Eenadu Etaram (23_07_2011)


అంతర్జాతీయ వేదికపై మెరిసిన ఆంధ్రా కుర్రాళ్లు!
బ్యాంకాక్‌లో అంతర్జాతీయ వేదిక. దేశదేశాల నుంచి వచ్చిన మెరికల్లాంటి యువ ప్రతినిధులు. మన దేశ ప్రతినిధులు అయిదుగురు. అందులో అత్యుత్తమ ప్రతిభ చూపి స్వర్ణ, రజత పతకాలు సాధించిన ఇద్దరు మన రాష్ట్రం వారే. బూర్లె సాయికిరణ్‌, ఇమ్మడి పృథ్వీతేజ్‌. దేశ వ్యాప్తంగా నలభై వేలమందితో పోటీ పడి ఎంపికైన తెలుగు తేజాన్ని చూపిన ఈ ఇద్దరూ ముంబై ఐఐటీలో చేరబోతున్నారు. వారితో 'ఈతరం' ముచ్చటించింది.
సిద్ధమయ్యారిలా...
సాయికిరణ్‌: ఒలింపియాడ్‌లో రాణించాలనే కోరిక పదోతరగతిలో మొదలైంది. ఐఐటీతోపాటే ఒలింపియాడ్‌ శిక్షణ తీసుకున్నా. దీనికోసం ప్రత్యేకంగా సరదాలేం పక్కన పెట్టలేదు. సినిమాలు వదల్లేదు. పృథ్వీతేజ: ఒలింపియాడ్‌లో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ఉన్నపుడే నా ఒలింపియాడ్‌ శిక్షణ మొదలైంది. ఐఐటీ కోచింగ్‌తోపాటే ఒలింపియాడ్‌కు ప్రిపేరయ్యా.
ఎంపిక తీరిదీ...
సాయి, పృథ్వీ: ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌ టీచర్‌ ఆధ్వర్యంలో ఏటా నేషనల్‌ స్టాండర్డ్‌ ఎగ్జామినేషన్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన వాళ్లను ఫిజిక్స్‌ ఒలింపియాడ్‌కి పంపిస్తారు. ఈసారి ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా నలభైవేల మంది పోటీపడ్డారు. మొదటి దశ పరీక్షల్లో నాలుగు వందలమంది ఎంపికయ్యారు. రెండో వడబోతలో ముప్ఫై మంది మిగిలారు. ఆ ముప్ఫై మందికి ముంబైలోని హోమీ బాబా సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌లో ఇరవై రోజులు శిక్షణ నిచ్చారు. అక్కడ ఒలింపియాడ్‌కు సన్నాహకంగా నమూనా పరీక్షలు, ప్రయోగాలు నిర్వహించారు. ఇందులో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఐదుగురిని ఇండియా తరపున బ్యాంకాక్‌ పోటీలకు ఎంపిక చేశారు. బ్యాంకాక్‌లో జరిగింది నలభై రెండో ఫిజిక్స్‌ ఒలింపియాడ్‌.
పరీక్ష కఠినమే...
సాయి: బ్యాంకాక్‌లో మొదలవుతుంది అసలైన పరీక్ష. ఇది ఐఐటీ కంటే ఎంతో కష్టం. మనదగ్గర ఎంపిక చేసినట్టే ఎనభై దేశాల నుంచి ఐదుగురు చొప్పున ఇంకో నాలుగు వందల మంది మెరికల్లాంటి విద్యార్థులతో పోటీ పడాలి. ఈ ఒలింపియాడ్‌లో రెండు రకాల పరీక్షలుంటాయి. మొదటిది వ్యాస రూపక పరీక్ష. మూడు ప్రశ్నలకు ఐదుగంటల్లో సమాధానం రాయాలి. రెండోది భౌతికశాస్త్ర ప్రయోగం. దీనికీ సమయం ఐదుగంటలే. ఇందులో రెండు రకాల ప్రయోగాలుంటాయి. మొదటిది ఎలక్ట్రికల్‌ బ్లాక్‌బాక్స్‌ ప్రయోగం. ఓ చెక్కబాక్సులో కెపాసిటర్‌ పెట్టి దానికి ఒక టైమర్‌ అమర్చుతారు. దాని నుంచి వెలువడే ఫ్రీక్వెన్సీ ఆధారంగా ఆ కెపాసిటర్‌ ఏ ఆకారంలో ఉందో కచ్చితంగా గుర్తించమన్నారు. రెండోది మెకానికల్‌ బ్లాక్‌బాక్స్‌ ప్రయోగం. ఒక పెద్ద సిలిండర్‌ ట్యూబ్‌లోకి ఓ బరువైన బాల్‌ని పంపి భౌతిక సూత్రాల ఆధారంగా అది ఎంత వేగంతో తిరుగుతుందో, కచ్చితంగా ఎక్కడుందో కనుక్కోమన్నారు. నిర్ణీత సమయం దాటినా మిగతావాళ్లు ప్రయోగం పూర్తి చేయడానికి తంటాలు పడితే రెండు ప్రయోగాలనూ నేను నాలుగున్నర గంటల్లోనే పూర్తి చేశా.
పృథ్వీ: నేను కాస్త సమయం ఎక్కువ తీసుకున్నా. అందుకే రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

వారి తీరే వేరు...
సాయి: ఒలింపియాడ్‌ కష్టమంతా రెండ్రోజులే. మిగతా రోజులు సరదాగా గడిపాం. అక్కడికొచ్చిన న్యాయనిర్ణేతలు, పార్టిసిపెంట్స్‌తో కలిసిపోయా. నేను గమనించిన విషయం ఏమిటంటే సింగపూర్‌, చైనా, అమెరికాలాంటి పాశ్చాత్య దేశాల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం ఎక్కువ. సబ్జెక్టు పరంగా వాళ్లలో పెద్దగా ప్రతిభ లేకపోయినా అందరితో ఇట్టే కలిసిపోతారు. అమెరికన్‌ విద్యార్థులు పాప్‌ సాంగ్స్‌ పాడి అలరించారు. బ్యాంకాక్‌ సంస్కృతి మనకు దగ్గరగా ఉంది.
పృథ్వీ: ఎనిమిది రోజుల్లో రెండ్రోజులు పరీక్షలు. మిగతా ఆరు రోజులు విహారయాత్రలా గడిచిపోయింది. బ్యాంకాక్‌ నగరంతోపాటు థాయ్‌లాండ్‌లోని చాలా ప్రాంతాలు చూపించారు. ఆసియా దేశాలైన చైనా, జపాన్‌, థాయ్‌లాండ్‌, వియత్నాంలు శాస్త్ర సాంకేతిక రంగాలకు విపరీతమైన ప్రాముఖ్యం ఇస్తాయని అక్కడి విద్యార్థుల మాటల్లో అర్థమైంది. కుటుంబ నేపథ్యం
సాయి: నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌. హైదరబాద్‌లో స్థిరపడ్డారు.
పృథ్వీ: పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల.


ప్రతిభకు గీటురాళ్లు

సాయి:
* ఐఐటీ ప్రవేశ పరీక్షలో ఆలిండియా స్థాయిలో నాలుగో ర్యాంకు.
* వెల్లూరు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (వి.ఐ.టి.) ప్రవేశ పరీక్షలో జాతీయస్థాయి రెండో ర్యాంకు.
* ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ స్పేస్‌ అండ్‌ టెక్నాలజీ (ఐసాట్‌) ప్రవేశ పరీక్షలో మూడో ర్యాంకు.
పృథ్వీ:
* ఐఐటీ ఆలిండియా స్థాయిలో మొదటి ర్యాంకు.
* కేంద్రప్రభుత్వ కిశోర్‌ వైజ్ఞానిక ప్రోత్సాహక్‌ యోజన స్కాలర్‌షిప్‌.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు