సొగసు జోరు..కుర్ర హుషారు! (Eenadu Eetaram_29/12/12)


రాతి యుగమైనా.. రాకెట్‌ రోజులైనా... కాల గమనం ఎప్పుడూ ఒకటే! రోజుకు 24 గంటలు... ఏడాదికి పన్నెండు నెలలు... కానీ అదేం చిత్రమో.. ఈ కాలపు కాలం మహా జోరు మీదుంది... నింగిని చీల్చుకెళ్లే రాకెట్‌లా... బుల్లెట్‌ రైలు స్పీడులా... అచ్చం కుర్రకారు దూకుడులా! అందుకేనేమో... స్మార్ట్‌ఫోన్‌పై మోజు తీరకముందే... ఆన్‌లైన్‌ చాట్లాట ముగియకముందే... బ్లాగుల్లో భావాల అల్లికకు ఫుల్‌స్టాప్‌ పెట్టకముందే... మాల్స్‌లో మెచ్చిన డ్రెస్‌ వేయకముందే... యుగాంతం భయమింకా తొలగకముందే... 2012 కనుమరుగవుతోంది! ఆ అనుభూతుల దొంతరల్ని నెమరేస్తూనే... 2013కి పలుకుదాం సుస్వాగతం!!
యువత కోసం సొగసులా? సొగసు సృష్టికర్తలు యువతా? అంటే కోడిముందా? గుడ్డుముందా? అన్నంత జటిల సమస్య. సమస్యను పక్కకి నెట్టేస్తే ఈ ఏడాది సొగసులు పరవళ్లు తొక్కాయనే చెప్పాలి. కాలేజీ స్వీటీల నుంచి బాలీవుడ్‌ బ్యూటీల దాకా అందరిదీ ఓం సొగసాయనమః జపమే. కుర్రాళ్లు మాత్రం తక్కువా? రిమ్‌'జిమ్‌' రిమ్‌'జిమ్‌' జిందాబాద్‌ అన్నారు. హీరోలు మీసాలు మెలేస్తే అనుసరిస్తూ రోషం చూపించారు. అలా 2012లో యువత ఆదరించిన హాట్‌ ట్రెండ్స్‌ కొన్ని.చీరకట్టు అందం: సింగారించుకునే తీరు తెలిస్తే చీరలోనే తరగని సొగసులు. ఈ విషయం బాలీవుడ్‌ తారలకి బాగా తెలిసొచ్చింది. అందుకే కేన్స్‌, మరకేష్‌.. అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో చీరలో చమక్కుమన్నారు బిపాషా, ఐశ్వర్యలు. ప్రపంచ ఫిగర్లు పారిస్‌ హిల్టన్‌, ఓఫ్రా విన్‌ఫ్రేలు చీరందాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఈ ఏడాదే. కాలేజీ అమ్మాయిలైతే కళాశాల యానివర్సరీలు, ప్రత్యేక సందర్భాల్లో చీర కుచ్చిళ్లు సవరిస్తూనే ఉన్నారు. ఎవరికి నచ్చిన చీరెలు వారు కట్టినా అందులో అందరు మెచ్చిన ట్రెండ్స్‌ నెట్టెడ్‌, డ్రేప్డ్‌లు.
అనార్కలి సూట్లు: అనార్కలి అందానికి సలీం ఎంత మురిశాడో తెలీదుగానీ నేటి అనార్కలి సూట్లకు అమ్మాయిలంతా ఫిదాలే. ముఖ్యంగా పెళ్లి, పండగ సందర్భాల్లో పల్లెటూరి అమ్మాయిలు, నగరాల్లోని మగువల మనసు పడింది వీటిపైనే. ఇక 2012లో కరీనా, కత్రినా, ప్రియాంకా లాంటి బాలీవుడ్‌ స్టార్లే ఈ ట్రెండ్‌కి బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారారంటే తేలిగ్గా నమ్మొచ్చు. కరీనా తన పెళ్లికి ముందు ముస్తాబయ్యింది, కత్రినా సినిమా ప్రచార కార్యక్రమాల్లో మెరిసిందీ అనార్కలీ సూట్‌లోనే. ఇందులోనూ లాంగ్‌ అనార్కలీ, వెస్ట్రన్‌ అనార్కలీ, ఓపెన్‌ షర్ట్‌ అనార్కలీ, అనార్కలీ ఫ్రాక్స్‌ మోడళ్లు స్పెషల్‌.
లెగ్గింగ్స్‌ జోరు: మరీ అంత ఓల్డ్‌ కాకపోయినా అమ్మాయిలు గోల్డ్‌లా అభిమానిస్తున్న ట్రెండ్‌ లెగ్గింగ్స్‌. ఆధునికంగా, సౌకర్యంగా ఉండే లెగ్గింగ్స్‌ ఈ ఏడాది కూడా గాళ్స్‌ వార్డ్‌రోబ్‌ల్లో తిష్ట వేశాయి. కాకపోతే అవే కాస్త సైజు తగ్గించుకొని, మరిన్ని తళుకులద్దుకొని 'క్లాసిక్‌ లెగ్గింగ్స్‌', 'డిజిటల్‌ లెగ్గింగ్స్‌' అంటూ బయల్దేరాయి.
మీసాలు మెలేసిన కుర్రాళ్లు: అమ్మాయిలు దుస్తుల్లో అందాన్ని వెతుక్కుంటే అబ్బాయిలు మీసాలు మెలేసే కార్యక్రమం మొదలు పెట్టారు. ఇదంతా సల్లూ భాయ్‌ ప్రభావమే లెండి! ఆ ట్రెండ్‌కి తమ సినిమాలతో మరింత ఊపు తెచ్చారు షాహిద్‌, అక్షయ్‌కుమార్‌లు. గబ్బర్‌సింగ్‌, పంజాలతో మన పవన్‌ సైతం మన కుర్రాళ్లలో రోషం రగిలించాడు. మీసం మొలిపించాడు.
కండలు పెంచారు: కండల కలవరం ఈ యేడు కూడా మహా జోరు మీదుంది. ఏడాది ఆరంభంలోనే పూలరంగడు సునీల్‌ ఈ ట్రెండ్‌కి తెరతీశాడు. ఆపై చెర్రీ రామ్‌చరణ్‌ కండల్ని బూరెల్ని పొంగిస్తూ కుర్రకారులో రచ్చ చేశాడు. చివర్లో రానా 'నేనే టాలీవుడ్‌ హంక్‌' అంటూ కృష్ణం వందే జగద్గురుమ్‌లో ఏకంగా కండల ప్రదర్శనే చేశాడు. దీని కంటే ముందే బాలీవుడ్‌లో కండల జోష్‌ మొదలైంది. క్రిష్‌ 3 కోసం 'పర్‌ఫెక్ట్‌ ఎయిట్‌' అనిపించుకున్నాడు హృతిక్‌రోషన్‌. మిగతా తారలూ యథాశక్తి శ్రమించారు! అన్నట్టు ఎప్పుడూ చొక్కా విప్పని మహేశ్‌ బాబు సైతం ఈ కండల క్లబ్బులో సభ్యుడు కావాలని తెగ ఊరిళ్లూరుతున్నాడని వినికిడి. అందం, ఆరోగ్యం కలిసి వస్తుంటే.. తెరవేల్పులు కసరత్తులతో కష్టపడుతుంటే.. కుర్రకారు మాత్రం జిమ్‌ల వెంట పరుగులు తీయకుండా ఉంటారా?
టోన్డ్‌ బాడీ ట్రెండ్‌: కండలే కాదు మొత్తం శరీరాకృతి ఫిట్‌గా ఉంటేనే హిట్‌ అనే కొత్త ట్రెండ్‌ మొదలైందీ ఈ ఏడాదే. దీన్నే ముద్దుగా 'టోన్డ్‌ బాడీ' అన్నారు. కాలి బొటన వేలి నుంచి తల దాకా అన్నీ అమరాలనేది ఈ ధోరణి ఉద్దేశం. దీని కోసం అమ్మాయిలు, అబ్బాయిలు ప్రత్యేక డైట్లు, వ్యాయామశాలలతో దోస్తీలు, సొంత శిక్షకులతో కుస్తీలు.. అబ్బో చాలానే కష్టపడ్డారండీ! ఇక తారలైతే మరీనూ. ఈ సొగసుల్ని పుణికిపుచ్చుకున్న బాలీవుడ్‌ మొదటి భామ దీపికా పదుకొనే. ఆపై ప్రియాంకా చోప్రా, రణ్‌వీర్‌, హృతిక్‌, షాహిద్‌లు మాదీ టోన్డ్‌బాడీ అని నిరూపించుకున్నారు.
ఇవి మచ్చుకే. జీరో జోరు, స్కార్ఫ్‌లు యువత మెడ చుట్టేయడం ఈ ఏడాది కొనసాగింపు మెరుపులు. హారెమ్‌ ప్యాంట్స్‌, బాక్సర్‌ షార్ట్స్‌, ట్యూనిక్‌లు, జంప్‌ సూట్లు, ఫ్లోరల్‌, ట్రైబల్‌ ప్రింట్ల ఔట్‌ఫిట్లు, దోతీ ప్యాంట్లు, స్లీవ్‌లెస్‌ గౌన్లు, లో నెక్‌ షర్టులు, పిక్కల పైకెక్కిన షార్ట్స్‌ మరిన్ని తళుకులు.
గెలిచారు... నిలిచారు!
విజేతలు గెలవడానికే పుడతారు. వాళ్ల ఆలోచన, ఆచరణ, ఆశయం, ఆకాంక్ష చేతల్లో చూపిస్తారు. ఈ ఏడాది కొందరు కార్య సాధకులు.
శృంగార నటుడు
నటనలో మేటి అమీర్‌. మాస్‌ మహారాజా సల్మాన్‌. అభిమానంలో అదుర్స్‌ షారూఖ్‌. ఈ ముగ్గురు ఖాన్‌లను తట్టుకొని స్టారయ్యాడు హృతిక్‌. నటన, డ్యాన్స్‌, శరీరాకృతి... పక్కా పర్‌ఫెక్ట్‌గా ఉండాలని తపించే రకం. ఎక్కడా తగ్గలేదు. అందుకే 'ఈస్టర్న్‌ ఐ' పత్రిక ఆన్‌లైన్‌ సర్వేలో హృతిక్‌ని 2012 'సెక్సీయెస్ట్‌ ఆసియన్‌ మ్యాన్‌'గా పట్టం కట్టారు జనం.మేటి విజేత
విజేతల ముఖ్య లక్షణం చరిత్ర సృష్టించడం. సైనా సిసలైన విజేత. లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గి చరిత్ర సృష్టించింది. భారత క్రీడాకారులెవరికీ సాధ్యం కాని విజయాలు సాధించింది. స్విస్‌, థాయ్‌లాండ్‌, ఇండోనేషియా, డెన్మార్క్‌ సూపర్‌ సిరీస్‌లు నెగ్గింది ఈ యేడాదే.
సొగసు దేవత
కేథరిన్‌ మిడిల్‌టన్‌ అంటే ఓ వివాదాల సునామీ. బ్రిటన్‌ యువరాజుతో ప్రేమాయణం, వైభవంగా జరిగిన పెళ్లి, న్యూడ్‌ ఫొటోల వివాదం.. అన్నీ సంచలనాలే. వీటికి మించి ఆమె యువతకు సొగసు దేవత. కేట్‌ స్త్టెల్‌ని గుడ్డిగా అనుసరించే యూత్‌ ప్రపంచమంతా ఉన్నారు. అందుకే డచెస్‌ ఆఫ్‌ కేంబ్రిడ్జ్‌ని 'గ్లోబల్‌ స్త్టెల్‌ ఐకాన్‌'గా గుర్తించింది హెరాల్డ్‌ సన్‌ పత్రిక. ఆమె పెట్టే ఖర్చులో 32 శాతం వార్డ్‌రోబ్‌కే.
60 కోట్లు: మన దేశంలో ఇరవై అయిదేళ్ల లోపు యువత
22 కోట్లు: 2012లో అమ్ముడైన సెల్‌ఫోన్లు
5 లక్షలు: ఈ ఏడాది నమోదైన కొత్త ఉద్యోగాల సంఖ్య
22 శాతం: పెళ్లికి ముందే శృంగారం రుచి చూసిన యువత
రూ.55వేల కోట్లు: 2015 నాటికి ఇంటర్నెట్‌ లావాదేవీల విలువ
రూ.750 కోట్లు: సొగసుల కోసం యువత ఖర్చుపెట్టిన మొత్తం
66 కోట్లు: మొత్తం వెబ్‌సైట్ల సంఖ్య
Eenadu direct link: http://eenadu.net/Specialpages/etharam/etharaminner.aspx?qry=sp-etaram1


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు