పసిభారతం తేరుకుంటుందా?

నేటి బాలలే రేపటి పౌరులు. జాతి భావిపథ నిర్దేశకులు అందరూ జాలిపడే దుస్థితిలో కుమిలిపోతుండటం ఏ దేశ పురోగతికైనా గొడ్డలిపెట్టు. ప్రపంచంలోనే అతిపెద్ద శిశు పోషకాహార పథకం దశాబ్దాలుగా అమలవుతున్న భారతావనిలో- నిస్సహాయ బాల్యం గుక్కపెడుతోంది, వ్యధాకలిత మాతృత్వం తల్లడిల్లుతోంది! శిశు జననం లగాయతు సంపూర్ణ వ్యక్తిగా ఎదిగేంతవరకు సమస్త సేవలూ సమకూర్చాలన్నది 1974నాటి జాతీయ విధాన నిర్దేశం. ఆ మరుసటి ఏడాదినుంచి దేశంలో సమీకృత శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్‌) ప్రారంభించడానికి అదే నాందీవాచకం. గడచిన మూడు పుష్కరాల్లో 'సమీకృత' ఘోరవైఫల్యాన్ని పార్లమెంటరీ స్థాయీసంఘమే తూర్పారబట్టినా, కోట్లాది లబ్ధిదారులకు అక్కరకొస్తున్నదన్న గొప్పలకు పాలకశ్రేణి తెరిపివ్వడం లేదు. అధికారిక వివరణల ప్రకారం ఐసీడీఎస్‌ ఆదుకుంటోందంటున్నవారిలో గర్భిణులు, బాలింతలు 1.83కోట్లు; ఆరేళ్లలోపు పిల్లలు 7.82కోట్లు. ఆసేతు హిమాచలం విమర్శల జడివాన పాలబడుతున్న 'ప్రతిష్ఠాత్మక' పథకాన్ని పరిపుష్టీకరించి అంచెలవారీగా విస్తరిస్తామని యూపీఏ నాయకులు చెబుతున్నారు. ఈ రెండేళ్లూ మొత్తం 400 జిల్లాల్లో, మరుసటి ఏడాది మిగతా 243 జిల్లాల్లో పటిష్ఠ బిగింపులతో పట్టాలకు ఎక్కిస్తామంటున్న పథకం నిమిత్తం పన్నెండో ప్రణాళికలో కేటాయిస్తామంటున్నది రూ.1,23,580కోట్లు. పదకొండో పంచవర్ష ప్రణాళికలో ఐసీడీఎస్‌ పద్దుకిది ఇంచుమించు మూడు రెట్లు. విడ్డూరమేమిటంటే, అందులో ఎకాయెకి రూ.39వేలకోట్ల ఖర్చుకు లెక్కాపత్రం లేవు. పారదర్శకత, జవాబుదారీతనం మచ్చుకైనా కానరాని ఖాతాను ఇప్పుడు అమాంతం విస్తరించేసి మరెందరికో ప్రయోజనం కట్టబెడతారట. పెద్దయెత్తున దుర్వ్యయాన్ని నియంత్రించేందుకు ఎటువంటి జాగ్రత్త చర్యలు చేపట్టదలచిందీ మాటమాత్రంగానైనా ప్రస్తావించని కేంద్ర సర్కారు- పాత పథకానికి కొత్తగా మళ్ళీ కొబ్బరికాయ కొట్టేయాలని తహతహలాడుతోంది!
దేశవ్యాప్తంగా ఆరేళ్లలోపు పిల్లల సంఖ్య రమారమి 17కోట్లు. అందులో సగం మందినైనా సంక్షేమ రక్షణఛత్రం నీడలోకి తీసుకురాలేకపోయిన మన్మోహన్‌ ప్రభుత్వం- మరిన్ని కోట్లమందికి నికరంగా మేలు చేస్తామంటోంది! యథార్థానికి, ఐసీడీఎస్‌ను సార్వత్రీకరించి అధమపక్షం 14లక్షల అంగన్‌వాడీలు నెలకొల్పాలన్న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను మన్నించడానికే పదేళ్లుగా కేంద్రం కిందుమీదులవుతోంది. ప్రతి వెయ్యిమంది జనాభాకు ఒక అంగన్‌వాడీ కేంద్రం నెలకొల్పాలని, గిరిజన ప్రాంతాల్లో ఏడువందల మందికొక కేంద్రం పనిచేయాలన్న 'సుప్రీం' మార్గనిర్దేశాల స్ఫూర్తిని ఆకళించుకోవడంలో యూపీఏ సర్కారు గద్దెనెక్కింది మొదలు విఫలమవుతూనే ఉంది. సుమారు 13 లక్షల అంగన్‌వాడీ కేంద్రాలను ప్రారంభించినట్లు కాగితాలపై లెక్కలు చాటుతున్నా- పది, పదకొండు కోట్లమంది పిల్లల్ని ఐసీడీఎస్‌ గాలికొదిలేసిందని ఆ మధ్య ప్రధానమంత్రే ఒప్పుకొన్నారు. పిల్లల్ని జాతిసంపదగా పరిగణించి, వారి అభ్యున్నతికి చేయగలిగినంతా చేస్తామన్నది వట్టి వాగాడంబరమేనని- సామాజిక తనిఖీల్లో బట్టబయలైన అవకతవకల అంగన్‌వాడీ బాగోతాలు నిరూపించాయి. పిల్లలు, గర్భవతులు, కిశోర బాలికల కోసం ఉద్దేశించిన పోషకాహారం, మందులు, టీకాలు చాలాచోట్ల పక్కదారి పడుతున్నాయి. కేంద్రాల్లో ఎక్కువమంది పిల్లలున్నట్లు దొంగలెక్కలు సృష్టించి, ఆ మేరకు రాబట్టిన పౌష్టికాహారాన్ని పశుదాణాగా తెగనమ్ముకుంటున్న ప్రబుద్ధుల ప్రహసనాలకు కొదవలేదు. మాతాశిశు సంరక్షణ స్ఫూర్తి వాస్తవంలో ఎంతగా కొల్లబోతోందో ఆమధ్య ప్రధానమంత్రే విశదీకరించారు. జనాభాలో 42శాతం పిల్లలు బరువు తక్కువగా ఉండటం దేశానికే సిగ్గుచేటని ఆయన లెంపలేసుకున్నారు. లోతుగా వేళ్లు తన్నుకున్న అవ్యవస్థను పరిమార్చకుండా, గుదిబండ అవినీతిని కదల్చకుండా- మాతాశిశు సంక్షేమం కుదుటపడదు.
దేశీయంగా చిన్నపిల్లల మరణాల్లో సగందాకా పోషకాహార లోపాలవల్ల సంభవించినవేనని వివిధ అధ్యయనాలు నిగ్గుతేల్చాయి. దశాబ్దాలుగా ఐసీడీఎస్‌ ఉండీ ఉద్ధరించిందేముందన్న ఘాటు విమర్శలకు అవే నారు, నీరు పోశాయి. శిశు మరణాల అదుపు, బాలింతలూ చూలింతల ఆరోగ్య సంరక్షణలో చురుకైన భూమిక పోషించాల్సిన అంగన్‌వాడీల్లో అత్యధికం జావగారి మూతపడటానికి మూలకారణం- సొంత గూడులేక గోడున విలపించాల్సి రావడమే. అరకొర వసతుల ఇరుకిరుకు అద్దెగదుల్లో నామమాత్రావశిష్టమైన అంగన్‌వాడీ కేంద్రాల దురవస్థను రూపుమాపేందుకంటూ- సరికొత్తగా విధివిధానాల మార్పు తలపెట్టడం స్వాగతించదగింది. ఒక్కో కేంద్రానికీ సొంత భవంతి నిర్మాణం నిమిత్తం ఇవ్వదలచిన నాలుగున్నర లక్షల రూపాయల్లో నాలుగోవంతును సంబంధిత రాష్ట్రం భరిస్తే, తక్కింది కేంద్రం సమకూరుస్తామంటోంది. అంగన్‌వాడీ కేంద్రాలను పట్టి పల్లారుస్తున్న నానావిధ సమస్యలూ భవన నిర్మాణ కసరత్తుతోనే చెల్లాచెదురైపోవు. 71శాతం పిల్లలు రక్తహీనతతో, 61శాతం పోషకాహార లోపాలతో కునారిల్లుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ పరువు మాయడానికి అంగన్‌వాడీల దయనీయ పని పరిస్థితులూ తమవంతు పుణ్యం కట్టుకుంటున్నాయి. దక్షిణాదిలోనే అత్యధికంగా ఏటా 73వేలమందికిపైగా పసికందుల శై'శవ'గీతి రాష్ట్రంలో మార్మోగుతోంది! సిబ్బంది కొరత, వేతనాల చెల్లింపుల్లో విపరీత జాప్యం, పర్యవేక్షణాధికారుల నియామకాల్లో పీనాసితనం, గౌరవ వేతనం ముట్టజెబుతూ గొడ్డుచాకిరి చేయించుకునే కర్కశత్వం- ఈ కంతలు పూడ్చనిదే పిల్లల హక్కుల భక్షణ ఆగదు; భారీ సంకల్ప ఉద్ఘోషల్లోనే తప్ప వాస్తవంలో 'మార్పు' రహించదు. బాల్యానికి భద్రతనిచ్చి భరోసా కల్పించడంలో- రక్షిత మంచినీరు, పారిశుద్ధ్య సదుపాయాలు, వైద్య వసతులు, పౌష్టికాహార లభ్యత, కనీస విద్య... ఇవన్నీ ప్రాణాధారాలు. సమీకృత శిశు అభివృద్ధికి నిబద్ధత చాటే ఏ ప్రజాప్రభుత్వమైనా వాటి పరికల్పనకు కంకణబద్ధమైనప్పుడే- పసిభారతం తేరుకుంటుంది; భావిభారతం పసిడికాంతులీనుతుంది!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)

వైవిధ్యమే జీవం! (Eenadu Sunday_30/09/12)