'అరవింద్‌' నేత్రవైద్యం...హార్వర్డ్‌ పాఠం! (Eenadu Sunday_07/10/12)



 

అమెరికా... హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌... ఎంబీఏ తరగతి గది...'డియర్‌ స్టూడెంట్స్‌! ఏ వ్యాపార సంస్థ అయినా బ్యాలెన్స్‌ షీట్‌ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే... సమాజానికి ఏమీ చేయలేదు. సమాజసేవే పరమార్థమనుకుంటే... ఆర్థికంగా నిలదొక్కుకోలేదు, ఎంతోకాలం మనుగడ సాగించలేదు...''సమతూకం సాధ్యం కాదా ప్రొఫెసర్‌!'... ఓ విద్యార్థి అడిగాడు.'తప్పకుండా సాధ్యం అవుతుంది. ఇండియాలోని అరవింద్‌ ఆసుపత్రే అందుకు ఉదాహరణ. ఆ సంస్థ విజయచరిత్రను ఓ కేస్‌స్టడీగా అధ్యయనం చేస్తే చాలా విషయాలు బోధపడతాయి. ఈరోజంతా ఆ పనిమీదే ఉండండి...'ప్రొఫెసరుగారు సెలవు తీసుకున్నారు. విద్యార్థులంతా గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ మీద పడ్డారు... aravind  అని టైప్‌ చేస్తూ.
మాజానికి మనమేం ఇస్తున్నాం?పదివేలు సంపాదిస్తున్న వ్యక్తిని అడిగితే 'నెలకో పాతికవేలు సంపాదిస్తున్నప్పుడు ఆలోచిస్తా' అంటాడు. కోటిరూపాయల టర్నోవరు ఉన్న సంస్థను ప్రశ్నిస్తే 'వందకోట్లకు చేరుకున్నాక తప్పకుండా ప్రయత్నిస్తా' అంటుంది. సంపాదన పాతికవేలు దాటాక, ఇంకేవో సాకులు చెబుతాడా వ్యక్తి. వందకోట్ల మైలురాయిని అధిగమించాక... మరేవో మజిలీలు గుర్తుకొస్తాయా సంస్థకు. అయినా, సామాజిక బాధ్యత అనేది... కడుపు నిండాకో కోట్లు కూడబెట్టాకో మొదలుపెట్టాల్సిన మొక్కుబడి వ్యవహారం కాదు.
వ్యాపారం, సేవ...
ఉద్యోగం, సేవ...
కుటుంబ జీవితం, సేవ...
మొత్తంగా జీవితమూ సేవా...
వేర్వేరు కాదు. వేరుగా చూడకూడదు. వ్యక్తి జీవితాన్ని అయినా, సంస్థ భవితవ్యాన్ని అయినా 'సేవాభావం' అనే పునాదుల మీద నిర్మించుకుంటే - దారితప్పే అవకాశమే ఉండదు. 'అరవింద్‌ బిజినెస్‌ మోడల్‌' చెబుతున్నదీ అదే. తమిళనాడులోని అరవింద్‌ నేత్ర వైద్యశాలల్లో నూటికి డెబ్భై శస్త్రచికిత్సలు ఉచితంగానే జరుగుతాయి. అలా అని, ఎవరి దగ్గరా విరాళాలు తీసుకోరు. ప్రభుత్వ గ్రాంట్ల కోసం పైరవీలు చేయరు. విదేశీ నిధుల కోసం వెంపర్లాడరు. స్థోమత కలిగిన రోగులు చెల్లించిన
ఫీజులే ప్రధాన ఆదాయవనరు. ఆ ఫీజులు కూడా కార్పొరేట్‌ ఆసుపత్రులతో పోలిస్తే చాలా తక్కువ. గత ముప్ఫై అయిదు సంవత్సరాల్లో... అరవింద్‌ దాదాపు మూడున్నరకోట్ల మందికి వైద్యం అందించింది. నలభైలక్షల శస్త్రచికిత్సలు చేసింది. రోజూ... ఏడున్నరవేలమంది పరీక్షలు చేయించుకుంటారు, వేయి సర్జరీలు జరుగుతాయి, ఐదారు వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. ప్రపంచంలోనే అత్యధిక నేత్ర చికిత్సలు జరుగుతున్న వైద్యసంస్థ ఇదే. ఇంకా, నలభై 'విజన్‌ సెంటర్స్‌' పల్లెప్రజల కళ్లలో వెలుగులు నింపుతున్నాయి. 'పీజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆఫ్తాల్మాలజీ' దేశంలోని ఆఫ్తాల్మాలజిస్టులలో పదిహేనుశాతం మందిని తయారు చేస్తోంది. అరోలాబ్స్‌ నేతృత్వంలో లెన్సులూ నేత్ర ఔషధాలూ తయారవుతాయి. ఇవికాకుండా, నేత్ర పరిశోధనాలయం ఉంది. ఐ-బ్యాంక్‌ ఉంది. జాన్స్‌ హోప్‌కిన్స్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌, హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ వంటి అంతర్జాతీయ సంస్థల విద్యార్థులు స్వల్పకాలిక శిక్షణ కోసం ఇక్కడికొస్తారు. ఈ మహావ్యవస్థ ప్రారంభం మాత్రం... సాధారణంగానే, ఓ చిన్నపాయలానే మొదలైంది.
స్వచ్ఛంద సంస్థే కానీ...
ఏ సంస్థ మనుగడకైనా నిధులే ప్రాణం. సేవల్ని విస్తరించాలన్నా, మరింతమందికి చేరువ కావాలన్నా, అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నా ఆర్థిక పరిపుష్ఠి తప్పదు. డబ్బు లేకపోతే, నాణ్యత తగ్గుతుంది. విస్తరణ మందగిస్తుంది. ఏదో ఒక దశలో, ఏదో ఒక రూపంలో రాజీపడాల్సి వస్తుంది. అందుకే అరవింద్‌ 'బిజినెస్‌ మోడల్‌'ను ఎంచుకుంది. ఇది నూటికి నూరుశాతం స్వచ్ఛంద సంస్థే. లాభార్జనే ధ్యేయంగా ఎప్పుడూ పనిచేయదు. ఇక్కడ సేవ ఉంది, వ్యాపారమూ జరుగుతుంది. సేవ కోసమే వ్యాపారం! వ్యాపారమే సేవ కాదు. ఆ సున్నితమైన విభజనరేఖ విషయంలో అరవింద్‌ అప్రమత్తంగా ఉంటుంది.అంతర్జాతీయ వైద్య ప్రమాణాలూ అధునాతన సౌకర్యాలూ సంపన్నులను ఆకర్షిస్తాయి. సంతోషంగా ఫీజులు చెల్లించి వైద్యం చేయించుకుంటారు. నామమాత్రపు ధర, ఉచిత సేవలు పేదల్ని ఆకట్టుకుంటాయి. ధైర్యంగా వైద్యం చేయించుకుంటారు. సంపన్నులు మరింతమంది సంపన్నులకు సిఫార్సు చేస్తారు. పేదలు మరికొంతమంది పేదలకు ప్రచారం చేస్తారు. అలా... సేవ, వ్యాపారం ఒకేసారి జరిగిపోతాయి. సంపన్నులు చెల్లించిన డబ్బును పొదుపుగా, సమర్థంగా ఖర్చుపెట్టడం ద్వారా మరో నలుగురికి ఉచిత వైద్యం అందించే అవకాశం కలుగుతోంది. అందుకే, ఇప్పటిదాకా అరవింద్‌ బ్యాలెన్స్‌షీట్‌లో లోటు మాటే లేదు. 'మేనేజ్‌మెంట్‌ గురు' సి.కె.ప్రహ్లాద్‌ వ్యాపార ప్రపంచాన్ని పిరమిడ్‌తో పోల్చారు. పిరమిడ్‌ అట్టడుగున... బోలెడంతమంది 'సామాన్య' కస్టమర్లు ఉన్నారు. వ్యాపారులు ఈ వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అరవింద్‌... ఇక్కడే దృష్టి సారించింది. వ్యాపార పరిభాషలో చెప్పాలంటే... కొత్త మార్కెట్‌ను సృష్టించుకుంది. అరవింద్‌ నమూనా హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ ఎంబీయే విద్యార్థులకు చదివితీరాల్సిన పాఠం. 'గూగుల్‌' వ్యవస్థాపకుల్లో ఒకరైన ల్యారీపేజ్‌ ఈ సామాజిక వ్యాపారాన్ని కళ్లారా చూడటానికి మధురై వచ్చారు. మేనేజ్‌మెంట్‌ నిపుణుడు పీటర్‌ డ్రక్కర్‌ ఇక్కడో రెండు రోజులు గడిపారు.
అరవింద్‌లో మూడురకాల సేవలుంటాయి.
ఒకటి... పూర్తిగా ఉచితం.
రెండు... తగ్గింపు ధర.
మూడు... చెల్లింపు.
పూర్తి ఫీజు చెల్లించాలా, ఉచితంగా చూపించుకోవాలా, సబ్సిడీ తీసుకోవాలా అన్నది రోగి లేదా అతని కుటుంబ సభ్యులే నిర్ణయించుకుంటారు. ఉచిత సేవ పొందాలనుకుంటే, ఎలాంటి ఆదాయ ధ్రువపత్రాలూ సమర్పించాల్సిన పన్లేదు. ఖరీదైన కార్లోంచి దిగి, ఉచిత విభాగంలోకి వెళ్లినా ఎవరూ అడ్డుచెప్పరు. ఫీజుల విషయానికొస్తే... కాటరాక్ట్‌ ఆపరేషన్‌కు ఐదువేల నుంచి యాభైవేలదాకా వివిధ ప్యాకేజీలు ఉంటాయి. తగ్గింపు ధరల్లో... ఓ వేయి రూపాయలకు శస్త్రచికిత్స పూర్తవుతుంది. ఉచిత విభాగంలో నయాపైసా కూడా చెల్లించాల్సిన పన్లేదు. తగ్గింపు ధర అయినా, ఉచితమైనా, పూర్తి చెల్లింపు అయినా... మౌలిక వైద్యసేవ అందరికీ సమానమే. ఎయిర్‌ కండిషన్డ్‌ గదులు, విదేశీ పరికరాలు, అటాచ్డ్‌ బాత్‌రూమ్‌ వంటి సౌకర్యాలకే ఈ అదనపు చెల్లింపులు.చాలారోజుల క్రితం ఓ పెద్దమనిషి కాటరాక్ట్‌ ఆపరేషన్‌ కోసం అరవింద్‌కు వెళ్లారు. తీరా వెళ్లాక, చెక్కు ఆమోదించరని తెలిసింది. అక్కడ నగదు లావాదేవీలు మాత్రమే ఉంటాయి. 'ఒకపని చేయండి. మీరు డబ్బు తీసుకురాలేదు కాబట్టి, ఉచిత వైద్యాన్ని ఎంచుకోవచ్చు' అని సలహా ఇచ్చారు సిబ్బంది. ఒక్కసారి ఆసుపత్రిలో కాలుపెట్టాక... ఎలాంటి తేడాలూ ఉండవు. ఒకేరకమైన చికిత్స, ఒకే నిపుణుల బృందం. అదంతా చూసి ఆయన చాలా సంతోషించారు. ఆ పెద్దమనిషి ఎవరో కాదు, డాక్టర్‌ అబ్దుల్‌కలామ్‌. 'చెల్లించగలిగే స్థోమత ఉన్నప్పుడు, చెల్లించగలిగే మొత్తమైనప్పుడు, చెల్లింపులకు సరిపడా సేవలు అందుతున్నాయని భావించినప్పుడు... ఎవరూ ఏదీ ఉచితంగా పొందాలని అనుకోరు. ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం' అని భావిస్తుంది అరవింద్‌. అరవింద్‌ బిజినెస్‌ మోడల్‌ను తొలిరోజుల్లో ఎవరూ నమ్మలేకపోయారు. ఉచితంగా వైద్యం చేస్తామని చెబితే, ఎవరు మాత్రం డబ్బు కట్టడానికి ముందుకొస్తారని భయపెట్టారు. కానీ ఇప్పుడు, ఉచిత వైద్యం కోసం వస్తున్నవారికంటే, సబ్సిడీ ధరలకు చేయించుకుంటున్నవారే ఎక్కువ.
అరవింద్‌ నేత్ర ఉద్యమంలో... గ్రామీణ వైద్య శిబిరాలు ఒక ప్రధాన భాగం. వూళ్లో ఉచిత వైద్య శిబిరం పెడితే, చాలామందే హాజరవుతారు. కానీ శస్త్రచికిత్సకు ముందుకొచ్చేవారు అతి తక్కువ. కారణం... ఆపరేషన్‌ మాత్రమే ఉచితం. మందుల ఖర్చులు, పట్నానికి ప్రయాణ ఖర్చులు, చికిత్స జరిగినన్నాళ్లూ నగరంలో వసతి, భోజనం - నిరుపేదలు భరించగలిగేంత పరిస్థితి ఉండదు. అరవింద్‌ వైద్యశిబిరంలో ...ఇవన్నీ ఉచితమే! ఈ నిర్ణయం వల్ల బడ్జెట్‌ అధికమైనా, శస్త్రచికిత్స చేయించుకోడానికి ముందుకొచ్చే రోగుల సంఖ్య ఎనభైశాతం పెరిగింది. ఆ శ్రద్ధా ఆ నాణ్యతా చూసి రోగులూ వారి బంధువులూ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులూ... మరిన్ని శిబిరాలు నిర్వహించడానికి ముందుకొస్తున్నారు. 1995 ప్రాంతంలో... ఎవరో సలహా ఇస్తే రంగస్వామి అనే తెలుగువ్యక్తి వయోధికులైన తల్లిదండ్రుల్ని తీసుకుని మధురైలోని అరవింద్‌ వైద్యశాలకు వెళ్లాడు. ఇద్దరికీ శస్త్రచికిత్సలు చేశారు. ఆ సేవలు అతనికి ఎంతగా నచ్చాయంటే... ఏకంగా వాలంటీర్‌గా మారిపోయాడు. ఇప్పటిదాకా దాదాపు లక్షన్నరమందిని తీసుకొచ్చి వైద్యం చేయించాడు. అలాంటివారి శ్రమ తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఓ ఆసుపత్రిని నిర్మించాలని అరవింద్‌ యాజమాన్యం నిర్ణయించింది. ఆ దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పొదుపు బాట...
అరవింద్‌ పొదుపునకు పెట్టపీట వేస్తుంది. ఎక్కడా ఏ స్థాయిలోనూ వృథాకు అవకాశమే ఉండదు. మరింత సమర్థంగా, ఇంకా సమర్థంగా వనరుల్ని ఎలా ఉపయోగించుకోవాలనే విషయంలో నిత్యం మేధోమథనం జరుగుతూనే ఉంటుంది. ఆ పొదుపరితనమే ఇంట్రాక్యులర్‌ లెన్స్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటుకు కారణమైంది. కాటరాక్ట్‌ సర్జరీలో ధరల విప్లవానికి దారితీసింది. ఆ లెన్సులను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం ఖరీదైన వ్యవహారం. సామాన్యులకు చాలా భారం అవుతుంది. ఏ అమెరికన్‌ స్వచ్ఛంద సంస్థో దానంగా ఇచ్చే సరుకు కోసం ఎదురుచూడాల్సి వచ్చేది. ఎవరి మీదో ఆధారపడటం అరవింద్‌కు ఇష్టంలేదు. దీంతో సొంతంగా ఓ తయారీ యూనిట్‌ను ప్రారంభించాలని నిర్ణయించింది. ఫలితంగా, లెన్స్‌ ధర ఏడున్నరవేల నుంచి ఐదువందలకు పడిపోయింది. నేత్రవైద్యంలో ఇదో మైలురాయి. అరవింద్‌ చొరవ వల్ల భారత్‌లోనే కాదు... దాదాపు 120 దేశాల్లో నేత్రవైద్య వ్యయం తగ్గింది. అరవింద్‌ లెన్సులు ఇప్పటిదాకా కోటిమందికి కనుపాపలయ్యాయి.
మానవ వనరుల సమర్థ నిర్వహణ కూడా పొదుపులో భాగమే. ఏ సంస్థ విజయానికైనా ఉద్యోగులే ప్రాణం. సిబ్బంది పనితీరు సంస్థ భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది. అందులోనూ వైద్యనిపుణుల సమయం చాలా అమూల్యం. చక్కని సమన్వయంతో శాస్త్రీయమైన విధానాలతో వారి సేవల్ని గరిష్ఠస్థాయిలో వినియోగించుకుంటోంది అరవింద్‌. డాక్టరు ఆపరేషన్‌ థియేటర్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి... శస్త్రచికిత్స పూర్తయ్యేదాకా... ఎంత సమయం పడుతుంది, దాన్ని కనిష్ఠంగా ఎంతకు తగ్గించవచ్చు అన్న శాస్త్రీయమైన అంచనా ద్వారానే ఇదంతా సాధ్యమైంది. ప్రపంచంలో అత్యధిక ఉత్పాదకశక్తి కలిగిన నిపుణుల్లో అరవింద్‌ వైద్యులు అగ్రస్థానంలో ఉన్నారు. దేశంలోని నేత్రవైద్యులు సగటున ఏడాదికి నాలుగువందల కాటరాక్ట్‌ ఆపరేషన్లు చేస్తారని అంచనా (అమెరికాలో రెండువందలే!). అదే అరవింద్‌ డాక్టర్లు రెండున్నరవేల సర్జరీలు చేస్తారు. దీనివల్ల వైద్యుల సమయం, యంత్రపరికరాలు, విద్యుత్‌ తదితరాలు కూడా ఆదా అవుతాయి. రోగులు ఎక్కువ రోజులు వేచి చూడాల్సిన అవసరం ఉండదు.శస్త్రచికిత్సల విషయంలోనూ సరికొత్త విధానాన్ని రూపొందించింది అరవింద్‌. ఆపరేషన్‌ థియేటర్‌లో వైద్యుడు ఒకేసారి రెండు శస్త్రచికిత్సలకు బాధ్యత తీసుకుంటాడు. మొదటి రోగికి శస్త్రచికిత్స జరుగుతున్నప్పుడే... నిపుణులైన సహాయకులు రెండో రోగి శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేసుకుంటారు. వైద్యుడు ఒక శస్త్రచికిత్స ముగించి మరో శస్త్రచికిత్సకు సిద్ధంకావడానికి (సాంకేతికంగా - సర్జరీ ల్యాగ్‌)... అరవింద్‌లో సరిగ్గా ఒక నిమిషం సరిపోతుంది. అదే మిగతా ఆసుపత్రులలో కనీసం పదిహేను నిమిషాలు పడుతుందని అంచనా. ఏటా వేయిమంది ఆఫ్తాల్మిక్‌ అసిస్టెంట్లను నియమించుకోవడం వల్లే ఇదంతా సాధ్యం అవుతోంది. నిజానికి ఇది... 'నియమించుకోవడం' కాదు... తయారుచేసుకోవడం! వేలకొద్దీ జీతాలిచ్చి... బయటి నుంచి నిపుణుల్ని తెచ్చుకోవడం కంటే, సాధారణ వ్యక్తులకు శిక్షణ ఇచ్చి సంస్థకు అవసరమైన విధంగా తీర్చిదిద్దుకోవడమే ఉత్తమమని అరవింద్‌ భావిస్తుంది. దీనివల్ల జీతాల భారాన్ని తగ్గించుకోగలిగింది. ఆసుపత్రి ఉద్యోగుల్లో ఎనభైశాతం గ్రామీణ మహిళలే. ఒక ఏడాది శిక్షణ... వాళ్లను చేయితిరిగిన నిపుణులుగా మార్చేస్తుంది. 
అలాగని, నాణ్యత విషయంలో అరవింద్‌ రాజీపడదు. ప్రపంచంలోని అత్యున్నత వైద్య విజ్ఞాన సంస్థలో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో... అరవింద్‌లోనూ అవన్నీ ఉంటాయి. శస్త్రచికిత్సల తర్వాత ఉత్పన్నమయ్యే సమస్యల విషయంలో... యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఆఫ్తాల్మాలజీ కంటే అరవింద్‌ పనితీరే మెరుగ్గా ఉన్నట్టు అధ్యయనాల్లో వెల్లడైంది.
1976లో అరవింద్‌ పదకొండు పడకలతో ప్రారంభమైంది. మధురైలోని ప్రధాన ఆసుపత్రి ఒక అంతస్తు నుంచి ఏడంతస్తులకు విస్తరించింది. కోయంబత్తూరు, పాండిచ్చేరి, తిరునెల్వేలి, దిండిగల్‌, తిరుపూర్‌ తదితర ప్రాంతాల్లో శాఖలు వెలిశాయి. ఇదంతా రోగులు చెల్లించిన ఫీజుల ద్వారానే సాధ్యమైంది. ఓ సారి, ఎవరో సంపన్నులు... 'ఇన్ని లక్షలు ఇస్తాం... ఓ విభాగానికి మా పేరు పెట్టండి చాలు' అనడిగారు. ఆ సమయంలో అరవింద్‌ నిధుల కొరత ఎదుర్కొంటోంది. నిజానికి, అలా తీసుకోవడం తప్పేంకాదు. కానీ, తాత్కాలిక అవసరాల కోసం శాశ్వత విలువలను వదులుకోకూడదన్నది అరవింద్‌ విధానం. బాగా ఆలోచించుకున్నాక 'క్షమించండి... మేం విరాళాలు స్వీకరించం' అని చెప్పేశారు.
మూలాలు...
'అంధత్వం పేదవాడి ప్రథమ శత్రువు. చూపుపోతే ఉపాధి పోతుంది, సమాజంలో గౌరవం పోతుంది, ఆత్మవిశ్వాసం పోతుంది. ఏ మనిషికీ అలాంటి పరిస్థితి రాకూడదు' అంటారు డాక్టర్‌ గోవిందప్ప వెంకటస్వామి (డాక్టర్‌ వి). పదవీవిరమణ అన్న మాటకు సరికొత్త అర్థాన్నిచ్చారాయన. నేత్రవైద్య నిపుణుడిగా పదవీ విరమణ నాటికి లక్ష శస్త్రచికిత్సలు పూర్తిచేశారు. రిటైర్మెంట్‌ తర్వాత... యాభై ఎనిమిదేళ్ల వయసులో అరవింద్‌ ఆసుపత్రికి ప్రాణం పోశారు. వారసత్వంగా వచ్చిన ఇంటిని అమ్మేసి... ఆసుపత్రి పనులు మొదలు మొట్టారు. ఆయన ఆలోచనల మీదా జీవన విధానం మీదా అరవిందుడి ప్రభావం అపారం. ఏడుపడకల ఆసుపత్రిగా ఉన్నప్పుడే... వంద పడకలకు విస్తరించినప్పుడు ఎలా నిర్వహించాలో ప్రణాళికలు సిద్ధంచేసుకున్నారు. కొన్ని వందల జర్నల్స్‌ చదివారు. వేల వ్యాపార సంస్థల్ని పరిశీలించారు. అరవింద్‌కు అన్వయించుకోదగిన ఏ మంచి అంశాన్నీ వదిలిపెట్టలేదు. 'అరవింద్‌ బిజినెస్‌ మోడల్‌' రూపకర్త కూడా ఈయనే. ఈ నిర్ణయం వెనుకా ఓ కారణం ఉంది. తొలిరోజుల్లో వెంకటస్వామి విరాళాల కోసం చాలామందిని సంప్రదించారు. ఎవరూ పెద్దగా స్పందించలేదు. వందో రెండువందలో ఇచ్చి చేతులు దులుపుకున్నవారే ఎక్కువ. ఇదంతా డాక్టరుగారికి నచ్చలేదు. ఎవరో ఇచ్చే విరాళాల మీద ఆధారపడి ఓ వ్యవస్థను నిర్మించడం అసాధ్యమని అర్థమైపోయింది. సేవా సంస్థ అయినా సరే, తన కాళ్లమీద తాను నిలబడగలిగితేనే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలదన్న నిర్ణయానికొచ్చారు. బతికినన్నాళ్లూ అరవిందే ఆయన ప్రపంచం. డాక్టర్‌.వి 2006లో మరణించారు. వారసులూ ఆ బాటలోనే నడుస్తున్నారు. వారసులంటే, కొడుకులో కూతుళ్లో కాదు. ఆయన పెళ్లి చేసుకోలేదు. ఆయన తమ్ముళ్లూ చెల్లెళ్లూ వాళ్ల పిల్లలూ ఆ పిల్లల పిల్లలూ... మూడుతరాలకు చెందిన 35 మంది వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. అందులో ఇరవైమందికిపైగా వైద్యనిపుణులే. డబ్బే జీవితం అనుకుంటే ఎంతైనా సంపాదించుకోగల అర్హతా నైపుణ్యం వాళ్లకున్నాయి. అయినా, జీవితాంతం అరవింద్‌ కోసమే పనిచేయాలని నిర్ణయించుకున్నారు. డాక్టర్‌.వి విలువల వారసత్వం అది. ఒక వ్యక్తి ఒక జీవితకాలం పనిచేయగలడు. భవిష్యత్‌ తరాల్లోనూ... ఆ సేవా భావాన్ని నింపగలిగితే... తరంతరం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఆ దూరదృష్టి కొరవడటం వల్లే... మూలపురుషుడు ఉన్నంతకాలం ఓ వెలుగువెలిగే సేవాసంస్థలు ఆతర్వాత కుప్పకూలిపోతాయి. ప్రస్తుతం, అరవింద్‌లో మూడోతరం ప్రవేశించింది. కానీ అంకితభావంలో మాత్రం... తొలితరాన్నే తలపిస్తోంది.
* * *
''ఇట్స్‌ అమేజింగ్‌.గ్రేట్‌...
మొత్తం దేశాన్నో రాష్ట్రాన్నో ఓ అరవింద్‌ ఆసుపత్రిగా మార్చేస్తే ఎంత బావుంటుంది! జిల్లా, తాలూకా, గ్రామం, కుటుంబం - ఇవి మాత్రం అరవింద్‌ సూత్రాల ఆధారంగా ఎందుకు పనిచేయకూడదు? అదే జరిగితే... ప్రతి ఒక్కరిలోనూ బాధ్యత ఉంటుంది. పదివేలు సంపాదిస్తూ పదివేలూ ఖర్చుపెడుతున్నవారు కూడా... పొదుపుద్వారా, వృథా అరికట్టడం ద్వారా, చక్కని కుటుంబ నిర్వహణ పద్ధతుల ద్వారా... అందులో ఓ వేయి రూపాయలైనా సమాజానికి కేటాయిస్తారు. అలాంటి వేయి రూపాయలు... లక్షలై కోట్త్లె భారత్‌ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను పరిష్కరిస్తాయి. ఇక వ్యాపార సంస్థలైతే కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ పేరిట సంపాదించిన దాంట్లో ఒకశాతమో, అరశాతమో ఇవ్వడం కాదు - సంపాదన మొత్తం సమాజానిదే అని భావిస్తాయి. గాంధీజీ బోధించిన ధర్మకర్తృత్వ భావన (ట్రస్టీషిప్‌) అంతరార్థమూ అదే కదా!''.
...హార్వర్డ్‌ విద్యార్థుల ఏకగ్రీవ తీర్మానం.
కొన్ని పాఠాలకు జీవితాల్ని మార్చే శక్తి ఉంది.
అరవింద్‌ దారిలో...
ద్గురు నేత్ర చికిత్సాలయం - మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో ఉంది. చాలా ఏళ్లుగా నిరుపేదలకు ఉచితంగా నేత్రవైద్యం అందిస్తోంది. ప్రజల నుంచి అందే విరాళాలే ఆధారం. ఫీజులు వసూలు చేయడం సేవాభావనకు విరుద్ధమని ట్రస్టు సభ్యుల భావన. కొంతకాలానికి విరాళాల ప్రవాహం తగ్గిపోయింది. సిబ్బంది జీతాలూ మందుల ఖర్చులూ భరించడం అసాధ్యమైపోయింది. సరిగ్గా ఆ సమయంలోనే వైద్యశాల డైరెక్టరు బి.కె.జైన్‌కు ఎవరో అరవింద్‌ మోడల్‌ గురించి చెప్పారు. వెంటనే మధురై బయల్దేరి వెళ్లారు. అక్కడి కార్యక్రమాల్ని కళ్లారా చూశారు. అరవింద్‌ ఆసుపత్రి సహకారంతో... సరికొత్త ప్రణాళిక రచించుకున్నారు. అత్యాధునిక టెక్నాలజీని సమకూర్చుకున్నారు. ఐదేళ్లలో సద్గురు నేత్ర చికిత్సాలయం... నష్టాలను అధిగమించింది. ఎంతోకొంత మిగులు సమకూర్చుకోగలిగింది. పశ్చిమ బెంగాల్‌లోని చైతన్యపూర్‌లో ఉన్న వివేకానంద మిషన్‌ ఆశ్రమ్‌ వైద్యశాల కూడా అరవింద్‌ సాయంతో ఒడ్డునపడింది. జేవియర్‌, కార్లోస్‌ అనే ఇద్దరు ఔత్సాహిక వ్యాపారవేత్తలు అరవింద్‌ మోడల్‌ స్ఫూర్తితో మెక్సికోలో సెంటర్‌ ఫర్‌ హెల్త్‌ మార్కెట్‌ ఇన్నొవేషన్‌ సంస్థను ప్రారంభించారు. 'ఫార్చ్యూన్‌ ఎట్‌ ద బాటమ్‌ ఆఫ్‌ ద పిరమిడ్‌' పుస్తకంలో సి.కె.ప్రహ్లాద్‌ అరవింద్‌ నమూనా గురించి వివరించిన తీరు ఆ యువకులను చాలా ప్రభావితం చేసింది. బిర్లా పరివారానికి చెందిన ప్రియంవద బిర్లా అరవింద్‌ ఆసుపత్రుల నిర్వహణ తీరును చూసి... అదే నమూనాలో కోల్‌కతాలో ఓ ఆసుపత్రిని నిర్మించారు. రాహుల్‌గాంధీ కూడా మధురైలోని ఆసుపత్రిని సందర్శించారు. అమేథీలో నేత్రవైద్యశాల నిర్మాణానికి అరవింద్‌ సహకారం తీసుకున్నారు. అరవింద్‌ ప్రపంచవ్యాప్తంగా 60 ఆసుపత్రులకూ భారత్‌లో 213 ఆసుపత్రులకూ దిశానిర్దేశం చేసింది.
హార్వర్డ్‌లో...
హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌కు చెందిన ప్రొఫెసర్‌ కస్తూరిరంగన్‌ అరవింద్‌ నమూనాను చాలా లోతుగా అధ్యయనం చేశారు. ఇక్కడి నుంచి తిరిగెళ్లాక... తన అనుభవాలకు అక్షర రూపం ఇచ్చారు. మార్కెటింగ్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు దీన్నో కేస్‌ స్టడీగా పరిచయం చేయాలనుకున్నప్పుడు... తోటి ప్రొఫెసర్ల నుంచి వ్యతిరేకత ఎదురైంది. కస్తూరిరంగన్‌కు మాత్రం అరవింద్‌ సేవా వ్యాపారం చాలా నచ్చింది. ప్రతి వ్యాపారవేత్తా ప్రతి మార్కెటింగ్‌ నిపుణుడూ తెలుసుకోవాల్సిన పాఠమని భావించారు. తన క్లాస్‌లో, తన విద్యార్థులకు చెప్పడానికి ఎవరి అనుమతీ అక్కర్లేదు కాబట్టి, అరవింద్‌ ప్రత్యేకతను కళ్లకు కట్టినట్టు వివరించారు. విద్యార్థులు కూడా చాలా ఆసక్తిగా విన్నారు. ఇంకా ఇంకా తెలుసుకోవాలన్న కుతూహలం వారిలో కనిపించింది. ఆ పాఠం హార్వర్డ్‌ ఆవరణలో చర్చనీయాంశమైంది. ఏటా తొమ్మిది వందలమంది ఎంబీయే విద్యార్థులు 'సర్వీస్‌ ఫర్‌ సైట్‌' కేస్‌స్టడీని శ్రద్ధగా అధ్యయనం చేస్తారు. 'ఏ కేస్‌ స్టడీ అయినా రెండుమూడేళ్లకే పాతబడి పోతుంది. కానీ అరవింద్‌కు మాత్రం కాలదోషం లేదు. వ్యక్తికీ వ్యవస్థకూ సామాజిక బాధ్యతను గుర్తుచేయడానికి ఇంతకు మించిన ఉదాహరణ లేదు' అంటారు కస్తూరిరంగన్‌.
డాక్టర్‌. వి బాటలో...
డాక్టర్‌ పి. నామ్‌పెరుమాళ్‌స్వామి
ఛైర్మన్‌, అరవింద్‌ ఐకేర్‌ సిస్టమ్‌
డాక్టర్‌. వి భౌతికంగా మా మధ్యలేకపోయినా, ఆయన ఆశయాలూ ఆలోచనలూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయి. సేవాభావానికి పెద్దపీటవేస్తూనే స్వావలంబన సాధిస్తున్నాం. భవిష్యత్‌లో విజన్‌ సెంటర్లకు మరింత ప్రాధాన్యం ఇవ్వబోతున్నాం. మరో వంద నేత్రవైద్యశాలలకు 'అరవింద్‌ నమూనా'పై శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అరోల్యాబ్‌ నేతృత్వంలో... మరింత తక్కువ ధరకు, మరింత నాణ్యమైన నేత్ర శస్త్రచికిత్స సామగ్రిని, ఔషధాలను తయారు చేసే ప్రయత్నం జరుగుతోంది



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)