ఉసిరితో పసిడి అందం! (Eenadu Vasundhara)


ఉసిరికాయను ఉత్తినే తిన్నా, పచ్చడిగా పెట్టుకున్నా రుచి బాగుంటుంది. అలాగని అది కేవలం వంటలకే కాదు, చర్మానికీ, జుట్టుకీ కళ్లు చెదిరే మెరుపునివ్వడంలోనూ ముందే ఉంటుంది. నారింజ పండులో కన్నా ఇరవై రెట్లు అధికంగా ఉసిరిలో విటమిన్‌ 'సి' ఉంటుంది. కనుక దీన్ని తినడం వల్ల నిత్య యౌవనంగా కనిపించవచ్చు.
సిరికాయల్ని బాగా ఎండబెట్టి మిక్సీలో పొడి చేసుకోవాలి. దీనిని ఒక డబ్బాలో ఉంచుకొని అవసరమైనప్పుడు వాడుకోవాలి. ఈ పొడిని ముఖ్యంగా మెరిసే జుట్టుకోసం వాడుకోవచ్చు. రెండు చెంచాల ఉసిరి పొడికి టేబుల్‌ స్పూను పెరుగు, ఆలివ్‌ ఆయిల్‌ కలిపి పేస్టులా చేసుకోవాలి. దానిని మాడుకి తగిలేలా రాసుకోవాలి. గంటయ్యాక షాంపూతో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు పట్టులా మారుతుంది.
తలలో తెల్ల వెంట్రుకలు కనిపిస్తూ ఉంటే ఉసిరి పొడికి నిమ్మరసాన్ని కలిపి జుట్టుకి రాసుకోవాలి. దీనివల్ల సహజమైన నలుపు రంగుని పొందవచ్చు. ఖరీదైన కండిషనర్ల కన్నా, ఉసిరి పొడికి గోరువెచ్చని నీటిని కలిపి రాసుకుంటే మంచిది. జుట్టుకి అది చక్కని పోషణనిస్తుంది. ఉసిరి పొడినే షాంపూగా కూడా వాడుకోవచ్చు. జుట్టు ఎండిపోయినట్టు జీవం లేకుండా కనిపిస్తే నీటిలో ఉసిరి పొడి, పంచదార కలిపి రాసుకోవాలి. అయితే ఇందులో ఎనభైశాతం నీరే ఉండాలి. చిన్న పిల్లల్లో జుట్టు తెల్లబడటాన్ని నివారించడానికి ఉసిరిపొడిని వాడచ్చు.
చర్మ సరరక్షణ కోసం...
వేడి నీళ్లలో ఉసిరి పొడిని కలిపి ముద్దలా చేసుకోవాలి. దానిని ముఖానికి స్క్రబ్‌లా రాసుకోవాలి. ఒక నిమిషం తరవాత కడిగేసుకుంటే రంగు పెరగడంతో పాటు, మొటిమల సమస్యా తగ్గుతుంది. ఆలివ్‌ ఆయిల్‌లో ఈ పొడిని కలిపి రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. రెండు టీ స్పూన్‌ల ఉసిరి పొడికి ఒక టీ స్పూను తేనె, ఒక టీస్పూను పెరుగు కలిపి పేస్టులా చేసుకోవాలి. దీనిని ముఖానికి మాస్కులా వేసుకుని కాసేపటికి కడిగేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం శుభ్రంగా, కోమలంగా మారుతుంది. వేడి నీటిలో రెండు టీ స్పూన్ల ఉసిరి పొడినీ, కాస్త బొప్పాయి గుజ్జునీ కలుపుకొని ముఖానికీ, మెడకీ రాసుకుంటే చర్మం మెరుపు సంతరించుకుంటుంది. అలాగే వేడి నీటిలో కొంచెం ఉసిరి పొడి, వేప ఆకుల ముద్ద, తేనె కలిపి పేస్టులా చేసుకుని ముఖానికి మాస్కులా వేసుకోవాలి. పది నిమిషాలు ఉంచిన తరవాత శుభ్రంగా కడిగేసుకోవాలి.

http://eenadu.net/vasundara/Vasundarainner.aspx?qry=beauty

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు