సొగసు జోరు..కుర్ర హుషారు! (Eenadu Eetaram_29/12/12)
రాతి యుగమైనా.. రాకెట్ రోజులైనా... కాల గమనం ఎప్పుడూ ఒకటే! రోజుకు 24 గంటలు... ఏడాదికి పన్నెండు నెలలు... కానీ అదేం చిత్రమో.. ఈ కాలపు కాలం మహా జోరు మీదుంది... నింగిని చీల్చుకెళ్లే రాకెట్‌లా... బుల్లెట్ రైలు స్పీడులా... అచ్చం కుర్రకారు దూకుడులా! అందుకేనేమో... స్మార్ట్‌ఫోన్‌పై మోజు తీరకముందే... ఆన్‌లైన్ చాట్లాట ముగియకముందే... బ్లాగుల్లో భావాల అల్లికకు ఫుల్‌స్టాప్ పెట్టకముందే... మాల్స్‌లో మెచ్చిన డ్రెస్ వేయకముందే... యుగాంతం భయమింకా తొలగకముందే... 2012 కనుమరుగవుతోంది! ఆ అనుభూతుల దొంతరల్ని నెమరేస్తూనే... 2013కి పలుకుదాం సుస్వాగతం!! యువత కోసం సొగసులా? సొగసు సృష్టికర్తలు యువతా? అంటే కోడిముందా? గుడ్డుముందా? అన్నంత జటిల సమస్య. సమస్యను పక్కకి నెట్టేస్తే ఈ ఏడాది సొగసులు పరవళ్లు తొక్కాయనే చెప్పాలి. కాలేజీ స్వీటీల నుంచి బాలీవుడ్ బ్యూటీల దాకా అందరిదీ ఓం సొగసాయనమః జపమే. కుర్రాళ్లు మాత్రం తక్కువా? రిమ్'జిమ్' రిమ్'జిమ్' జిందాబాద్ అన్నారు. హీరోలు మీసాలు మెలేస్తే అనుసరిస్తూ రోషం చూపించారు. అలా 2012లో యువత ఆదరించిన హాట్ ట్రెండ్స్ కొన్ని. చీరకట్టు అందం: సింగారించుకునే తీ...