వై ఫై గ్రామం ..పున్స్‌రి!!! (Eenadu Sunday Mag_26/08/2012)


సర్పంచ్‌ చిత్తశుద్ధి, ప్రజల భాగస్వామ్యం...గుజరాత్‌లోని పున్స్‌రి గ్రామ భవితవ్యాన్నే మార్చేశాయి. గ్రామాల్లోని స్వావలంబన, పట్టణాల్లోని ఆధునికత...ఆ పల్లె సొంతం.
గుజరాతీ విలేజ్‌...దట్‌ పుట్స్‌ మెట్రోస్‌ టు షేమ్‌! ఆ గ్రామాన్ని చూసి మహానగరాలు సిగ్గుపడాలి...అంటూ ఈమధ్య ఓ ఆంగ్లపత్రిక విశ్లేషణాత్మక కథనాన్ని ప్రచురించింది. నిజమే...పున్స్‌రిని చూసి పట్టణాలూ నగరాలూ తలదించుకోవాలి. గ్రామాలు ఆ అడుగుజాడల్లో నడవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలి.
ప్రజా ప్రతినిధి అంటే ఎలా ఉండాలో ఆ వూరి సర్పంచ్‌ను చూసి నేర్చుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల్ని ఎంత చక్కగా నడుపుకోవచ్చో ఆ స్కూళ్లను చూసి నేర్చుకోవాలి. గ్రామాభివృద్ధికి టెక్నాలజీని ఎలా అన్వయించుకోవచ్చో...ఆ వూరి సచివాలయాన్ని చూసి నేర్చుకోవాలి. పౌరులు ఎంత బాధ్యతగా మెలగాలో ఆ గ్రామ ప్రజల్ని చూసి నేర్చుకోవాలి. పరపతి సంఘాలు ఎంత సమర్థంగా పనిచేయగలవో ఆ వూరి మహిళల్ని చూసి నేర్చుకోవాలి. గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌కు వంద కిలోమీటర్ల దూరంలో ఉందీ గ్రామం.
పున్స్‌రి..
అభివృద్ధి యాత్రాస్థలి.
గ్రామస్వరాజ్య పుణ్యక్షేత్రం!
చదువుల గుడి...
విశాలమైన ఆవరణ. పరిశుభ్రమైన వాతావరణం. బుద్ధిగా చదువుకుంటున్న విద్యార్థులు. శ్రద్ధగా పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయులు. గాలీవెలుతురూ పుష్కలంగా ప్రసరించే తరగతి గదులు. ఓమూలన వరుసగా కంప్యూటర్లు. ఆ పిల్లల చదువుల్లో కంప్యూటర్లూ ఒక భాగమే. నిజానికి ప్రభుత్వం, కంప్యూటర్‌ పాఠాలు చెప్పడానికి ఒక టీచర్‌ను మాత్రమే నియమించింది. ఒక్కరూ అంతమంది పిల్లలకు ఎలా బోధిస్తారు? అందుకే, పంచాయతీ చొరవ తీసుకుని మరో ఐదుగురు టీచర్లను నియమించింది. ఆ ప్రయత్నం చక్కని ఫలితాల్ని ఇచ్చింది. ఒకటో తరగతి పిల్లాడు కూడా కంప్యూటర్‌ కీబోర్డు మీద వేళ్లు కదిలిస్తున్నాడు. పెయింట్‌ టూల్స్‌లోకి వెళ్లి రంగుల బొమ్మలు గీస్తున్నాడు. ఆ బళ్లో ఏ విద్యార్థీ పుస్తకాలు కొనుక్కోనక్కర్లేదు. పంచాయతీవాళ్లే ఉచితంగా ఇస్తారు. ఒకటో తరగతిలో చేరిస్తే...పన్నెండో తరగతి దాకా నిశ్చింత. ప్రభుత్వ పాఠశాలలో ఇన్ని సౌకర్యాల్ని కల్లో అయినా వూహించలేం. కాబట్టే, ఆ వూళ్లో చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లకు పంపడానికి పెద్దగా ఇష్టపడరు. నూటికి నూరుశాతం విద్యార్థులు గవర్నమెంటు స్కూల్లోనే చదవాలని సర్పంచ్‌ కోరిక. అదీ కన్నవారి మీద ఒత్తిడి తీసుకురావడం ద్వారా కాదు, సర్కారీ పాఠశాలలో నాణ్యత పెంచడం ద్వారా. వారానికోసారి అయినా ఆయన పాఠశాలను సందర్శిస్తాడు. విద్యార్థులను కుశలప్రశ్నలు అడుగుతాడు. ఉపాధ్యాయులతో సంభాషిస్తాడు. సమస్యలేమైనా ఉంటే చెప్పమంటాడు. తల్లిదండ్రులు తమ పిల్లల పనితీరు తెలుసుకోడానికి ఇంతదూరం రావాల్సిన అవసరమే లేదు. పంచాయతీ ఆఫీసులోని కంప్యూటర్‌ తెరమీద తరగతి గదులన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఉపాధ్యాయులు ఏం చెబుతున్నారో, పిల్లలెంత శ్రద్ధగా వింటున్నారో...ప్రత్యక్షంగా చూడొచ్చు. హెడ్‌మాస్టరూ విద్యాశాఖ అధికారులే కాదు.. గ్రామ ప్రజలు సైతం టీచర్ల పనితీరును మదింపు చేస్తారు. బాగా చెప్పేవారిని ప్రోత్సహిస్తారు. కాబట్టే ఫలితాల్లో..ఆ విద్యాసంస్థ ఎప్పుడూ ముందుంటుంది. 'పాఠశాలను మరింత అభివృద్ధి చేయాలన్నది మా లక్ష్యం. సెంట్రల్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసే ఆలోచనా ఉంది. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోడానికి అవసరమైన సమస్త నైపుణ్యాల్నీ విద్యాసంస్థ ఆవరణలోనే పరిచయం చేయాలన్నది మా ఆశయం' అంటాడు సర్పంచ్‌ హిమాన్షు నరేంద్రభాయ్‌ పటేల్‌.
హలో...హెల్ప్‌లైన్‌!
బర్త్‌ సర్టిఫికెట్‌ కావాలి.
వీధిదీపాలకు మరమ్మతు చేయాలి.
ఆస్తిపన్ను వివరాలు తెలుసుకోవాలి.
...ప్రతి చిన్న పనికీ పంచాయతీ ఆఫీసుకు వెళ్లడం కుదరకపోవచ్చు. వెళ్లినా, సమయానికి సిబ్బంది సీట్లో లేకపోవచ్చు. ఈ తలనొప్పులన్నీ లేకుండా...పున్స్‌రి ప్రజల కోసం ప్రత్యేకంగా ఓ హెల్ప్‌లైన్‌ పనిచేస్తోంది (నంబరు - 864). ఇది టోల్‌ఫ్రీ నంబరు. ఫోన్‌ చేసినవారికి బిల్లుపడదు. ప్రజల అభ్యర్థనలు అందుకోవడం, ఆ సమాచారాన్ని పంచాయతీ సిబ్బందికి చేరవేయడం...కాల్‌సెంటర్‌ బాధ్యతలు. ప్రతి సమస్య పరిష్కారానికీ నిర్దిష్ట వ్యవధి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ...ఆలోపే పనైపోవాలి.ఆ వూళ్లో అన్నీ పక్కా రోడ్లే. శుభ్రంగా కళకళలాడుతూ ఉంటాయి. చెత్త కనిపిస్తే ఒట్టే. భూగర్భ మురుగునీటి వ్యవస్థ అందుబాటులో ఉంది. వీధుల్ని శుభ్రంచేయడానికి పంచాయతీ అత్యాధునికమైన మెషీన్లు కొనుగోలు చేసింది. పెద్దపెద్ద నగరపాలక సంస్థల్లో మాత్రమే ఈతరహా యంత్రాలుంటాయి. నల్లాలో నీరు రావడంలేదనో, వచ్చినా మురుగునీరు వస్తోందనో ప్రజలు ఫిర్యాదు చేసే అవకాశమే లేదు. ఆ వూళ్లో ఆధునికమైన నీటి శుద్ధి యంత్రాన్ని ఏర్పాటు చేశారు. స్వచ్ఛమైన మంచినీరు ఇరవై నాలుగు గంటలూ అందుబాటులో ఉంటుంది. నయాపైసా కూడా చెల్లించకుండా...అవసరమైనన్ని నీళ్లు తెచ్చుకోవచ్చు. 'డోర్‌ డెలివరీ' కావాలంటే మాత్రం, పాతిక లీటర్లకు నాలుగు రూపాయల చొప్పున చెల్లిస్తే సరిపోతుంది. దాదాపు ముప్ఫై లక్షల వ్యయంతో ఈ నీటిశుద్ధి యంత్రాన్ని నిర్మించారు. గ్రామంలో సకల సౌకర్యాలూ ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. ఇరవై నాలుగు గంటలూ ఆసుపత్రి లైట్లు వెలుగుతూనే ఉంటాయి. ఇద్దరు వైద్యులు, ఇద్దరు సహాయకులు సేవలు అందిస్తున్నారు. రోగుల పరిస్థితి తీవ్రంగా ఉంటే తప్ప, పట్టణానికి తీసుకెళ్లాల్సిన అవసరం రాదు. తీసుకెళ్లినా...ఎటూ ఆరోగ్య బీమా ఉంటుంది కాబట్టి, ధైర్యంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో అడుగుపెట్టవచ్చు. ఆ వూళ్లో ప్రతి ఒక్కరికీ జీవిత బీమా, ఆరోగ్య బీమా సౌకర్యాలున్నాయి. గ్రామ పంచాయతీ ఏటా పాతిక లక్షల ప్రీమియం చెల్లిస్తోంది.
ఇంటర్నెట్‌-ఎప్పుడైనా ఎక్కడైనా
ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. గ్రామస్థులకు వైర్‌లెస్‌ ఇంటర్నెట్‌ సౌకర్యం (వైఫై) అందుబాటులో ఉంది. ఇందుకు అవసరమైన మొత్తాన్ని కూడా పంచాయతీ ఖజానా నుంచే చెల్లిస్తారు. ఎందుకీ ఏర్పాటు? ఓ మారుమూల పల్లెలో ఇంత అత్యాధునిక సౌకర్యం అవసరమా? అనడిగితే, 'అవసరమే! ఇంటర్నెట్‌ ద్వారా... రైతు ఆధునిక సాగు పద్ధతులు తెలుసుకుంటాడు, విద్యార్థి మరింత విజ్ఞానాన్ని పొందుతాడు, నిరుద్యోగి ఉపాధి అవకాశాల్ని వెతుక్కుంటాడు. రేపటి ప్రపంచానికి ఇది స్వాగత ద్వారం' అంటాడు హిమాన్షు. గ్రామ పాలనలో కూడా టెక్నాలజీకి పెద్దపీట వేశారు. ఒక్క స్కూల్లోనే కాదు...వూరంతా సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. వాటిని సచివాలయానికి అనుసంధానించారు. పాలన వ్యవహారాల్ని పూర్తిగా కంప్యూటరీకరించారు. మీట నొక్కితే చాలు...ఆస్తిపన్నుల నుంచి పశుసంపద దాకా..సమస్త సమాచారం తెరమీద ప్రత్యక్షం అవుతుంది.
కోతల్లేవ్‌..
గుజరాత్‌ విద్యుదుత్పత్తిలో మిగులును సాధించింది. ఘనత నరేంద్ర మోడీ సర్కారుదే అయినా...పున్స్‌రి వంటి ఆదర్శ గ్రామాలకూ అందులో వాటా ఉంది. ఎందుకంటే, పున్స్‌రిలో...వీధిదీపాల కోసం పూర్తిగా సౌరశక్తినే ఉపయోగిస్తారు. దీంతో సగానికి సగం విద్యుత్‌ వినియోగం తగ్గిపోయింది. అయినా కూడా, ట్రాన్స్‌ఫార్మర్‌పై భారంపడకుండా...66 కిలోవాట్ల సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేయించుకున్నారు. ఈ సౌకర్యం కూడా అయాచితంగా వచ్చిందేం కాదు, గ్రామప్రజలూ సర్పంచీ పట్టుబట్టి సాధించుకున్నారు. వూళ్లో తొంభైశాతం రైతులే. వ్యవసాయ విద్యుత్‌ వినియోగంలో వృథా లేకుండా ఎవరికివారు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నీరు ఎక్కువగా వాడితే, విద్యుత్‌ వినియోగమూ అధికం అవుతుంది. అందుకే, బిందుసేద్యాన్ని ఎంచుకున్నారు.
శాంతికి భద్రత...
గత ఐదారేళ్లలో వూళ్లో ఒక్క పోలీసు కేసు కూడా నమోదు కాలేదు. అలా అని, మనస్పర్ధలు ఉండవా అంటే..ఉంటాయి! కానీ వాటిని తామే సామరస్యంగా పరిష్కరించుకుంటారు. శాంతియుతంగా చర్చించుకుంటారు. అవసరమైతే గ్రామపెద్దల సహకారం తీసుకుంటారు. కొట్టుకోవడం, తన్నుకోవడం, నరుక్కోవడం - వారి స్వభావం కాదు. 'నేను సంతోషంగా ఉండాలి. నువ్వూ సంతోషంగా ఉండాలి...అనుకున్నంత కాలం ఎలాంటి ఇబ్బందీ ఉండదు' అంటాడో వయోధికుడు. ఎవరి వృత్తి వారికి ఉంటుంది, ఎవరి సంపాదన వారికి ఉంటుంది. పనీపాటా లేకుండా కాలక్షేపం చేసేవారు ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించరు. అందరూ శ్రమ విలువ తెలిసినవారే, ఆత్మాభిమానం ఉన్నవారే. ఇక...దొంగతనాలకూ చేతివాటాలకూ అవకాశం ఎక్కడిది? ఎవరికైనా అలాంటి పాడుబుద్ధి పుట్టినా, సాక్ష్యాలతో పట్టివ్వడానికి దాదాపు పాతిక కెమెరాలు పహరా కాస్తుంటాయి. పదేళ్లక్రితం..గుజరాత్‌ మతకల్లోలాలతో అట్టుడికినప్పుడు కూడా...ఆ పల్లె ప్రశాంతంగా ఉంది. అన్ని మతాలవారూ కలసికట్టుగా జీవించారు. 'ఏ మతమైనా.. మంచిని పెంచాలి. మానవత్వాన్ని చాటాలి. సర్వమతాల సారం ప్రేమే అయినప్పుడు...మృత్యునినాదాలెందుకు, మారణహోమాలెందుకు?' అని ఆవేశంగా ప్రశ్నిస్తాడు హుస్సేన్‌భాయ్‌.
ఆడపిల్ల అయినా, మగపిల్లాడు అయినా... ఆ వూరి ప్రజలకు సమానమే.అమ్మాయి పుట్టిందని ఎవరూ బాధపడరు. కడుపులో ఉండగానే కరిగించేద్దామనుకునే కఠినాత్ములకు అక్కడ స్థానం లేదు. భ్రూణహత్యల్ని నిరసిస్తూ గ్రామపంచాయతీ తీర్మానం చేసింది. ఆడపిల్లల్ని...అపురూపంగా చూసుకుంటారా గ్రామస్థులు. పెద్దచదువులు చదివించి, ప్రయోజకుల్ని చేయాలన్నది వారి సంకల్పం. పన్నెండో తరగతి వరకూ విద్యార్థినులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించారు. పంచాయతీ బస్సులో బడికి వెళ్లిరావచ్చు. ఈ బస్సు పొరుగూళ్లకూ తిరుగుతుంది. సచివాలయం కంప్యూటర్‌లో గర్భిణులూ బాలింతల వివరాలు కూడా ఉంటాయి. వారికి అవసరమైన పౌష్ఠికాహారాన్ని అందించే బాధ్యత కూడా పంచాయతీ తీసుకుంది.యావన్మందికీ...
పన్నుల గురించీ ప్రభుత్వ పథకాల గురించీ పంచాయతీ కార్యక్రమాల గురించీ ముఖ్యమైన పరిణామాల గురించీ ప్రజలకు వివరించడానికి ఓ వ్యవస్థంటూ ఉండాలి. దీనివల్ల, ఏ సమాచారమైనా చేరాల్సినవారికి నేరుగా చేరుతుంది. పాలనలో పారదర్శకతా పెరుగుతుంది. పున్స్‌రిలో వీధివీధికీ ఓ మైకు ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచి సెల్‌ఫోన్‌తో ఆ మైకులు అనుసంధానమై ఉంటాయి. ఏదైనా ముఖ్య విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని భావించినప్పుడు...హిమాన్షు ప్రసంగిస్తాడు. రోజూ ఉదయం సాయంత్రం..మైకులో భక్తిగీతాలు వేస్తారు.
ప్రియసఖి...
మహిళల ఆర్థిక స్వేచ్ఛే లక్ష్యంగా గుజరాత్‌ ప్రభుత్వం ప్రారంభించిన 'మిషన్‌ మంగళం' కార్యక్రమంలో భాగంగా...పున్స్‌రిలో దాదాపు 109 సఖి సంఘాల్ని ఏర్పాటు చేశారు. ఒక్కో సంఘంలో 10 నుంచి 12 మంది సభ్యులుంటారు. హిమాన్షు చొరవతో ప్రభుత్వం 30 లక్షల రూపాయలు మంజూరు చేసింది. మహిళలు కూడా తమవైపు నుంచి కొంత సమకూర్చుకున్నారు. చిల్లర వ్యాపారాలకూ పాడిపశువులు కొనుక్కోడానికీ ఈ నిధుల్లోంచి రుణాలు తీసుకోవచ్చు. నయాపైసా కూడా వడ్డీగా చెల్లించాల్సిన పన్లేదు. పున్స్‌రిలో ఎంతోమంది మహిళలు ఈ రుణాలతో అదనపు ఆదాయం పొందుతున్నారు. నెలకు ఎనిమిది నుంచి పదివేల దాకా సంపాదించుకుంటున్నవారూ ఉన్నారు. పల్లె నుంచి పట్నానికి పాలు తరలించడానికి పంచాయతీ ప్రత్యేకంగా ఓ బస్సును నడుపుతోంది.సమర్థ నాయకత్వం...
ప్రతి ఆదర్శగ్రామం వెనుకా ఒక ఆదర్శ నాయకుడు ఉంటాడు. అతనే ప్రజల్లో కదలిక తీసుకొస్తాడు. చైతన్యాన్ని రగిలిస్తాడు. దారిచూపుతాడు. వేలుపట్టుకుని ముందుకు నడిపిస్తాడు. తొలిదశలో ఎదురయ్యే అవరోధాల్ని తట్టుకు నిలబడతాడు. విమర్శల్ని చిరునవ్వుతో స్వీకరిస్తాడు. అవహేళనల్ని పట్టించుకోకుండా పయనం సాగిస్తాడు. వేయిమందిని ఒక్క తాటిపై నడిపించడం అంటే మాటలు కాదు...అదో సవాలు, నాయకత్వానికో పరీక్ష! హిమాన్షు ప్రయత్నాలకూ తొలిరోజుల్లో అలాంటి అవరోధాలే ఎదురయ్యాయి. అయనది రాజకీయ కుటుంబం. తాత, తండ్రి సర్పంచులుగా పనిచేసినవారే. దీంతో ఎన్నికల్లో సులభంగానే గెలిచాడు. ప్రజల హృదయాల్ని గెలవడానికి మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది. పట్టుమని పాతికేళ్లు కూడా లేని యువకుడు తరాలనాటి సమస్యల్ని పారదోలగలడా అన్న సందేహం ఉండేది. అతనికి తన పరిమితులేమిటో తెలుసు. వూరినిండా ఇబ్బందులే. వాటిని పరిష్కరించాలంటే బోలెడు నిధులు కావాలి. ఖజానా ఎప్పుడో ఖాళీ అయిపోయింది. అప్పుడే ఒక ఆలోచన వచ్చింది. గ్రామ జనాభా పెరుగుతోంది. నివాస స్థలాల సమస్య తీవ్రంగా ఉంది. వూరిచుట్టూ ప్రభుత్వ భూములు ఉండటంతో...పల్లె విస్తరించలేకపోతోంది. ప్రభుత్వ భూముల్ని ప్రజలకు అమ్మి..ఆ నిధుల్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తే ఎలా ఉంటుందీ అనిపించింది. తన ఆలోచనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. కాదూ, కుదర్దూ, రూల్స్‌ ఒప్పుకోవూ- అధికారుల స్పందన వూహించినట్టే ఉంది. అంతకంటే పెద్ద అధికారుల్ని కలిశాడు. పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్లతో సమస్యలను కళ్లకు కట్టాడు. మొత్తానికి దారికొచ్చారు. ప్రభుత్వ భూముల్ని అమ్మడానికి అంగీకరించారు. ప్రజలు మొత్తం డబ్బు ఒకేసారి చెల్లించాల్సిన పన్లేదు. వాయిదాల్లో తిరిగి ఇచ్చే వెసులుబాటు కల్పించాడు. మొత్తానికి, వూళ్లో నివాస స్థలాల సమస్య తీరింది. ఖజానాకు నిధుల ప్రవాహమూ పెరిగింది. అలా రూ.30 లక్షలు సమకూరింది.
తొలిరోజుల్లో... వీధి దీపాల్లేవు. రక్షిత మంచినీరు లేదు. వీధుల్లో ముక్కుమూసుకుని నడవాల్సిన పరిస్థితి. మురుగునీరు రోడ్డెక్కేది. చెత్త తొలగింపు కూడా ఓ సమస్యే. ప్రధానంగా పరిశుభ్రత మీదే దృష్టిసారించాడు హిమాన్షు. భూగర్భ డ్రైనేజీ, సిమెంటు రోడ్లు, వూడ్చే యంత్రాలు...ఆ పల్లెకు కొత్తకళ తెచ్చాయి. క్రమక్రమంగా మిగిలిన సమస్యలూ తొలగిపోయాయి. ఆ మార్పు ప్రభుత్వాన్నీ ఆకర్షించింది. ఏ కొత్త కార్యక్రమం వచ్చినా...తొలిసారిగా అక్కడ ప్రారంభించాల్సిందే. వివిధ పథకాల కోసం దాదాపు 14 కోట్లు మంజూరు చేసింది. ఓ యువకుడు... పల్లె ప్రగతే తన లక్ష్యమన్నట్టు పనిచేస్తుంటే, గ్రామస్థులు మాత్రం ఎంతకాలమని నిర్లిప్తంగా ఉంటారు? కదలిక ప్రారంభమైంది. స్పందించడం మొదలుపెట్టారు.
సర్వసమర్థుడైన నాయకుడు...
అంకితభావం ఉన్న ప్రజలు...
