అంతర్జాలంలో అ..ఆ..ఇ..ఈ! (Eenadu Eetaram_22/12/12)
ఎవరన్నారు? తెలుగు కనుమరుగవుతోందని...ఎవరన్నారు?? తెలుగులో చదివితే ఉద్యోగాలు కరవవుతాయని...ఇది ఒట్టి అపోహ, భ్రమే! అంటున్నారు టెక్ నిపుణులు...పైపెచ్చు... భవిష్యత్తులో ఆన్‌లైన్ తెలుగుమయం...అంతర్జాలం కొలువుల నిలయం... ఇది ఖాయం అని సెలవిచ్చేస్తున్నారు...ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆ సంగతుల సమాహారం. ఆన్‌లైన్ వెలుగులకు శ్రమిస్తున్న కొందరు యువ తరంగాల పరిచయం. కంప్యూటర్, ఆన్‌లైన్, అంతర్జాలం అనగానే గుర్తొచ్చేది ఆంగ్లమే. ఇదంతా గతం. పరిస్థితులు మారుతున్నాయి. స్థానిక భాషల ప్రాభవం మొదలవుతోంది. అందులో తెలుగు భాష సైతం తన స్థానం పదిల పరుచుకుంటోంది. ఇది అత్యయిక పరిస్థితి. అందుకే గూగుల్, ఫేస్‌బుక్, యాహూలాంటి దిగ్గజాలు ముందే మేలుకున్నాయి. తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ, కన్నడమంటూ స్థానిక భాషలకు తమ సేవలు విస్తరిస్తున్నాయి. యువతలో భాగమైన ఫేస్‌బుక్ సైతం తెలుగును ప్రోత్సహిస్తోంది. ఫలితమే నిత్యం లక్షలమంది తమ చాట్లాటలు, అభిప్రాయాల్లో అలవోకగా తెలుగు అక్షరాల్ని వినియోగిస్తున్నారు. ఫేస్‌బుక్‌ని పోలిన వూక్‌స్టర్‌లాంటి సామాజిక అనుబంధాల వెబ్‌సైట్లు అయితే అచ్చంగా తెలుగు భాష, వ్యక్తులకే పట్టం కడుతున్నాయి. సెల్‌ఫోన్ కంపెనీలు సైతం ఎప్పుడో తెలుగు బాట పట్టాయి. తెలుగు భాష, అప్లికేషన్స్ (యాప్స్)ని అందుబాటులోకి తెచ్చాయి. ఇక బ్లాగుల సంఖ్య చెప్పనక్కర్లేదు. మనసు పొరల్లోని భావాలకు అక్షర రూపమిచ్చే తెలుగు బ్లాగుల సంఖ్య దాదాపు పదివేల వరకు ఉంటుందంటారు వివెన్. రాష్ట్ర ప్రభుత్వ ఐటీ శాఖ అంతర్జాల సలహామండలి సభ్యుడు. 'రాష్ట్రంలో ఆంగ్లంపై పట్టున్నవారు పది శాతమే. తెలుగు సాఫ్ట్‌వేర్లు, నిర్వహణ వ్యవస్థలు, ఫాంట్లు అభివృద్ధి చెందితే తొంభై శాతం ఆన్‌లైన్ ప్రక్రియ తెలుగుమయం అవుతుంది. భాష వికసిస్తుంది. ఉద్యోగాలు వెల్లువెత్తుతాయి' అంటూ విశ్లేషిస్తున్నారు. ఈమధ్య ప్రభుత్వం వైపు నుంచి కూడా ప్రోత్సాహం మొదలైంది. ప్రభుత్వ లావాదేవీలు కూడా ఆన్‌లైన్‌కెక్కితే తెలుగు పరిమళాలు మరింత వెదజల్లుతాయి. అజంత భాష అంతర్జాలాన్ని చుట్టేస్తుంటే భాషా నిపుణులు, కొలువులకు గిరాకీ పెరగకుండా ఉంటుందా? 'ఇప్పటిదాకా ఐటీ కంపెనీలు కార్పొరేట్ సంస్థల కోసం పనిచేశాయి. ఇప్పుడిక సామాన్యుల అవసరాలపై దృష్టి సారించే సమయం మొదలైంది. దీంతో వేల సంఖ్యలో ఉద్యోగాలు పుట్టుకు రావడం తథ్యం' అంటారు నల్లమోతు శ్రీధర్. 'కంప్యూటర్ ఎరా' సంపాదకులు. కుడి నుంచి ఎడమకు రాసే ఉర్దూ, కింది నుంచి పైకి రాసే జపనీస్ లాంటి భాషలు సైతం తమకంటూ ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం, సాఫ్ట్‌వేర్లు, వెబ్‌సైట్లు అభివృద్ధి చేసుకుంటుంటే తెలుగులో అది ఎందుకు సాధ్యం కాదంటారు వాళ్లు. ఈమధ్య కాలంలో ఇదే తరహా సానుకూల పరిణామాలు ఎక్కువయ్యాయి. గతంలో కంప్యూటర్‌లో తెలుగు రాయాలంటే అదో క్లిష్టమైన ప్రక్రియ. నిర్వహణ వ్యవస్థ (ఆపరేటింగ్ సిస్టమ్)లు సహకరించేవి కాదు. ఇప్పుడా పరిస్థితి మారింది. 'యుబుంటు', విండోస్ ఎక్స్‌పీ, 7, 8 ఓఎస్‌లను రెండే నిమిషాల్లో తెలుగు ఓఎస్‌లుగా మార్చొచ్చు. తెలుగుకు సహకరించేలా చేయొచ్చు. కొందరు యువ నిపుణులు బ్రౌజర్లను సైతం తెలుగులోకి అందుబాటులోకి తెచ్చారు. తెలుగు ఖతులు (ఫాంట్లు), తెలుగు వికీపీడియా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇదంతా తెలుగు భాషాభిమానులు వ్యక్తిగతంగా ఏళ్లకేళ్లు శ్రమించి చేసిన కష్టానికి ప్రతిఫలం. పెద్ద సంస్థలు ఇదే పనికి పూనుకుంటే భాషా నిపుణులు, సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, సాంకేతిక నిపుణుల రూపంలో వేలమందికి ఉద్యోగాలు దక్కే అవకాశం. ఈనాడు: హైదరాబాద్ |
Eenadu Direct Link: http://eenadu.net/Specialpages/etharam/etharaminner.aspx?qry=sp-etaram1
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి