ఆన్‌లైన్‌........ హీరో మీరే! (Eenadu mag_09/09/2012)


ఆన్‌లైన్‌లో మీరెవరు...నాయకుడా, ప్రతినాయకుడా?పరిచితుడా, అపరిచితుడా?గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ మీ గుట్టుమట్లన్నీ విప్పేస్తుంది. బలాల్నీ బలహీనతల్నీ బట్టబయలు చేసేస్తుంది. 'ఆన్‌లైన్‌ రెప్యుటేషన్‌ మేనేజ్‌మెంట్‌' గురించి ఆలోచించకపోతే అంతే సంగతులు.
వెంకట్‌. వినయ్‌. శ్రీనివాస్‌. ప్రభు. ఇస్మాయిల్‌. డేవిడ్‌. నూర్జహాన్‌. మేరీ. లక్ష్మి. సుజాత. రాధిక. ఇందిర. ప్రేమ. ...మీపేరు ఏదైనా కానివ్వండి. గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లో ఇంటిపేరుతో సహా టైప్‌చేస్తే ఏం వస్తుంది? ఒకటి... మీ విజయాలు, నైపుణ్యాలు, అర్హతలు. అయితే, ఆన్‌లైన్‌లో మీరు విజేతే. రెండు... మీ లోపాలు, బలహీనతలు, ఇబ్బందిపెట్టే సంఘటనలు. అయితే, మీరు వైఫల్యం చెందినట్టే మూడు... మీపేరుతో ఉన్న ఇతర వ్యక్తుల సమాచారమే కనిపిస్తోంది. మీ ప్రస్తావన మాత్రం ఎక్కడా లేదు.'ఆన్‌లైన్‌ రెప్యుటేషన్‌ మేనేజ్‌మెంట్‌'లో మీరు చాలాచాలా వెనకబడి ఉన్నట్టే. ...ఈ ప్రక్రియ పేరు 'సెల్ఫ్‌ గూగ్లింగ్‌'.
* * *
నేనెవర్ని?...
ఈ ప్రశ్న సిద్ధార్థుడిని బుద్ధుడిగా మార్చింది. సామాన్యుడిని రమణమహర్షిగా తీర్చిదిద్దింది. ఇదే ప్రశ్న ఆన్‌లైన్‌ హీరోలనూ తయారు చేస్తుంది.
ఆలోచించండి... మీరెవరు?
తక్షణ మజిలీ ఎక్కడ?
తదుపరి గమ్యం ఏమిటి?
మంచి ఉద్యోగం, వ్యాపార విజయం, మనదైన రంగంలో గుర్తింపు... ఏదైనా కావచ్చు.
ఆ ప్రయాణంలో 'ఆన్‌లైన్‌'ను ఎలా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారు?
...ఈమాత్రం స్పష్టత ఉండాల్సిందే. ట్విటర్‌లో... ఏదో ఒకటి ట్వీట్‌ చేయడం, బ్లాగులో తోచిందేదో రాసేయడం. కామెంట్లూ కాంప్లిమెంట్లూ చిన్నాచితకా ఫొటో అప్‌లోడ్‌లూ... మొత్తంగా కాలక్షేపం వ్యవహారాలకే పరిమితమైతే ప్రయోజనం లేదు. సమయం వృథా. సాధించేది సున్నా.
నిన్నమొన్నటిదాకా... మీరు ఎలాంటివారో తెలుసుకోవాలని అనుకుంటే ఒకటే దారి - మీ సహపాఠీల్నో సహోద్యోగుల్నో వాకబుచేయడం. ఇప్పుడా స్థానాన్ని ఆన్‌లైన్‌ ఆక్రమించింది. గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌... మీ ఘనతను చాటుతుంది, మీ బలహీనతల్ని ఎత్తిచూపుతుంది. ఉద్యోగ నియామకాల నుంచి వ్యాపార అవకాశాల దాకా... ప్రతి విషయంలోనూ 'ఆన్‌లైన్‌' ఇమేజ్‌ చాలాచాలా ప్రభావం చూపుతుంది. దీంతో, మన అర్హతలూ నైపుణ్యాలూ విజయాలూ ఆన్‌లైన్‌ శోధకులకు అందుబాటులో ఉంచడం తప్పనిసరి అవుతోంది. తూతూమంత్రంగా ఉంచడం కాదు... శక్తిమంతంగా వ్యక్తీకరించాలి. అదో కళ, అంతకుమించిన శాస్త్రం. 'ఆన్‌లైన్‌ రెప్యుటేషన్‌ మేనేజ్‌మెంట్‌' ఇప్పుడిప్పుడే ప్రత్యేక విభాగంగా అవతరిస్తోంది. బ్లాగులూ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లూ ఆ ప్రయత్నంలో ఆసరాగా నిలుస్తున్నాయి.
మన నైపుణ్యం గురించి కార్పొరేట్‌ ఆఫీసులో కథలుకథలుగా చెప్పుకోవచ్చు. మనం మహా ప్రతిభావంతులమంటూ క్యాంపస్‌ జీవులంతా ముక్తకంఠంతో ఘోషించవచ్చు. ఆయా ప్రహరీలు దాటితే... మనం అనామకులం! అదే, ఆన్‌లైన్‌ పరిధి... సువిశాలం! మనకు తెలిసినవాళ్లూ చూస్తారు. తెలియని వాళ్లూ చూస్తారు. మన గురించి తెలుసుకోవాలనుకున్నవాళ్లు కూడా చూస్తారు. అందులో... మనకు ఉద్యోగాన్నిచ్చే కార్పొరేట్‌ సంస్థ ఉండవచ్చు, మన ఆలోచనలకు రూపంపోసే ఏంజిల్‌ ఇన్వెస్టర్‌ ఉండవచ్చు, భావసారూప్యం ఉన్న వ్యాపార భాగస్వామి ఉండవచ్చు. ఆన్‌లైన్‌లో ఉనికి ఉందంటే... మన పరిధి ప్రపంచమంతా విస్తరించినట్టే!
సమస్యలొద్దు...
ఆఫీసు క్యాంటీన్‌లోనో, కాలేజీ బస్‌స్టాప్‌లోనో మనం మాట్లాడుకునే మాటలన్నీ గాలికబుర్లే. గాల్లో కలిసిపోతాయి. కానీ, ఆన్‌లైన్‌లో ఏ చిన్న వ్యాఖ్యానం చేసినా - లిఖితపూర్వకంగా రికార్డయిపోతుంది. అందుకే, తూకమేసినంత కచ్చితంగా పదాల్ని ఎంచుకోవాలి. అతివాద ధోరణి అసలు పనికిరాదు. అప్‌లోడ్‌ చేసే ఫొటోల విషయంలోనూ అంతే జాగ్రత్త అవసరం.
జోగేష్‌ జిగిరీ దోస్తుకు మంచి జాబొచ్చింది. ఇంకేముంది, వీకెండ్‌ పార్టీకి పిలుపొచ్చింది. సిగ్గుపడుతూనే ఓ పెగ్గుపుచ్చుకున్నాడు. ఒకటి రెండైంది. రెండు మూడైంది. సీసా ఖాళీ అయ్యింది. తాగరాభాయ్‌, తాగి వూగరాభాయ్‌ అంటూ కిక్కెక్కి పాడుతుంటే... కెమెరాఫోన్లు క్లిక్కుక్లిక్కుమన్నాయి. మత్తు దిగేలోపు ఫొటోలన్నీ ఫేస్‌బుక్కులో ఎక్కేశాయి. భళ్లున తెల్లారిపోయింది. మనవాడు హ్యాంగోవర్‌ నుంచి బయటపడి... ఓ మార్కెటింగ్‌ కంపెనీ ఇంటర్వ్యూకు తయారవుతుంటే, సదరు సంస్థ హెచ్‌ఆర్‌ మేనేజరు నుంచి సంక్షిప్త సందేశం... 'ప్రస్తుతానికి రానక్కర్లేదు. మళ్లీ కబురుపెడతాం...' అంటూ. కారణం - ఫేస్‌బుక్‌ ఫొటోలే. ఆ విజయవాడ సంబంధం వాళ్లు కూడా 'అబ్బాయి మంచోడే కాని, అలవాట్లే బొత్తిగా మంచివికావండీ..' అని మధ్యవర్తికి తేల్చి చెప్పేశారు. ఈ నిర్ణయం వెనుకా ఫేస్‌బుక్కే ఉంది. ఫేస్‌బుక్‌కీ పెళ్లి సంబంధానికీ లంకెలా కుదిరిందంటారా? కొత్త బంధుత్వాల విషయంలో అటు ఆడపెళ్లివారైనా, ఇటు మగపెళ్లివారైనా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. డిటెక్టివ్‌ ఏజెన్సీల సాయంతో చరిత్రంతా తవ్వితీస్తున్నారు. ప్రొఫెషనల్‌ డిటెక్టివ్‌లు పన్లోపనిగా ఆన్‌లైన్‌ జీవితాల్నీ పరిశీలిస్తున్నారు.
ఉద్యోగ సిద్ధిరస్తుకైనా..
కల్యాణ ప్రాప్తిరస్తుకైనా...
ఆన్‌లైన్‌ సచ్చరిత్ర తప్పనిసరి.
ఆ జాగ్రత్తలేవో క్యాంపస్‌ రోజుల నుంచే మొదలుపెడితే బావుంటుంది.ముంబయిలోని ఓ కాలేజీ విద్యార్థులు ర్యాగింగ్‌ చేయడమే కాకుండా, ఆ ఘనకార్యాల గురించి బ్లాగులో గొప్పగా రాసుకున్నారు. ఆ కేసులో పోలీసులు బ్లాగు రాతల్ని ఆధారాలుగా చూపించారు. 'దేశంలోని రాజకీయ నాయకులందర్నీ కాల్చిపారేయాలా? అవినీతిని నిర్మూలించడానికి ఇదా మీరు సూచించే పరిష్కారం?'... ఓ బహుళజాతి సంస్థలో ఉద్యోగానికి వెళ్లినప్పుడు, ఇంటర్వ్యూబోర్డు సభ్యుడు అడిగిన ప్రశ్నకు శ్రీనాథ్‌ బుర్ర తిరిగిపోయింది. కాలేజీ పాలిటిక్సుతో బిజీగా ఉన్న రోజుల్లో వీరావేశంతో రాసుకున్న బ్లాగు వ్యాసాన్ని ఆ పెద్దమనిషి ఎప్పుడు చదివాడో, మనవాడికి అర్థం కాలేదు.
'ఆన్‌లైన్‌' రచ్చబండ లాంటిది. అక్కడ వ్యక్తం చేసే ప్రతి అభిప్రాయమూ బహిరంగమే. ఓ మేనేజ్‌మెంట్‌ ట్రైనీ కుర్రాడు 'బామ్మ సీరియస్‌' తరహా అబద్ధం అల్లేసి.. గాళ్‌ఫ్రెండ్‌తో లాంగ్‌డ్రైవ్‌కు వెళ్లొచ్చాడు. ఎప్పట్లాగానే ఆ ఫొటోలు నెట్‌వర్కింగ్‌ సైట్‌లో పెట్టేసుకున్నాడు. విషయం మెమో దాకా వెళ్లింది. పెద్దబాసు పెద్దమనసు చేసుకోబట్టి సరిపోయింది. లేదంటే, ఉద్యోగం వూడిపోయేది. గాళ్‌ఫ్రెండ్‌ కూడా గుడ్‌బై చెప్పేది.
చాలా కంపెనీలు ఉద్యోగార్థుల ఆన్‌లైన్‌ చరిత్రను లోతుగా పరిశీలిస్తున్నాయి. సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్ల వడపోతతోనే ఆ కార్యక్రమం మొదలవుతుంది. అర్హతలూ నైపుణ్యాలూ ఆతర్వాతే. వాగుడుకాయలనూ వీరావేశపరులనూ తొలిదశలోనే పక్కనపెట్టేస్తున్నాయి. కొన్ని సంస్థలైతే కన్సల్టెంట్ల ద్వారానో, పత్రికా ప్రకటన ద్వారానో కాకుండా... సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్ల సాయంతోనే సమర్థులకు గాలమేస్తున్నాయి. పెప్సీకో 'ఆన్‌లైన్‌ వేట'కు ప్రత్యేకంగా ఓ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించుకుంది. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ గత ఏడాది దాదాపు అరవైశాతం సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లను లింక్డిన్‌ తదితర సైట్ల ద్వారా నియమించుకుంది. మహీంద్రా సత్యం ప్రత్యేకంగా ఫేస్‌బుక్‌లో 'కెరీర్‌ దివస్‌' పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. కార్పొరేట్‌ సంస్థలు ఆన్‌లైన్‌ నియామకాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాయో, ఆన్‌లైన్‌ వ్యాఖ్యల్నీ అంతే సీరియస్‌గా తీసుకుంటున్నాయి. చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరు మొదలు సాధారణ ఉద్యోగి దాకా..ప్రతి ఒక్కరూ తమ బ్రాండ్‌ అంబాసిడర్లే అని భావిస్తాయి. ఆన్‌లైన్‌లో ఉద్యోగుల అవాకుల్నీ చవాకుల్నీ ఎంతోకాలం భరించడం లేదు. బాసు గురించో బాసు బాసు గురించో చేతికొచ్చినట్టు రాసినందుకు మెమోలు అందుకున్నవారూ పనివాతావరణాన్ని ప్రశ్నించినందుకు ఇంటిదారి పట్టినవారూ బోలెడంతమంది. ఆమధ్య ఓ బహుళజాతి చిరుతిళ్ల తయారీ సంస్థ ఉద్యోగులు వంటశాలలో అసహ్యంగా ప్రవర్తించారు. పిండి కలుపుతున్న చేతులతోనే, ముక్కులో చెవుల్లో వేళ్లుపెట్టుకుంటూ వీడియో తీసుకున్నారు. అంతటితో ఆగకుండా వాటిని యూట్యూబులో పెట్టారు. విషయం సంస్థ దృష్టికి వచ్చేసరికి..జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. క్రమశిక్షణా రాహిత్యానికి ఆ ఉద్యోగులు పెద్దమూల్యమే చెల్లించుకున్నారు. ఓ ప్రైవేటు బ్యాంకు పనితీరుపై ఒకానొక బ్లాగులో వచ్చిన వ్యాసం... చేతులుమారి చేతులుమారి లక్షలమందికి చేరింది. స్టాక్‌మార్కెట్‌లో ఆ బ్యాంకు షేరు విలువనూ ప్రభావితం చేసింది. వ్యవహారం బ్లాగు రచయితకు లీగల్‌ నోటీసు పంపడం దాకా వచ్చింది.
హుందాగా..
కొందర్ని చూడగానే గౌరవభావం కలుగుతుంది. స్నేహం చేయాలనిపిస్తుంది. ఇంకొందర్ని చూసినప్పుడు... ఎటైనా పారిపోవాలనిపిస్తుంది. మొహం చూసి మనిషిని అంచనా వేసినట్టే..సోషల్‌నెట్‌వర్కింగ్‌ సైట్‌లో మనం పెట్టుకునే ఫొటోల్ని బట్టే, మనతో స్నేహం చేయాలో వద్దో నిర్ణయించుకునేవారు చాలామంది. 'రెప్యుటేషన్‌ 24 ఇంటూ 7' అనే ఆన్‌లైన్‌ ఇమేజ్‌ బిల్డింగ్‌ సంస్థ అధ్యయనం ప్రకారం... అసహ్యకరమైన చిత్రాలూ అర్ధనగ్న ఫొటోలూ పెట్టుకునేవారితో జతకట్టడానికి నూటికి ఎనభైశాతం మంది ఇష్టపడరు. డమ్మీ ఫొటోలూ నకిలీ ఛాయాచిత్రాలూ... మనపై సదభిప్రాయాన్ని కలిగించలేవు. హుందాగా కనిపించే ఫొటోల్నే ఆన్‌లైన్‌ గోడకు తగిలించుకోవడం ఉత్తమం.బ్లాగు రూపకల్పనలో ఉపయోగించే సాఫ్ట్‌వేర్లూ, టూల్స్‌ విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. వాటితోనే పేజీకి అందం వస్తుంది. రచనా శైలి గురించీ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆన్‌లైన్‌ పాఠకుల అభిరుచులూ ఆఫ్‌లైన్‌ పాఠకుల అభిరుచులూ వేరువేరు. ఆన్‌లైన్‌ పౌరులు... ఏ విషయమైనా సూటిగా సుత్తిలేకుండా ఉండాలని కోరుకుంటారు. పాయింట్ల వారీగా ఇస్తే, చాక్లెట్లలా నమిలేస్తారు. ఏం చేసినా, ఏం రాసినా చదువరులను ఆకట్టుకోవడమే ప్రధాన లక్ష్యం కావాలి. విశ్లేషణ నచ్చి, ఏ పత్రికా రచయితో మన బ్లాగు గురించి తన వార్తాకథనంలో ప్రస్తావించవచ్చు. పాపులర్‌ బ్లాగులు మన లింకుల్ని ఇవ్వవచ్చు. దీనివల్ల క్లిక్కులు ఎక్కువవుతాయి. మన ఆన్‌లైన్‌ బ్రాండ్‌ విలువ అమాంతంగా పెరిగిపోతుంది.
వాడుకున్నంత...
ఆన్‌లైన్‌లో 'విజిబిలిటీ' ముఖ్యం. కనిపిస్తూనే ఉండాలి... ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు. అత్యద్భుతంగా అనిపించే ఒకే ఒక్క రచనతో సరిపుచ్చుకోవడం కంటే... ఓ మోస్తరు సమాచారం ఉన్న వంద సాధారణ వ్యాసాలే ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. ఆ వంద విషయాల్ని వందమంది చదువుతారు. మరో వందమందితో షేర్‌ చేసుకుంటారు. ఆన్‌లైన్‌ను సమర్థంగా వాడుకోవడం ఒక కళ. స్టీవ్‌జాబ్స్‌ అందులో నిష్ణాతుడు. 'ఆపిల్‌' విజయానికి ఆన్‌లైన్‌ ప్రచారం చాలా ఉపయోగపడింది. ఆపిల్‌ ఏ కొత్త ఉత్పత్తిని విడుదల చేయాలన్నా... తొలి ఫొటో ఆన్‌లైన్‌లోనే ప్రత్యక్షమయ్యేది. డిగ్‌.కామ్‌ లాంటి సైట్లలో ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నమూ జరిగేది. సరుకు మార్కెట్‌లోకి వచ్చేసరికి... ఓ ప్రచార వేదికను సిద్ధంచేసి పెట్టేవాడు స్టీవ్‌జాబ్స్‌ - అదీ కాణీ ఖర్చులేకుండా! డరియా మస్క్‌ అనే పాప్‌ గాయని..గూగుల్‌ ప్లస్‌లో తన మ్యూజిక్‌ను షేర్‌ చేసుకోవడం ద్వారా..లక్షలమంది అభిమానులను సంపాదించుకుంది. ఆమెకంటే గొప్ప గాయకులు ప్రపంచంలో చాలామంది ఉండవచ్చు. కానీ ఎవరూ ఆన్‌లైన్‌ మార్గాన్ని ఆమెలా సద్వినియోగం చేసుకోలేదు. అదే డరియా విజయ రహస్యం!
సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లను ఎలా వాడుకోవాలో మన రాజకీయ నాయకులకు బొత్తిగా తెలియదు. తెలిసినవారు కూడా, సమర్థంగా వినియోగించుకున్న సందర్భాలు తక్కువ. నోటిదురద వ్యాఖ్యలతో కష్టాలపాలు అవుతున్నవారే అధికం. శశిథరూర్‌ లాంటివారు ఏకంగా పదవుల్నే పోగొట్టుకున్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా గత ఎన్నికల ప్రచారంలో సోషల్‌ నెట్‌వర్కింగ్‌ మార్గాన్ని నూటికి నూరుశాతం సద్వినియోగం చేసుకున్నారు. లక్షలమంది ఓటర్లతో తన ఆలోచనలు పంచుకున్నారు.
నైపుణ్యమే సగం బలం...
ఆన్‌లైన్‌లో మన ప్రత్యేకత నిలుపుకోవాలంటే, మనదైన రంగానికి సంబంధించి... సాధికారమైన నైపుణ్యాన్ని సాధించాలి. ఆన్‌లైన్‌ చర్చల్లో మన విశ్లేషణాశక్తిని చాటుకోవాలి. ఏ రాత అయినా, ఏ వ్యాఖ్యానమైనా 'ప్రొఫెషనల్‌'గా ఉండాలి. ఆలోచన రేకెత్తించాలి. ప్రస్తావించే సంఘటనల్లో, జోడించే గణాంకాల్లో ప్రామాణికత అవసరం. మౌత్‌షట్‌.కామ్‌ వంటి సైట్లలో విమర్శలకూ రేటింగ్‌లకూ అవకాశం ఉంది. అమేజాన్‌.కామ్‌లో మనం చదివిన పుస్తకాల సమీక్షలు కూడా రాసుకోవచ్చు. ఇలాంటి వేదికలన్నీ మన ఉనికిని నిరూపించుకోడానికి ఉపకరిస్తాయి. పేరున్న బ్లాగులు, ఆన్‌లైన్‌ పత్రికలు, న్యూస్‌ సైట్లలో... మన కామెంట్లు పోస్ట్‌ చేయవచ్చు. 'యాహూ ఆన్సర్స్‌' విభాగంలో రకరకాల ప్రశ్నలకు జవాబులు ఇవ్వవచ్చు. ఆసక్తి ఉన్న అంశాలపై వికీపీడియాలో వ్యాసాలు రాయవచ్చు. వికీలో స్వచ్ఛంద ఎడిటర్‌గా పేరు నమోదు చేసుకోవచ్చు. వివిధ అంశాలపై ఉన్న వ్యాసాలను ఎడిట్‌ చేయడం వల్ల కూడా గూగుల్‌ సెర్చ్‌లో మనకు ప్రాధాన్యం లభిస్తుంది. పర్సనల్‌ ఫైనాన్సింగ్‌ నిపుణులమైతే... పొదుపు-మదుపులకు సంబంధించి, వైద్యనిపుణులమైతే ఆరోగ్యానికి సంబంధించి, ఉద్యోగ అవకాశాల మీద అవగాహన ఉంటే కెరీర్‌కు సంబంధించి... ప్రత్యేకమైన బ్లాగులు నిర్వహించవచ్చు. దీనివల్ల పాఠకులనే కాదు, కస్టమర్లనూ ఆకర్షించవచ్చు. కొన్నిసార్లు మన అభిప్రాయాలు తప్పని తేలిపోవచ్చు. మన వ్యాఖ్యలపై విమర్శలు రావచ్చు. ఎవరో వేలెత్తి చూపవచ్చు. బురదజల్లే ప్రయత్నం చేయవచ్చు. ఇలాంటి సందర్భాల్లో... హుందాగా వ్యవహరించాలి. మనదైన శైలిలో వాటిని తిప్పికొట్టాలి. తప్పులుంటే నిజాయతీగా ఒప్పుకోవాలి. సరిచేసుకునే ప్రయత్నం చేయాలి. బ్లాగు నిర్వహించడమంటే మామూలు విషయం కాదు. పట్టుపట్టరాదు, పట్టి విడవరాదు.. అన్నంత ఓపిక అవసరం. ఒకటిరెండు నెలలు హంగామా చేసి, ఆతర్వాత అటకెక్కిస్తే నవ్వులపాలవుతాం. బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతింటుంది.
ఆన్‌లైన్‌ బ్రాండింగ్‌లో యూట్యూబ్‌ ప్రాధాన్యాన్ని విస్మరించలేం. మనకున్న పరిజ్ఞానంతో నలుగురికీ ఉపయోగపడే సమాచారాన్ని వీడియోల రూపంలో అందుబాటులో ఉంచవచ్చు. అవన్నీ అద్భుతమైన విషయాలు కానక్కర్లేదు. ఉదాహరణకు, 'బ్రహ్మచారులకు పాఠాలు' శీర్షిక కింద... ఓవైపు గెడ్డం గీసుకుంటూనే, మరోవైపు వంటపనులు పూర్తిచేయడం ఎలాగో ఓ వీడియోలో చూపించవచ్చు. బోధన రంగంలో అనుభవం ఉంటే ఏ గణితం పాఠాలో, సైన్స్‌ ప్రయోగాలో అందుబాటులో ఉంచవచ్చు. ఖాన్‌ అకాడమీ అలానే విశ్వవ్యాప్తమైంది. ఆలోచన కొత్తగా ఉంటే, జనం తప్పకుండా ఆదరిస్తారు. మన పేరు మారుమోగిపోతుంది.
నెట్‌వర్కింగ్‌... మనమే కింగ్‌!
ఒకటిరెండు దశాబ్దాల క్రితం... ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలన్నీ గోల్ఫ్‌కోర్స్‌లోనే జరిగిపోయేవంటారు. ఆట మీద ఆసక్తి ఉన్నా లేకపోయినా... 'నెట్‌వర్కింగ్‌' పెంచుకోడానికి గోల్ఫ్‌ నేర్చుకున్నవాళ్లు చాలామంది. ఇప్పుడు ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లు ఆ అవకాశాన్ని ఇస్తున్నాయి. మన రంగానికి చెందిన వ్యక్తులతో పరిచయం పెంచుకోవడం, వారి అనుభవాలు తెలుసుకోవడం, మన ఆలోచనలను పంచుకోవడం... ఆన్‌లైన్‌ అందిస్తున్న గొప్పవరం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తల్లో నాలుకలా మెలగాలి. సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోడానికే కాదు, అవకాశాల్ని ఇచ్చిపుచ్చుకోడానికీ ఇది వేదిక.
సప్తసముద్రాలకు ఆవల ఒంటిస్తంభం మేడమీదున్న బంగారు చిలకను తీసుకురావడానికి వెళ్లిన రాకుమారుడికి దార్లో... రకరకాల సమస్యలు ఎదురవుతాయి. రకరకాల ప్రలోభాలు దారితప్పించే ప్రయత్నం చేస్తాయి. ఇంటర్నెట్‌లోనూ అలాంటి టక్కుటమార చేష్టలు చాలానే కనిపిస్తాయి. చూపుతిప్పామా... దారితప్పుతాం! హీరో కావాల్సిన వాళ్లం కాస్తా, జీరోగా మిగిలిపోతాం!
'ఆన్‌లైన్‌' పౌరసత్వం కోసం...
ఆన్‌లైన్‌లో మనకంటూ ఓ ఉనికిని సంపాదించుకోడానికి ఉపకరించే మార్గాలివి...
వెబ్‌సైట్‌
మీదైన ఓ వెబ్‌సైట్‌ సృష్టించుకునే ప్రయత్నం చేయండి. సొంత సైట్‌ కాస్త ఖరీదైన వ్యవహారమే. అంత మొత్తం భరించలేమని అనుకుంటే, ఉచితంగా సేవలు అందించే సంస్థలూ ఉన్నాయి. వాటి ద్వారా ఐదారు పేజీల వెబ్‌సైట్‌ ఏర్పాటు చేసుకోవచ్చు.
బ్లాగు
మీకంటూ ఓ బ్లాగ్‌ ఉండాలి. అదీ వర్డ్‌ప్రెస్‌.కామ్‌ లేదా బ్లాగర్‌.కామ్‌ వంటి వాటి ద్వారా అయితే ఉత్తమం. వాటికి గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లో తగిన ప్రాధాన్యం లభిస్తుంది. 'ఎబౌట్‌ మీ...' అంటూ మీ గురించి మీరు చెప్పుకునే పరిచయ వ్యాసం... వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలి.
సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌
ట్విటర్‌, ఫేస్‌బుక్‌, లింక్డిన్‌, గూగుల్‌ప్లస్‌... ఒక్కో సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌కూ ఓ స్వభావం ఉంటుంది. దాన్ని అర్థంచేసుకోవాలి. వీలైనన్ని ఎక్కువ నెట్‌వర్క్స్‌లో మన ఉనికిని చాటుకోవాలి. ఎందుకంటే మీ బ్లాగు అభిమాని, ట్విటర్‌లోనూ మిమ్మల్ని ఫాలో అవుతాడు. మీ ట్వీట్స్‌ తెగనచ్చే వ్యక్తి, మీ బ్లాగునూ వదిలిపెట్టడు.
నిజమే చెబుతాను...
ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో పెట్టే ప్రొఫైల్స్‌ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అబద్ధాలకూ అతిశయాలకూ దూరంగా ఉండాలి. విద్యార్హతలు, అనుభవం విషయంలో దాపరికాలు వద్దేవద్దు. ఆ ప్రభావం మన కెరీర్‌ మీద పడుతుంది.
మార్పులూ చేర్పులూ
ప్‌డేట్స్‌ చాలా ముఖ్యం. కొత్త అర్హతలేవైనా తోడైతే, ప్రొఫైల్స్‌కు..జోడించాలి. కొత్త విజయాలేమైనా సాధిస్తే సవివరంగా ప్రస్తావించాలి. ఆన్‌లైనే కదా, అని తేలిగ్గా తీసుకోకుండా...వ్యాకరణ దోషాలూ అచ్చుతప్పులూ లేకుండా జాగ్రత్తపడాలి.
హెచ్చరిక గంట
'గూగుల్‌ అలర్ట్స్‌'లో నమోదు చేసుకోవడమూ మంచి ఆలోచనే. దీనివల్ల ఆన్‌లైన్‌లో మన పేరు కొత్తగా ప్రత్యక్షమైన ప్రతిసారీ... సమాచారం అందుతుంది. 'హాట్‌సూట్‌' వంటి టూల్స్‌తో... మన సోషల్‌ నెట్‌వర్కింగ్‌ ఖాతాలన్నీ ఒకే 'డాష్‌బోర్డ్‌' మీదికి తెచ్చుకోవచ్చు.
ఛాయాచిత్రాలు
పూర్తి వ్యక్తిగత ఫొటోలు ఆన్‌లైన్‌లో వద్దు. పెట్టినా, కొద్దిమంది ఆత్మీయులకు మాత్రమే అందుబాటులో ఉంచాలి. వ్యక్తిగత, వృత్తిపర జీవితాలు వేరువేరు. వాటిని కలగాపులగం చేయడం మంచిది కాదు.
'కార్పొరేట్‌' నెట్‌వర్కింగ్‌..
విమర్శ వల్ల వ్యక్తికి జరిగే నష్టం కంటే, సంస్థకు జరిగే నష్టం చాలా తీవ్రమైంది. గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లో ఫలానా సంస్థ పేరు కొట్టగానే..నాణ్యత బావోలేదనో, సేవలు నాసిరకంగా ఉంటున్నాయనో... ఫిర్యాదులే ముందువరుసలో ఉంటే ఎంత అప్రతిష్ఠ! అందులోనూ దేశంలో ఇంటర్నెట్‌ వినియోగం వేగంగా పెరుగుతోంది. ఏ వస్తువును కొనాలన్నా... చాలామంది ఆన్‌లైన్‌ సమీక్షల మీదే ఆధారపడుతున్నారు. అందుకే, కార్పొరేట్‌ సంస్థలు తమ గొప్పదనాన్ని చాటుకోడానికి ప్రత్యేకంగా రెప్యుటేషన్‌ మేనేజ్‌మెంట్‌ బృందాల్ని ఏర్పాటు చేస్తున్నాయి. బ్లాగుల ద్వారా ట్విటర్‌ వంటి నెట్‌వర్కింగ్‌ సైట్ల ద్వారా.. సంస్థ ఉత్పత్తుల్ని ప్రచారం చేయడం ఈ విభాగం బాధ్యత. ఎక్కడైనా తమ బ్రాండ్‌పై విమర్శలు ఉంటే వాటికి తగిన జవాబు ఇవ్వడం అదనపు బాధ్యత. వినియోగదారుల కోసమే ఓ నెట్‌వర్కింగ్‌ ఖాతా తెరిచి, అభిప్రాయాల్నీ సమీక్షల్నీ ప్రోత్సహిస్తున్న సంస్థలూ ఉన్నాయి.
* * *
అందమైన ఫొటో పెట్టుకుంటాం. అద్భుతమైన బ్లాగు సాహిత్యాన్ని సృష్టిస్తాం. అదరగొట్టే ప్రొఫైల్‌ తయారుచేస్తాం. నెట్‌వర్కింగ్‌ ద్వారా వేలమంది స్నేహితుల్ని సంపాదిస్తాం. గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లో పేరు కొట్టగానే... వరుసగా మన గురించే. ఈ పరుగులో పడిపోయి, ఆ ప్రాచుర్యంతో మురిసిపోయి.. వ్యక్తిత్వ నిర్మాణాన్ని మరచిపోకూడదు.
అలా అని, 'ఆన్‌లైన్‌ రెప్యుటేషన్‌ మేనేజ్‌మెంట్‌'ను విస్మరించమని కాదు...
వ్యక్తిత్వం చెట్టులాంటిది.
ప్రచారం నీడలాంటిది.
...చెట్టులా పైపైకి ఎదుగుతూనే, నీడలా నలుదిశలకు విస్తరించాలి. నీడే సర్వస్వమని అనుకుంటే, వామనవృక్షంలా మిగిలిపోతాం.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)

వైవిధ్యమే జీవం! (Eenadu Sunday_30/09/12)