నాసామెచ్చిన సావాసగాళ్లు (Eetaram_18/08/12)


నాసామెచ్చిన సావాసగాళ్లు
మైకేల్‌ జాక్సన్‌ 'మూన్‌వాక్‌' పాటకి స్టెప్పులేయాల్సిన యువతరంగాలు... ఏకంగా మూన్‌పై వాక్‌ చేసే 'లూనాబోట్‌'నే సృష్టించారు... ఆ ప్రతిభకు ప్రఖ్యాత అంతరిక్ష పరిశోధన సంస్థ 'నాసా' మురిసింది... ఇది ఐదునెలల కష్టార్జితం... ప్రపంచంలో కేవలం 65, ఇండియా నుంచి ఎంపికైన ఆరు జట్లలో ఒకటిగా నిలిచిన అరుదైన అవకాశం... ఆ 'టీమ్‌ ఇల్యుమినాటి'తో మాట కలిపింది 'ఈతరం'.
యువత అంటే ఏదో చేయాలనే కసి ఉండాలి. సాధించాలనే తపన నిరంతరం జ్వలిస్తుండాలి. వయసు పైబడ్డాక చెప్పుకోవడానికి నాలుగు మంచి అనుభూతులు మూటకట్టుకోవాలి. దాన్నే శ్వాసిస్తుంటే ఎవరినైనా మెప్పించగలం. ఆఖరికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థనైనా.స్ఫూర్తినిచ్చిన పోటీ
చంద్రుని ఉపరితలంపై 'రెగోలిత్‌' అనే మందమైన పొర ఉంటుంది. దీనిలో యురేనియం, ఆక్సిజన్‌ పాళ్లు ఎక్కువ. భవిష్యత్తులో మానవాళి చంద్రునిపై ఆవాసం ఏర్పరచుకోవాలంటే ఈ పొరను కరిగించాల్సిందే. ఈ పని చేసేవే లూనార్‌బోటిక్స్‌. ఇదే ఉద్దేశంతో అమెరికా ప్రతిష్ఠాత్మక అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా 'లూనాబోటిక్స్‌ మైనింగ్‌ కాంపిటీషన్‌' పేరుతో ఏడాదికోసారి పోటీలు నిర్వహిస్తోంది. ఎవరు అత్యుత్తమ లూనాబోట్‌ తయారు చేస్తే వాళ్లకి బహుమతి. సాంకేతిక విద్య అభ్యసిస్తున్న విద్యార్థులెవరైనా బరిలో దిగొచ్చు. పోటీ ప్రకటించగానే వందకు పైగా దేశాల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. వడపోతలో 65 మిగిలితే అందులో మనదేశానివి ఆరు. మన రాష్ట్రం నుంచి ఏకైక విద్యార్థుల బృందం 'టీమ్‌ ఇల్యుమినాటి'.
అవాంతరాలు దాటి
టీమ్‌ ఇల్యుమినాటి విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ విద్యార్థుల బృందం. ఈ ఏడాది జనవరిలో లూనాబోట్‌ తయారీ మొదలుపెట్టారు. పూర్తవడానికి ఐదునెలలు పట్టింది. ఈ మధ్యలో వాళ్లు ఎదుర్కొన్న సవాళ్లు, దాటిన అవాంతరాలు లెక్కలేనన్ని. ముందు డిజైన్‌, టెక్నికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, సర్క్యూట్‌ బోర్డ్‌, సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రాం రాయడం, ఔట్‌రీచ్‌.. విభాగాలుగా విడిపోయి ఒక్కో పనిని ఒక్కొకరు పంచుకున్నారు. క్లాసులు అయిపోగానే పని మొదలయ్యేది. సాయంత్రం నుంచి అర్థరాత్రుళ్లు, ఒక్కోసారి తెల్లవారేదాకా కొనసాగుతూనే ఉండేది. సరదాలు, సినిమాలు పూర్తిగా బంద్‌. మరోవైపు క్లాసులు పోతున్నాయనే బాధ. అయినా వచ్చిన అవకాశం వదులుకోవద్దనే తపనతో ప్రాజెక్టుకే అంకితమయ్యారు కుర్రబృందం. ముందు లూనాబోట్‌ విడిభాగాలు దొరకడమే గగనమైంది. వీటికోసం నాలుగైదు సార్లు ముంబై, ఒడిశాలు వెళ్లొచ్చారు. అన్ని అమరాయి అనుకుంటుండగానే నాణ్యత లేని పరికరాలు మొరాయించేవి. మరోవైపు తరుముకొస్తున్న గడువు. 'ఇవన్నీ దాటుకొని లక్ష్యం చేరడానికి మేం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం' అంటాడు బృంద సభ్యుడు సిద్ధార్థరామ్‌. మొత్తమ్మీద ఐదునెలల్లో వాళ్ల కలల రూపం సిద్ధమైంది. దీనికి అల్యూమినియం, మైల్డ్‌ స్టీల్‌, ఎక్రిలిక్‌ లోహాలతోపాటు హైఎండ్‌ మోటార్లు వాడారు. సర్క్యూట్‌ని సొంతంగా డిజైన్‌ చేశారు. ఈ సర్క్యూట్‌ వైఫై ఆదేశాలతో పనిచేసేలా సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌ రాశారు. ల్యాప్‌టాప్‌ ఇచ్చిన ఆజ్ఞలతో లూనాబోట్‌ ముందుకు, వెనక్కి కదులుతుంది. ఇవే కాదు ఆర్థిక అవాంతరాలు సైతం ఈ కుర్రకారుని అడ్డగించాయి. మొదట్లో స్పాన్సర్లే దొరకలేదు. చేసేదేం లేక సొంత డబ్బులు వెచ్చించి ప్రాజెక్టు మొదలు పెట్టారు. ప్రాజెక్టు పూర్తయ్యాకే స్పాన్సర్లు ముందుకొచ్చారు.
శాస్త్రవేత్తల మెచ్చుకోలు
మే నెలలో మిత్రబృందం అమెరికాలోని ఫ్లోరిడాకి పయనమైంది. న్యాయనిర్ణేతల ముందు తమ ప్రాజెక్టు వివరాలు, పనిచేసే విధానం పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌తో వివరించారు. తలల పండిన జడ్జీలు అడిగిన సందేహాలకు తడుముకోకుండా బదులిచ్చారు. చివరికి ఈ పోటీల్లోని ఐదు అత్యుత్తమ లూనాబోట్లని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ కార్యాలయంలో ప్రదర్శనకు ఉంచారు. అందులో టీం ఇల్యుమినాటి లూనాబోట్‌ కూడా చోటు సంపాదించింది. దీన్ని అక్కడికొచ్చిన వివిధ దేశాల ఔత్సాహిక విద్యార్థులు, శాస్త్రవేత్తలు ఆసక్తిగా తిలకించారు.
ఇదే కాకుండా నాసాకి వెళ్లకముందే ఈ బృందం 'ఔట్‌రీచ్‌ ప్రాజెక్టు' పేరుతో వైజాగ్‌, చెన్నై, హైదరాబాద్‌ల్లోని దాదాపు ముప్ఫై విద్యాసంస్థల్లోకి వెళ్లి తమ ప్రాజెక్టు సంగతుల్ని వివరించారు. అంతరిక్ష రంగంలో భారత్‌ భవిష్యత్తు, కెరీర్‌పై సలహాలిచ్చారు.
హీరోలు వీళ్లే!
* పి.వి.ఎస్‌.ఎస్‌.సిద్ధార్థరామ్‌
* షరీఖ్‌ షేక్‌ అబ్దుల్‌
* రుద్రప్రతాప్‌
* పి.శ్రీచందన్‌ రెడ్డి
* టి.గిరిధర్‌
* కె.నిశాంత్‌
* బి.జానకి
* టి.ఎస్‌.కె.నాయుడు
* షైఫుద్దీన్‌ మాలిక్‌
* ఎ.వి.ఆదిత్య శాస్త్రి
భవిష్యత్‌ సూచి
టీమ్‌ ఇల్యుమినాటి బృందం రూపొందించింది అధునాతన డిజైన్‌. ఎంతో సృజనాత్మకమైంది. భవిష్యత్తు పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుంది. బృంద సభ్యులకు నా అభినందనలు.
- ఫిలిప్‌ మెట్జ్‌గర్‌, నాసా సీనియర్‌ శాస్త్రవేత్త
సమష్టి కృషి
కచ్చితంగా అవార్డు గెలుచుకోదగ్గ డిజైన్‌ ఇది. వ్యయ ప్రయాసలకోర్చి అంత దూరం నుంచి వచ్చినా దానికి తగ్గ ఫలితం చూపారు. మీలాంటి యువత కష్టం, చూపిన ప్రతిభ ఈ పోటీల గొప్పతనాన్ని మరింత పెంచుతుంది.
- రాబర్ట్‌ స్ప్రింగర్‌, నాసా స్పేస్‌షటిల్‌ టెస్ట్‌ పైలెట్‌


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)

Ratan Tata special article on Eenadu