ఇద్దరూ ఒక్కటైతే...ఎదురేముంది, తిరుగేముంది? హిమాన్షు ప్రాథమిక సౌకర్యాలతో సంతృప్తి చెందలేదు. ఆధునికతకూ పెద్దపీట వేశాడు. దీనికో కారణం ఉంది. పల్లెల్లో ఎన్ని వసతులు ఉన్నా... చాలామంది పట్టణాలవైపే మొగ్గుచూపడానికి కారణం..టెక్నాలజీ! అందుకే ఐటీ సేవలకు అంత ప్రాధాన్యం ఇచ్చాడాయన. పన్నుల వసూళ్లలోనూ ఆ గ్రామం రికార్డు సృష్టిస్తోంది. దాదాపు 90 శాతం మంది స్వచ్ఛందంగా పన్నులు చెల్లిస్తున్నారు. ఏ వూళ్లోనూ లేని మరో సౌకర్యమూ ఉందిక్కడ - 'అస్థికల బ్యాంక్‌'. ఆ ఏడాది కాలంలో మరణించినవారి అస్థికలన్నీ ఒకేసారి హరిద్వార్‌ తీసుకెళ్లి గంగలో కలుపుతారు. త్వరలోనే ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించాలన్నది హిమాన్షు ఆలోచన. దీనివల్ల ఆ పల్లె...చుట్టుపక్కల గ్రామాలకు ప్రధాన వ్యాపార కేంద్రం అవుతుంది. మరింతమందికి ఉపాధి దొరుకుతుంది. పంచాయతీకి మరికొంత ఆదాయం వస్తుంది.ఐదేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత, రెండోసారీ సర్పంచ్‌గా ఘనవిజయం సాధించాడు హిమాన్షు. ఈసారి 'వారసత్వ' విజయం కాదు. అక్షరాలా అభివృద్ధి విజయం!
ఇటీవల కెన్యా నుంచి ఓ నిపుణుల బృందం వచ్చింది. సభ్యులు పాఠశాలను సందర్శించారు. రక్షిత మంచినీటి వ్యవస్థను పరిశీలించారు. వైఫై సౌకర్యం గురించి విన్నారు. సర్పంచ్‌ చొరవా, ప్రజాభాగస్వామ్యం ...కళ్లారా చూశారు. 'సరిగ్గా ఇదే అభివృద్ధి నమూనాలో, ఇలాంటి గ్రామాల్నే మా దేశంలో నిర్మిస్తాం'...పద్నాలుగు గొంతుకలు ఒక్కటిగా తీర్మానించాయి. గ్రామ ప్రజలు వారికి ఓ చరఖా బహూకరించారు. చరఖా...స్వావలంబనకు చిహ్నం. పున్స్‌రి సాధించిందీ, చాలా గ్రామాలు సాధించాల్సిందీ అదే!
- రఘుపతి పోరెడ్డి, ఈటీవీ న్యూస్‌
ఇది అందరి విజయం...
ఏ గ్రామీణుడూ కన్నతల్లిలాంటి పల్లెను వదిలిపెట్టి, పట్టణానికి వలస వెళ్లాలని అనుకోడు. పరిస్థితులే ఆ దిశగా ప్రేరేపిస్తాయి. అవసరం అతన్ని నగరానికి లాక్కెళ్తుంది. వలసలు ఆగాలంటే, పల్లెల్లో చేతినిండా పని ఉండాలి. ఆ ఆలోచనతోనే... పాడిపంటలకు పెద్దపీట వేస్తున్నాం. చాలామంది సర్పంచులకు కేంద్రరాష్ట్ర సంక్షేమ కార్యక్రమాల మీద పెద్దగా అవగాహన ఉండదు. నేను మాత్రం... ప్రతి పథకాన్నీ అధ్యయనం చేస్తాను. ప్రజలకు ఉపయోగపడుతుందని అనిపించిన ప్రతి కార్యక్రమాన్నీ మా వూరికి తీసుకొస్తాను. ఆ ప్రయత్నంలో... అధికారులూ ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటా.
ఏ విద్యార్థీ ప్రైవేటు పాఠశాలకు వెళ్లకూడదు.ఏ గ్రామస్థుడూ పట్టణానికి వలస వెళ్లకూడదు.
ఒకటిరెండు అవరోధాలు ఎదురవుతున్నా... ఆ దిశగా మా ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. ఇప్పటిదాకా మా గ్రామం సాధించిన అభివృద్ధిలో నా కృషి ఎంతో, గ్రామస్థుల పాత్రా అంతే ఉంది. అందరికీ కృతజ్ఞతలు.
- హిమాన్షు పటేల్‌, గ్రామ సర్పంచ్‌
మా వూరంటే మాకిష్టం...
ప్రయోజకుడైన కొడుకును తలుచుకుని మీసాలు మెలేసిన కన్నతండ్రిలా... అభివృద్ధి దిశగా దూసుకెళ్తున్న తమ పల్లెను చూసి వాళ్లంతా గర్విస్తున్నారు...
నాకు కిరాణా దుకాణం ఉంది. మా కుటుంబానికి అదే ఆధారం. గతంలో వూళ్లో చాలా సమస్యలుండేవి. గొడవలు జరిగేవి. ఆ ప్రభావం నా వ్యాపారం మీదా పడేది. ఇప్పుడెలాంటి సమస్యలూ లేవు. అంతా కలసిమెలసి ఉంటున్నాం. కష్టపడి పనిచేసుకుంటున్నాం. దుకాణానికి తాళం వేయకుండా ఇంటికెళ్లిపోయినా...నిశ్చింతగా ఉండగలను.
- దయాలాల్‌ షా
మా కుటుంబ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండేది. అప్పుడే మా వూళ్లో సఖి సంఘాలు ప్రారంభం అయ్యాయి. నేనూ ఉత్సాహంగా చేరాను. పదివేల రూపాయలు అప్పుగా తీసుకుని, పాడి పశువులు కొన్నాను. ఖర్చులు పోనూ, నెలకు నాలుగైదువేల దాకా మిగులుతోంది. రేపటి అవసరాల కోసం ఎంతోకొంత పొదుపు చేస్తున్నా.
- సోని
ల్లెటూళ్లో ఉండటం వల్ల పిల్లలకు మంచి చదువులు చెప్పించలేకపోతున్నాననే బాధ ఉండేది. ఇప్పుడా కొరత లేదు. పెద్దపెద్ద స్కూళ్లలో ఉండే సౌకర్యాలన్నీ మా వూరిబళ్లోనూ ఉన్నాయి. నా పిల్లలు ఎలా చదువుతున్నారో తెలుసుకోవాలనిపిస్తే... గ్రామ సచివాలయంలోని సీసీటీవీ ముందు కూర్చుంటే సరిపోతుంది.
- అంకుర్‌ రమణభాయ్‌ పటేల్‌
పున్స్‌రి.ఇన్‌
పున్స్‌రి గ్రామానికి ఓ వెబ్‌సైట్‌ ఉంది. 'హోమ్‌పేజ్‌'లో సర్పంచ్‌ వ్యక్తిగత వివరాలు ఇచ్చారు. గ్రామాభివృద్ధికి సంబంధించి ఆయన ఆలోచనలు ఉన్నాయి. పంచాయతీ సభ్యుల వివరాలూ సిబ్బంది పేర్లూ ఫొటోలూ ఫోన్‌ నంబర్లతో సహా ప్రచురించారు. ఆదాయ, వ్యయాల గణాంకాల్ని ఇచ్చారు. భవిష్యత్‌ ప్రణాళికల్ని వివరించారు.అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ వివరాలను సచిత్రంగా అందించారు. గుజరాత్‌లో ప్రత్యేక వెబ్‌సైట్‌ ప్రారంభించిన తొలి గ్రామం ఇదే. 'ఇదంతా ఆరంభం మాత్రమే. దేశంలోని మిగతా గ్రామాలకు స్ఫూర్తినిచ్చేలా మా వెబ్‌సైట్‌ను తీర్చిదిద్దుతాం' అంటాడు హిమాన్షు పటేల్‌ 
(www.punsarigrampanchayat.in).

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)

Ratan Tata special article on Eenadu