పల్లెసీమ కుర్రాళ్లు... గెలుపు మొనగాళ్లు! (Eenadu_08/12/12)



పల్లెసీమ కుర్రాళ్లు... గెలుపు మొనగాళ్లు!
తల నెరిసిన అనుభవం లేదు... కాన్వెంట్లలో చదవలేదు... పెట్టుబడికి కార్పొరేట్ల అండ లేదు... పుట్టిపెరిగింది పల్లెటూళ్లలో... అయినా ఇవేం అడ్డంకి కాలేదు... ఆశనే పెట్టుబడిగా పెట్టారు... ఆశయాన్ని ఆలంబనగా చేసుకున్నారు... కలల బాటలో దూసుకెళ్లారు... విజయ తీరాలకు చేరుకున్నారు... పక్కవాళ్లకూ ఉపాధి కల్పిస్తున్నారు... అలాంటి యువ ఔత్సాహిక వ్యాపారవేత్తలతో మాట కలిపింది 'ఈతరం'.
పరిస్థితులు అనుకూలించక పదో తరగతితోనే చదువు ఆపేశాడు. కానీ ఇప్పుడతడు ఐ.ఎఫ్‌.ఎస్‌. అధికారులకే పాఠాలు బోధించే మేనేజ్‌మెంట్‌ గురూ. నర్సరీ వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న ఆ యువకుడేరత్నం అయ్యప్ప.తూర్పుగోదావరి జిల్లా బొబ్బర్లంక రత్నం సొంతూరు. చిన్న కుటుంబం. రెండున్నర ఎకరాల పొలం. సాఫీగా సాగిపోయేది జీవితం. 1996లో విరుచుకు పడిన తుపాను వారి పంటనే కాదు బతుకుల్నీ ఛిద్రం చేసింది. ఉన్నదంతా వూడ్చుకుపోవడంతో చదువాపేసి స్థానిక నర్సరీలో పనికి కుదిరాడు. నెలకు రూ.1500 వేతనం. జీతం పెరుగుతున్నా ఖర్చులకు సరిపోని పరిస్థితి. సొంతంగా నర్సరీ ప్రారంభించాలనే నిర్ణయానికొచ్చాడు. వినియోగదారులతో సత్సంబంధాలున్నాయి. ఆంగ్ల, హిందీ భాషలపై పట్టుంది. హార్టీకల్చర్‌ డిప్లమా కూడా పూర్తి చేశాడు. ఇవే సరిపోవుగా? భారీ పెట్టుబడి పెట్టాలి. బ్యాంకుల చుట్టూ తిరిగినా రుణం పుట్టలేదు. చివరికి రూ.2 లక్షలు అప్పు చేసి 'ఎ.కె.ఎస్‌.వి. నర్సరీ' ప్రారంభించాడు.
వెంటనే లాభాలొచ్చి ఒళ్లో పడలేదు. అందుకే సరికొత్తగా ఆలోచించి ఆన్‌లైన్‌ బుకింగ్‌కి తెర తీశాడు. మారిషస్‌, మలేషియా, సింగపూర్‌, బ్యాంకాక్‌ల నుంచి కొత్తరకం మొక్కలు తీసుకొచ్చి పరిచయం చేశాడు. అంతర్జాల ప్రచారం ఫలించింది. ఆర్డర్లు జోరందుకున్నాయి. ఫలితం... నాలుగేళ్ల కిందట నలుగురితో మొదలైన నర్సరీ ప్రస్తుతం 50 మందికి జీవనోపాధి కల్పిస్తోంది. వాళ్ల వేతనాలకే నెలకు రూ.2.50 లక్షలు చెల్లిస్తున్నాడు రత్నం. ప్రచారంలో భాగంగా అతడు వైవిధ్యంగా రూపొందించిన గ్రీటింగ్‌ కార్డు ఆంధ్రప్రదేశ్‌ ఫారెస్ట్‌ అకాడమీ డైరెక్టర్‌కు తెగ నచ్చింది. ఐ.ఎఫ్‌.ఎస్‌. అధికారులకు 'మైక్రో క్రెడిట్‌ అండ్‌ మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌ మేనేజ్‌మెంట్‌' అంశంపై బోధించాలని ఆహ్వానం పంపారాయన. వెళ్లి పాఠాలు బోధించాడు. ఇక తమిళనాడులో శ్రీపురం గోల్డెన్‌ టెంపుల్‌, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, చెన్నైలోని మహేంద్ర ఇన్ఫోసిటీలు... రత్నం నర్సరీ మొక్కలతో సరికొత్త అందాలు సంతరించుకున్నవే.
- గేదెల భరత్‌కుమార్‌, ఈజేఎస్‌
కల నెరవేరింది!
రోబో తయారీ ఆ కుర్రాడి కల. దానికోసం డబ్బులు సంపాదించాలనుకున్నాడు. మిత్రుడితో కలిసి కంపెనీ ప్రారంభించాడు. మూడున్నరేళ్లలో దాన్ని రోబోలు రూపొందించే స్థాయికి తీస్కెళ్లాడు. మధ్యలో ఎన్నో ఆటుపోట్లు. ఆ విజేత గుంటూరు జిల్లా తాడికొండ కుర్రాడురాజేశ్‌ యర్రమాసు.2009 జనవరిలో మిత్రుడు రావూరి రమాకాంత్‌తో కలిసి 'జెస్ట్‌ యు'కి రెక్కలు తొడిగాడు రాజేశ్‌. అప్పటికింకా ఇద్దరూ ఇంజినీరింగ్‌ విద్యార్థులే. జెస్ట్‌ యు ఉచిత ఎసెమ్మెస్‌ల ఆన్‌లైన్‌ పోర్టల్‌. ఇందులో 120 అక్షరాలు ఉచిత ఎసెమ్మెస్‌లకైతే, నలభై అక్షరాలు ప్రచారానికి కేటాయించేవాళ్లు. అప్పటికే ఎస్‌.ఎమ్‌.ఎస్‌. కంట్రీ, 160బై2 లాంటి కంపెనీలు మార్కెట్‌ని శాసిస్తుండేవి. ఈ పోటీ తట్టుకోవడానికి తమ కస్టమర్లకి నచ్చేలా సందేశాలు రూపొందించేవాళ్లు ఇద్దరు మిత్రులు. నాణ్యమైన సేవలు అందించేవాళ్లు. దీంతో ఏడాదిన్నరలో వెయ్యి మంది కస్టమర్లయ్యారు. అందులో బిగ్‌బజార్‌, లెవీస్‌, రీబాక్‌లాంటి ప్రముఖ సంస్థలున్నాయి. 'వెబ్‌సైట్లు ఎందుకు రూపొందించకూడదు?' అంటూ ఓ కస్టమర్‌ అడగడంతో వెబ్‌డిజైనింగ్‌లోకి ప్రవేశించారు. జస్ట్‌ యు కాస్తా 'జస్ట్‌ వింగ్స్‌'గా మారింది. తర్వాత ఆర్నెళ్లకు ఐటీ సర్వీసుల్నీ ప్రారంభించారు. మొదట్లో కొత్త సంస్థపై నమ్మకం లేక 'మీరు డిజైన్‌ చేసిన వెబ్‌సైట్‌లో సమస్యలొస్తే పరిష్కరించేవాళ్లు ఎవరు?' అనడిగేవారు కస్టమర్లు. వాళ్లకి నమ్మకం కలిగించడానికి వెబ్‌సైట్ల నిర్వహణ సైతం చేసేవాళ్లు. ఏ రంగంలోకి వెళ్లినా రాజేశ్‌, రమాకాంత్‌లు నమ్మిన సూత్రం ఒక్కటే. వినియోగదారుడు సంతృప్తి పడేలా సేవలందించడం. మొదట్లో చిన్న ఇరుకు గది, ఇద్దరు ఉద్యోగులతో మొదలైన జెస్ట్‌ వింగ్స్‌ ఇప్పుడు ఎనభై మంది ఉద్యోగులు, పెద్ద భవనంలో కొనసాగుతోంది. రెండు కోట్ల టర్నోవరుకి చేరువైన జస్ట్‌వింగ్స్‌ వ్యవస్థాపకులు ఒకనాడు జేబులో డబ్బుల్లేక కిలోమీటర్లు నడిచి వెళ్లిన సందర్భాలున్నాయి. అన్నట్టు తనకిష్టమైన రోబో రంగంలో కూడా కాలు మోపాడు రాజేశ్‌. ఓ రిటైల్‌ సంస్థ కోసం గుమ్మం ముందు నిల్చొని వినియోగదారులకు స్వాగతం పలికే రోబోలు తయారు చేస్తున్నాడు.
కోరిన చోటే ఉపాధి బాట
చదువు పూర్తి కాలేదు. చేతిలో చిల్లిగవ్వలేదు. అయినా అతడి లక్ష్యం సొంత కంపెనీ. సొంతూరిని ఐటీ కేంద్రంగా మలచడం. తరగతి గది నుంచే పని మొదలుపెట్టాడు. లక్ష్యానికి చేరువయ్యాడు. అతడే బాపట్ల కుర్రాడుదేవరకొండ మణికంఠ.నిచేస్తేనే పూట గడిచే కుటుంబం మణికంఠది. అయినా తాహతుకు మించి కార్పొరేటు కాలేజీల్లోనే చదివించారు నాన్న. కష్టపడి చదివాడు. కానీ ఇంజినీరింగ్‌లో అసలు కష్టాలు మొదలయ్యాయి. గ్రామీణ నేపథ్యం. ఆంగ్లం అంతగా రాదు. పాఠాలు కొరుకుడు పడేవి కాదు. దూరంగా పారిపోలేదు. అంతు చూడాలనుకుని నిత్యం కాలేజీ ల్యాబ్‌లో గడిపేవాడు. సీనియర్ల ల్యాప్‌ట్యాప్‌తో తెల్లవార్లూ కుస్తీ పట్టేవాడు. గొప్పవాళ్ల జీవిత చరిత్రలు చదువుతూ స్ఫూర్తి పొందాడు. అప్పుడే సొంత కంపెనీ ప్రారంభించాలనే లక్ష్యం ఏర్పడింది అతడిలో.
2010లో బాపట్లలో 'అడిగోస్‌ సాఫ్ట్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌' మొదలు పెట్టాడు. చేతిలో డబ్బులు లేకుంటే మూడున్నర లక్షలు అప్పు చేసి మరీ. అప్పటికింకా అతడు ఇంజినీరింగ్‌ రెండో ఏడాదే. సొంతంగా వెబ్‌సైట్‌లు రూపొందించేవాడు. సాయంత్రం దాకా క్లాసులు, తెల్లవారేదాకా పని. ఇంజినీరింగ్‌ అయ్యాక పూర్తి సమయం సంస్థకే. 'పని నచ్చితేనే డబ్బులివ్వండి' అంటూ ప్రాజెక్టులు సంపాదించాడు. మరో నలుగురు ఉద్యోగుల్ని చేర్చుకున్నాడు. సర్వీసు బాగుండటంతో అమెరికన్‌ కంపెనీలు సైతం మణికంఠకి ఔట్‌సోర్సింగ్‌ ప్రాజెక్టులిచ్చాయి. ఈమధ్యలో అతడిలో మరో ఆలోచన మెరిసింది. ప్రముఖల పెళ్లిళ్లు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయడం చూస్తుంటాం. మరి ఎవరి పెళ్లిళ్లు వాళ్లకి గొప్పే కదా! దీంతో సామాన్యుల్ని దృష్టిలో పెట్టుకొని 'మ్యారేజ్‌ ఆన్‌లైన్‌' ప్రారంభించాడు. ఈ వెబ్‌సైట్‌తో ఎవరైనా తమ పెళ్లిని ప్రపంచమంతా వీక్షించేలా ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేసుకోవచ్చు. ఇప్పటికి 780 పెళ్లిళ్లు ఆన్‌లైన్‌కెక్కాయి. అందులో దేశవిదేశాలకు చెందిన జంటలున్నాయి. ఇప్పుడు మణికంఠ ఇరవై మందికి ఉపాధి కల్పించడమే కాదు బాపట్ల కార్యాలయానికి అనుబంధంగా అమెరికాలోని వర్జీనియాలో మరో సంస్థ ఏర్పాటు చేశాడు. బాపట్లలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ అనగానే ఎగతాళి చేసినవాళ్లు ఇప్పుడతడి ఎదుగుదల చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.
- కిరణ్‌కుమార్‌, ఈజేఎ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు