మంచు యుగం ఏర్పడటం.. సముద్రమట్టాలు పడిపోవటం వంటవన్నీ దీనికి దోహదం చేశాయి.
రెండో అంతార్థనం: 36 కోట్ల ఏళ్ల కిందట మొదలైన ఇది సుమారు 2 కోట్ల సంవత్సరాల వరకూ కొనసాగింది. సుమారు 75% సముద్ర జీవజాతులు కనుమరుగయ్యాయి. కొత్తగా పుట్టుకొచ్చిన వృక్షాలు భూమి నిండా విస్తరించటం.. వీటి బలమైన వేళ్లే భూమిని చీల్చటం వల్ల బయటపడిన పోషకాలు సముద్రంలో కలవటం.. ఫలితంగా అల్గే పుట్టుకొచ్చి నీటిలోని ఆక్సిజన్‌ను లాగేసుకోవటం దీనికి మూలం.
మూడో అంతర్థానం: ఇది 25.1 కోట్ల సంవత్సరాల క్రితం జరిగింది. మొత్తం 96% జీవజాతులు తుడిచిపెట్టుకుపోయాయి. గ్రహశకలం లేదా తోకచుక్క ఢీకొట్టటం దీనికి కారణమన్నది శాస్త్రవేత్తల అంచనా.
నాలుగో అంతర్థానం: ఇది 20 కోట్ల సంవత్సరాల క్రితం జరిగింది. దాదాపు 80% జీవజాతులు అంతరించిపోయాయి. మధ్య అట్లాంటిక్‌ ప్రాంతంలో భారీగా పొంగుకొచ్చిన అగ్నిపర్వత లావా దీనికి దోహదం చేసింది.
ఐదో అంతర్థానం: 6.6 కోట్ల సంవత్సరాల క్రితం జరిగింది. సుమారు 78% జీవజాతులు కనుమరుగయ్యాయి. ఒకప్పుడు భూ మండలాన్ని శాసించిన డైనోసార్లు అంతరించింది ఈ కాలంలోనే. గ్రహశకలం ఢీకొట్టటంతో పాటు భారత్‌లో దక్కన్‌ మైదానాల్లో అగ్నిపర్వతాలు పేలటం దీనికి ఆజ్యం పోశాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)