ఆ తెల్లవాడే అసలైన తెలుగు వాడు!




ఆ తెల్లవాడే అసలైన తెలుగు వాడు!
1817, ఆగస్ట్‌ 13. 
ఇంగ్లండ్‌ నుంచి భారతదేశానికి ఓడ ఒకటి బయల్దేరింది. దాని పేరు కర్ణాటక్‌. వందలాది ప్రయాణికులున్నారు అందులో. ఆ వందల్లో ఓ అనామకుడు. 19 ఏళ్లవాడు. పేరు.. ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌. భవిష్యత్తులో మరణశయ్యపై ఉన్న తెలుగు సాహిత్యాన్ని.. శాస్త్రీయతా అనే గంగతో బతికించే సాహితీ భగీరథుడు. 'కానీ ఆ ఓడ ఎక్కేటప్పుడు అసలు 'తెలుగు' అనే మూడక్షరాల మాట విన్లేదు' అంటాడతను నిజాయతీగా. కానీ అతని జీవితం మొత్తాన్ని ఆ మూడు అక్షరాలే శాసించాయి. అతని మాటల్లో చెప్పాలంటే 'పిచ్చెక్కించాయి'. అతని వూపిరున్నంత వరకు వూడిగం చేయించుకున్నాయి!
క్క వ్యక్తి.. కేవలం ఒకే వ్యక్తి. పండితుల ఇంట్లో నా అనేవారులేక చెదలుపట్టిపోయిన తెలుగు సాహిత్యం బూజు దులిపాడు. మహరాజపోషకులు లేక... అణగారిన సారస్వతానికి అండగా నిలిచాడు. మిణుమిణుకులు మరిచిన అనర్ఘ రత్నాల మట్టితుడిచి సానబెట్టాడు. బ్రౌనే లేకుంటే.. మన తెలుగు సాహిత్యం మరొక వందేళ్లు వెనకబడి ఉండేదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.
బ్రౌన్‌ తండ్రి డేవిడ్‌ బ్రౌన్‌ కోల్‌కతాలో ఈస్టిండియా కంపెనీ నడిపిన ధర్మపాఠశాలల నిర్వాహకుడు. క్రైస్తవ మతప్రచారకుడే అయినా భారతీయతపై మక్కువ పెంచుకున్నవాడు. తన ముగ్గురు పిల్లలకు చిన్నప్పుడు పారసీ, హిందూస్థానీతోబాటు.. సంస్కృతం నేర్పించాడు డేవిడ్‌ బ్రౌన్‌. ఆ ముగ్గురిలో నడిపివాడు చార్లెస్‌ ఫిలిప్‌. భారతదేశంలో తొలిసారి తెలుగు పుస్తకాలను ప్రచురించిన శ్రీరాంపురం బాప్టిస్ట్‌ మిషన్‌.. అప్పట్లో వాళ్లింటికి దగ్గరే. డేవిడ్‌ బ్రౌన్‌ ప్రాచీన సంస్కృత గ్రంథాల మేలిప్రతులు తీసి.. ప్రచురించారు. ఆ పనిలో చార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌ కూడా పాలుపంచుకున్నాడు. ఈ బహుభాషా పరిచయం, ప్రచురణ అనుభవం.. తర్వాతి కాలంలో తెలుగు సాహిత్యానికి ఎంతో ఉపయోగపడింది. కానీ.. అందుకు తెలుగు సాహిత్యం మరో ఆరేళ్లపాటు వేచి ఉండాల్సి వచ్చింది!
ఇంగ్లండు నుంచి..: డేవిడ్‌ బ్రౌన్‌ అకాల మరణం తర్వాత ఆ కుటుంబం లండన్‌ వెళ్లింది. బ్రౌన్‌కు 18 ఏళ్లు నిండగానే చార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌ను కుంఫినీ తన ఉద్యోగంలోకి ఆహ్వానించింది. 'రైటర్‌'గా మద్రాసుకు పంపింది. మద్రాసులో మరో మూడేళ్లు శిక్షణ తీసుకోవాలని సూచించింది. ఆ మూడేళ్ల శిక్షణలో భాగంగానే బ్రౌన్‌ తెలుగు, మరాఠీ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. వెలగపూడి వెంకటరమణయ్య బ్రౌన్‌ చేత తెలుగు అక్షరాలు దిద్దించారు. ఎంతో కృషి చేసిన బ్రౌన్‌ తెలుగులో అత్తెసరు మార్కులతోనే పాస్‌ కాగలిగాడు!
'మన్రోలప్ప' స్ఫూర్తి!
అది కాలేజీలో చివరి రోజు. బ్రౌన్‌ను కడప కలెక్టర్‌ సహాయకునిగా నియమిస్తున్నట్టు ప్రకటించారు. అదే రోజు.. 'సివిల్‌' విద్యార్థులను ఉద్దేశించి నాటి గవర్నర్‌ థామస్‌ మన్రో ప్రసంగించారు. 'ప్రజల భాష నేర్చుకుని, ఆ భాషలో పాలన సాగిస్తేనే వారి ప్రేమానురాగాలు పొందవచ్చు...' అంటూ ఆయన చెప్పిన మాటలు కుర్ర బ్రౌన్‌ మనసులో నాటుకుపోయాయి. థామస్‌ మన్రో కడప కలెక్టర్‌గా పాలెగాళ్ల అధికారాల్ని తోసిరాజని రైత్వారి పద్ధతితో విప్లవం సృషించినవాడు. అంతటి మహానుభావుడు పనిచేసిన అదే ప్రాంతంలో తనకు తొలి పోస్టింగ్‌ రావడం కుర్రవయసు బ్రౌన్‌కు ఎంతో స్ఫూర్తినిచ్చింది. కడప థామస్‌ మన్రో పేరును రైతులు తమ పిల్లలకు 'మన్రోలప్ప'గా పెట్టుకోవడం బ్రౌన్‌ గమనించాడు కూడా! ఇదంతా తెలుగు ప్రాంతంపై బ్రౌన్‌లో మక్కువ పెంచింది. అతితక్కువకాలంలోనే తెలుగు మాట్లాడటంలో కడప కలెక్టర్‌ హేన్‌బరీని సునాయాసంగా మించిపోయాడు.
వేమనతోనే మొదలు..
రెండేళ్లలోనే కుంఫినీ కడప నుంచి మచిలీపట్నానికి బ్రౌన్‌ను బదిలీచేసింది. అక్కడే 'అబే దుబాయ్‌' అనే ఫ్రెంచి మతబోధకుడు భారతదేశ ఆచారవ్యవహారాలపై రాసిన పుస్తకం బ్రౌన్‌ చేతికి చిక్కింది. అందులోనే తొలిసారి 'కడపకు చెందిన వేమన' గురించి తెలుసుకున్నాడు బ్రౌన్‌. విభిన్న పాఠాంతరాలు, తాళపత్ర ప్రతులతో వేమన పద్యాలు సేకరించాడం మొదలుపెట్టాడు. పండితుల సహాయంతో వాటిలో నిక్కమైనవాటిని ఏర్చికూర్చాడు. రాతప్రతులు రాయించాడు. తన వ్యాఖ్యానాలతో ఆంగ్లంలో అనువదించడం మొదలుపెట్టాడు. అలా అనువదించేటప్పుడే.. తెలుగు ఛందస్సుపై దృష్టిసారించాడు. తెలుగు ఛందోరీతుల్ని అర్థంచేసుకుంటూ.. తెలుగు, సంస్కృతంపై పుస్తకం రాశాడు. మళ్లీ రాజమండ్రికి బదిలీపై వెళ్లినప్పుడే తెలుగు సాహిత్యం ఓ ఉన్మాదంలా అతని బుర్రకు ఎక్కడం ప్రారంభించింది. బ్రౌన్‌ తెలుగు కావ్యాలకు పూర్తిగా దాసుడైపోయాడు. నాలుగువేలకు పైగా తాళపత్ర గ్రంథాలు సేకరించాడు. 1826లో మళ్లీ కడపకు రావడంతోనే.. అక్కడ సొంత డబ్బులతో బంగళా ఏర్పాటుచేశాడు. దానికి కాలేజా అని పేరుపెట్టాడు. తెలుగు పండితులు, రాయసగాళ్లను నియమించుకుని ప్రాచీన తెలుగు గ్రంథాల పరిష్కరణకు నడుంబిగించాడు. ఇదంతా సొంత ఖర్చుతోనే!
పనిలో పనిగా అది వరకు ఎ.డి.క్యాంప్‌బెల్‌ రాసిన తెలుగు-ఇంగ్లీష్‌ నిఘంటువుకు అదనంగా సరళభాషలో నాలుగువేల పదాలు జతచేశాడు. తర్వాతి కాలంలో తెలుగు-ఇంగ్లిష్‌(బ్రౌణ్యం), ఇంగ్లిష్‌-తెలుగు నిఘంటువుల నిర్మాణానికి ఇది ఉపయోగపడింది.
బ్రౌన్‌ తయారుచేసిన మిశ్రమ భాషా నిఘంటువు... అప్పటికీ, ఇప్పటికీ ఓ 'క్లాసిక్‌'. బ్రౌన్‌ తర్వాత వందేళ్లకు గానీ మనం ఇటువంటి గ్రంథం తీసుకురాలేకపోయాం.
బ్రౌన్‌ ఎంత సాహితీప్రియుడో అంతగా ముక్కుసూటిదనం ఉన్నవాడు. అవినీతిని చూస్తే ఉడుకురక్తంతో ఉప్పొంగేవాడు. బ్రౌన్‌ క్రిమినల్‌ జడ్జిగా ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులకు వేసిన కఠిన శిక్ష వివాదాస్పదమైంది. కుంఫినీ ప్రభుత్వం ఆయన్ని తొలగించింది. మూడేళ్లపాటు ఆయన ఇంగ్లండులో ఖాళీగా ఉండిపోవాల్సి వచ్చింది. అప్పటికిగానీ తెలుగు కావ్యాల ప్రచురణకు తానువెచ్చించిన ఖర్చు రాసుకునే తీరిక బ్రౌన్‌కు దొరకలేదట! అప్పట్లోనే ఆ ఖర్చు రూ.30 వేలని తేలింది. ఇంగ్లండు నుంచి మరోసారి కుంఫినీ ఉద్యోగిగా వచ్చినప్పుడూ ఆయన తెలుగు ప్రచురణ మానలేదు..మళ్లీ సొంత ఖర్చుతోనే!
తెలుగులో నలరాజ కథ, రంగనాథ రామాయణం, మహాభారతంలో కొన్ని పర్వాలు, భాగవత స్కంధాలు, తారాశశాంకీయం, వసుచరిత్ర, మనుచరిత్ర, దశావతార చరిత్ర, ముద్దుపళని రాధికాసాంత్వనం గ్రంథాలను సేకరించి.. శుద్ధప్రతులు తయారుచేశారు. ఆ తర్వాత పదవి విరమణ పొంది ఇంగ్లండు వెళ్లారు.
అలా వెళుతూ వెళుతూ... తాతాచారి కథల్ని సంకలనం చేశారు. తెలుగుజాతికి బ్రౌన్‌ ఇచ్చిన చివరి బహుకృతి అది. ఆధునిక కథానికలకు దగ్గరగా వచ్చే కథనశైలి ఈ సంకలనంలో కనిపిస్తుంది. ఆ రకంగా అప్పట్లోనే వ్యవహారిక భాషపై బ్రౌన్‌ దృష్టిసారించాడని చెప్పొచ్చు.
'తెలుగు సాహిత్యం మరణశయ్యపై ఉండేది. 1825 నాటికి ఆ దీపం మిణుకుమిణుకు మంటోంది. అయితే 30ఏళ్లలో దాన్ని తిరిగి బతికించగలిగాను..' అని చెప్పుకున్నాడు బ్రౌన్‌.
ఆ 'కాలేజా' ఇది...!
కడపలో బ్రౌన్‌ ఉపయోగించిన కాలేజా బంగళా... తర్వాతి కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదంలో పడింది. ఓ కోర్టు వేలంతో ఆడిటర్‌ సీఆర్‌ కృష్ణస్వామి చేతికి వచ్చింది. చాలా కాలం తర్వాత ప్రముఖ సాహితీవేత్త జానుమద్ది హనుమచ్ఛాస్త్రి దాన్ని బ్రౌన్‌ బంగళాగా గుర్తించారు. ఆరుద్ర, బంగోరెలాంటి సాహితీ ప్రముఖులు ఆయనకు సహకరించారు. బంగళా యజమాని కృష్ణస్వామి నుంచి దానంగా పొంది 1987లో బ్రౌన్‌ లైబ్రరీకి శంకుస్థాపన చేశారు. బ్రౌన్‌ స్ఫూర్తిగా ఎన్నో తాళపత్ర గ్రంథాలు, అరుదైన పుస్తకాలు కొలువుదీరాయి. 2006లో జానుమద్ది హనుమచ్ఛాస్త్రి దాన్ని యోగి వేమన విశ్వవిద్యాలయానికి అప్పగించారు.
- ఈనాడు, కడప
Eenadu Link:http://eenadu.net/Homeinner.aspx?item=news/panel10






కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు