Ratan Tata special article on Eenadu


వృద్ధ యోధునికి టాటా
75 ఏళ్ల వయోభారం.. అప్పటిదాకా ఎన్నో ఆటుపోట్లు చవిచూసి అలిసిన శరీరం.. విశ్రాంతి కోరుకునే సమయమిది.
గత 50 ఏళ్లుగా టాటా గ్రూప్‌లో భాగమై.. రెండు దశాబ్దాలకు పైబడి గ్రూప్‌ సారథ్యాన్ని చాకచక్యంగా నిర్వహిస్తూ వచ్చిన రతన్‌ టాటా ఇప్పుడు విశ్రాంతి పర్వంలోకి అడుగుపెడుతున్నారు. దాదాపు రూ.5 లక్షల కోట్ల టాటాల సామ్రాజ్యాన్ని వారసుడు మిస్త్రీ చేతిలో పెట్టి నేడు పదవీ విరమణ చేస్తున్నారు. దాదాపు రూ.10,000 కోట్ల టాటా గ్రూపు సామ్రాజ్యాన్ని గత 20 ఏళ్లలో రూ. 4.75 లక్షల కోట్ల స్థాయికి తీర్చిద్దిన ఘనత రతన్‌ది. గ్రూప్‌ కార్యకలాపాలను ఎల్లలు దాటించడంలోనే కాదు.. దేశ పారిశ్రామిక, వాణిజ్య పురోగతిలోనూ కీలక పాత్ర పోషించారు. మంచి నడవడిక, అంకిత భావం, పోటీతత్వం, ధైర్యం.. ఈ నాలుగు లక్షణాలు రతన్‌లో పుష్కలంగా ఉన్నాయి. అందుకేనేమో రతన్‌ను పుట్టుకతోనే నాయకుడిగా అభివర్ణిస్తూ ఉంటారు ఆయన గురించి బాగా తెల్సినవాళ్లు. 'నాకు అలసటగా ఉంది. ఈ పని రేపు చేద్దాం' అన్న మాటలు రతన్‌ నోట విన్నవారు లేరు. ఆయన దృష్టంతా లక్ష్యంపైనే. గత పదేళ్లలో దాదాపు 1,800 కోట్ల డాలర్లు.. అంటే సుమారు లక్ష కోట్ల రూపాయలు వెచ్చించి టెట్లే టీ, కోరస్‌ స్టీల్‌, జేఎల్‌ఆర్‌ వంటి 22 కంపెనీలను కొనుగోలు చేయడం ద్వారా టాటాల సామ్రాజ్యాన్ని దశదిశలా వ్యాపింపచేసిన ఘనత ఈయన సొంతం. రతన్‌ టాటా ఒక వ్యక్తి కాదు.. ఒక సంస్థ, ఒక బ్రాండ్‌. అన్నిటికీ మించి సృజనాత్మకత, దార్శనికత ఉన్న వ్యక్తి. శరీరం సహకరించినన్నాళ్లూ ఫర్వాలేదు.. ఆ తర్వాతైనా టాటా గ్రూప్‌ బాధ్యతలు చేతులు మారాల్సిందేగా.. అదే ఇప్పుడు జరుగుతోంది. బృహత్తర బాధ్యతల్ని 44 ఏళ్ల యువతరానికి అప్పగించి.. రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తున్న రతన్‌ టాటాకు మనసారా వీడ్కోలు చెబుదాం.. అదే సమయంలో.. పగ్గాలు చేపడుతున్న మిస్త్రీ.. రతన్‌ను మించే స్థాయికి ఎదగాలనీ ఆశిద్దాం..
మలి సంధ్య వేళలో...
న్నాళ్లూ బిజీబిజీగా గడిపిన రతన్‌ ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌కు సిద్ధమవుతున్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో అన్నీ కార్పొరేట్‌ లక్ష్యాలే. రెండో ఇన్నింగ్స్‌లో సామాజిక సమస్యలే ప్రధాన అజెండా. గ్రామీణాభివృద్ధి, నీటి పొదుపు, ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందించడం, పేదరికంలో మగ్గుతూ.. నిరుపేద గర్భిణిలు, చిన్నారులకు పౌష్ఠికాహారాన్ని అందించడం వంటి అంశాలపై ఆయన దృష్టి సారించే అవకాశం ఉంది. తనదైన 'కార్పొరేట్‌' శైలిలో టాటా ట్రస్టులను ముందుకు నడిపించవచ్చు. బిల్‌గేట్స్‌ తరహాలోనే రతన్‌ కూడా సామాజిక సేవపై దృష్టి పెట్టొచ్చు. అంతేకాదు.. తన నీడ టాటా గ్రూపును వెన్నాడకూడదని రతన్‌ కోరుకుంటున్నారట. అడగక ముందే సలహాలు ఇవ్వడం, తన అభిప్రాయాలను సంస్థపై రుద్దడం వంటి వాటి జోలికి వెళ్లరట. ఏదైనా సహాయాన్ని కోరితే మాత్రం అందుబాటులో ఉండి, ఆ పని చేసి పెడతారట. ఆకాశ వీధిలో విహరిస్తూ ఉండటం, పియానో సాధన చేయడం, పెంపుడు శునకాలతో పొద్దు పుచ్చడం.. వీటికి ఇదివరకటి కన్నా మరింత ఎక్కువ సమయాన్ని కేటాయించడం.. ఇవన్నీ రతన్‌ రెండో ఇన్నింగ్స్‌లో భాగమే!
నానో విడుదల వేళ..
కొన్నేళ్ల క్రితం నేను చూసిన ఒక దృశ్యమే ఈ 'నానో' కారుకు నాంది. ఓ కుటుంబం స్కూటరుపై వెళ్తోంది. తండ్రి డ్రైవ్‌ చేస్తూంటే.. కొడుకు ముందు నిలబడ్డాడు. వెనక సీట్లో భార్య.. ఆమె ఒళ్లో ఓ చిన్నారి.. అది చూశాక ఒక్కసారిగా నా మనసు చలించింది. నాకు నేనే ప్రశ్న వేసుకున్నా. ఇలాంటి చిన్న కుటుంబాలు.. ఎలాంటి ఇబ్బంది లేకుండా.. కారులో వెళ్లాలంటే.. వారి స్తోమతకు తగ్గ కారును అందుబాటులోకి తేలేమా..? అదే నా ప్రశ్న. రానురాను నాలో అది బలంగా నాటుకుపోయింది. ప్రజల కారు తేవాలనుకున్నా.. అదే ప్రకటించా.. చాలామంది నన్ను గేలి చేశారు. ఈ కల నెరవేరదని నిరుత్సాహపరిచారు. కొంతమంది అయితే రెండు స్కూటర్లను కలిపి చేసినట్లు అవుతుందంటూ ఎకసెక్కాలు ఆడారు. అయినా నేను లక్ష్యపెట్టలేదు. ఈవేళ నా కలల కారు.. ప్రజల కారు.. రూ.లక్ష కారు.. 'నానో'ను మీముందు ఉంచా. నేను సాధించాననే అనుకుంటున్నా.
ఆ లోటు అలాగే ఉంది...
దేశంలో విమానయాన రంగానికి ఆద్యులు టాటాలే. 1932లోనే టాటా ఎయిర్‌లైన్స్‌ను జేఆర్‌డీ ఏర్పాటు చేశారు. 1946లో ఇది ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లి ఎయిరిండియాగా మారింది. మళ్లీ రతన్‌ హయాంలో విమానయాన సంస్థను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఇందుకోసం సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌తో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. కానీ 'అనివార్య' కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేకపోయింది.
ఆ విషయంలో విఫలమయ్యా..
ప్రతిభకు పట్టం కట్టే ధోరణిని టాటా గ్రూప్‌ కంపెనీల్లో అమలు చేసి ఉంటే బాగుండేది. అంటే సీనియర్లు, జూనియర్లు అన్న భావన పక్కన పెట్టి.. చక్కటి పనితీరు కనబరిచిన వారికి తగిన నగదు బహుమతులను అందించడమే కాదు.. ఉన్నత స్థాయికి చేరేలా ప్రోత్సహించడమూ అవసరమే. ఈ విషయంలో అనుకున్నది సాధించలేకపోయా..
పెంపుడు కుక్కల కోసం..
తన్‌కు విమానాలు, హెలికాప్టర్లు నడపడమే కాదు.. కార్లపైనా మమకారం ఎక్కువే. ఆయన గ్యారేజీలో కనీసం 5 కార్లుంటాయి. వీటిలో 'ఫెరారీ కాలిఫోర్నియా'ను బాగా ఇష్టపడతారు. ఇంకా మసరాటీ క్వాట్రోపోర్టే, క్యాడిలాక్‌ ఎక్స్‌ఎల్‌ఆర్‌, క్రిస్లర్‌ సెబ్రింగ్‌, ల్యాండ్‌రోవర్‌ ఫ్రీల్యాండర్‌, మెర్సిడెస్‌ 500ఎస్‌ఎల్‌, మెర్సిడెస్‌ ఎస్‌-కస్‌, ఇండిగో మెరీనాలు రతన్‌ వినియోగించే కార్లలో కొన్ని. తన పెంపుడు కుక్కల కోసం ఇండిగో మెరీనా కారులోని వెనుక సీటు తీయించేసి పరుపు అమర్చడం విశేషం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)