నెట్టింట్లో నేత! యువ స్పందన మోత!! (Eenadu Eetaram_06/10/12)

నెట్టింట్లో నేత! యువ స్పందన మోత!!
గుడ్‌ మార్నింగ్‌ నుంచి గుడ్‌నైట్‌ వరకు... ఆన్‌లైన్‌లో ఒక్కసారైనా 'హలో' అనని యువత అరుదే! దీన్ని గమనించారు యువ రాజకీయ నేతలు... అందుకే ఆన్‌లైన్లో అందర్నీ పలకరిస్తున్నారు! ప్రచారం, వ్యక్తిగతం, అభిప్రాయాలు పంచుకోవడం... ఇలా నెట్టింట్లో కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు! అలాంటి కొందరితో మాట కలిపింది 'ఈతరం'
 రాజకీయ నాయకుడు సభ పెడితే ఎంత మంది జనం వస్తారు? వేలు, అరుదుగా లక్షలు! కానీ ఆన్‌లైన్‌లో రోజూ మీట్‌ అయ్యే భారతీయుల సంఖ్య కోటిపైనే. ఎందుకంటే మనదేశంలో సామాజిక అనుబంధాల వెబ్‌సైట్లలో సభ్యులుగా ఉన్నవాళ్ల సంఖ్య పదిహేను కోట్లు. అందులో ఫేస్‌బుక్‌లో ఫేస్‌లు ఉన్నవాళ్లే ఐదుకోట్ల డెబ్భై లక్షలు. ట్విట్టర్‌ ట్వీట్లలో మునిగి తేలేవాళ్లు కోటీ ముప్ఫై లక్షలు. ఆపై గూగుల్‌ ప్లస్‌, ఆర్కుట్లలాంటివి ఉండనే ఉన్నాయి. ఈ నెటిజన్లలో ఎక్కువమంది యూతే. వీళ్లని చేరాలంటే అందర్నీ ఒకచోటికి తరలించే పన్లేదు. తమ సందేశం అందించాలన్నా, అభిప్రాయం చెప్పాలన్నా మైకులు ఊదరగొట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఒక్క క్లిక్‌తో, ఒక్క ట్వీట్‌తో, ఒక్క పోస్ట్‌తో దగ్గర కావొచ్చు. ఆ 'పవర్‌' తెలుసు కాబట్టే మన యువ నాయకులు పోలోమంటూ ఆన్‌లైన్‌ బాట పడుతున్నారు.కేవలం ప్రచార పటాటోపానికి కాదు వ్యక్తిగత ఎదుగుదలకు, చర్చోపచర్చలకు, సరికొత్త ఆలోచనలకు ఆన్‌లైన్‌ ఓ చక్కని వేదిక అని నమ్మే యువ నేతల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వాళ్లు తప్పనిసరిగా ఏదో సామాజిక అనుబంధాల వెబ్‌సైట్‌లో సభ్యులవుతున్నారు. ఆపై వాళ్లని అనుసరించే వారి సంఖ్య కూడా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. ప్రజాప్రతినిధిని నేరుగా కలుసుకుని తమ ఆలోచనలను పంచుకోలేని ఎందరో యువతీ యువకులు ఆ నేతని వెబ్‌సైట్లో పలకరిస్తున్నారు. ఇది నేతలకు కూడా ఎంతో ఉపయోగకరంగా మారింది. విద్యావంతులైన యువత నుంచి సరికొత్త ఆలోచనలను, సూచనలను వారు అంది పుచ్చుకుంటున్నారు. కొందరు నేతలు కొన్ని విషయాలపై ఆన్‌లైన్‌ చర్చలను కూడా నిర్వహిస్తున్నారు. ఆ చర్చల ఫలితాలు చట్టసభల్లో మార్మోగుతున్న సందర్భాలు కూడా లేకపోలేదు. మొత్తం మీద సరికొత్త రాజకీయ ఒరవడికి ఆన్‌లైన్‌ ఓ వేదికగా మారుతోంది.
'నన్ను నేను ఆప్‌డేట్‌ చేసుకోవడానికి, కొత్త విషయాలు తెల్సుకోవడానికి ఆన్‌లైన్‌ ఓ మంచి మార్గం' అంటున్నారు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌. సమకాలీన అంశాలపై అప్పుడప్పుడు ట్విట్టర్‌లో స్పందించే ఆయన జాతీయ, అంతర్జాతీయ నాయకులు, రచయితలు, పాత్రికేయుల్ని ఎక్కువగా ఫాలో అవుతుంటారు. సోషల్‌నెట్‌వర్కింగ్‌ వెబ్‌సైట్లను విషయ సేకరణకు వాడుకుంటున్న యువ ప్రతినిధులు కూడా పెరుగుతున్నారు. చింతలపూడి ఎమ్మెల్యే రాజేశ్‌ది అదే తీరు. మిత్రులతో జరిపిన చాటింగ్‌లో అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యవసాయ కమతాలు పెద్దవని, యాంత్రీకరణ ఎక్కువనే సంగతి తెలిసింది. మనకూ యాంత్రీకరణ ఆవశ్యకతపై శాసనసభలో మాట్లాడితే ముఖ్యమంత్రి నుంచి ప్రశంసలొచ్చాయి. బెల్జియంలో జరిగే వరల్డ్‌ అగ్రిఫోరం సెమినార్‌కు రాష్ట్ర ప్రతినిధిగా వెళ్లే అవకాశం దక్కింది. ఉద్ధానం ప్రాంతంలో తీవ్ర కిడ్నీ వ్యాధుల సమస్య రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితం. దీనికి పరిష్కారంగా ఓ వెబ్‌సైట్‌ ప్రారంభించారు ఇచ్ఛాపురం ఎమ్మెల్యే సాయిరాజ్‌. స్నేహితులతో జరిపిన ఆన్‌లైన్‌ చర్చలే ఈ ప్రయత్నానికి ప్రేరణగా నిలిచాయి. విద్యుత్తు సమస్యకి పరిష్కారంగా ఓ సోలార్‌ పవర్‌ పైలెట్‌ ప్రాజెక్టు ప్రారంభించాలనే ఆలోచన వైరా ఎమ్మెల్యే చంద్రావతిలో మొగ్గ తొడగడానికి కారణం తను ఫేస్‌బుక్‌లో సభ్యురాలు కావడమే. స్నేహితులు ఇచ్చిన సలహాల్ని స్వీకరించడమే. ఇది కొత్త కాకపోయినా ఈ మధ్య కాలంలో దీని ప్రాధాన్యతను గుర్తిస్తున్న నేతలు పెరుగుతున్నారన్నది నిజం.
న్‌లైన్‌ కామెంట్లతో వివాదాల్లో చిక్కుకున్న వారు కూడా లేకపోలేదు. పార్లమెంట్‌ సభ్యుడు శశి థరూర్‌ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యానాలు రేకెత్తించిన వివాదం ఎలా మర్చిపోగలం? ఇలాంటి అపశృతుల సంగతి పక్కన పెడితే దీన్నొక చక్కని వేదికలా వాడుకునేవారే ఎక్కువని చెప్పాలి. గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో నాయకుల ఆన్‌లైన్‌ ప్రభంజనం మరీ ఎక్కువైంది. యువ నాయకుల విషయానికొస్తే రాహుల్‌ గాంధీ, నవీన్‌ జిందాల్‌, వరుణ్‌ గాంధీ, మురళీ దేవ్‌రా, సచిన్‌ పైలెట్‌... లాంటి వారు నిత్యం ఆన్‌లైన్లో కనిపిస్తూనే ఉన్నారు.
రాహుల్‌ గాంధీ
పదవి: ఎంపీ (అమేథీ నియోజకవర్గం)
ట్విట్టర్‌ ఫాలోయర్లు: లక్షాల పన్నెండువేలమంది 
ఫేస్‌బుక్‌ పేజీ లైక్స్‌: 185,100
ఆన్‌లైన్‌లోకి?: ఏడేళ్ల కిందట 
మిలింద్‌ దేవ్‌రా
పదవి: కేంద్ర మంత్రి ఐటీ, కమ్యూనికేషన్లు
ట్విట్టర్‌ ఫాలోయర్లు: 28,996
ఫేస్‌బుక్‌ పేజీ లైక్స్‌: 1,040
ఆన్‌లైన్‌లోకి?: మూడున్నర ఏళ్ల కిందట
నవీన్‌ జిందాల్‌ 
పదవి: ఎంపీ (కురుక్షేత్ర నియోజకవర్గం)
ట్విట్టర్‌ ఫాలోయర్లు: 40,700
ఫేస్‌బుక్‌ లైక్స్‌: 21,350
ఆన్‌లైన్‌లోకి?: ఏడాదిన్నర 
అఖిలేష్‌ యాదవ్‌
పదవి: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి
ట్విట్టర్‌ ఫాలోయర్లు: 12,320
ఫేస్‌బుక్‌ లైక్స్‌: 76,600
ఆన్‌లైన్‌లోకి?: ముఖ్యమంత్రి కాగానే యాక్టివ్‌ 
వరుణ్‌ గాంధీ
పదవి: ఎంపీ (పిల్బిత్‌ నియోజకవర్గం) 
ట్విట్టర్‌ ఫాలోయర్లు: 96,600
ఫేస్‌బుక్‌ పేజీ లైక్స్‌: 18,674 (రెండు అకౌంట్లు) మూడేళ్ల కిందట
ఆన్‌లైన్‌లోకి?: మూడేళ్లు
ఫేస్‌బుక్‌లో చిట్‌చాట్‌
నా నియోజకవర్గంలోని ప్రజలు ఏ సమస్య వచ్చినా ఫేస్‌బుక్‌ ద్వారా నా దృష్టికి తెస్తుంటారు. సమస్య తీవ్రతను బట్టి ఒక్కోసారి ప్రత్యక్షంగా అక్కడికెళ్లి పరిష్కారానికి ప్రయత్నిస్తా. ఇటీవలే నా పుట్టిన రోజు సందర్భంగా www.ktramarao.com అనే వెబ్‌సైట్‌ ప్రారంభించాం. ఇందులో నా వ్యక్తిగత, రాజకీయాలకు సంబంధించి అన్ని విషయాల్ని ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేస్తుంటా. సలహాలిచ్చినా స్వీకరిస్తుంటా. ఇటీవల కాంగ్రెస్‌ జాతీయ నాయకుడు ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ ఆస్ట్రేలియా వెళ్లినపుడు అక్కడి తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం సభ్యులు ఆయన్ని కలిసి మాట్లాడారు. ఆ విషయాలను ఫేస్‌బుక్‌లో నాతో పంచుకున్నారు. నా చిన్ననాటి స్నేహితులు, విదేశాల్లో ఉన్నప్పటి సన్నిహితులతో చాటింగ్‌ చేస్తుంటా. 
-కె.తారకరామారావు, సిరిసిల్ల ఎమ్మెల్యే 
పరిష్కార వేదిక
పే¶స్‌బుక్‌ నా దినచర్యలో భాగం. నా నియోజకవర్గంలోని వెయ్యిమంది యువకులు ఏ సమస్యనైనా నాకు ఫేస్‌బుక్‌లోనే తెలియజేస్తారు. ఆ వివరాలు, వాటిని నేనెంతవరకు పరిష్కరించిందీ ఓ ఎక్సెల్‌ షీట్‌ రూపంలో పొందు పరుస్తున్నా. గత వేసవి కాలంలో లింగపాలెం మండలంలో తాగునీటికి తీవ్ర ఎద్దడి ఏర్పడింది. దీనికి పరిష్కారం చూపమని ఎక్కువ మంది సూచించారు. వెంటనే స్పందించి ఏసీడీపీ నుంచి నిధులిప్పించా. కలెక్టర్‌తో మాట్లాడి ఆ సమస్య పరిష్కారమయ్యేలా చూశా. ఆన్‌లైన్‌లో కొత్త కొత్త ఫ్యాషన్లు, ట్రెండ్స్‌ గమనిస్తుంటా. 
- ఎం. రాజేష్‌, చింతలపూడి ఎమ్మెల్యే
బాధితులకు సాయం..
ఫేస్‌బుక్‌లో నాతో వెయ్యిమంది టచ్‌లో ఉన్నారు. ఉగాండా, కెనడా, అమెరికాల్లో ఉద్యోగాల్లో స్థిరపడ్డ ఫ్రెండ్స్‌తో తరచూ చాటింగ్‌ చేస్తుంటా. వాళ్లిచ్చిన సలహాల్ని ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన వాళ్లకు చెబుతుంటా. మా నియోజకవర్గంలో కిడ్నీల సమస్యపై చర్చించి జనాలకు ఉపయోగపడే విధంగాwww.helpuddaanom.org అనే వెబ్‌సైట్‌ ప్రారంభించా. దీంతో ఏడాది నుంచి కిడ్నీ బాధిత కుటుంబాలకు సాయం అందుతోంది. దీనికోసం ప్రత్యేకంగా ఓ డయాలసిస్‌ యూనిట్‌ను ఏర్పాటు చేశానంటే అది నా ఫేస్‌బుక్‌ మిత్రుల ఆలోచనల పుణ్యమే. 
- పి.సాయిరాజ్‌, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే 
సోలార్‌ ఆలోచనలు... 
మా పార్టీ యువజన విభాగం నిర్ణయాలు, అభిప్రాయాల్ని ఆన్‌లైన్‌లోనే పంచుకుంటా. నా నియోజవర్గంలో చేపట్టే ప్రతి కార్యక్రమాల్ని ఎప్పటికప్పుడు ఫేస్‌బుక్‌లో అప్‌డేట్‌ చేస్తుంటా. విదేశాల్లో సోలార్‌ విద్యుత్తును పెద్దస్థాయిలో వినియోగిస్తున్నారనే విషయం మిత్రుల చాటింగ్‌లో తెలిసింది. అదే స్ఫూర్తితో ఓ గ్రామాన్ని సోలార్‌ మోడల్‌ విలేజ్‌గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రయత్నం ఆరంభించా. ప్రాజెక్టు రిపోర్టు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించాం. 
- బానోత్‌ చంద్రావతి, వైరా ఎమ్మెల్యే

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)