ప్రయోగాలు భేష్! ప్రయోజనాలు సెభాష్!! (Eetaram_21/07/2012)




ఏసీ గదుల కొలువు రొటీన్‌... ఎడతెగని పుస్తకాల చదువు బోర్‌... ఉద్యోగం, చదువు ఏదైనా... సమాజహితం జోడిస్తే వెరైటీ... అప్పుడిక ప్రశంసలు, మెచ్చుకోళ్లే! కుదిరితే ట్రెండ్‌ సెట్టర్లూ మీరే! అలా చదువుల్లో రాణిస్తూనే... మేటి ఆవిష్కరణలు చేశారు వీళ్లు! జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరిసిన... ఆ యువతరంగాల ముఖాముఖి 'ఈతరం'లో ఈవారం.
ఇంధనం ఇక చౌక!
పరిశోధన: విజిబుల్‌ లైట్‌ డీ ఆక్సినైజేషన్‌ ప్రత్యేకత: ఇంధన పునర్వినియోగం
రూపకర్త: రాఘవేంద్ర రామచంద్రన్‌ గుర్తింపు: ఇంటెల్‌ అంతర్జాతీయ సైన్స్‌, ఇంజినీరింగ్‌ అవార్డు. గూగుల్‌ సైన్స్‌ ఫెయిర్‌ ఫైనలిస్ట్‌
మురు ధరలు రోజురోజుకూ కొండెక్కుతున్నాయి. భవిష్యత్తులో సంక్షోభంగా మారే ప్రమాదం. పరిష్కారం కనుగొనే దిశగా రాఘవేంద్ర రామచంద్రన్‌ చేసిన ప్రయోగమే 'విజిబుల్‌ లైట్‌ డీ ఆక్సిజనేషన్‌'. ప్రకృతిలో అపారంగా లభించే సూర్యరశ్మి సాయంతో జరిపే కొన్ని రసాయనిక చర్యల ద్వారా ఇంధన ఉత్పత్తులను తిరిగి వాడుకునే విధంగా మార్చడమే ఇందులో సూత్రం. ఈ చర్య పూర్తిగా పర్యావరణ అనుకూలమైంది. అంతేకాకుండా కేన్సర్‌ చికిత్సలో వాడే రేడియోథెరపీ, కీమోథెరపీల్లో కొత్త ప్రక్రియలకు కూడా ఈ సూత్రాన్ని అన్వయించవచ్చని బెంగళూరు కుర్రాడు రాఘవేంద్ర చెబుతున్నాడు. మూడునెలల కిందట ఇంటెల్‌ అంతర్జాతీయ సైన్స్‌, ఇంజినీరింగ్‌ ప్రదర్శన (ఐ.ఎస్‌.ఇ.ఎఫ్‌.) సందర్భంగా ప్రపంచస్థాయిలో నిర్వహించిన పోటీలో రాఘవేంద్ర ఫార్ములా రసాయన శాస్త్రంలో 'బెస్ట్‌ కేటగిరీ'గా ఎంపికైంది. 70 దేశాల నుంచి వచ్చిన 1500 మంది అభ్యర్థుల మధ్య మెరిసిన ఇతడి పరిశోధన వివరాలను ప్రముఖ సైన్స్‌ జర్నల్‌ 'సైన్స్‌ న్యూస్‌'లో ప్రచురించారు. ఇదే రాఘవేంద్రని ప్రతిష్ఠాత్మక గూగుల్‌ సైన్స్‌ పోటీల ఫైనలిస్టుగా నిలిపింది. రాఘవేంద్ర ఈమధ్యే చెన్నైలో ప్లస్‌ టూ పూర్తి చేశాడు. 
- రుద్రరాజు సుభాష్‌, తమిళనాడు డెస్క్‌
కూలీల నేస్తం
ఆవిష్కరణ: హుమోటార్‌, ప్రత్యేకత: పెద్ద బరువుల్ని మోసే తేలికైన యంత్రం
రూపకర్తలు: ఐఐటీ మద్రాస్‌ విద్యార్థులు గుర్తింపు: నేషనల్‌ ఇన్నోవేషన్‌ అవార్డు
ఇండియాలో కోటిన్నర మంది నిర్మాణ రంగంలో ఉన్నారు. సగం మంది కూలీలే. ఇటుకలు, సిమెంట్‌, కాంక్రీట్‌ లాంటి బరువులు మోసేందుకు వాళ్లకి కర్రలు, నిచ్చెన లాంటి తాత్కాలిక నిర్మాణాలే ఆధారం. ఈ క్రమంలో ప్రమాదాల బారిన పడతారు. దీన్ని ఆపాలనుకున్నారు తరుణ్‌ మెహతా, స్వప్నిల్‌ జైన్‌, శ్రీరామ్‌ చెపిలాల, బహదూర్‌ జైదీప్‌, శంతన్‌ బిశ్వాస్‌లు.ఐఐటీ మద్రాస్‌ విద్యార్థులు రెండేళ్ల నాటి ఆలోచనకు నేషనల్‌ ఇన్నోవేషన్‌ కౌన్సిల్‌ (ఎన్‌.ఐ.సి.) 'ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌' పోటీ ఉత్ప్రేరకమైంది. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే ఈ పోటీకి దేశవ్యాప్తంగా 468 ప్రతిపాదనలందితే వడపోతలో ఆరు ఉత్తమంగా నిలిచాయి. వాటిలో 'హుమోటార్‌' ఒకటి. బహుమతిగా యాభై వేల నగదు, ప్రశంసా పత్రం గెల్చుకున్నారు.హుమోటార్‌ మానవ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే పరికరం. ట్రెడ్‌మిల్‌ ఆకారంలో ఉంటుంది. పెడల్స్‌, షాఫ్ట్‌, డ్రమ్‌, క్లచ్‌, బ్రేక్‌ ప్రధాన భాగాలు. పెడల్స్‌ను తొక్కడం ద్వారా నిర్మాణ సామగ్రిని పుల్లీ ద్వారా ఎత్తులకు సునాయాసంగా పంపే వీలు కలుగుతుంది. బరువు నియంత్రణకు కావాల్సిన చోట ఆపేందుకు క్లచ్‌, బ్రేకులుంటాయి. ఇంజినీరింగ్‌ డిజైన్‌ విభాగం ప్రొఫెసర్లు కుర్రాళ్లకి మార్గదర్శనం చేశారు. విజేతగా నిలవడంతో ఎన్‌ఐసీ నుంచి రూ.50 వేల నగదు, ప్రశంసాపత్రం అందాయి.
- గుమ్మడి రామలక్ష్మి, న్యూస్‌టుడే: చెన్నై
కరెంటు సమస్యకి కోత!
పరిశోధన: థర్మో డైనమిక్‌ మోడలింగ్‌ ప్రత్యేకత: వందశాతం బొగ్గు సద్వినియోగం
రూపకర్త: అనపగడ్డి రవికిరణ్‌ గుర్తింపు: ఐఐటీ మద్రాస్‌ టాపర్‌
న దేశపు బొగ్గు నాణ్యత తక్కువ. దీన్ని విద్యుత్తు తయారీకి ఉపయోగిస్తే అరవై శాతం సద్వినియోగమైతే, నలభై శాతం బూడిదగా బయటికొస్తుంది. ఉత్తర కొరియాలోనూ ఇదే పరిస్థితి. దీన్ని వందశాతం ఉపయోగించేలా థర్మల్‌ ప్లాంట్‌ నెలకొల్పానుకుంది కొరియా. ఈ ప్రాజెక్టుని ఐఐటీ మద్రాస్‌ విద్యార్థి అనపగడ్డి రవికిరణ్‌కి అప్పగించింది. ఏడాది పాటు పరిశోధన చేసి అతడు అందించిన నమూనా వల్లనే ఇది సాధ్యమైంది. ఇతడి ఆలోచనలకు అనుగుణంగా కొరియాలో 30x30 అడుగుల వైశాల్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుత్తు ప్లాంటులో పనులు జరిగేవి. ఎప్పటికప్పుడు ఫలితాలను తెలుసుకుంటూ బొగ్గు పరిమాణం, బొగ్గును మండించే ప్రక్రియల్లో మార్పులు సూచించేవాడు రవికిరణ్‌. చాలాసార్లు విఫలమైనా పదకొండు నెలల తర్వాత అనుకున్న ఫలితానికి దగ్గరగా వచ్చాడు. దీనికోసం అమెరికా నుంచి ఖరీదైన సాఫ్ట్‌వేర్‌ తెప్పించాడు. దానికి సొంతంగా కోడ్‌ రాయడానికే నెల్లాళ్లు పట్టింది. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు కంప్యూటర్‌తో కుస్తీ పట్టి ఉదయాన్నే క్లాసులకెళ్లేవాడు. ఎంటెక్‌ పూర్తయ్యే సరికి ప్రాజెక్టు ఓ కొలిక్కి వచ్చింది. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే విద్యుత్తు సమస్యకి కొంత పరిష్కారం దొరికినట్టే. బొగ్గును వందశాతం వినియోగించుకోవడంతో పాటు, వ్యర్థాలను సిమెంటులా వాడొచ్చు. ఇతడి నమూనా వల్ల ఓ చిన్న ప్లాంట్‌ నెలకొల్పడానికి అయ్యే ఖర్చు దాదాపు కోటి రూపాయల నుంచి నలభై లక్షలకే సాధ్యమవుతుంది.ఈ వివరాల్ని జర్మనీ, ఫ్రాన్స్‌లో జరిగిన అంతర్జాతీయ సైన్స్‌ సమ్మేళనంలో ప్రదర్శించాడు. ప్రాజెక్టు వివరాలు ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌ ఐ అండ్‌ ఈసీ (ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ కెమిస్ట్రీ రీసెర్చ్‌)లో ప్రచురితమయ్యాయి. దీని సాయంతోనే రవికిరణ్‌ 2011లో ఐఐటీ మద్రాస్‌ టాపర్‌గా నిలిచాడు.
-గౌరీపట్నం త్రినాథ్‌, న్యూస్‌టుడే: మాడుగుల
మె(మ)రుగైన పరిష్కారం
ఆవిష్కరణ: వాక్యూ-ఫ్లష్‌ ప్రత్యేకత: నీటి పొదుపు మరుగుదొడ్డి
రూపకర్త: రోహిత్‌ ఫెన్‌ గుర్తింపు: ప్రతిష్ఠాత్మక గూగుల్స్‌ సైన్స్‌ఫెయిర్‌ ఫైనలిస్టు
విష్యత్తులో నీటి కోసమే యుద్ధాలు జరుగుతాయట. మరలాంటిది టాయ్‌లెట్‌ వ్యర్థాలను శుభ్రం చేయడానికి ఒక్క 'ఫ్లష్‌'కు ఆరు నుంచి పన్నెండు లీటర్లు వాడుతున్నాం. సగటున ఒక్కో కుటుంబం 72 లీటర్లు ఖర్చు చేస్తోంది. ఈ నీటిని పొదుపు చేసేందుకు బెంగళూరు ఇంటర్‌ విద్యార్థి రోహిత్‌ ఫెన్‌ 'వాక్యూ-ఫ్లష్‌' రూపొందించాడు. ఒక్క ఫ్లష్‌కి మూడు లీటర్ల నీళ్లే చాలు. ప్రత్యేకమైన ఐదు పీవీసీ పైపులు, పిస్టన్‌లతో రూపొందించాడు. ఫ్లష్‌ బటన్‌ నొక్కగానే పిస్టన్‌ తీవ్ర ఒత్తిడితో వ్యర్థాలను బయటికి నెట్టివేస్తుంది. ఈ నమూనా ప్రతిష్ఠాత్మక గూగుల్‌ సైన్స్‌ ఫెయిర్‌కి ఎంపికైంది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన యువ శాస్త్రవేత్తలతో పోటీ పడి ఫైనలిస్టుగా నిలిచాడు రోహిత్‌. నోబెల్‌ బహుమతి గ్రహీతల నుంచి సైతం ప్రశంసలందాయి.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)