విడివిడిగా కలివిడిగా..సామాజిక ఒరవడిగా! (Eetaram_12/01/13)



వూసుపోని కబుర్లు... ఉకదంపుడు ముచ్చట్లు... సరదాల కాలక్షేపం... సల్లాపాల వ్యవహారం... ఫేస్‌బుక్‌ అనగానే చాలామంది భావమిదే! కానీ కొంతమంది దృష్టిలో... అదో అనుబంధాల వారధి... సమాజ సేవకు మార్గం... అభిరుచుల సమాహారం... దాని కోసం వాళ్లు ఫేస్‌బుక్‌ 'గ్రూపు'లుగా జ తకడుతున్నారు! ఆన్‌లైన్‌ మాటల్ని ఆఫ్‌లైన్‌లో చేతలుగా మార్చేస్తున్నారు! ఆ సంగతుల ఖజానా ఈవారం.నలుగురు యూత్‌ కలిస్తే కబుర్ల వరదే. ఆన్‌లైన్లో సామాజిక అనుబంధాల వారధైన 'ఫేస్‌బుక్‌'లో లక్షలాది మధ్య జరిగేది కూడా ఇదే. 'ప్రతి ఫ్రెండూ అవసరమేరా...' తరహాలో ఒకరి పరిచయాలు మరొకరితో 'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌'లై, 'కన్‌ఫం' స్నేహితుల కలబోతల కబుర్లతోనే ఆగిపోవడం లేదు యువత. వేర్వేరు అభిరుచుల మేరకు వేర్వేరు బృందాలుగా ఏర్పడుతూ కలిసి కట్టుగా సాగుతున్నారు. ఇప్పుడు ఆ ట్రెండే జోరు మీదుంది. ఇక లక్షల గ్రూపులు పుట్టకుండా ఉంటాయా?
'బృందా'వనమిది...
"those who love a girl truely...
- - - - - - 
one day he loves me too...
అంటుందట వైన్‌షాపు బోర్డు. ప్రేమికుడిని ఉద్దేశించి ఓ టీనేజీ కుర్రాడు కొంటెగా చేసిన వ్యాఖ్య ఇది. 'లవ్‌ ఫెయిల్యూర్‌' గ్రూపు అందుకు వేదిక. ఇలాంటి చమక్కులు, సెటైర్లు.. ముఖ పుస్తక బృందాల్లో బోలెడు. పరీక్షలు బోర్‌ కొట్టే అబ్బాయి 'లెట్స్‌ దిస్‌ సెమిస్టర్‌ గో... ఐ విల్‌ స్టడీ సీరియస్‌లీ ఫ్రమ్‌ నెక్ట్స్‌ సెమిస్టర్‌' అంటూ ఓ గ్రూప్‌ మొదలుపెట్టాడు. వందలమంది జత కూడారు. ప్రేమని పిచ్చిపిచ్చిగా ప్రేమించే ఓ కుర్రాడు 'లవర్స్‌ పాయింట్‌'కి ఊపిరిలూదాడు. ఇరవై ఎనిమిదివేల మంది సభ్యులయ్యారు. అందులో వైఫల్యం చెందినా 'లవ్‌ ఫెయిల్యూర్‌' ఉండనే ఉంది. ప్రతిభ నిరూపించుకునేందుకు 'ఎక్స్‌ప్లోర్‌ యువర్‌ టాలెంట్‌' అని ఒకరంటే, స్నేహం విలువ తెలిసిన వ్యక్తి 'ఫ్రెండ్స్‌ ఫరెవర్‌' అన్నాడు. 14,550 మంది స్నేహ హస్తం అందించారు. సినిమా వాళ్ల కథలు, వెతలు పంచుకోవడానికి 'కృష్ణానగరే మామా... కృష్ణానగరే' పుట్టింది. గల్ఫ్‌లో స్థిరపడ్డ ప్రభాకర్‌ సరదాగా తన ఇంటిపేరు మీదే 'బాలైట్స్‌' మొదలుపెట్టాడు. డెబ్భైఏడు మంది సభ్యులయ్యారు. ఒకే సంస్థలో పనిచేసే ఉద్యోగులూ గ్రూపు కడుతున్నారు. ఇంతేకాదండోయ్‌... నచ్చిన నాయకుడ్ని పొగడటానికో గ్రూప్‌, తిట్టడానికో గ్రూప్‌. అభిమాన సినిమా తారలకో గ్రూప్‌, అసహ్యించుకోవడానికో గ్రూప్‌. భాష, సంగీతం, సాహిత్యం, గాడ్జెట్స్‌, హాస్యం.. ఇలా ఒక్కో అభిరుచికో గ్రూప్‌. ఆఖరికి ఏ పనీ పాటాలేనివాళ్లకీ గ్రూప్‌. ఈ సభ్యులంతా తమ భావాల్ని ఫేస్‌బుక్‌ గోడలపై కుమ్మరిస్తారు. గ్రూప్‌ చాట్‌లో మూకుమ్మడిగా ముచ్చట్లాడతారు. ఫొటోలు, వీడియోలు షేర్‌ చేసేస్తుంటారు.గోడలు దాటి..
ఈ అనుబంధాలు కేవలం ఆన్‌లైన్‌కే పరిమితం కాదు. గ్రూపు సభ్యులు 'గోడ'లు దాటి బాహ్య ప్రపంచంలోకి వచ్చేస్తున్నారు. మనసు విప్పి ముచ్చట్లాడతారు. ఆటపాటలతో సేదతీరతారు. తెలుగు ఇండిపెండెంట్‌ సినిమా సభ్యులైతే ఏకంగా ఓ సినిమానే నిర్మించారు. ఇక ఆన్‌లైన్‌లో జట్టుకట్టి సేవా కార్యక్రమాలకీ సై అంటున్న యువత లేకపోలేదు. అయితే వీటన్నింటికీ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం మాత్రం ఆన్‌లైన్‌ టైమ్‌లైన్‌లోనే టైమ్లీగా జరుగుతుంటుంది.
తీరుతెన్నులు తేలికే...
ఇన్ని లాభాల ఫేస్‌బుక్‌ గ్రూపు ప్రారంభించడం తేలికే. ఫేస్‌బుక్‌ తెరిచి ఎడమవైపు ఉండే 'క్రియేట్‌ గ్రూప్‌'ని సింపుల్‌గా క్లిక్‌మనిపించడమే. ఆపై గ్రూపుకి నచ్చిన పేరు పెట్టేసి, సభ్యుల్ని ఆహ్వానిస్తే సరి. ఇద్దరితో మొదలైనా గ్రూపే. సభ్యుల సంఖ్యకు పరిమితి లేదు. అయితే ఈ గ్రూపుల్లో మూడు రకాలుంటాయి.
ఓపెన్‌ గ్రూప్‌: గ్రూపు సభ్యులు, సభ్యులు కానివాళ్లూ ఫాలో కావొచ్చు. తమ అభిప్రాయాలు చెప్పొచ్చు.
క్లోజ్డ్‌ గ్రూప్‌: ఎవరైనా ఈ గ్రూపుని గమనించవచ్చు. పోస్ట్‌లు చేయాలంటే మాత్రం సభ్యులు కావాల్సిందే.
సీక్రెట్‌ గ్రూప్‌: కేవలం గ్రూపు సభ్యులకే పరిమితం.
సేవకు మార్గం
టెక్‌ నిపుణుల మనసులూ సాంకేతికం కాదు. సాఫ్ట్‌వేర్‌ జనాలంటే నిత్యం సరదాల్లో సేద తీరేవాళ్లు కాదు. వీళ్లలో సమాజహితం కోరుకునేవాళ్లూ ఎందరో. అలాంటిదే 'ఐటీ ప్రొఫెషనల్స్‌' ఫేస్‌బుక్‌ గ్రూపు. టెక్‌ సపోర్ట్‌ అసోసియేట్‌ నవీన్‌ మొదలుపెట్టిన ఈ బృందంలో 5,520 మంది సభ్యులు. 'సేవకు నాతో చేతులు కలపండి' అని అతడిచ్చిన పిలుపునకు ఆర్నెళ్లలో అంతమంది సై అన్నారు. ఇది ఓపెన్‌ గ్రూప్‌. సమాజంలోని సమస్యలు, అవసరాల సమాచారం ఏ సభ్యుడికి తెలిసినా వివరాలు ఆన్‌లైన్‌లోకి చేరతాయి. చేపట్టబోయే కార్యక్రమ షెడ్యూల్‌ వాల్‌పై ప్రత్యక్షమవుతుంది. అందరూ రావాలనే ఒత్తిడేం లేదు. ఆసక్తి ఉన్నవాళ్లే కార్యక్రమంలో భాగస్వాములు కావొచ్చు. ఇప్పటికే రక్తదాన శిబిరాలు నిర్వహించారు. అనాథ పిల్లలతో ఆడిపాడారు. వృద్ధులకి వేల స్వెట్టర్లు పంచారు. అన్నదానం చేశారు.
అనుబంధాల వారధి
'పే¶స్‌బుక్‌ అంటే కాలక్షేపం కాదు. తరాల అంతరాలతో పాటు మనుషుల మధ్య పెరిగిపోతున్న అంతరాల్ని తగ్గించుకునే సాధనం' అంటారు సుషుమ్నరావు. అనురాగాలు, ఆప్యాయతల ఉమ్మడి కుటుంబం లక్ష్యంతో తమ బంధువుల కోసం YES (Young Elder"s sandadi) గ్రూపు ప్రారంభించారామె. అప్పుడే పుట్టిన పాపాయి నుంచి వందేళ్ల బామ్మ వరకు ఇందులో 77 మంది సభ్యులు. బంధాలు, బంధుత్వాలు, అనుబంధాలు, ఆప్యాయతలు, తీపి జ్ఞాపకాలు, భాష, సంప్రదాయాల్ని తమ వారసులకు అందించడం ఈ గ్రూపు ఉద్దేశం. బామ్మ వందేళ్ల పుట్టినరోజు వేడుక, తాతగారి మేడపై పెరిగిన పూల మొక్క... చర్చించుకోవడానికి ఏదైనా సందర్భమే. సభ్యుల ఇళ్లలో ఏదైనా కార్యక్రమం జరిగినా, అంతా కలిసి సరదాగా బయటికెళ్లాలనుకున్నా 'మీరూ రండహో' అని ఒక పోస్ట్‌ పెట్టేస్తారు. 'నేటి యూత్‌ అపరిచితులతో తమ భావాలు పంచుకుంటూ ఇంట్లోవాళ్లకి దూరమవుతుంటారు. తరాల అంతరాలను తగ్గించడానికి ఈ సాంకేతికతను కుటుంబ సభ్యులే ఎందుకు ఉపయోగించుకోకూడదు?' అంటారు సుషుమ్నరావు.
 
వెండి వెన్నెల... వెండి వెన్నెల...
సినిమాలంటే కొందరికి అభిమానం. ఇంకొందరికి వ్యామోహం. ఒక్క ఛాన్స్‌ ఇస్తే చెలరేగిపోయేవాళ్లూ ఎందరో. ఈ మూడురకాల వ్యక్తుల కూడలి 'తెలుగు ఇండిపెండెంట్‌ సినిమా'. కోట్లు వెచ్చించి సినిమా తీయకపోయినా ఈ గ్రూపు సభ్యులకు సినిమా సక్సెస్‌ మంత్ర తెలుసు. సినిమాల రివ్యూల దగ్గర్నుంచి ఆ పాత మధురాల్లోని క్లాసిక్స్‌ వరకు దేనిపైనైనా చర్చిస్తారు, విమర్శిస్తారు, సలహాలిస్తారు. అరవ సినిమా ఎందుకు ఆడింది? బెంగాలీ చిత్రం అవార్డుల బరిలో ఎందుకు నిలిచిందీ? విశ్లేషణాత్మకంగా చెప్పగలరు. అయితే ఇవి అంతర్జాల చర్చలకే పరిమితం కాదు. 'వీలు కుదిరితే బయట కలుసుకుంటాం. తెలుగు సినిమా డెవలప్‌మెంట్‌పై చర్చిస్తాం. అసలు తెలుగు సినిమాకి ప్రత్యామ్నాయ, సమాంతర సినిమాలే మా లక్ష్యం' అంటాడు ఈ కీలక సభ్యుడు ప్రదీప్‌. కొంతమంది సభ్యులు కలిసి ఓ షార్ట్‌ఫిల్మ్‌ కూడా నిర్మించారు. మహేశ్‌కుమార్‌ కత్తి ఈ గ్రూపు క్రియేటర్‌. 1960 మంది సభ్యులున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)