సొంతగడ్డపై..సొగసైన విజయాలు!!! (Eetaram_01/09/12)


కలల బాటలో విదేశాలకు చలో అన్నారు... డాలర్‌ డ్రీమ్స్‌ కరిగాయి... కన్నభూమిపై మమకారం పెరిగింది... అంతకు మించి అవకాశాలు రారమ్మని వూరించాయి... బ్యాగ్‌ సర్దుకొని ఇండియా బయల్దేరారు... ఆపై చిన్న పెట్టుబడితో పెద్ద విజయాలు సాధించారు... ఇప్పుడు వాళ్లది ఉద్యోగం వెతుక్కునే స్థితి కాదు... ఉపాధి కల్పించే స్థాయి... ఆ యువ వ్యాపారవేత్తల విజయగాథలు మీకోసం.
విదేశాల్లో చదువు, ఉద్యోగం గొప్పమాటే. అది ఒకప్పటి సంగతి. ఇప్పుడు ఆ అభిప్రాయం పల్చనైంది. ఇక్కడి అవకాశాలు కూడా తక్కువేం కాదనే వాదన బలపడుతోంది. 'హీడ్రిక్స్‌ అండ్‌ స్ట్రగుల్స్‌' సంస్థ సర్వే ప్రకారం 2010లో అరవై వేలమంది ప్రవాస భారతీయులు ఉద్యోగాలు వదిలి ఇండియాకొచ్చారు.
అభిరుచే పెట్టుబడి
పేర్లు: కిరణ్‌ వేమూరి, హిమవంత్‌ వల్లభనేని సొంత
సంస్థ: ట్యాగ్‌ యువర్‌ స్మైల్‌,
పెట్టుబడి: రూ. 10లక్షలు
 అమ్మాయి మెచ్చుకోవాలంటే ఆమె మనసుకు నచ్చే బహుమతివ్వాలి. పుట్టినరోజు స్నేహితుడు హ్యాపీగా ఫీలవ్వాలంటే కనీసం అందమైన పూలబొకేనైనా చేతిలో పెట్టాలి. కానీ ఇష్టమైన వస్తువులు నిమిషాల్లో దొరకాలంటే కష్టం. అవన్నీ ఒకే క్లిక్‌తో కోరుకున్న వ్యక్తులకు చేరవేసే ఆన్‌లైన్‌ వ్యాపారానికి తెరతీశారు కిరణ్‌, హిమవంత్‌లు. గుడివాడ, గుంటూరు కుర్రాళ్లు. కిరణ్‌ ఇంజినీరింగ్‌ తర్వాత ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లాడు. మంచి వేతనం. అయినా ఏదో అసంతృప్తి. పెంపుడు జంతువుల్ని పెంచడం, స్నేహితులకి గిప్టులివ్వడం మిత్రులిద్దరి అభిరుచి. దీన్నే వ్యాపారంగా ఎందుకు ప్రారంభించకూడదు? అనుకున్నారిద్దరూ. 2011 జూన్‌లో 'ట్యాగ్‌ యువర్‌ స్మైల్‌' మొదలైంది. కేక్స్‌, అక్వేరియమ్స్‌, బొమ్మలు, చాక్లెట్లు, బొకేలు, వాచీలు, ఆఖరికి ముద్దొచ్చే కుక్కపిల్లలు, చిలకలు.. ఏవైనా ట్యాగ్‌ యువర్‌ స్మైల్‌లో ఆర్డర్‌ ఇవ్వొచ్చు. నిర్ణీత సమయంలో డెలివరీ చేస్తారు. బహుమతులన్నీ సృజనాత్మకంగా, చిలిపిగా ఉంటాయి. ఏడాదిన్నరలో వేల ఆర్డర్లు డెలివరీ చేశారు. హైదరాబాద్‌లో మొదలైన వ్యాపారం బెంగళూరు, చెన్నైలకు విస్తరించారు. మొదట్లో ఒకట్రెండు ఆర్డర్లే వచ్చినా అధైర్యపడకుండా ముందుకెళ్లారు. ప్రతి వినియోగదారుడు సంతృప్తి పడేలా సేవలందించారు. అదే వాళ్ల విజయ రహస్యమైంది.
హైదరాబాద్‌ కుర్రాళ్లు బెంగళూరులో భేష్‌
పేర్లు: శరత్‌ పోతరాజు, రవిప్రతాప్‌. ఎం.
విదేశాల్లో: ఐదేళ్లు, ఎనిమిదేళ్లు,
చేసిన కంపెనీ: మెరిల్‌ లించ్‌, మోర్గాన్‌ స్టాన్లీ,
తిరిగొచ్చింది: 2009,
సొంత కంపెనీ: మోబ్‌స్టాక్‌,
పెట్టుబడి: రూ.30 లక్షలు
రెండేళ్లలో కంప్యూటర్‌ కంటే సెల్‌ఫోన్‌లో ఇంటర్‌నెట్‌ వాడే వాళ్ల సంఖ్య ఎక్కువవుతుంది! ఈ అవకాశం మిత్రులు రవి, శరత్‌లను ఇండియా రప్పించింది. ఈ హైదరాబాద్‌ కుర్రాళ్లిద్దరూ ఐఐటీ మద్రాస్‌ పట్టభద్రులు. అమెరికా వెళ్లి మంచి ఉద్యోగాల్లో చేరారు. కానీ వాళ్ల లక్ష్యం ఎప్పటికైనా ఫేస్‌బుక్‌, గూగుల్‌లాంటి ప్రపంచస్థాయి కంపెనీ ఏర్పాటు చేయడం. 2009లో రవి, శరత్‌లు భారత్‌ తిరిగొచ్చి బెంగళూరులో 'మోబ్‌స్టాక్‌' ప్రారంభించారు. వచ్చీ రాగానే విజయాలు దక్కలేదు. అసలు ఈ కొత్త కంపెనీలో పనిచేయడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. సంస్థ ఆశయం, ఈ రంగంలో ఉండే భవిష్యత్తు వివరించి కష్టమ్మీద మెరికల్లాంటి ఉద్యోగుల్ని ఎంపిక చేసుకున్నారు. ఆ తర్వాత ఏడాదిన్నర రాత్రింబవళ్లు ఆఫీసుకే అతుక్కుపోయినా పైసా ఆదాయం లేదు. ఒక దశలో 'ఉద్యోగాలు మానేసి ఎందుకు ఇక్కడికొచ్చామా?' అనే ఆలోచనలో పడ్డారు. కానీ ఇంతలోనే లక్ష్యం గుర్తొచ్చి కసిగా ముందుకెళ్లారు. 
మోబ్‌స్టాక్‌ మీడియాని పెనవేసుకున్న సంస్థ. ఈరోజుల్లో ప్రతి దినపత్రిక, వారపత్రిక, మ్యాగజైన్‌కు ఆన్‌లైన్‌ ఎడిషన్‌ మామూలే. పాఠకులు వీటిని సెల్‌ఫోన్‌లో చదవాలంటే సపోర్ట్‌ చేసే సాఫ్ట్‌వేర్‌ ఉండాలి. దీనికి పరిష్కారమే మోబ్‌స్టాక్‌. వీళ్లు తయారు చేసిన సాఫ్ట్‌వేర్‌తో ఏ రకమైన సెల్‌ఫోన్‌, ట్యాబ్లెట్‌లో అయినా పత్రిక తెరిచి చదవొచ్చు. ఈ సాఫ్ట్‌వేర్‌ రూపొందించడానికి రవిప్రతాప్‌ పద్దెనిమిది నెలలు కష్టపడ్డాడు. ప్రస్తుతం మోబ్‌స్టాక్‌కి ప్రపంచదేశాల్లోని 500 కంపెనీలు కస్టమర్లు. అందులో ది హిందూ, పంజాబ్‌కేసరి, ఆల్‌ఆఫ్రికా పత్రికలు బాలీవుడ్‌ వెబ్‌సైట్లు, వీడియో షేరింగ్‌ సైట్లున్నాయి. గతేడాది 'బిజినెస్‌ వరల్డ్‌' మ్యాగజైన్‌ మోబ్‌స్టాక్‌ని 'ఇండియాస్‌ హాటెస్ట్‌ స్టార్టప్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌'గాగుర్తించింది.
'స్పా'ధించాడు
పేరు: రితేశ్‌ రెడ్డి,
విదేశాల్లో: ఎనిమిదేళ్లు
పనిచేసిన సంస్థ: సైప్రెస్‌ సెమీకండక్టర్స్‌,
తిరుగు ప్రయాణం: 2009
సొంత కంపెనీ: ఓ2 స్పా
పెట్టుబడి: రూ.35లక్షలు 
1998 నాటి సంగతి. మహబూబ్‌నగర్‌ జిల్లా మస్తిపురం కుర్రాడు రితేశ్‌రెడ్డికి అమెరికాలో ఎం.ఎస్‌. చేసే అవకాశమొచ్చింది. బీమా పత్రాలు తాకట్టు పెట్టి డబ్బులు ఇప్పించింది చిన్నమ్మ. అప్పుడే అనుకున్నాడు 'ఇలాంటి పరిస్థితి తన పిల్లలకి రావొద్దని. జీవితంలో బాగా స్థిరపడాలని'. చదువు పూర్తయ్యాక అక్కడే కొలువులో చేరాడు. సంపాదన, సుఖాలకి కొదవ లేదు. కానీ కుటుంబాన్ని, దేశాన్ని కోల్పోతున్నాననే బాధ. మరోవైపు ఇండియాలో సంస్కరణలు వేగవంతమయ్యాయి. కొత్త వ్యాపారాలకు అనుకూల వాతావరణం. దాంతో ఎనిమిదేళ్ల అమెరికా సావాసానికి గుడ్‌బై చెప్పి ఇండియా బయల్దేరాడు. ఎదిగే అవకాశం ఉంటుందని రితేశ్‌ 'స్పా' రంగంలోకి దిగాడు. హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో 'ఓ2' పేరుతో తొలి స్పా మొదలైంది. ఆ ప్రయత్నం, మూడేళ్లలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై సహా అన్ని ప్రధాన నగరాల్లో 27 గొలుసు కట్టు శాఖలుగా విస్తరించింది. ఈ స్థాయికి చేరడానికి ఎన్నో బాలారిష్టాలు అధిగమించాడు. మొదట్లో రుణమివ్వడానికి ససేమిరా అన్నాయి బ్యాంకులు. విమానాశ్రయాల్లోని స్పాల నిర్వహణకు సెక్యూరిటీ పరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. అన్నింటినీ ఎదుర్కొన్నాడు. ఓ2 స్పాలలో ప్రస్తుతం ఆరు వందల మంది ఉపాధి పొందుతున్నారు. బ్యూటీ పెడిక్యూర్‌, మానిక్యూర్‌, బాడీ ట్రీట్‌మెంట్‌, బాడీ మసాజ్‌, సెలూన్‌.. ఇలా అన్నిరకాల సర్వీసులు ఓ2లో ప్రత్యేకం. 'మనం ఏ పని ఆరంభించినా మంచి, చెడు సలహాలిచ్చే వాళ్లుంటారు. కానీ మన సత్తాకి తగ్గ పని ఎంచుకొని కష్టపడితే విజయం సులువు' అంటాడు రితేశ్‌.
రాకకు కారణాలివే..
సొంతదేశంపై ప్రేమ, భావోద్వేగాలు
అక్కడ ఎంత సంపాదించినా పరాయివాళ్లమనే భావన
కుటుంబం, బంధువులకు దగ్గరవ్వాలనే తాపత్రయం
రుణాలిచ్చేందుకు సిద్ధంగా ఉన్న బ్యాంకులు, వెంచర్‌ క్యాపిటలిస్టులు
అందుబాటులో నిపుణులైన మానవ వనరులు
వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ
పెరుగుతున్న ప్రజల కొనుగోలు శక్తి. వ్యాపారాలకు అనువైన వాతావరణం
విదేశాల్లో మళ్లీ ఆర్థిక మాంద్యం రాదనే భరోసా లేకపోవ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)

వైవిధ్యమే జీవం! (Eenadu Sunday_30/09/12)