ఐడియా యుద్ధం! (Eenadu Sunday_16/12/12)
కొత్త ఆలోచనలు కదంతొక్కుతాయి. ఆవిష్కరణలు సై అంటే సై అంటాయి. ఐడియా పోటీలూ, బిజినెస్ ప్లాన్ కాంపిటీషన్లూ... క్యాంపస్ బుర్రలకు పదునుపెడుతున్నాయి. ఔత్సాహిక వ్యాపారవేత్తల కోసం గెలుపుఆలోచన... చిన్న పాయగా మొదలై... మహా సముద్రంలా విస్తరిస్తుంది. ఇది... జ్ఞానశక్తి. మేధకు సంబంధించింది. పోటీ... ప్రపంచానికి వీరుడినిస్తుంది. వీరుడికి విజయాన్నిస్తుంది. విజయానికి అర్థాన్నిస్తుంది. ఇది... ఇచ్ఛాశక్తి. గెలవాలన్న తపనతో ముడిపడింది. ఆచరణ... అద్భుతమైన ఐడియాలన్నీ వాటంతటవే అత్యద్భుతమైన వ్యాపారాలైపోవు. అమలు ముఖ్యం. చిత్తశుద్ధి ఉండాలి. ఇదే క్రియాశక్తి. ఆచరణే ప్రాణం. ఇచ్ఛాశక్తి-జ్ఞానశక్తి-క్రియాశక్తి ఈ మూడింటినీ కలిపి 'మహాశక్తి'గా అభివర్ణిస్తుంది భారతీయత. అది ఐడియాల పోటీ కావచ్చు, బిజినెస్ ప్లాన్ కాంపిటీషన్ కావచ్చు-ఏ విజయానికైనా ఇదే మార్గం, ఇదే మంత్రం!ఐడియాలు కావాలి... నూట ఇరవైకోట్ల కస్టమర్లున్నారు. ఇంటర్నెట్ ఉంది. ఇంటికో ఇంజినీరింగ్ పట్టభద్రుడున్నాడు. మౌలిక సౌకర్యాలున్నాయి. లేనిదల్లా ఐడియాలే. ఉన్నా అడుగుబొడుగు సరుకే. కాపీ రాగమే! నిఖార్సయిన ఐడియాల కొరత మార్కెట్‌ను తీవ్రంగా వేధిస్తోంది. ఎదుగుతున్న సమాజానికి ఆవిష్కరణలే ఆక్సిజన్. ఆ అవసరం పెరిగేకొద్దీ పోటీల ప్రాధాన్యం పెరుగుతుంది. అదే జరుగుతోందిప్పుడు. పోటీ... పదునైన బుర్రలకు సవాలు, గట్టి ఆలోచనలకు గండపెండేరం. అలాంటి పరీక్షలోనే... రంగురాళ్లతో పోరాడి వజ్రం గెలుస్తుంది. జంతుజాలం మధ్యలోంచి మృగరాజు దర్జాగా నడిచొస్తుంది. త్రేతాయుగంలో శివధనుస్సు అయినా, ద్వాపరలో మత్స్యయంత్రమైనా పోటీకి ప్రతీకలే. ఇప్పుడా పోరు మేధోయుద్ధంగా మార్పు చెందింది. బిజినెస్ ఐడియా కాంపిటీషన్స్... వాటి తాజారూపం. క్యాంపస్ క్యాంటీన్లో సెటైర్లేసుకుంటూ కాలక్షేపం చేసే కుర్రాళ్లను రెచ్చగొట్టాలంటే... లక్ష్యం లేకుండా బతికే టెక్కీలకు గెలుపులోని కిక్కు రుచి చూపాలంటే... 'నేనూ నాజీతం' అనుకునే జీవితాలకు విశ్వరూప దర్శనం చేయించాలంటే పోటీలే మార్గం. మరో వర్గమూ ఉంది. వాళ్లనెవరూ గిల్లాల్సిన పన్లేదు. గిచ్చాల్సిన అవసరం లేదు. రెచ్చిపోయే గుణం రక్తంలోనే ఉంటుంది. అవకాశాల కోసం భుజానికి బైనాక్యులరేసుకుని తిరుగుతుంటారు. ప్యాకేజీ బాగుంటే... బ్యాగేజీ సర్దుకుని బయల్దేరతారు. ప్రైజ్‌మనీ పాకెట్లో పడేదాకా పచ్చి మంచినీళ్లయినా ముట్టుకోరు. ...వీళ్లంతా ఐడియాల యుద్ధంలో అక్షౌహిణుల సైన్యం. శామ్‌సంగ్, ఎకనమిక్ టైమ్స్, టాటా, మహీంద్రా, ఫిలిప్స్, నోకియా... ఆహ్వానిస్తున్నది ఆషామాషీ సంస్థలు కాదు. జాతీయ అంతర్జాతీయ దిగ్గజాలు. ఆ పిలుపులో కొంత కార్పొరేట్ సామాజిక బాధ్యత ఉంది. ఎదుగూ ఎదగనివ్వూ... అన్న సువిశాల వ్యాపార భావనా లేకపోలేదు. నిజానికి ఏ సంస్థకు ఆ సంస్థకు పరిశోధన- అభివృద్ధి విభాగాలున్నా, వాటిపై కోట్లకు కోట్లు ఖర్చుపెడుతున్నా... ఇప్పటిదాకా ఏ గొప్ప వ్యాపార ఆలోచనా అద్దాల గదుల్లో వూపిరిపోసుకోలేదు. గూగుల్, ట్విటర్, ఫేస్‌బుక్... అన్నీ జనంలోంచి పుట్టినవే. సామాన్యుల ఆవిష్కరణలే. అందుకే కార్పొరేట్ సంస్థలు యువత భాగస్వామ్యానికి అంత ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఐడియాను వ్యాపారంగా మలచడంలో అన్నివిధాలా అండగా నిలిచే ఏంజిల్ ఇన్వెస్టర్లూ, వ్యాపార భాగస్వాములుగా మారి పెట్టుబడులు సమకూర్చే వెంచర్ క్యాపిటలిస్టులూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆశీస్సులు అందించే పోటీలూ తక్కువేం కాదు. అందులోనూ రకరకాలు. ఒక పోటీ ఐడియాలు చెబితే చాలంటుంది. ఒక పోటీ పక్కా బిజినెస్ ప్లాన్ సమర్పించమంటుంది. ఒక పోటీ గ్రామీణుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే ఆవిష్కరణలు కావాలంటుంది. ఒక పోటీ పర్యావరణానికి హానిచేయని టెక్నాలజీని కనిపెట్టమంటుంది. ఒక పోటీ అదరగొట్టే మొబైల్ అప్లికేషన్లను అందించమంటుంది. ఒక పోటీ డిజైనింగ్‌కు పెద్దపీట వేస్తూ వికలాంగుల సైకిళ్లనో, బస్‌స్టాపు బెంచీలనో సరికొత్తగా రూపొందించమంటుంది. కొన్ని విద్యార్థులకే పరిమితం. ఇంకొన్ని అందరికీ ఆహ్వానం. విద్యార్థికైనా, ఔత్సాహిక వ్యాపారికైనా... బిజినెస్ ప్లాన్ పోటీల్లో గెలుపు అంటే, జీవితంలో మలుపే! ఆ విషయంలో సందేహం లేదు. ఎకనమిక్ టైమ్స్ 'ద పవర్ ఆఫ్ ఐడియా'... ముడి ఐడియాలకు పదునుపెట్టి మెరుగులు దిద్దుతుంది. వేలవేల దరఖాస్తుల్లోంచి... దాదాపు 75 ఆలోచనలను ఎంపిక చేసి, ఐడియా వీరుల కోసం ఐఐఎమ్ సహకారంతో సదస్సు నిర్వహిస్తుంది. మెంటార్స్‌ను (మార్గదర్శకులను) అందిస్తుంది. అనుభవ సంపన్నుల దిశానిర్దేశంలో బాగా రాటుదేలిన ఐడియాల మధ్యే ప్రధాన పోరు ఉంటుంది. విజేతలకు ఐదు లక్షలదాకా బహుమతి ఇస్తారు. శామ్‌సంగ్ కూడా దాదాపుగా ఇంతే మొత్తంలో నజరానా ప్రకటిస్తుంది. మహీంద్రా స్పార్క్ సెప్టెంబరులో ప్రారంభించిన పోటీలు డిసెంబరు చివరి దాకా ఉంటాయి. బిజినెస్ ప్రాజెక్టులకూ, ఐడియాలకూ వేరువేరు విభాగాలున్నాయి. నెలనెలా పన్నెండు గ్రాంట్లు (ప్రాజెక్టులకు ఎనిమిది, ఐడియాలకు నాలుగు) అందిస్తారు. అంతిమ పోటీలో అత్యుత్తమ ప్రాజెక్టుకు 40 లక్షలు, అత్యుత్తమ ఐడియాకు 20 లక్షలు నజరానా ఇస్తారు. 'నెక్ట్స్ బిగ్ ఐడియా' తొలి 30 బృందాలకు 50 లక్షలదాకా నిధులు సమకూరుస్తుంది. 'బిజ్‌క్వెస్ట్' పోటీల విజేతల్లో ముగ్గురికి కోటిరూపాయల చొప్పున నిధులు లభించాయి. 'హైదరాబాద్ ఫర్ ఇన్నొవేటర్స్ ఫోరం'... త్వరలో జరగనున్న ఐడియా కార్నివాల్ ద్వారా రెండువందల మంది విద్యార్థులను ఎంపిక చేయాలని భావిస్తోంది. వారి ఐడియాలను వడపోసి, మెరుగుపెట్టి... కొన్నింటికైనా కార్యరూపం ఇవ్వాలన్న కృతనిశ్చయంతో ఉంది. కాలేజీ స్థాయిలో జరిగే పోటీలపై పెద్దపెద్ద కంపెనీల మానవవనరుల విభాగాలు ఆసక్తి చూపుతున్నాయి. 'ఐడియా' స్టార్స్‌కు ఆకర్షణీయమైన జీతాలు ఆఫర్ చేస్తున్నాయి. క్యాంపస్ దాటకుండానే వల వేయడానికి మైక్రోసాఫ్ట్ వంద విద్యాసంస్థల్లో ఇన్నొవేషన్ కేంద్రాలు ప్రారంభించబోతోంది. ఐడియాకు ప్రాణంపోయడం అంటే మాటలు కాదు. ఉత్పత్తి, మార్కెటింగ్, బ్రాండింగ్, సిబ్బంది... కోట్లు కావాలి. మొత్తంగా ఓ వ్యవస్థను నిర్మించుకోవాలి. ఆ పెట్టుబడితో పోలిస్తే, విజేతలకు ఇచ్చే బహుమతి మొత్తం తక్కువే కావచ్చు. కానీ, గెలుపు అందించే ఆత్మవిశ్వాసం మాత్రం వెలకట్టలేనిది. గుర్తింపు వల్ల..మన ఐడియా మీద మనకు నమ్మకం కుదుర్తుంది. విజేతను వేయికళ్లు గమనిస్తుంటాయి. అందులో ఇన్వెస్టర్లూ ఉండవచ్చు. అంతెందుకు, 'పాలతో ప్రజల జీవితాల్లో మార్పు' నినాదంతో 'అన్‌రీజనబుల్ ఇన్‌స్టిట్యూట్' పోటీకి పంపిన ప్రతిపాదన... తమిళనాడుకు చెందిన దేవీప్రసాద్ జీవితాన్నే మార్చేసింది. 'మీ ఆలోచన ఏమిటో నాలుగు ముక్కల్లో చెప్పండి?' అని అడిగినప్పుడు 'ప్రతి ఆవు నుంచి మరిన్ని పాలు, ప్రతి రైతుకూ మరిన్ని ఆవులు, ప్రతి పల్లెలో మరింతమంది రైతులు..' అంటూ మూడంటే మూడేముక్కల్లో తేల్చేశాడు. ఆ ఆత్మవిశ్వాసం నిర్వాహకులకు నచ్చింది. దేవీప్రసాద్ 'ఆరోహణ' పేరుతో పాల ఉత్పత్తిని ఓ సామాజిక వ్యాపారంగా ప్రారంభించాలనుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఎంపికలో అందరికంటే ముందు నిలిచాడు. ఇంకేముంది, వెంచర్ క్యాపిటలిస్టుల ద్వారా నిధులు సమకూరాయి. దాదాపు పాతిక గ్రామాలకు తన సామాజిక వ్యాపారాన్ని విస్తరించగలిగాడు. ఐడియా దగ్గరికే అవకాశాలు... ఒక్క పోటీల ద్వారానే సాధ్యం. కలల కసరత్తు... ఎందుకు, కొన్ని ఐడియాలే న్యాయనిర్ణేతలను ఆకర్షిస్తాయి? కొన్ని ఐడియాలకే బహుమతులు దక్కుతాయి? కొన్ని ఐడియాలే ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని చూరగొంటాయి? అంటే... 'ఐడియా మేనేజ్‌మెంట్' ఓ కళ. బిజినెస్ ప్లాన్... సినిమా స్క్రిప్టులా పక్కాగా ఉండాలి. రోడ్‌మ్యాప్‌లా స్పష్టంగా ఉండాలి. రాజ్యాంగంలా సమగ్రంగా ఉండాలి. ఫిక్షన్‌లా ఆకట్టుకునేలా ఉండాలి. మంచి బిజినెస్ ప్లాన్ అన్నది నూటికినూరు శాతం విజయాన్ని ఇవ్వకపోవచ్చు. కానీ, విజయావకాశాల్ని ఇస్తుంది. సైనికుడిలోని అప్రమత్తత, ఆటగాడిలోని సాధన, సైంటిస్టులోని ఏకాగ్రత, విద్యార్థిలోని జిజ్ఞాస, నటుడిలోని సమయస్పూర్తి, పర్వతారోధకుడిలోని ఆశావాదం...
ఫస్ట్ దె ఇగ్నోర్ యు. దెన్ దె లాఫ్ ఎట్ యు. దెన్ దె ఫైట్ విత్ యు. దెన్... యు విన్! |
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి