hai bujji (Eenadu special for children)

అనగనగా ఓ అతిథి...త్వరలోనే రాబోతున్నారు...ఆకాశంలో మెరిసిపోనున్నారు...మనకి కనువిందు చేయనున్నారు... ఇంతకీ ఎవరా అతిథి? ఓ తోకచుక్క!
సూర్యకుటుంబం ఏర్పడిన తర్వాత మిగిలిన మంచు, అంతరిక్ష ధూళి, చిన్న చిన్న రాళ్లు రప్పలతో తోకచుక్కలు ఏర్పడ్డాయి.
వీటిలో ఒక కిలోమీటరు నుంచి 300 కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉండేవి ఉన్నాయి.
వూర్ట్‌క్లౌడ్‌ ప్రాంతంలో సుమారు 1,000,000,000,000 తోకచుక్కలు ఉన్నాయని అంచనా!
తోకచుక్కల్లో ముఖ్యమైనది హేలీ తోకచుక్క. 76 ఏళ్లకు ఒకసారి కనిపించే ఇది వూర్ట్‌క్లౌడ్‌ నుంచే వచ్చిందని చెపుతారు.
నింటికి ఓ బంధువు వస్తున్నాడని తెలిసిందనుకోండి. ఎప్పుడు వస్తున్నాడు? ఎలా వస్తున్నాడు? అనే ఆసక్తి కలుగుతుంది కదా! అలాగే మన భూమి దగ్గరకి కూడా ఒక బంధువు త్వరలో రాబోతున్నాడు. ఆ బంధువు ఎవరో కాదు ఓ తోకచుక్క! శరవేగంగా దూసుకువస్తున్న ఈయనగారు తన ప్రయాణంలో భాగంగా భూమికి దగ్గరగా వస్తారు. అప్పుడు ఆకాశంలో రాత్రి వేళ దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపిస్తారు. ఈయన పేరేంటో తెలుసా '2012 ఎస్‌1'. కెనడాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు ఈ కొత్త తోకచుక్కను గుర్తించారు. వీరిలో మన భారతీయ సంతతికి చెందిన శాస్త్రవేత్త కూడా ఉన్నారు.ప్రకాశవంతమైన తోకచుక్కల్లో ఇది కూడా ఒకటని చెబుతున్నారు. నిండు చందమామ కంటే ఎక్కువగానే ఇది వెలుగులీనుతుందని అంచనా. ఇది భూమికి దగ్గరగా వచ్చినప్పుడు పట్టపగలు కూడా దీన్ని చూడవచ్చంటున్నారు. ఇది ప్రస్తుతం ఎక్కడుంది? భూమికి 9 కోట్ల కిలోమీటర్ల దూరంలో శని (శాటర్న్‌), గురు (జ్యూపిటర్‌) గ్రహాలు తిరిగే కక్ష్యలకు మధ్యలో ఉండి, సూర్యుడి దిశగా ప్రయాణిస్తోంది. ఇది అంగారక (మార్స్‌) గ్రహానికి దగ్గరగా వస్తే దాని మీదకి ఈ మధ్యనే పంపిన 'క్యూరియాసిటీ' రోవర్‌ ఫొటోలు తీసే అవకాశం ఉంది. దీని తల సుమారు మూడు కిలోమీటర్ల వెడల్పుగా ఉంది. వచ్చే ఏడాది నవంబర్‌లో దీన్ని మనం నేరుగా చూడవచ్చంటున్నారు. నిజానికి తోకచుక్కలన్నీ మనకి బంధువులనే అనుకోవచ్చు.
ఎందుకంటే సూర్యకుటుంబం ఏర్పడినప్పుడే ఇవి కూడా ఏర్పడ్డాయి. కోటానుకోట్లుగా ఉండే ఇవన్నీ నెప్ట్యూన్‌, ప్లూటోలకి ఆవల వైపు ఉన్న ఊర్ట్‌ క్లౌడ్‌, క్యూపియర్‌ బెల్ట్‌ ప్రాంతాల్లో ఉండి మూకుమ్మడిగా సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. వీటిలో అడపాదడపా ఒకోటి దారి తప్పి వేరే కక్ష్యలో ప్రయాణం మొదలుపెడతాయి. కొత్త తోకచుక్కగారు కూడా ఇలా బయల్దేరినవారే!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)